ఒక పాట…

ఒరే…

వినండ్రా… సీక్రేటుగా వినండి…

అంటే… ఏంటంటే… వద్దులే చెపితే అది అంత బాగోదు… ఊహూ అలాగని పెద్ద సీక్రేటేం కాదు, ఓపెనుగా పబ్లీకుగా అలా జరిగిపోయింది.. ప్చ్.. అప్పట్లో మన గురించి బళ్ళో మా బాగా మాట్లాడుకున్నారులే… కాని యిప్పుడు అందరూ మర్చిపోయారు కదా? చెపితే చీపుగా చూస్తారు కదా?

అయినా నేనప్పుడు వొకటో తరవతి కదా… నాకు తెలీదు కదా… రెండేళ్ళ క్రితం చాలా చిన్నవాడిని కదా?

సరే… చెప్పేస్తా, కాని మీరు నవ్వకూడదు… ఆ..?

ఆ రోజు నేను క్లాసులో వున్నానా? బుద్దిగానే వున్నానా? బాగానే చదువుకుంటూ వున్నానా?

తెలుసు కదా? ఆ… ఆ మీనా టీచరే- నా మానాన నేనుంటే అందర్నీ వదిలేసి నన్నుపట్టుకొని ‘లేచి నిల్చోరా’ అందా? అప్పటికీ నేను చెప్పినట్టుగా నిల్చొని, అంతకుముందే చెప్పినట్టుగా నోటి మీద వేలేసుకున్నానా? అదేంటో ఎప్పుడూ ఎయ్యరా అనేది, ఆవేళ తియ్యరా అన్నాది! నోటి మీద వేలు! టీచర్ కదా ఏటయినా అంటాది! అనదా? తీసాను! ‘చెప్పరా’ అంది! ఏమిటి చెప్పాలో నాకు తెలీలేదు?!

‘నీ గురించి నాకంతా తెలుసు’ టీచరు అన్నాది!

నాకు కొద్దిగ భయమేసింది! డాబుగ వుండకపోతే తప్పుకింద లెక్క కట్టేస్తాదని దర్జాగ ఫోజుపెట్టాను!

కాని టీచరు కదా?, కనిపెట్టీసింది! ‘ఎందుకురా భయం?’ అన్నాది! ఆవులిస్తే పేగులు వొకట్రెండుమూడ్నాలుగైదారేడెనిమిత్తొమ్మిదిపాదీ అని టక్కున లెక్కపెట్టేస్తాదేటి పెట్టీసింది… అడిగీసింది!

భయమెందుకుండదు? నేను సిరి కొత్త పెన్సిలు మెండరుతో చెక్కానా? చెక్కుతూ వుంటే ముల్లు విరిగిపోతూ వుందా? చెక్కుతూ వున్నా! విరుగుతూ వుందా? కాసేపటికే పెన్సిలు అయిపోయిందా? ఆ విషయం గానా? ఊ… లేకపోతే బంటిగాడి బేగునిండా ఇసుక పోసాను, అదా? లేపోతే ఇంటర్వెల్లో సీనుగాడి బ్రెడ్డూ జామూ బాగుందని తినేసాను కదా.. అదా? ఇంకా లక్ష్మి రెండు జడలూ బేగూ మూడూ కలిపి ముడేసాను, అదా? మరి టీచరు బెత్తం కనపడకుండా దాచేసాం కదా, అదా? ఆ… డస్టరుతో బాలాట ఆడితే బాబీగాడికి టామ్ అండ్ జెర్రీలో టామ్ పిల్లికి బొప్పి కట్టినట్టు బొప్పి కట్టిపోయింది, అదా? ఏది? అప్పటికీ మనం డీపుగా తింకు చేసాం! ప్చ్.. దినికి… తప్పు తప్పు… ఈవిడికి ఏమి తెలిసిపోయిందీ?

గింజుకు చచ్చినా తెలీడం లేదే!?

‘నువ్వు చెప్పకపోతే నాకు తెలీదనుకున్నావా?’ మీనా టీచరు వదలదే?!

టీచరు మనకేసి చూసినట్టు మనం టీచరుకేసి చూడలేం కదా? అందుకే పుట్టి బుద్దెరిగి బూమి చూడనట్టు నేల చూపులు చూసానా?

‘సిగ్గు పడింది చాలు, ఊ… కానీ… నీ దగ్గర చాలా టాలెంటు వుందట కదా?’ అన్నాది టీచరు!

నేను మరింత గుడ్ స్టూడెంట్ అయిపోయి చేతులు కట్టేసాను! తలకాయ దించేసాను!

‘నీ టాలెంటు చూపించ్రా’ టీచరు మాటకి వత్తాసుగా అందరూ నాకేసే చూస్తున్నారు!

నేను చేసిన పనుల్లో ఏది టాలెంటో… నాకర్థం కావడంలేదే?!

‘అంత బతిమాలించుకుంటావేట్రా? ఊ.. పాడు… పాడరా, నువ్వు పాడే లోపల క్లాసే కాదు, స్కూలే అయిపోయినట్టుంది’ టీచరుకు వోపిక తగ్గుతున్నట్టున్నాది!

‘పాటా?’ అన్నాను, నాకర్థం కాలే?!

‘నీ అల్లరికిదే పనిష్మెంట్, ఊ.. పాడు…’ అన్నాది టీచరు! ఆవిడగారు వొప్పకంటున్నాది!

….రావడం లేదన్నాను!

‘ట్రై చెయ్… అదే వస్తుంది…’ టీచరు నమ్మకంగానే చెప్పింది, గాని మనకు రావాలి గదా?

నేను పల్లకుంటే, ‘ట్రై చెయ్యమన్నానా?’ బెత్తం ఎత్తినట్టే గొంతెత్తింది!

‘నేనిందాకే ఇంటర్వెల్లో పాడేసాను…’ చెప్పాను, వింటేనా? ‘ఇంటర్వెల్లో పాడితే ఏం? ఇప్పుడు పాడ కూడదా? ట్రై చెయ్… అదే వస్తుంది’ మీనా టీచరు గమ్ములా వదలడం లేదు?!

‘ఇక్కడే పాడాలా?’ తప్పదని తెలిసి అడిగా!

‘మరెక్కడ పాడుతావ్? బాత్ రూమ్లోనా? బాత్ రూమ్లో అందరూ పాడుతారు…’ అని టేబుల్ మీద డస్టరుతో దబ్ దబ్ మని కొట్టి ‘సైలెన్స్’ అని అందర్నీ టీచరు ప్రిపేరు చేసేసింది!

అప్పటికీ వేరే పనిష్మెంటు యిమ్మని అడిగా! వింటేగా?!

మీనా టీచరు కాదు… ఫెవికోల్ టీచర్…

‘ఏంటి సైలెంటయిపోయావ్? సైలెంటు అయితే వదిలేస్తానని అనుకున్నావేమో?, ఏం కుదరదు…’ టీచరు వొక డబల్ రోల్ బుక్కు… రాసిందే రాసినట్టు చెప్పిందే చెపుతుంది!

వదిలేస్తుందని సూటుకాకపోయినా బాగా ఏడుపు ముఖం పెట్టాను!

‘నో.. నో..నో..’ టీవీ సీరియల్లా మూడుసార్లని, ‘నేనొక్క క్షణం క్లాసులో లేకపోతే స్కూలంతా తెలిసిపోయేలా పెంకులు యెగరగొడతావ్ కదరా… ఇప్పుడేం?’ అన్నాది తిక్కల టీచరు!

‘నువ్వు తిట్టుకున్నా సరే, నిన్ను వదలను..’ అని టీచరు మళ్ళీ కనిపెట్టేసి అంటే- నాకయితే ‘వదల బొమ్మాలీ వదల…’ అనే వినిపించింది!

పోనీ ఎందుకీ బాధ అని ‘గుంజీలు తియ్యనా? గోడకుర్చీ వెయ్యనా?’ అడిగేసాను!

నవ్వింది టీచరు! కాని అడ్డంగా తలూపింది! పనిస్మెంట్లు పిల్లలకి పిల్లలు ఇచ్చుకోకూడదట! టీచర్లు మాత్రమే ఇవ్వాలట!

‘ఎంత వస్తే అంత పాడు’ అన్నాది టీచరు!

‘నువ్విపుడు పాడలేదనుకో, ఇoటికి వెళ్ళవ్ ..’ ఫైనల్ వార్నింగ్ కూడా!

పాడక తప్పదని నాకు తెలిసిపోయింది!

తలూపాను! సిద్దమని!

తలూపినందుకే ‘వెరీగుడ్’ అని మేచ్చేసుకుంది టీచరు!

‘ఊ… కానీ…’ ఆలస్యమైందన్నట్టు టీచరు!

‘వీళ్ళందర్నీ పంపించెయ్యండి టీచర్… వీళ్ళు చూస్తుంటే పాడలేను…’ అన్నాను!

అందర్నీ వెనక్కి పంపించేసింది టీచర్!

‘సైలెన్స్’

ఆ సైలెన్సుకు భయమేసింది!

‘మీరు కళ్ళు మూసుకోండి టీచర్…’ అన్నాను!

టీచర్ కళ్ళు మూసినట్టే మూసి తెరచింది! లాభం లేదని నేనే కళ్ళు మూసుకున్నాను! నేను సిగ్గు పడుతున్నానని అర్థం చేసుకొని టీచరు మనకి కోపరేట్ చేస్తూ కళ్ళుమూసుకొని మరీ అటు తిరిగింది!

హమ్మయ్య…

వచ్చినంత పాట పోసాను!

క్లాసు తడిచింది!

అప్పుడు నావైపు తిరిగిన టీచరు ‘చి ఛీ..’ అని ‘పాడు వెధవ’ అంది. మళ్ళీ పాడమంటాదేమిటి ఈవిడ అని అనుకున్నాను! పాడడానికి మరి రావడం లేదన్నాను!

నా పాటకీ మా టీచర్ తాళానికీ తోటిగుంటల కోరస్లకీ (అప్పుడు నాకివన్నీ తెలీవు, పనిగట్టుకొని తెలుసుకున్నాను) పక్క క్లాసులోని టీచర్లూ మాస్టార్లే కాదు, హెడ్ మాస్టారు కూడా వచ్చేసారు!

‘నాన్సెన్స్… ఏమిటిది?’ హెడ్ మాస్టారు వరవడిలో రాసిందే రాసినట్టు అన్నమాటే అన్నారు!

చెప్పకేం… మీనా టీచరు బిక్కచచ్చిపోయింది!

‘బాత్ రూముకు వెళ్ళలేవా? వెధవ…’ టీచర్లదీ మాస్టార్లదీ అందరిదీ వొకే వరవడి! ఒకే మాట!

నాది కూడా ఒకే మాట! ‘నేను బాత్ రూముకెళ్ళి పాడుతానంటే, వద్దు ఇక్కడే పాడమన్నారు’ అని జరిగిందే చెప్పాను!

‘వెధవకనా… అబద్దాలు ఆడావంటే టీసీ యిచ్చి పంపించేస్తా’నని హెడ్ మాస్టారూ-

నేను మదర్ ప్రామిస్ చేసినా నమ్మలేదు?!

మా అమ్మానాన్నల్ని తీసుకొస్తేగాని క్లాసుకు రానిచ్చేది లేదని కూడా తేల్చి చెప్పేసారు!

అమ్మానాన్నలు కూడా టీచర్లలాగే నన్నే తిట్టారు!

మా ప్రయివేటు మాస్టారొక్కరే నన్నర్ధం చేసుకున్నారు!

ప్రయివేట్లో… ‘పాస్’కని మేం చిటికెన వేలు చూపిస్తామా? ఏంట్రా- అని అడుగుతారు! ఎక్కువ ‘పాస్’లు తీసుకుంటే ‘ఫెయిల్’ అయి పోతారని వార్నింగు యిచ్చి మరీ- ఆనక మాత్రం ‘వెళ్ళి పాడేసి రండి’ అని వొంటేలుకి పంపించేవారు!

అదేమిటో వొంటేలు కూడా ఒకరికి వస్తే చాలు అందరికీ వచ్చేస్తుంది! అందరమూ కలిసి వెళ్ళి అడిగామా? ‘ఏమిట్రా సామూహిక బృందగానమా?’ అని తిట్టేవారు! ‘వెళ్ళి పాడేసి రండి’  అనేవారు!

పాటంటే ఏమిటో… ఎలా పాడాలో… ఎంత పెద్ద రాగం తియ్యాలో… ఎంత దూరం పొయ్యాలో… అలా పొయ్యడమే రాగమట! ఎవరు పెద్ద రాగం తీస్తే వాళ్ళే గ్రేట్! పెద్దరాగం తియ్యాలంటే వుగ్గబట్టి వుగ్గబట్టి వొక్కసారి వొదిలితే… రాగం తీస్తే… తస్సాదియ్యా మస్సాలేప… పొడావుగా వొస్తుంది!

చాలాసార్లు నేనే గ్రేట్!

‘ఎప్పుడూ పాటలు పాడడమేనా చదివి చచ్చేదేమయినా వుందా?’ అని ప్రయివేటు మాస్టారు అంటే, మాస్టారుకి ప్రయివేటు చెప్పే అమ్మగారు కోపమొచ్చినప్పుడు ‘వీళ్ళకి చెప్పి చచ్చినా చెవికెక్కి చావదు, మీరలా పాడిన పాట పాడడమే’ అంటుంది! ‘నేనలా చీటీ పాటకు వెళ్ళొస్తానంటుంది’ అమ్మగారు! మా సావాసగాళ్ళు కిసుక్కున నవ్వుతారు!

మరి ఆ పాటేమిటో తెలీదు!

ఎవరి పాట వాళ్ళే పాడుకోవాలి అని మాత్రం అర్ధమయ్యింది!

అసలు పాట తన్నుకొస్తే ఆపకూడదనీ అది అనారోగ్యమనీ ప్రయివేటు మాస్టారే చెప్పారు! ఆ వంకన పాటలు పాడుతూ కూర్చుంటే చదువు చెట్టెక్కెస్తాది, నేను మీకు రామకీర్తన పాడేస్తానని కూడా ఆయనే అన్నారు!

ఏమిటో మాటలకి చెప్పిన అర్ధాలే కాదు, చెప్పని అర్దాలూ వుంటాయని, లేకపోతే అపార్ధాలు వస్తాయని అమ్మ ఈ కతంతా తెలిసి నాకు చెప్పింది!

ఏమయినా ‘పాట’ గురించి మా ప్రయివేటు మాస్టారితో క్లాసు చెప్పించాలి!

-రజనీకాంత్ ,

మూడో తరగతి,

సమితి ప్రాధమిక పాఠశాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.