ఆరుబయలు ముద్దు
మరీ అంత చేదా?

రంగనాయకమ్మతో కొనసాగుతున్న చర్చలో ఇది నా తాజా స్పందన. ఆమె ఏం రాశారు, నా మాటలేమిటి అనేది తెలుసుకోడం చాల సులభం. ఇదే ఆర్టికల్ చివరికంటా వెళ్లాక ఇంకా కిందికి వెళ్తే వరుసగా గత సంచికల్లోని ఈ చర్చా వ్యాసాలు వొస్తాయి. ఎంచక్కా చదువుకోవచ్చు.

గత మే 1 సంచికలో రంగనాయకమ్మ విమర్శలకు ఇది నా స్పందన. సంక్షిప్తంగా ఆమె ఏమన్నారు దానికి నా స్పందన ఏమిటి… వరుసగా రాశాను. అంకెలు ఆమె వ్యాసం లోనివి కాదు. కాని పై నుంచి కిందికి ఆమె వ్యాసం క్రమంలోనే ఇక్కడ ఉటంకింపులూ స్పందనలు వున్నాయి. నా ఉటంకింపులు చాలకపొతే ఆమె ఏమన్నారో వివరంగా మీరు ఆమె వ్యాసం లోనే చూడొచ్చు.

ఈసారి నా స్పందనకు… ఇదిగో ఈ ఛాయా చిత్రమే ఉపోద్ఘాతం. ఇది ఏదో సినిమాలోని బొమ్మ అనుకునేరు. కాదు. నిజం. రెండో ప్రపంచ యుద్దం అయిపోయి బయటపడిన నావిక సైనికుడు రోడ్డు మీద ఒక అమ్మాయిని కౌగిట్లోకి తీసుకుని, గాఢంగా ముద్దు పెట్టిన ఈ దృశ్యం ప్రపంచ ప్రసిద్ధ ఛాయా చిత్రాల్లో ఒకటి. ఫోటోలో ఆమె అతడి ప్రేయసి కూడా కాదు. ప్రపంచయుద్ధం ముగిసి, కొత్త స్వేచ్ఛ దొరికిన వుద్వేగాన్ని అతడలా వ్యక్తం చేశాడు. ఇక్కడ మన సబ్జెక్టు వాళ్లిద్దరు కాదు. వాళ్లను చూస్తున్న వాళ్లు. చూసే వాళ్ళ ముఖాల్లో వున్న ఆనందం. అది వాయురిస్టిక్ ఆనందం కాదు. జస్ట్ వేరే వాళ్ళ సంతోషాన్ని చూసి మనం పొందే ఆనందం. ఆడుకునే పిల్లల సంతోషాన్ని చూసి ఆటలో లేని వాళ్ళు చప్పట్లు కొట్టే ఆనందం. బొమ్మ చూశారుగా, ఇక పదండి తాజా తాజా పేచీ లోనికీ.  

  1. రంగనాయకమ్మ: ‘బహిరంగ   ముద్దుల్ని మనోహరాలుగా అర్ధం చేసుకోకుండా, వాటిని ‘ప్రదర్శనలు’ గా భావించడం, నా విమర్శలో”అతిశయోక్తి” (అని హెచ్చార్కె) అన్నారు.’

నేను: ఔను అన్నాను. ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్. ప్రేమికులకు ఎగ్జిబిషనిజం అంటగట్టడం. ముద్దు పెట్టుకునే వారెవరూ… అది నాటకమో చలన‍చిత్రమో అయితే తప్ప… ఇతర్లు చూడాలని ఆ పని చేయరు. పరస్పరం ప్రేమతో, మమకారంతో చేస్తారు. ఇక చూసే వాళ్లకది మనోహరంగా వుంటుందా, అసహ్యంగా వుంటుందా అనేది చూసే వాళ్ల తలనొప్పి, ప్రేమికులదికాదు. నేను మనోహరం అన్నది సెక్సు ను కాదు, ఆ కావిలింత లోని ప్రేమను, జీవన కాంక్షను.

  1. రంగనాయకమ్మ: ‘రాజశేఖర రెడ్డిని హెచ్చార్కే మెచ్చుకున్న విషయంలో, నా “జడ్జిమెంటు, అర్ధ రహితం” అనీ, నేను అలాంటి తీర్పు ఇవ్వడానికి కారణం, నాలో “శ్రామిక వర్గ దృక్పధం లోపించడం” అనీ, నా విమర్శకి కారణం “వొట్టి పెటీ బూర్జువా దృక్పధం” అనీ అన్నారు… .

నేను: ప్రజలకు పనికొచ్చే పనులను… అవి నిజంగా ప్రజలకు పనికొస్తాయో లేదో, వాటి ఇతర ప్రభావాలేమిటో చర్చించవలససిందే. కాని, అది పాలకుల పని కాబట్టి దాన్ని ఆహ్వానించకూడదని అనడం మధ్యతరగతి మనస్తత్వమనే అనుకుంటున్నాను. అదే ఆశయాలతో అంతకన్న మంచి కార్యక్రమాన్ని శ్రామిక వర్గం ప్రతిపాదించగలిగితే, శ్రామిక వర్గం దాన్ని ఇప్పుడో రేపో అమలు చేసే అవకాశం వుంటే…. అప్పుడు మాత్రం, పాలక వర్గ పార్టీని మెచ్చుకోడం తప్పవుతుంది. అలా కానప్పుడు ప్రజలకు విద్యా, వైద్యం వంటి బూర్జువా డెమొక్రటిక్ సౌకర్యాల్ని వ్యతిరేకించడం ప్రజా వ్యతిరేక వైఖరి. 

  1.  రంగనాయకమ్మ: హెచ్చార్కే చెప్పని దాన్ని కూడా నేను చేర్చడం… అంటే, స్త్రీపురుష ఆలింగనాల్ని హెచ్చార్కే  చెప్పక పోయినా, దాన్ని నేను తెచ్చాను -అని.

నేను: వూరక స్త్రీపురుష ఆలింగనాలని అనలేదు రంగనాయకమ్మ. ‘నగ్న ఆలింగనాలు’ అని అన్నారు. మామూలు ఆలింగనాలు నిత్యజీవితంలో వుండేవే. అవి తప్పు కానే కాదు. నా వాదం తప్పని అనిపించాలంటే, రంగనాయకమ్మ అక్కడితో ఆగడం కుదరదు. చాలదు. స్త్రీ పురుషుల నగ్న ఆలింగనాలు అనాలి. కాని, అవి బహిరంగంగా జరగవు. అలాంటి నగ్న ఆలింగనాలు రతికేళిలోనే వుంటాయి. దానికీ ముద్దులకూ సాపత్యం లేదు. ముద్దును రతికేళితో పోల్చడం… ఏదో సినిమాలో ఆడ హాస్య పాత్ర అమ్మా వాడు నన్ను ముద్దెట్టుకున్నాడే, నాకు పాపాయి పుఢుతుందా అని వాపోవడం వంటిది. బహిరంగ రతి అసహ్యకరం. నాకూ మరి చాల మందికి అసహ్యం కాని బహిరంగ ముద్దును…. మాక్కూడా అసయ్యకరమైన బహిరంగ రతితో పోల్చడం తప్పు. ఇది వాచిక‍ంలో లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి, దానికి గాను వాచికాన్ని ఎద్దేవా చేయ‍డమే. 

4. ‘రంగనాయకమ్మ: ….అంటే, హెచ్చార్కే  చెప్పిన, రాజశేఖర రెడ్డిలో నిజాయితీని, నేను విస్మరించాను -అని! ఇంత స్పష్టం గా హెచ్చార్కే… 

నేను: ఆమె విస్మరించారని నేను అన్నది రాజశేఖర రెడ్డిలోని నిజాయితీని కాదు. రాజశేఖర రెడ్డి ‘విప్లవకారుడు కాడు, పాలక వర్గ నాయకుడు అని నేను ప్రత్యేకించి పేర్కొన్నది వుబసుపోకకు కాదు. పాలక వర్గ నాయకుడుగా (బూర్జువా డెమొక్రటిక్ నాయకుడుగా) విద్యా, వైద్యాలు, నక్సలైట్లతో చర్చలు… అనే సందర్భాలలో నిజాయితీ వుంది అని నేను చెప్పాను. అంతే గాని రాజశేఖర రెడ్డి జీవితాన్ని మూల్యాంకన చేసి ఇతడు నిజాయితీ పరుడు అని నేను అనలేదు. మెచ్చుకోలుకు నేనిచ్చిన మినహాయింపులను పట్టించుకోకపోవడం… అవి అక్కడ లేక కాదు, రంగనాయకమ్మ చూడదలచక పోవడం వల్లనే.

5. రంగనాయకమ్మ: నా విమర్శని ఇంత వ్యతిరేకంగా తీసుకున్న హెచ్చార్కే కి మళ్ళీ జవాబు ఇచ్చి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, నా విమర్శ వివరంగానే ఉన్నా, దాన్ని ఆయన అర్ధం చేసుకోవడానికి నిరాకరించారు.

నేను: ఈ మాటలు అస్సలేమీ బాగో లేవు. supercilious గా వున్నాయి. ఆమె అంటున్నట్లు ఇది ఆమె పట్ల నా వ్యతిరేకత కాదు. నా పట్ల ఆమె వ్యతిరేకత, ఇక్కడ నాది  స్వీయ రక్షణ యత్నం. రెండు వేర్వేరు చోట్లలో నేను రాసిన వాటికి వ్యతిరేకంగా ఆమె ఒక ప్రశ్నకు జవాబిచ్చే రూపంలో విమర్శ రాశారు. నేను చేసింది నన్ను నేను డిఫెండ్ చేసుకోడం మాత్రమే. అర్థం చేసుకోడానికి నిరాకరించానని అనడం మరీ డొల్ల మాటే. ఎందుకంటే ఆ మాట నేను రంగనాయకమ్మ ను కూడా అనొచ్చు. ఎవరిని ఎవరైనా అనొచ్చు.  

6. రంగనాయకమ్మ: యాక్యురసీ’ అంటే, చెప్పిన దాని దగ్గిరే ఆగడం కాదు.  చెప్పిన మాటని బట్టి, అదే స్వభావం గల ఇతర విషయాల్ని గురించి కూడా అడిగే వాదం సాగుతుంది…

నేను: నిజమే, చర్చకు ఏ అంశాన్ని తీసుకుంటామో అక్కడే ఆగక్కర్లేదు. కాని, ఒకే స్వభావం లేని రెండింటిని పోల్చడం కరెక్ట్ కాదు. ఒక జంట బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకున్నారు అనడం వేరు, ఒక జంట బహిరంగ ప్రదేశంలో రతికేళిలో ఓలలాడారు అనడం వేరు. స్త్రీ పురుషుల నగ్న ఆలింగనాలు రతి కేళిలోనే వుంటాయి. రతికేళి బహిరంగంగా జరగదు. జరిగితే అసహ్యకరం. ముద్దులు పెట్టుకోడం పాశ్చాత్య దేశాల్లో బాగానే జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది. అది అసహ్యకరం కాదు.

7. రంగనాయకమ్మ:బహిరంగ ముద్దులు ‘మనోహరం’ అయితే, ఎవరికి ఆ మనోహరం? – ఆ ఇద్దరికే.  దాన్ని చూసే మూడో మనిషికి కాదు.

నేను: ఈ మాటకు అర్థం పర్థం లేదు. నేను మనోహరమన్నా, రంగనాయకమ్మ అసహ్యకరం అన్నా అది చూపరుల సమస్యనే. ఆ ఇద్దరు ప్రేమికుల సమస్య కాదు.

8. రంగనాయకమ్మ:  ‘చూసే వాళ్ళకి కూడా అది మనోహరం అయితే, ఆ ముద్దు అందరికీ సంబంధించిన విషయం అవుతుంది గానీ, ఆ జంటకి మాత్రమే సంబంధించిన ‘ప్రైవసీ’ విషయం అవదు..

నేను: అది నాకూ మరికొందరికి మనోహరం అని నేను రాశాను. అందరూ అలా అనుకోవాలని కడ్డాయం ఏమీ లేదు. నాకు పేలాల్లో ఇసుళ్లు కలుపుకుని తినడం చాల ఇష్టం. ఛా, పురుగులను తింటారా ఛీ అసయ్యంఅని ఇతర్లు అనొద్దు. ఇతర్లు తినకుండా వుండొచ్చంతే.

9. రంగనాయకమ్మ: ఏంటి? వీధుల్లో నడిచిపోతున్న వాళ్ళు, అక్కడే “తమకంలో, మైమరుపులో” పడి పోతారా? .

నేను: వీధుల్లో నడిచిపోతున్న వాళ్లు అనేది ఎద్దేవా చేసే మాట. కాని, అలాంటి సందర్భాలుంటాయి. నేను చూశాను. చాన్నాళ్ళుగా కలుసుకోని ప్రేయసీ ప్రియులు బస్టాండులోనో, రైల్వే స్టేషన్ లోనో కలవడం వంటి సందర్భాలుంటాయి. లేదా వీడ్కోలు సందర్భాలుంటాయి. అంతే కాదు, ఇళ్ళ వద్ద కలుసుకోలేని, కలుసుకోడానికి ఇంకా ఇళ్లే లేని జంటలు తాము కలుసుకున్న బహిరంగ ప్రదేశంలో తమకంతో కావిలించుకుని ముద్దు పెట్టుకోవడం జరగొచ్చు. ఎక్కడో శ్రీశ్రీ అన్నట్టు వొడ్డించిన విస్తళ్ళ లాంటి జీవితాలున్న వాళ్ళకు ఇది అర్థమయ్యేలా చెప్పడం నా చాత కాదు.  

10. రంగనాయకమ్మ: ఆ జంట, నడి వీధిలో, తమకంతో, తమని తాము మరిచిపోయే మైమరుపులోకి పోతే, ఆ జంటకి తర్వాత ఏం జరుగుతుందో, చూసే వాళ్ళకేం జరుగుతుందో కూడా, హెచ్చార్కే చెప్పాలి. లేదా పాఠకులే ఉహించాలి.

నేను: ఊహలెందుకు? అలాంటి దృశ్యాల్ని నేను చూశాను. చూసే వాళ్ళకు… ముద్దును చూడడం వల్ల ఏం జరగదు. నాదీ గ్యారంట్రీ. అలా ఏదో జరిగే వాళ్లకు… ముద్దు దాకా ఎందుకు, పార్కులో యువ జంటల్ని చూసినా జరుగుతుంది. యువ జంట పార్కు బెంచీ మీద ఆనుకుని కూచోడం చూసినా జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రేమికులు ఎడం ఎడంగా నడవక్కర్లేదు. నడవరు.  

11. రంగనాయకమ్మ: ఇద్దరు స్త్రీ పురుషులికి  ఏకాంతంలో సహజంగా కలిగే ‘తమకం’, ‘మైమరపు’, అందరి ముందూ, బహిరంగ స్థలాల్లో రావడం అంటే, అది ప్రదర్శన కోసమే! ‘ప్రదర్శన’ కాకపోతే, ఏకాంతానికీ, బహిరంగానికీ, తేడాయే తెలియని పాగల్ లక్షణాలు అవి ఆ ఇద్దరికీ. ముద్దుకు ఏకాంతం వుంటే ఓకే,

నేను: పార్కుల్లో, బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ముద్దెట్టుకుంటున్న వాళ్ళ ప్రేమను చూసి హాయిగా నవ్వుకుంటాన్నేను. వాళ్లు పాగల్ అనుకోను. మాగ్జిమమ్ నా ప్రేయసిని గుర్తు చేసుకుంటానేమో. తనను చూడాలనిపించి ఇంటికి కాస్త తొందరగా నడుస్తానేమో, ఏ ఫ్రెండు దగ్గరికో, బార్ వైపో నడవకుండా.  మనకు అనుభవంలో లేని దాని గురించి పాగల్ అనడం ఎవరికీ తగదు. 

12. రంగనాయకమ్మ:బహిరంగ ముద్దుల తమకాలూ, మైమరుపులూ, ఆ యువ జంటనే, ఆ ‘అతిక్రమణ‘కు ప్రోత్సహించవచ్చు. లేదా, ఆ మైమరుపు, ఆ జంటకీ, ఆ దృశ్యాన్ని మనోహరంగా భావించే చూపరులకూ కూడా, ఆ ‘అతిక్రమణ స్పృహ‘ కలిగించవచ్చు.

నేను: యువ జంట ముద్దు అలాంటి స్పృహ కలిగించదు. అంతగా కలిగించినా, కొంపలేం మునగవు, అలాంటి స్పృహ లేకుండా టీనేజ్ పిల్లలెవరూ వుండరు. ఎవరో ముద్దు పెట్టుకోడం చూఢ్డం వల్లనే అలాంటి భావనకు లోను కానక్కర్లేదు, చెలం కథలు చదివి కూడా అదే స్పృహకు లోను కావొచ్చు. నిషేధిద్దామా చెలాన్ని?

13. రంగనాయకమ్మ: ‘ఆరుబయట యువ జంట ముద్దు… అయితే మనోహరం అవుతుంది, లేదా ఏమీ కాదు’ అనేది దాటవేత.

నేను: ఇందులో దాటవేత ఏమీ లేదు, తన పనిలో తాను వెళ్తున్న మనిషి దాన్ని పట్టించుకోడు, అతడికి /ఆమెకు ముద్దు మనోహరం కాదు, ఏమీ కాదు.

14. రంగనాయకమ్మ: ప్రేమల’ పేరుతో, నగ్న ప్రదర్శనల్ని చూపే సినిమాలూ, టీవీలూ, పెచ్చుపెరిగిపోతూ ఉన్నప్పుడు, చాదస్తాల్ని నిలబెట్టుకోవడమే, చెయ్యవలిసిన మంచి పని !

నేను: ప్రేమల పేరుతోనైనా మరెలాగయినా నగ్న ప్రదర్శనలు అనేది రంగనాయకమ్మ పనిగట్టుకుని తెచ్చిపెడుతున్న మాట. దాంతో నాకు సంబంధం లేదు. అదలా వుంచి; చాదస్తాల్ని నిలబెట్టుకోడం అసలెప్పుడూ మంచి పని కాదు. చాదస్తాలు మంచి పని అనడం సంప్రదాయ వాదం పునరుద్దరణ.

15. రంగనాయకమ్మ: మానవ జీవితంలో, ఏ కోణాన్ని తీసుకున్నా, ‘సహజం-అసహజం’ అనే తేడాలతోనే చూడాలనేది ఆ (మార్క్సిస్ఠు) సిద్ధాంతం. దీని కోసం సైకియాట్రిస్టులెందుకు? ఆ ఫీజు దండగ! ఆ టైమూ, ఆ శ్రమా దండగ!.

నేను: సైకియాట్రిస్టులెందుకు, ఫీజు దండగ అనే  విసురుతో పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఇక్కడ చర్చనీయాంశానికి మార్క్సిజానికి సంబంధం లేదు. బహిరంగ ప్రదేశంలో ముద్దు అసహ్యకరమని మార్క్సిజం  చెప్పదు. ఎందుకంటే రంగనాయకమ్మ పదే పదే ఎన్ని సార్లు చెప్పినా ముద్దు… బహిరంగ ప్రదేశంలో (కూడా) ముద్దు … అసహజం కాదు. అది అసహజం అనడం రంగనాయకమ్మ అభిప్రాయం  మాత్రమే. నిర్ద్వంద్వ సత్యం కాదు. ఈ ఫీచర్ లో వుంచిన ముద్దు ఫోటోలు చూఢండి. ఈ ముద్దు బహిరంగమే. అసహ్యం కాదు.

16. రంగనాయకమ్మ: ఈ మెచ్చుకోలు (“ప్రజల పోరాట అజెండా లోనికి చేర్చినందుకు” అనే మెచ్చుకోలు), ‘యాత్ర’ సినిమా మీద చేసిన సమీక్షలో లేదు. ఇప్పుడు రాసిన జవాబులోనే ఉంది.

నేను: ఆమె అన్న రీతిలో ఆ మాట నా సంపాదకీయంలో లేదు. ఇప్పుడు రాసిందే. ఇందిరాగాంధీ హయంలో రోటీ కపడా మకాన్ అనేవి ప్రజల పోరాట అజెండాలో చేరాయి. ఒక బూర్జువా నేత వాటిని తన వాగ్దానాలుగా ప్రకటించి, అమలుకు ప్రయత్నించారు. ప్రచారం కల్పించారు, తన అవసరాల కోసమే. వాటి అమలులో ఆమె ఎంత సఫలమయ్యారో ఎంత విఫలమయ్యారో ఎంతైనా చర్చించొచ్చు, కాని, అవి ఆ తరువాత ప్రజలు స్టేట్ ను నిలదీసి డిమాండ్ చేసే ప్రాక్టికల్ అంశాలైపోయాయి. ఆ డిమాండ్లను ఇక ప్రజలు వొదలరు. వయ్యెస్సార్ హయాంలో ప్రజలందరికి విద్యా, వైద్యాలు అనేవి ప్రాక్టికల్ అంశాలుగా ప్రభుత్వ అజెండా మీదికి వొచ్చాయి.  ప్రజలు ఈ అదనపు డిమాండ్లను పోరాట అజెండాలో చేర్చేసుకున్నారు. ఇక ప్రతి ప్రభుత్వాన్ని వాటి కోసం డిమాండ్ చేస్తారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి ఈ డిమాండ్లు ప్రజా పోరాట అజెండాలో చేరడానికి దోహదం చేశాడు. ఈ పని రెండు కమ్యూనిస్టు పార్టీలు గాని, నాగిరెడ్డి, పుల్లారెడ్డి గ్రూపులతో సహా సాయుధ పోరాట వాదులు గాని…  తమ డెమొక్రటిక్ కార్యక్రమం లోనికి తీసుకు రాలేదు. అందుకే వయ్యెస్సార్ ను మెచ్చుకున్నాను. మెచ్చుకోని వాళ్ళు ఆ ఐదు ప్రజావసరాల కోసం తామేం చేస్తారో చెప్పాల్సి వుంది. లేక అవి తక్షణావసరాలు కాదు, రెవల్యూషన్ వొచ్చే వరకు ఆగమంటారా?

17. రంగనాయకమ్మ: ఈ మెచ్చుకోలు, బూర్జువా ప్రతిపక్ష నాయకుడికి, అతడి కోరికపై, బడ్జెట్ ప్రసంగం రాసిపెట్టడం కన్నా దారుణం.

నేను: అలా బడ్జెట్ ప్రసంగం ఎవరికి ఎవరు రాసిపెట్టారో నాకు తెలీదు.  అది ఆ రచయిత తన ఉద్యోగంలో భాగంగా చేశారో మరెందుకు చేశారో తెలీదు. ఆ రచయితకూ నాకూ పోలిక కుదురుతుందో లేదో లేక ఇది కూడా ముద్దుకు, రతికి తేడా చూపని చాదస్తమో తెలీదు. ఆ చర్చకు ఇది స్థలం కాదనుకుంటాను.

18. రంగనాయకమ్మ: పాలక పక్ష నేతనే ‘ప్రజల పోరాట అజెండాకి’ రూపకర్తగా ప్రశంసించడం ఇది.   

నేను: ‘ప్రజల పోరాట అజెండాకి’ రూపకర్త’ అని నేను ఏ పాలక నేతనూ ప్రశంసించలేదు. అలా ప్రశంసించాననడం అబద్ధం. అబద్ధాలకు జవాబివ్వలేను.  

19. రంగనాయకమ్మ:  ‘హెచ్చార్కే ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఈ ప్రశంసలు చేశారంటే, దానికి కారణం ‘శ్రామిక వర్గ ధృక్పధం’ గురించి ఆయనకు ఉన్న అవగాహన ఆ స్థాయిలో ఉందన్నమాట! 

నేను: ఔను నా శ్రామిక వర్గ అవగాహన ఆ స్థాయిలోనే వుంది. అలాంటి మెచ్చికోళ్ళు ప్రజల్ని భ్రమల్లో ముంచి విప్లవానికి దూరం చేస్తాయని భయపడ్డానికి ఇప్పుడు ప్రజలు నాగిరెడ్డీయుల నాయకత్వంలోనో, రంగనాయకమ్మ నాయకత్వంలోనో విప్లవించడం లేదు. సుమారు వందేళ్ఫ వైఫల్యాలతో వుద్యమాల పట్ల డిజల్యూజన్ కు లోనై ముందుకు వెళ్లడం ఎలా, తమకు తాము సర్వైవ్ కావడమెలా అని పోరాట ప్రజలు అంతర్మధనంలో వున్నారు. నిజం చెప్పాలంటే ఒక గ్రేట్ డిబేట్ లో వున్నారు. ఒక్కుమ్మడి మార్పు(ఇన్సరెక్షన్)తో కార్మికులే రాజ్యాధికారం చేపట్టి పైనుంచి సోషలిజం నిర్మించడమా లేక బూర్జువా డెమొక్రసీ లో అడుగడుగున జోక్యం చేసుకుంటూ పౌర, రాజకీయ సమాజాల్లో అడుగునుంచి మార్పు తీససురావడమా లేక ఈ రెండింటి సమ్మిశ్రమమా అనేది ప్రస్తుతం రగులుతున్న చర్చ సారాంశం. ఈ చర్చలో భాగంగానే…  ప్రజల దైనందిన జీవితం (ఎవెరి డే లైఫ్) లో అతి ముఖ్యమైన  5 నిత్యావరాలు ప్రాక్టికల్ డిమాండ్లుగా మారడానికి తమ పాలక చర్యల ద్వారా తోడ్పడిన ఇద్దరు బూర్జువా నేతలను నా ఎడిట్ లో ప్రస్తావించాను. ఈ పద్దతి ప్రజా పోరాటాల ముందంజకు పనికొస్తుందని చెప్పడానికి ఆ ఎడిట్ లోనే కాదు, దానికి ముందూ తరువాత కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నన్ను రంగనాయకమ్మ లేదా మరెవరైనా విమర్శించవచ్చు. నేనూ మాట్లాడుతాను. వాళ్ళు నా కన్న పెద్దవారైనా, నా కన్న చిన్న వారైనా… కులం బయాస్ లాగే, జెండర్ బయాస్ లాగే నాకు ఏజ్ బయాస్ కూడా లేదు. అంటే అందరిని నాతో సమానికులుగా భావించి మాట్లాడుతాను.

20. రంగనాయకమ్మ:  ‘శ్రమ దోపిడీని కొనసాగించే ఏ పాలక వర్గ నేత అయినా, ఏ పధకం ప్రవేశపెట్టినా, తమ దోపిడీ వర్గ దృష్టితో చేస్తాడా, శ్రామిక వర్గ దృష్టితో చేస్తాడా?.

నేను: శ్రామిక వర్గ దృష్టితో చేసే వాళ్ళు లేనప్పుడు ఆ దిశగా పయనం ఇంకా చర్చ దశలోనే వున్నప్పుడు, ఇలాంటి పథకాలను వాటి బాగోగుల ప్రాతిపదిక మీదే పరిశీలించాలి. ఆ ప్రాతిపదిక మీదే స్టేట్ తో సంవాదం (డిస్కోర్స్)లో దిగాలి. అవతలి వారేం చేసినా మేం ఒప్పుకోం అనే వైఖరి ఏ సంవాదంలో వుండదు. ప్రాక్టికల్ సంవాదాల్లో అసలుండదు.   

21. రంగనాయకమ్మ:రాజశేఖర రెడ్డి పెట్టిన ఆ రెండు పధకాలూ, బూర్జువా పారిశ్రామిక వేత్తల సరుకుల అమ్మకాల కోసమే!    

నేను అన్నీ అమ్మకాల కోసమే గాని, పాలకులు కేవలం అమ్మకాల కోసమే చెయ్యరు. తమ పాలనకు, బూర్జువజీ లోని తన సెక్షన్ పాలనకు ప్రజల సమ్మతి (కన్సెంట్) కూడ గట్టడం కోసం కూడా చేస్తారు. బూర్జువజీ యొక్క మన్నిక(డ్యురబిలిటీ)కి అదే మూలం. ఇక్కడే ప్రజలు, ప్రజల్ని ప్రేమించే వాళ్ళు జనజీవనగతిలో కలుగజేసుకోవాలి. పైన చెప్పినట్లు బూర్జువా నాయకులతో డిస్కోర్స్ సాగించాలి.  

22. రంగనాయకమ్మ: రెడ్డి తర్వాత వచ్చిన నాయుడు, ఆ గొప్ప పథకాలకు ‘తూట్లు పొడిచాడని’  హెచ్చార్కే ఆరోపణ! చంద్ర బాబు నాయుడి సమర్ధకులు చెప్పుకునేది ఏమంటే: “మా పధకాలు గొప్పవి. విస్తృతమైనవి…. … గమనించాల్సింది ఏమిటంటే, పధకాల గొప్పతనాలలో తర తమ భేదాలు కాదు చూడవలిసింది.

నేను: పథకాల ప్రయోజనాల గురించి, అమలు గురించి ప్రజా ప్రేమికులు పట్టించుకోవలసిందే. రెడ్డి తరువాత వొచ్చిన నాయుడు ఆ రెంఢు పథకాలను తగిన విధంగా మెరుగు పరచాల్సింది పోయి వాటికి తూట్లు పొడిచాడనేది  ఒక వాస్తవం. ప్రజలకు చాల అవసరమైన విద్యా వైద్య పథకాల అమలు కోసం వామపక్షీయులు ప్రజలను కదిలించాల్సింది. వాటిలోని కార్పొరేట్ అనుకూలతను తొలగించకపోతే వాటి అమలు సాధ్యం కాదు గనుక ఆ రంగాలను ప్రజల అదుపులో పబ్లిక్ రంగంలో చేర్చాలని డిమాండ్ చేయాల్సింది.

23. రంగనాయకమ్మ: పాలక వర్గం లో రెండు ముఠాల నాయకులూ ఒకడిని మించి ఒకడు జనాల్ని మోసగించడానికి వేసిన ఎత్తుగడలే ఈ పథకాలన్నీ’ .

నేను: కమ్యూనిస్ట్ అని పేరెట్టుకున్న నాయకులు కూడా అదే పని చెయ్యొచ్చు. ప్రజల నిరంతర క్రియాశీల నిఘా తప్పని సరి. నిఘా వుంచడమంటే పాలకవర్గమోడివి కాబట్టి  తప్పుటోడివి’ అని బండ ప్రకటనలు చేయడం కాదు. సంవాదంలో పాల్గొనాలి. ప్రజలకు తెలిసే ఆచరణాత్మక భాషలో సంవాదం జరగాలి.    

 24. రంగనాయకమ్మ:  ‘ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వ ఆస్పత్రుల్ని గానీ, ప్రభుత్వ కాలేజీల్ని గానీ అభివృద్ధి చేసే పధకాలు చేయకూడదా? వాటి వల్ల ‘అత్యవసర మేలు’ జరగదా?

నేను: జరుగుతుంది. అలా జరగాలనే నేనింతగా మొత్తుకుంటున్నది. ప్రభుత్వ రంగం అనే దాన్ని గుడ్దిగా వ్యతిరేకించడం కాదు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజానుకూలంగా లేకపోతే ఎండగడుతూ, ప్రజానుకూలంగా వున్న చోట్ల మెచ్చుకుంటూ, ఆ అనుకూలాల్ని ప్రజా పోరాటాంశాలుగా మార్చుకుంటూ పోవాలంటున్నాను

25. రంగనాయకమ్మ:  బూర్జువా ముఖ్యమంత్రికి  ‘కార్పొరేటైజేషన్’ అంటే వ్యతిరేకత ఉన్నట్టూ; అతడు శ్రామిక ప్రజల ప్రయోజనాల దృష్టితోనే, నిజాయితితో ప్రవేశ పెట్టిన  ప్రజానుకూల పథకాలకు సమస్య అయ్యేదన్న ట్టూ; ఇలాంటి అర్ధాలు చెప్పడం అంటే, ఇదా శ్రామికవర్గ దృక్పధం? 

నేను: ఆయనకు కార్పొరేట్ వ్యతిరేకత వుందా లేదా అనేది కాదిక్కడ. కార్పొరేటైజైషన్ వల్ల ఆ పథకాలు విఫలమే అవుతాయి. అయి తీరుతాయి. ఈ లోపల ఆ పథకాల ఆవశ్యకతను ప్రజలు గుర్తించి వుండడం వల్ల వాటిని ప్రైవేటు రంగం నుంచి తీసుకుని పబ్లిక్ రంగంలో చేపట్టాలని, వాటిపై ప్రజల అదుపు వుండాలని జనం డిమాండ్ చేస్తారు. చేయాలి. ఆ డిమాండ్ మీద జనాన్ని నడపడానికే కదా కమ్యూనిస్టులు?.   

26. రంగనాయకమ్మ:  ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు కలిసి కట్టుగా కృషి చెయ్యాలని బూర్జువా పాలకులు చెప్పే దానికీ, అదే రకపు సంస్కరణల్ని మెచ్చుకుంటూ హెచ్చార్కే చెప్పేదానికీ, తేడా ఏమైనా ఉందా?    

నేను: నేను ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పని చేయడం గురించి మాట్లాడలేదు. పోగా విద్యా వైద్య పథకాలని పబ్లిక్ రంగంలో చేర్చి వాటి మీద ప్రజల అదుపుతో పని చేయడం సాధ్యమేనని అన్నాను. అసలు, రంగనాయకమ్మ దేన్ని బూర్జువా సంస్కరణ అంటున్నారో (ఇక్కడ) దాన్ని నేను బూర్జువా డెమోక్రసీ అంటున్నాను. దానికి కార్మిక వర్గం నాయకత్వం వహించాలనే థీరీ సరైనదే. అది జరగడం లేదు. లోకం ఆగదు. ప్రస్తుతం దానికి బూర్జువజీ నాయకత్వం వహిస్తోంది. ఇది బూర్జువా డెమొక్రసీయే గాని, ఇది అవసరం. ఈ క్రమం కనీస స్థాయిలో పూర్తి కాకుండా సోషలిజం సాధ్యం కాదు. మట్టి లేకుండా కుండ సాధ్యం కాదు.

కార్మిక వర్గ నాయకత్వంలో బూర్జువా డెమోక్రసీ అనేది ఎలా వుంటుందో రష్యా లో చూశాం. దాన్నే కదా బెతల్హాం మనకు చూపించింది? దాన్నే ఇప్పటికీ చైనాలో చూస్తున్నాం. కార్మిక వర్గ నాయకత్వం అక్కడ పేరుకు మాత్రమే. అమలయ్యింది బూర్జువా నాయకత్వమే. ఇలాంటప్పుడు ఇప్పుడున్న స్టేట్ ను ప్రజానుకూల డిమాండ్ల ఆకురాయి మీద అరగదీసి చివరకు స్టేట్ నే శ్రామిక  శక్తులు ఆక్రమించడం వినా వేరే దారి లేదు. ఏ దారీ వుండక పోయినా సరే అనడం, ప్రజలు తమ అవసరాల మీద కాకుండా వూహల మీద కన్ స్ట్రక్టెడ్‍ కాన్సెప్టుల మీద నడవాలనడం… పెటీ బూర్జువా దృక్పథమే.   

27. రంగనాయకమ్మ: ‘పాలక వర్గాలు ఇలాంటి పధకాల ద్వారా శ్రామిక ప్రజల్ని మోసపుచ్చుతార’ ని, వారు గ్రహించేలా ఎప్పుడు చెపుతారు?  మన అదనపు విలువలో నుంచే, పన్నుల పేరుతో లాగిన దానిలో నుంచే, ప్రైవేట్ పెట్టుబడిదారుల్ని పోషించడానికి, మన మొహాన కొంత బిచ్చమ్ పడేస్తున్నారని ప్రజలకి చెప్పారా? ఈ రకపు ధోరణి ఏమైనా ఉందా ‘యాత్ర’ సమీక్ష లో?

నేను: యాత్ర మీద ఎడిట్ లో ఆ పథకాలు కార్పొరేటైజేషన్ కారణంగా విఫలమయ్యేవి అని స్పష్టాతి స్పష్టంగా రాశాను. వాటిని పబ్లిక్ రంగంలో చేపట్టడం, వాటి మీద ప్రజల అదుపుకు ఏర్పాట్లుండడం తప్పనిసరి అని చెప్పాను. అంటే వీటి పరిమితుల గురించి చెప్పినట్టే. ఇవి బూర్జువా డెమోక్రసీ పరిధిలో సాధ్యమే కాదు అని నేను చెప్ప లేదు. చెప్పను కూడా. ఎందుకంటే అది అవాస్తవం. ఈ పనులు బూర్జువా డెమొక్రటిక్ ప్రభుత్వాలు చేయాల్సిన పనులే, వాటికి నాయకత్వం ఎవరిదైనా.  

28. రంగనాయకమ్మ: అడవి సాయుధ చర్యలు, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం జరిగేవా కాదా?….   

నేను: ఆదివాసులవి పూర్తిగా డెమోక్రటిక్ డిమాండ్లు. వాటిని  బూర్జువా డెమొక్రటిల్ డిమాండ్లు అన్నా తప్పు లేదు. వాటి కోసం ఓపెన్  ప్రజా వుద్యమం అవసరం. గిరిజనులు ఇతర సమాజంతో కలిసి నడవాల్సిన ఒక అనివార్య ప్రక్రియను హింసాత్మకంగా వాయిదా వేయడం వినా  ఇప్పుడు మౌలికంగా జరుగుతున్నదేం లేదు. ఇది ఆదివాసుల ప్రయోజనాల కోసమా? ఏమో?

29. రంగనాయకమ్మ:  ‘మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని’ తెలుగు దేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే తెలుగు దేశం సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగైన పధకాలు ప్రవేశ పెడతామని’ వయ్యెస్సార్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు.

నేను: పాలక పార్టీలు అలా కాకుండా మరోలా వుండవు. ఆ శూన్యాన్ని భర్తీ చేసే కార్మిక శక్తులు వేదిక మీద లేవు. ప్రజలను ప్రేమించే వాళ్ళు ప్రజానుకూల డిమాండ్లతో స్టేట్ మీద వొత్తిడి తీసుకు వచ్చే రూపంలో ప్రజలను కదిలించాల్సి వుంది. ఏవేవో అమూర్త నినాదాలతో కాదు. పాలక పార్టీలు ఏం చెప్పినా కాదనాలనే నినాదమూ కాదు . రష్యాలో లెనిన్ పార్టీ ఇన్సరెక్షణ్ విజయవంతం కావడానికి పనిచేసిన నినాదం సోషలిజం కాదు, కార్మికులను/ప్రజలను నడిపించింది ఒకటే…  బ్రెడ్ అండ్ పీస్. పోటేమ్కిన్ తిరుగుబాటుకైనా మరి దేనికైనా ప్రజల నిత్యావసారాలే ప్రేరక శక్తులు.

30. రంగనాయకమ్మ: :ఇక్కడ ‘శాంతి’ అనేది, కమ్యూనిస్టు తిరగబాట్లు లేని శాంతే!…. అదే, బూర్జువా పాలకులకు కావలిసిన ‘శాంతి’.  హెచ్చార్కే ఈ విషయం గ్రహించక పోవడం వల్లనే ‘హెచ్చార్కేకి ఏమైంది?’ అని అడగవలిసి వచ్చింది?

నేను: హెచ్చార్కెకు ఏమీ కాలేదు. ‍అతడు వూహలను వాస్తవాలని భ్రమించడం లేదంతే.  రాజశేఖర్ రెడ్డి ఇనీషియేట్ చేసిన శాంతి చర్చల్లో ప్రభుత్వం తన పరిధిలో (బూర్జువా డెమొక్రటిక్ పరిధిలో) చిత్తశుద్ధితో వ్యవహరించిందని అన్నాను. పాలక నేతలు తమ వర్గ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిధిలోనే చర్చిస్తారు. నా ఎడిట్ లో చెప్పిందీ అదే, తరువాత చెప్పింది కూడా అదే. నక్సలైట్లు ఆ చర్చలకు వెళ్లాల్సింది కాదు, వెళ్లాల్సిందని ప్రోత్సహించిన వాళ్లు తప్పు చేశారు. రాజశేఖర రెడ్డి నక్సలైట్ల ప్రయోజనాల కోసం పని చేస్తానని అనివుంటే అతడు నిజాయితీ లేని మనిషి అయ్యే వాడు. ఉన్నదాన్ని వున్నట్ట్లు చూసి, ఆ తరువాత దాన్ని మార్చే ప్రయత్నం చేయడమే మంచి మార్క్సిజం నేను అనుకుంటాను. నేను వైఫల్యాల్ని వైఫల్యాలుగా ప్రజల అవసరాల్ని ప్రజల అవసరాలుగా చూస్తున్నాను.

31. రంగనాయకమ్మ: హెచ్చార్కే ప్రకారం, జరగవలిసింది, బూర్జువా స్వచ్చంద విరమణ!

నేను: బూర్జువా స్వచ్చంద విరమణ  సాధ్యమని అంటున్నది హెచ్చార్కె కాదు. ప్రభుత్వంతో నక్సలైట్ల బేస్ లెస్ చర్చలను సమర్థిస్తున్న  వారే. బూర్జువా ప్రభుత్వం స్వచ్చంద పదవీ విరమణకు సిద్దపడితే తప్ప… రాజ్యాధికారం తక్షణ ధ్యేయమైన విప్లవకారులకూ ప్రభుత్వానికీ మధ్య చర్చలకు బేస్ లేదని నేను అన్నాను.

32. రంగనాయకమ్మ: హెచ్చార్కే జవాబులో, నాకు, అన్నీ తప్పుడు జవాబులే దొరికాయి. ఇతరులకూ అదే జరిగి ఉండాలి. హెచ్చార్కే జవాబు ఎలా ఉందంటే, రాజశేఖర రెడ్డి వెచ్చని కర స్పర్శని ఆస్వాదించిన విప్లవ రచయిత, ‘క్షమాపణ ముసుగులో దబాయింపు’ చేశాడే, అలా ఉంది.అని రంగనాయకమ్మ చివరాఖరి దబాయింపు.

నేను: ఇక్కడ నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? చెబితే గిబితే తమ చాదస్తాలకు గాను రంగనాయకమ్మ చెప్పుకోవాలి. నా పేరులో ఆర్ (రెడ్డి) వుందంటో చెత్త మాట్లాడిన ఆమె సమర్థకులు చెప్పాలి క్షమాపణ. నిజానికి ఆమెవి అన్నీ తప్పుడు జవాబులే అని నేననాలి. మొత్తం తమ అంకెల వారీ రైటప్ లో ఎక్కడా గతి తార్కికత లేదు. నిరంకుశమైన తీర్పులు తప్ప. ఆమెకు అసయ్యం అయింది ఇతరులకూ అసయ్యం కావాలా? లేకుంటే పాగల్ అవుతారా?  రాజకీయ చర్చలోనూ అంతా పెద్ద పెద్ద పదాల మాటున వొఠ్టి క్రియాశూన్యతా. ఓపిక లేని తనం. బై ది బై రంగనాయకమ్మ ప్రతిసారీ వెచ్చని కరస్పర్శ విప్లవరచయిత అంటూ ఒక ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు?  ఎవరితోనైనా ఏమైనా పేచీ వుంటే వేరుగా నేరుగా వారితో పేచీ పడాలి. ఈ అదాటు విసుర్లు కరెక్ట్ కాదు.

హెచ్చార్కె

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.