ఆవేశభరితం పండితారాధ్యుడి పద్యం

కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. కాలంతోపాటు మానవుడు సంతరించుకొనే విజ్ఞానం మేర గతంలోని ఒప్పులు నేడు తప్పులు కాగలవు. కేవలం కాలమే కాదు, సంస్కృతి, దేశ పరిస్థితులను బట్టి కూడా సమాధానాలు మారుతుంటాయి.

‘హితేన సహితం సాహిత్యం’ – హితం చేకూర్చేది సాహిత్యం అని నిర్వచనం. కానీ ఏది హితం?, ఎవరికి హితం? వీటికి ప్రశ్నలు దేశ కాలాలను బట్టి మారుతుంటాయి. కొందరు ప్రజ్ఞావంతులైన కవులు, నాయకులు సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేయగలిగారు. వారేది చెబితే అదే హితమన్న విధంగా వారివెంట అశేష ప్రజానీకం నడిచి వెళ్లిన సందర్భాలు మనం చరిత్రలో చూశాం. విప్లవాలు సైతం రగిలించిన సన్నివేశాలు చూశాం. సుదీర్ఘ తెలుగు సాహిత్య ప్రస్థానంలో అటువంటి ప్రతిభామూర్తులు లేకపోలేదు. తొట్టతొలి తరం కవులలో ఒకడైన మల్లికార్జున పండితారాధ్యుడు సరిగ్గా అటువంటి నిప్పు రవ్వే. నన్నయ్యకు దాదాపు వందేళ్ళ తరువాత జీవించి, ఆశయ సాధనే లక్ష్యంగా సాహిత్య శ్రమ చేసి తరువాతి కవులపై కూడా ముద్ర వేసిన కవి – పండితయ్య.

కవిత్వమెంత విశేషమైనదో, ఈ కవి జీవితంలోని సంఘటనలు కూడా అంతే ఆసక్తిని కలిగించేవి. వైష్ణవ సంప్రదాయాలపై ధ్వజమెత్తి శైవ దీక్షను చేపట్టి, వీర శైవ శాఖను ముందుండి నడిపాడు. ఈ శాఖలోని కొన్ని పద్దతులు అప్పటి సమాజంలోకి తొంగి చూస్తే చాలా విప్లవాత్మకంగా అనిపిస్తాయి.

యుద్దలక్షణమైన వీరత్వం మతంలో ప్రవేశించడమే వీర శైవం. భక్తిలో పరమోత్సాహమే వీరత్వం. ఆరాధనా వ్రత లోపం జరిగినపుడు తృణప్రాయంగా ప్రాణత్యాగం చేయడం వీరవ్రతం. అయితే శైవం పైనున్న ఈ అత్యుత్సాహం అదే మోతాదులో  అన్యమతాలను ద్వేషించేందుకు దారితీసింది కూడా. ఒక్కమాటలో చెబితే వీరశైవులు ఇటు ఆత్మహింసా చేసుకోగలరు, అటు పరపీడనా చేయగలరు.

ఈ వీరావేశం మనకు నచ్చినా లేకున్నా ఎన్నో విశిష్ట గుణాలను వీరశైవం ఆచరించింది. జాతి, కుల భేదాలను తిరస్కరించింది. స్రీ పురుషుల భేదం లేదు. కలిమిలేముల తేడా లేదు. మడి, మైల లేవు. అన్నిటినీ మించి ‘కాయికమే కైలాసము’ అంటే కాయకర్మే (శ్రమ జీవితం) గౌరవించిన విధానం అది. పాపినేని శివశంకర్ గారన్నట్లు ఈ విధానం వల్ల కాయకర్మలు చేసే శూద్ర పంచమ కులస్థులు గౌరవనీయులైనారు. కనుకనే మడివాలు మాచయ్య, కుమ్మర గుండయ్య, పూసల నయనారు, స్వాపచయ్య(చండాలుడు) మొదలైన శూద్ర, పంచమ కులాల వారొందరో ఈ శాఖనే ఆచరించిన పాల్కురికి సోమనాథుని బసవపురాణంలో అయ్యలు (గార్లు) అయ్యారు. మతం విషయం అలాఉంచితే, ఈ విషయాలన్నీ ఆనాటి సమాజంలో విప్లవాత్మకమైనవి, సాహసోపేతమైనవి కూడాను. అటువంటి శాఖకు ఆద్యుడు కర్నాటదేశ బండారు బసవన్నయితే, తెలుగుదేశంలో దాన్ని తలకెత్తుకుని మోసింది పండిత త్రయం. వారిలో మల్లికార్జున పండితారాధ్యుడొకరు.

ఇక అసలు విషయం సాహిత్యంలోకి వస్తే, ఆరుద్ర గారు సెలవుచ్చినట్టు ఉద్యమాలూ, విప్లవాలు నెగ్గినా మగ్గినా పద్యం మటుకూ నాటి చరిత్రను భద్రపరుస్తుంది. దాన్నే మనం స్వీకరిద్దాం.  ఆ పరిధిలో మనం విశ్లేషిస్తే పండితయ్య పద్య లక్షణాలు చాలా ఆకట్టుకుంటాయి.

పండితయ్య వేదవేదాంగాలూ, శాస్త్రాలూ ఉడ్డోలంగా చదువుకొన్నాడు. సంస్కృత వ్యాకరణం క్షుణ్ణంగా అభ్యసించాడు. వ్యాకరణ విషయాలనే కాక శ్మృతి పురాణాలలో ఉన్న సంస్కృత సమాసాలను తెలుగు పద్యాలలో ఛందస్సు చెడకుండా పొదగడం పండితయ్యకు నల్లేరు మీద నత్తనడక.

“వసుమతి జిత్రము జితచి
త్తసంభవా! ‘నకర్మణా నతపసా నజపై
ర్న సమాదిభి’ రవ్యయ! నీ
యసదృశ భక్తికిని బ్రియుడవగు దీశానా”

వసుమతి చిత్రము = భూమిలో చిత్రమైన విషయం; జితచిత్త సంభవా= మన్మథుని జయించిన వాడా (శివా) ;  ‘న కర్మణా న తపసా న జపైర్న సమాది భి’ ర్యవ = కర్మలకు కానీ, తపసునకు గానీ, జపమునకు గానీ, నిశ్చల సమాధికి గానీ లొంగవు;  అసదృశ = సాటిలేని ; ప్రియుడవగు దీశానా = ఇష్టపడతావు శివా

భావము = పరమేశ్వరా భూమిలో చాలా చిత్రమైన విషయం! కర్మలకు కానీ, తపసునకు గానీ, జపమునకు గానీ, నిశ్చల సమాధికి గానీ లొంగవు, కానీ, కొంచెమైనా నీ పై చూపే భక్తిని మాత్రం ఇష్ట పడతావు.

తెలుగు కంద పద్యాలలో సంస్కృత సూక్తులను ఛందస్సు తప్పకుండా ఇట్టే  ఇరికించేయడం ఈయనే మొదట, తరువాత పాల్కురికి నుండి పెద్దన వరకూ పండితయ్యనుండి ఆ టెక్నిక్ ఉదాహరణగా తీసుకున్నవారే. ఇక్కడ భావంలోని విశేషమేమంటే క్లిష్టమైన  కార్యాలూ తపస్సులు వాటన్నిటికంటే, నిర్మలమైన చిన్నపాటి భక్తి అనే దానిలో ఒక సింప్లిసిటీ ని ప్రతిపాదించినట్లయింది.

సంస్కృతంలో ఎంత ప్రావీణ్యతో తెలుగు నుడికారం అంత బాగానూ వచ్చు. మసి పాతను కట్టిన మాణిక్యం, బంగారానికి తావి అబ్బడం అనే సామెతలు, ‘అంటీముట్టని’ అనే మాట సొంపు తన పద్యాలలో వాడాడు. మనకేదైనా కష్టమో, అపాయమో వచ్చి కొద్దిలో బయటిబడి పోతే ‘బతుకు జీవుడా’ అనీ, లేక ‘బతికి పోయాను’ అనీ అంటూ ఉంటాం.

“భక్తుల దవ్వుల గని శివ
భక్తులు  వచ్చిరని పొంది బ్రతికితి నని  పో
భక్తుల కెదురేగి యథా
శక్తిస్థితి జేయవలయు సత్క్రియలు శివా”

దువ్వు = దూరము;

భావము = భక్తులను దూరంనుండే గమనించి, వారు శివ భక్తులైనచో బ్రతుకు జీవుడా అన్నంత నిట్టూర్పు తో వారి కెదురేగి తిరిగి ఎప్పుడూ ఉండేటంత శక్తితో వారికి సత్ క్రియలు శివునికి చేయవలెను.

దాదాపు 850 ఏళ్ళ క్రితమే తెలుగు మాట్లాడే వారి మద్య ఈ సామెతలు వాడిబడినవని పండితయ్య పద్యాల వల్ల మనం తెలుసుకోవచ్చు. ఆరుద్ర గారన్నది నిజం, ఏ ఆచారాలు ఏ నమ్మకాలెట్లా ఉన్నా ఈ పద్యాల ద్వారా తెలుగు వారి సాంఘిక చరిత్ర మనకు కళ్ళముందు కనిపిస్తుంది. ఆ నాటి జనసమూహాలలోని భిన్నత్వం మనకు తెలుస్తుంది. అదే  మనం తెసుకోవలసిన చరిత్ర సారం. అదే ఈ కాలంలో మనం గ్రహించాల్సిన హితం. ఆ విజ్ఞానమే మన భాష పట్ల మనకు గౌరవం, గర్వం కలిగిస్తాయి. మన పిల్లలకు మనం కథలుగా చెప్పేందుకు విషయం దొరుకుతుంది. భాష మనగుడ కొనసాగుతుంది.

 

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

1 comment

  • ఉడ్డోలంఅన్నమాట చాలా కాలం తర్వాత చూసి మంచి సంతోషమేసింది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.