కాస్త వెలుతురు మిగిల్చి
ఎగిరిపోయిన పిట్ట!

ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది కానీ, ఇది నాన్సెన్స్. ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది. ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుందంటాడొకచోట తిలక్.

దేని గురించి ? కవిత్వం లో అబ్స్ క్యూరిటీ (అర్ధ దురవగ్రాహ్యత) ఎంత పాళ్ళుండాలో, ఏ మోతాదు దాటితే కవితలో అర్ధం ఏమయిపోతుందో సున్నితంగా చెప్పాడా ? అసలు కవిత అర్ధమవడంలో కవి పాత్ర ఎంత ? పాఠకుడిదెంత ? సరే పద్యమైతే గణ విభజన, కచటదబలు, యతి ప్రాసలూ గట్రా వివేచన కొంత ఉండి తీరాలి. వచన పద్యం సంగతేంటి ? అసలు వచనం అర్ధం కాకుండా పోవడానికి ఆస్కారమెక్కడుంది ?

కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ్ణే తీసుకుంటాను.
“ఈ ఉద్రిక్తత సడలిపోయాక, ప్రశాంత సాగరంపై ప్రమిదలాంటి పడవలో, దీపంలాంటి తెరచాప; ఏ తీరాన్ని మేల్కొలుపుతుందో” అనంటాడు ఇప్పటి యెవ్వనం అన్న కవితలో.

అలానే ఇంకోచోట పరివర్తన అనే కవిత లో “పడమటి కొండల పై కాంతి శిరస్సు నరికి, అంటుకున్న రుధిరాన్ని సముద్రంలో కడిగేసుకుని ఆకాశం లోకి చేరుతుంది విదియనాడు చంద్రాయుధం” అంటాడు. ఇలా చెప్పినప్పుడు కవి చేసిన మాయ కేవలం అతని ఊహాశాలీనత అని సర్దుకుంటాను. ఆ అంశం ఎంత ఒత్తుగా అల్లుకుంటే అంత లోతైన భావచిత్రం ఏర్పడుతుంది. ఆ భావచిత్రం తేలిగ్గా అనిపించనప్పుడు ఆ కవితా వాక్యం ముందునుండి వెనక్కి, మళ్ళీ వెనక నుండి ముందుకీ (?) ఒకట్రెండుసార్లు చదువుకుంటాం. కవిత ఆ మాత్రం మనల్ని తన మర్మం వెతకమని డిమాండ్ చేయడాన్ని కాదనం. అయితే ఆ క్రమం మనకేమనిపించిందో అదే మనకి నచ్చి మనం మెచ్చిన వాక్యమవుతుంది. లేకపోతే
“బుద్దదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి ?” (కరుణశ్రీ – పుష్పవిలాపము) అని చదివినపుడో లేక “సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది ? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు” (శ్రీ శ్రీ – దేశ చరిత్రలు) అని కంఠతా పెట్టి వల్లించినపుడో కలిగే ఉద్వేగం మాటల్లో చెప్పగలిగేది కాదు. దానిక్కారణం ఆ వాక్యార్ధమో, శబ్దమో మనల్ని పట్టి ఊపేయడాన్ని ఎలా విస్మరించగలం ? కానీ ఈ వెలుతురు పిట్టలలా లేదు. ఒక్కో వాక్యం దగ్గరా మెదణ్ణి కాపలా పెట్టి ఏ ఒక్క భావచిత్రాన్నీ బంధించిన జైలు గోడలు దాటి బయటకు రానివ్వడు కవి. కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. ఒక ఇంజినీరింగు మనిషి. ఎన్ని అక్షరాల్ని కొత్త కొత్త పదాల్ని చేసి వాటిల్లో ఇంకా ఊహాతీత భావాల్ని తొడిగి మనల్ని ఆశ్చర్య పరుస్తాడో చెప్పనలవి కాదు. ఈ పుస్తకం మొదట 1974 లో అచ్చైంది. 1975 లో ఫ్రీ వెర్స్ ఫ్రంటు అవార్డు పొందింది.

కుందుర్తి కలలుగన్న వచన కవిత్వం ఎన్ని హొయలు పోయిందో అర్ధం కావాలంటే ఈ లాంటి ప్రయోగాత్మక కవిత్వాన్ని చదవాల్సిందే. ఎందుకు ప్రయోగమనాలి ? అర్ధవంతం కావడానికి కవి తన వస్తువులో అనుభూతినే జొప్పించి ఏదో కొత్తగా చెప్పజూడటం మనకి దీంట్లో కనిపిస్తుంది. మొత్తం కవిత చదివాక్కూడా మనకొక రసావిష్కరణ జరిగిన అనుభవం దొరుకుతుందా ? ఉదహరిస్తాను.
“వేడెక్కిన నాడులు, వెతుక్కుంటూ నీడలు, గోడ మూలల క్రీనీడల్లో ఊర్ధ్వ లోకాలకు నిగళాలు వేసిన వర్తమానం. అధో లోకాల నిశీధి. తరుగుతూ మండే కట్టెల ఫలం. మరుగుతూ పొంగే కోర్కెల జలం” (గట్టు తెగే దాహం). ఏమనిపించింది ? ముందు ఏ అవయవం స్పందించింది ? హృదయమా ? మెదడా ? ఈ రెండూ కాని ఇంకోటేదన్నానా ? అసలు భావ సంపర్కానికి సామీప్యం కాని కావ్యనుభూతికి ఏ రసావిష్కరణ దోహదకారి అవుతుంది ? అది ఊహలోంచే పుడుతుందనుకుంటే ఏ ఊహ ? అనుభవంలోంచి కలిగే ఒక ఊహకి ఇంకొకటేదో ఉపమనాన్నో తీసుకుని ‘భావనని’ కాస్త క్లిష్టతరం చేయడం వల్ల తక్షణ ప్రతిస్పందన సాధ్యం కాదు. మరలాంటప్పుడు ఏ లక్షణం ఈ కవిత్వాన్ని చారిత్రకం చేసింది ?

శ్రీమన్నారాయణే అంటాడు :
“హృదయానుభూతులూ, దేహ చలనాలూ వేరుగా ఉండే కామశాస్త్ర పరిజ్ఞానపు జెనాస్టిక్స్ తో, ముసలి వాసనలతో, ముడతలు పడుతుంది పూవు లాంటి సహజత్వం. మేధాసుర సంజల్లోంచి తొంగిచూసే వెలుతురెండిన పర్ర చీకటిని నా కవిత్వంలోకి అడుగుపెట్టనీయను సహృదయులారా ! (సహృదయులారా.)

సరే, హృదయంతో సంబంధం లేకుండా జరిగే దేహ చలనం లాంటి శృంగారం కాదు నా కవిత్వం అన్నాడు కవి. చెట్టులోంచి సహజంగా బయటకొస్తాయిగనుక పూవుల్నిచూసి ఆనందించినట్టు, పసిపిల్లల మాటలు విని ఆనందిస్తాం. అంత సహజంగా అనుభూతి మాత్రమే అంగాల్ని, వాటి చలనాల్నీ నిర్దేశిస్తుండాలని కవి తెలియజెప్తాడు. పదండి ముందుకు పదండి తోసుకు అని ఊగిపోయే చాలామందికి కవి మాటలు మింగుడుపడవు. ఇతని అభివ్యక్తి వేరు. అభిమతం కూడా. కవిత్వ రూపం పట్ల, దాని భావం పట్ల అప్పటిదాకా ఉన్న కొన్ని ప్రమాణాల్ని శ్రీమన్నారాయణ కాదన్నట్టు తోస్తుంది. కవిత్వంలో వస్తు రూప సంవిధానాన్ని కొత్త కోణంలోంచి చూడమన్నట్టు తోస్తుంది. అతని అనుభూతిని ప్రధానమైన దినుసు చేస్తాడు కవి. అనుభూతి కాకుండా వేరు మూలమేముంటుంది కవిత్వానికసలు ? అంటే శ్రమజీవినో, విలాసవంతమైన ఇంట్లోని స్త్రీనో, తాజ్మహల్ నో ఈ కవి చూసినపుడు వాటిల్లోని పదార్ధం ఇతని అభివ్యక్తిలో అందరికంటే వేరుగా పలుకుతుంది.

“రాత్రి ఆకాశమ్నుండి రాక్షస బొగ్గుపొడి లా చీకటి నిరుపయోగంగా రాలిపోతుంటే చూస్తూ ఊరుకోలేక సూర్యుని కొలిమిలో నింపి నిప్పంటించాను. నీరు జారే చిరుసవ్వడులూ, అగ్ని జ్వాలల రొదలూ నా కవిత్వంలో కనిపిస్తుంటాయి” (చూస్తూ ఊరుకోలేక) అని చెప్పుకుంటాడు. చురుక్కుమనకపోయినా కవి దేన్ని ఆశ్రయించి ఏం మాట్లాడుతున్నాడో కొత్తగా తెలుస్తుంది. శ్రీమన్నారాయణ కవిత్వంలో క్లిస్టత కానీ, అస్పష్టత కానీ తోచదు కానీ ఒక్క ఉదుటున అర్ధమూ కాదు. ఎందుకంటే ఆ కవితా వాక్యాల్లో అంతటి నిగూఢమైన వ్యక్తీకరణ ఉంటుంది. ఆ సాంద్ర స్వభావం భావనా పటిమని బలిష్టంగా తయారుచేస్తుంది.

ఇక్కడొక మాట గుర్తు చేయాలి. ప్రముఖ విమర్శకులు ఆర్ యస్ సుదర్శనం గారు ” ….అనుభూతి కవిత గా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తరువాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పధం కాకుండా – కేవలం అనిర్దిష్టమైన అనుభూతి కావాలి. అది పోలికల ద్వారా, ఊహల అల్లికల ద్వారా,ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణన ద్వారా కావొచ్చు, కానీ అందులోనవ్యత హృదయానికి హత్తుకునే అనిర్వచనీయమైన అనిర్దిష్టమైన అనుభూతిగా మిగలాలి” అని అంటారు. అనిర్దిష్టత సంగతి అటుంచితే ఏ భావనమూ, సందేశమూ కలిగించకుండా, దృక్పధ దర్శనమూ చేయకుండా ఆ కవిత తయారయినపుడు ఆ సృజన ప్రయోజనం ఏముంటుంది ? సరే సృజన వేరు, దాని ప్రయోజనం వేరు. కాదనలేము. కానీ కేవలం సృజనలోనే అనుభూతి చెంది దాని ప్రయోజకత్వమంతా నువు నువ్వుగా అనుభవించేదే అయి ఉంటుందంటే కొంత మింగుడు పడని విషయమే.

“కుత కుత లాడే నీ హృదయాన్ని భూమిని భరించమంటే దాని కేంద్రం సంగతేమిటి ? ముక్కలు ముక్కలైన నీ హృదయాన్ని చీకటికిస్తానంటే నక్ష్త్రాల విషయమేంటి ? తెలిసిందా ! నీ పాట్లేవో నువు పడాల్సిందే” (తెల్సిందా) లాంటి కవితలు చదివినపుడు ఆత్మాశ్రయంగా ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా భావకవిత్వం కాదన్న విషయం తెలిసిపోతుంది గానీ, వ్యక్తిని పట్టుకునే వేలాడ్డం వల్ల వ్యక్తి ఊహల ప్రాధాన్యంగా ఉంటుంది గానీ వాస్తవికంగా తోచదు. ఈ వెలుతురు పిట్టల్లోని కవితలన్నీ సామాజికానుభవాలు కాదు. కేవలం ఒక వ్యక్తి అనుభవాల్లోంచి ఊడిపడ్డ ప్యూర్ శాఖారామంటారే, అలాంటి ప్యూర్ కవిత్వమన్నమాట. ప్యూర్ కి మళ్ళీ నేను ఏ కారణం చేతనైనా శుద్దమైన అనే సందేహాత్మక పదాలు వాడదల్చుకోలేదు. కవిత్వానికీ ప్యూరిటీ (Purity) అవసరమని చెప్పాడు కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. ఆధునిక కవిత్వంలో శిల్ప చాతుర్యం అద్భుతంగా ఉన్నప్పటికీ వస్తువుని కూడా గొప్పగా అనుభవైక్యవేద్యం చేసిన తిలక్ అమృతం కురిసిన రాత్రి లాంటి కవితా సంకలనాల్ని కవిత్వ ప్రేమికులు గుండెలకి హత్తుకున్నారు. అది కేవలం అనుభూతివాదమన్నప్పటికీ అందులో జీవన చైతన్య ప్రకట సూటిగా ఉంటుంది. ఏ సుత్తీ లేకుండా అని కూడా అనగలుగుతాను. ఇతర ప్రక్రియల్లో గుచ్చుకున్నంత తీవ్ర భావ సూదంటుదనం అనుభూతి కవిత్వంలో కలిగి దాన్నేంచేసుకోవాలీ అని సమాధానం కావల్సిన ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాటి కవితా సంకలనాలు అరుదుగా పాఠక హృదయాల్ని కొల్లగొడతాయనుకొంటాను. లేదా పాఠకుల్ని రెండు సగాలుగా విడగొట్టి కవిత్వ అపరిమితత్వాన్ని తెలియజేస్తాయి. సున్నితత్వం, కరుకు పదాల వాడుక,విపరీతార్ధ సౌందర్యం నియమాల్లా లేకపోవడమొకటి ఈ కవిత్వాన్నాస్వాదించడానికి ఆనందపరుస్తుంది. కొత్తదనం మూల పదార్ధం. కవి ప్రతీకలు సంబ్రమాశ్చర్యాలకి గురిచేస్తాయి. మచ్చుకు కొన్ని చెప్తాను:

– పగిలే పగళ్ళను మోస్తూ మలిసంజల ధూళులు పడిన మనస్సు, గోల్డ్ ఫిష్ లా కదిలే కాబరే డాన్సరై జనంకిక్కిరిసి ఉన్న హాల్లో ఒంటరిగా అరిగిపోతుంది ఆనందం పంచుతూ ! (ఆనందం పంచుతూ)

– మానుకిపూసిన నాగమల్లి పూలు నాలోపల ఫైర్ ఇంజన్ గంటల్ని మోగిస్తున్నాయి. గంటల చప్పుళ్ళకు పెనుగాలుల్లో నెమలిపురిలా మట్టల్ని విప్పిన కొబ్బరి చెట్టులా ఊగిపోతున్నాను (జారుడు బల్లపైకి)

– సంధ్యలో నామీద ఆకళ్ళు రెండూ మషీన్ గన్లై మెరిశాయి. ఒంటినిండా దిగబడిన తారలతో నింగిలా రాతిరంతా జాగరణ (మెరిసే కళ్ళు)

ఇలా ఎన్ని ఉదాహరణల్ని తీసుకున్నా కానీ, శబ్దమూ, అర్ధమూ యొక్క కూర్పు చాలా చాకచక్యంగా ఉంటుంది. రసవత్తరత ఉండదు. అరసున్నలూ, శకట రేఫలూ వాడడు కానీ కవి అంతకు మించిన ఒక మాంత్రిక వ్యాకరణ గుణాల్ని వాడిన లక్షణం ఈ కవిత్వంలో కనిపిస్తుంది.

చెప్పే విషయం ఆసక్తిగా లేకపోతే, చెప్పడమొక్కటే ఆసక్తిగా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది.అది అనుభూతి కవిత్వం పేరిట ఇబ్బందిలేకుండా మన గలిగింది. కానీ తిలక్, కృష్ణశాస్త్రి మొదలగువారు విషయాన్నికూడా ఆసక్తి కరంగానే చెప్పి వాళ్ళ వాళ్ళ కవిత్వాల్ని ఏ చట్రంలో బిగించినా రసానుభూతి కవులుగా మిగిలిపోయారు. వెలుతురు పిట్టల్లో రస సిద్దమైన వాక్య ప్రయోగాలు తక్కువగా కనిపిస్తాయి. విబ్రమకీ అనువు తక్కువే. ప్రతీకల్లోని కొత్తదనం మాత్రం మన ఆలోచనలని భిన్న సీమాంతరాలలోనికి తీసుకుని వెడతాయి. అతను తీసుకున్న స్వేచ్చని ప్రశంసించకుండా ఉండలేము. భాషలోనైతేనేమి, అన్వయాల్లోనైతేనేమి అంత స్వైరవిహారం చేసేస్తాడు కవి. మన ఊహలకి దొరకని ప్రతీకలకి ప్రతీకల్ని జోడించి మనల్ని గిలిగింతకి గురిచేస్తాడు.

1974 లో ఈ వెలుతురు పిట్టల్ని రాజమండ్రి లోని విక్రమ హాలులో ఆరుద్రగారు ఆవిష్కరించారు. అటు తర్వాత 1995 లో అక్షరంలో అంతరిక్షం, 2006 లో స్వస్థాన మిత్రుడ్, 2007 లో వామన విశ్వం తీసుకొచ్చారు. వెలుతురు పిట్టల్తో పోల్చితే మిగతావన్నీ భావ ప్రసారంలో చాలా సరళంగా ఉంటాయి. ఫ్రీవెర్సు ఫ్రంటు తోపాటు ఈ కవికి నూతలపాటి గంగాధర పురస్కారం కూడా లభించింది.

కవిత్వంలో ‘అద్వయంభైకొ’ అనే వాడుక ఉంది. అద్వయమంటే అత్తలూరి, అబ్బూరి, భై అంటే భైరవయ్య, కొ అంటే కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ అని. వీళ్ళకి నిరసన కవులని పేరు. సామాజిక రుగ్మతలపై రంగు రంగుల బ్రోచర్లు వేసేవారని, శ్రీ శ్రీ వీళ్ళ కవిత్వాన్ని నిరసనాయులు అని వ్యఖ్యానించినట్టు చెప్తారు.

దృశ్యావిష్కరణలో కొత్తపల్లిని ఇస్మాయిల్తో పోల్చి మాట్లాడ్డం ఉంది. సినారె ఇస్మాయిల్ని చెట్టు కవి అని కొత్తపల్లిని పిట్ట కవి అని సంభోధించారని ఆయన మిత్రుడు సన్నిధానం తన లేటెస్టు ప్రమేయ ఝరిలో ప్రస్తావిస్తాడు.

అయితే ఈ వెలుతురు పిట్టల కవితా సంకలనంలో చాలా కొన్ని కవితలు సరళంగా ఉంటాయి. కీర్తి, శాంతి, సిమహాసనం, విమర్శ లాంటివి చదువుతోంటే హాయిగా ఉంటుంది. ఆ వాక్యాలు చూడండి.

– బిందెపుడూ ములగని అడవి కొలనుల్లో తారలతో పాటు అర్ధరాత్రి స్నానమాడుతూ నాకు నచ్చిన లక్ష్మి కనిపిస్తుంది (శాంతి)

– నా కీర్తి ఎప్పుడూ పాదాల్ని స్పృసిస్తూ నేలమీదుండే నా నీడలాగుండాలి. నా తలకు మించి విప్పారిన వటవృక్షంలా కాదు (కీర్తి)

– తలలపైనే దీపాలూ, తలలమీదే పుష్పాలూ ఎందుకుంటాయో తెలుసా ? స్నేహితులారా మనం స్నేహితులం. మన మధ్యనే ఒక సింహాసనం వేసుకుందామనుకుంటే చెల్లాచెదురైపోతాం, మళ్ళీ కనిపించం! సిలువెక్క గలిగినవాడే సిమ్హాసనానికి అర్హుడు (సింహా సనం)

– క్షార జీవితం గడుపుతున్నా బ్రతుకు మీది తీపిచావని ఉప్పుని నిప్పుల్లో వేస్తే గెంతుతూ అరుస్తూ ఏడుస్తుంది (హృదయ కోణాలు)

ఏం చెప్తున్నాయీ వాక్యాలన్నీ ? వైయుక్తికానుభవాల్ని కవి నిశితమైన చూపులోంచి దృశ్యమానం చేస్తాడు. ఏ భావచిత్రమన్నా అంతే కద ? ముందు కళ్ళముందు ఒక కోటి లింగాల రేవుని, మెడడులో దీపాన్ని, చావు, లయ, చీకటి ముల్లు లాంటి కవితలు మనోతలమ్మీద 70 mm సినీమా తెరలు గడతాయి. గోరేటి యెంకన్న పాటనో, దాశరధి గాలిబ్ ద్విపదల్నో, పఠాభి గేయాల్నో, సినారె గజల్నో మనమెందుకు ప్రాణప్రదంగా ఇష్టపడతామంటే ఆ ప్రక్రియల్ని వాళ్ళు ప్రాణవంతంచేసి వాటికి అమరత్వాన్ని కలిగించారు కనుక. ఆ అమరత్వానికి ఏమిటి కారణమంటే కేవలం పాఠక హృదయపీఠమ్మీదెక్కి కూర్చోగలిగే చొరవ. అది సంపాదించిపెట్టేదే శైలైనా, శిల్పమైన ఇంకేదైనా. ఆ రకంగా చూడాల్సివస్తే మినీ కవిత కానివ్వండి, హైకూ లనండి, నానీ లనండి అవి కేవలం అనుభూతిప్రధానంగా ఉండే ప్రజల మన్ననలందాయంటే ఒప్పుదల కష్టమైన పని. వాటిల్లో వస్తు వైవిధ్యమూ, నిబద్దమైన సామాజికత లేకుండా అవి రాణించలేదు. సామ్యవాదాన్ని, రాజకీయాన్ని లేక మరే సిద్దాంత కోణాన్నో పట్టుకు వేలాడే కవిత్వ సృజన జరగాలన్న నియమాన్ని బలపరచాలని కాదు గానీ, వ్యక్తి లోని సున్నితత్వానికి సామాజికీకరణ తో అసంబంధంగా ఉన్నపుడు అది ఏం నిర్వచించినా ఎంత ప్రయోజనముంటుంది ? అవును. నేనిప్పుడు ప్రయోజకత్వం గురించే మాట్లాడి ముగించదలిచాను. వ్యక్తి అనుభూతులు ఏ ప్రక్రియకైనా అతీతమైనవే గానీ, వాటిని విశ్వజనీనం చేయాల్సిన అవసరం కవిత్వానికుంది. అప్పుడే అది ఎంతటి విస్తృతానుభవంలోంచి పుట్టినా, ఏ గ్లాసులో పోసిన్నీళ్ళలా ఎలా కనిపించినా, అది ఆర్ధిక, సామజిక, రాజకీయ మరింకే ప్రతివాదమైనా ఒక ప్రయోజనశీలంగా ఉండి తీరాలి. ఉపదేశాత్మకం, నినాదప్రాయంగా కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వం ఇంకా ఈరోజుల్లోనూ ఉద్దేశ్యపూరిత వాస్తజీవన రాహిత్యాన్ని కాలానికి తన సంతకంగా చీటినీచేసి అతికిస్తానంటే ఒప్పుకోలేము.

ఉత్తరాధునికతో, ఉన్మత్త ఆదిమ అనుభూతివాదమో, లేక మరింకే సామాజిక కవిత్వమో, ఏది అర్ధం కాకపోవడమూ ఒప్పుకోదగ్గది కాదు. కవితను అందుకునేటప్పుడు ఎంత ఎత్తుమీదకెళ్తాడు కవి. మళ్ళీ ఎంత కిందకి పడిపోతాడు. మరో కవితకై పైకెళ్ళి మళ్ళీ మళ్ళీ కింద పడతాడని కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణే తన మాటల్లో చెప్పుకున్నాడు.

కింద పడాల్సిందే. పైకి లేవాల్సిందే. అనుభవించక తప్పదు.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

26 comments

 • మీరు వయసులో చిన్న వారైనా
  ఓ మాట చెప్పాలనుంది.
  మీరు కవితారణ్యంంలో యువకిషోరం
  మీ సామాజిక దృక్పథమనే కుంకుమ రాతలకు
  సామాజిక సేవనే పసుపు చేతలు తోడైతే మీ జీవితం పసుపుకుంకుమల సంగమమయిన నిండైన జీవితం అవుతుంది.ఆ దిశలో కూడా ప్రయత్నించండి.
  మీరు కదిలించగలరు సమాజాన్ని…
  మీరు నడిపించగలరు యువతరాన్ని…
  మీరు సాధించగలరు లక్ష్యాలను…

 • అనుభూతి కవిత్వాన్ని, వాస్తవ కవిత్వాన్ని బేరీజు వేస్తూ సాగిన మీ సమీక్ష చాలా చాలా బావుంది.అభినందనలు

 • మీరు చేసే ప్రతి విమర్శ పాఠకుడికి సాహిత్యావగాహనను పెంచడంతో పాటు,
  రచయితకు సృజన పట్ల ఎరుకను పెంచుతుంది.

  వ్యాసానికి పెట్టిన శీర్షిక నుండి ముగింపు వరకు విశ్వనాథ సత్యనారాయణగారి నవల చదువుతున్నప్పుడుండే భాషాకర్షణ మీ విమర్శలో ఉంండి పట్టిలాగుతుంటుంది.

  నేను శ్రీరామ్ అనే గొప్ప విమర్శకుడి కాలంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను

 • అక్షరతూకం వెయ్యగలిగే మీ కవిత్వ సమీక్ష ప్రతీ కవినీ వారిలోతుపాతులూ, నిమ్నోన్నతాలనీ చక్కగా పట్టి అప్పజెబుతోంది.సంక్లిష్ట మైన సామాజిక జీవనంలో మనిషిని స్పర్శిఃచాలన్నా,దర్శించాలన్నా సులభవాక్యాల్లో ఇమడవు.సామాజిక వేదనని వ్యక్తి గా వ్యక్తం చేసినపుడు కొ.స.శ్రీ అవుతారు. కృష్ణ శాస్త్రి బాధవుతుంది. అందరూ శ్రీ శ్రీ బాధలే కాలేరు కదా. అంతమాత్రాన కవిత్వం కాకుండా పోదు కదా.”కొందరికి తెలుగు గుణమగు…!”

 • నిజమే కవిత కోసం కింద పడాల్సిందే…పైకీ ఎక్కాల్సిందే …మీరు పరిచయం చేసే కవిత్వం సంపుటాలన్నీ ఏదో ఒక విశిష్టతను కల్గి ఉండేవే…అదే విధంగా ఈ కవిత్వం 1974 లో వచ్చినప్పటికినీ ఇప్పుడు మీరు చేసిన ఈ పరిచయం వల్ల ….ఇప్పటి వాళ్లకి చదవాలనే ఒక ఉత్సుకత మొదలవుతుంది. మీ వ్యాసం చాలా బాగుంది సార్…అభినందనలు…

 • చాలా మంచి వ్యాసం సార్. వెలుతురు పిట్టలు కవితా సంపుటి గురించి సమగ్రంగా తెలుసుకున్నాం. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు చెప్పినట్లు కవిత కోసం కవి ఎంత ఎత్తుకైనా పోవడం మళ్ళీ క్రిందకు రావడం కవితా ప్రక్రియలో భాగమే. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు సార్…

 • చాలా బావుంది శ్రీరామ్ గారూ మీ సమీక్ష.. అభినందనలు

 • నిజమే ఇక్కడ మీరు పరిచయం చేసిన వెలుతురు పిట్టల కవితాసంపుటిలోని కొన్ని కవిత్వ పంక్తుల్ని
  పరిశీలిస్తే అవగతమవుతుంది. ఒక్కో వాక్యం దగ్గర మనం కూలబడిపోయి కూలంకశంగా కవి వాడిన ప్రతీకల్ని అందులోని పదాల్ని, అర్దాన్ని అది కలిగించే అనూభూతిని తడిమి మరీ ఎలా చుసుకుంటాం అని.సరికొత్త ప్రతీకలతో ఉన్న ఈ కవితా పాదాలను చదువుతున్నప్పుడు ఊహాతీత సంవేదన కలగడం మాత్రం కచ్చితం.ఇది అక్షరసత్యం కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ గారి వెలుతురు పిట్టలు పాఠకుల మెదడు మూలల్లోని నిశీధి ధూళిని రాల్చి వేకువ రజనును నింపగలవు.దీనికి తోడు మీదైన విమర్శనాత్మక వ్యాసం దానిలోని భాషాకర్షణ ఆ మొదలు నుండి ఈ తుది వరకూ పట్టిలాగేస్తుంది..మీ కొ..శ్రీ ల కలయికతో ఈ వ్యాసం మరింత లోతుగా మళ్లీ మళ్ళీ చదివేలా చేసింది….ఇరువురికీ హృదయపూర్వక అభినందనలు…

 • శ్రీ రామ్ గారు.. మీ విశ్లేషణా శైలి చాలా బావుంటుంది.
  మీదైన ముద్ర కనపడుతూ.. చదివేటందుకు మరింత ఆశక్తిని కలిగించే విధంగా ఉంటాయి మీ రచనలన్నీ..
  ఈ మద్య కాలంలో నేను అక్షరం మీద మమకారం ఉన్నా.. మనసు పెట్టలేక చదవట్లేదు.
  చదివినా కామెంట్ రాసేంత సమయం కుదరట్లేదు.
  అందుకే పుట్టుమచ్చ కవిత్వం చదివాక సగం రాసిన కామెంట్ ఇంకా పూర్తి చేయలేదని నా మనసు గోల పెడుతున్నా.. ఈ వేళ కాస్త సమయాన్ని చేతిలో చిక్కించుకుని ఇష్టం గా చదివాను.
  కవిత్వం చాలా బావుంది.
  మీ విశ్లేషణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
  ఇక విషయంలోకొస్తే..
  ఏ ఏ పాళ్ళు ఎంతుండాలనేది ఏముంది కానీ.. ఎదుట వారి మనసు లోతుల్లోకి చొచ్చుకుని మరల మరలా అక్కడక్కడే ఆ అక్షరాల చుట్టూ మనసునీ మెదడునీ తిప్పగలిగితే అంతకంటే ఏం కావాలి ఏ వచనానికైనా అంటాన్నేను.
  మీరు పరిచయం చేసిన కవితలు కొన్ని నన్ను తిప్పుతూనే ఉన్నాయలా..
  (గట్టు తెగే దాహం)
  ఏమనిపించింది ? ముందు ఏ అవయవం స్పందించింది ? హృదయమా ? మెదడా ? ఈ రెండూ కాని ఇంకోటేదన్నానా ? అసలు భావ సంపర్కానికి సామీప్యం కాని కావ్యనుభూతికి ఏ రసావిష్కరణ దోహదకారి అవుతుంది ? అది ఊహలోంచే పుడుతుందనుకుంటే ఏ ఊహ ?
  నిజంగా ఎంత చక్కటి భావప్రకటన.
  మరోటి చూడండి
  “రాత్రి ఆకాశమ్నుండి రాక్షస బొగ్గుపొడి లా చీకటి నిరుపయోగంగా రాలిపోతుంటే చూస్తూ ఊరుకోలేక సూర్యుని కొలిమిలో నింపి నిప్పంటించాను. నీరు జారే చిరుసవ్వడులూ, అగ్ని జ్వాలల రొదలూ నా కవిత్వంలో కనిపిస్తుంటాయి” (చూస్తూ ఊరుకోలేక)
  (శ్రీ రామ్ గారు నిజంగా చదివి ఊరుకోలేకనే..
  నేనీ చిరు లేఖ)
  ఒకటేమిటీ..
  లిఖించుకున్నా సంజల ధూళులు పడిన మనస్సు, గోల్డ్ ఫిష్ లా కదిలే కాబరే డాన్సరై జనంకిక్కిరిసి ఉన్న హాల్లో ఒంటరిగా అరిగిపోతుంది ఆనందం పంచుతూ ! (ఆనందం పంచుతూ)

  – మానుకిపూసిన నాగమల్లి పూలు నాలోపల ఫైర్ ఇంజన్ గంటల్ని మోగిస్తున్నాయి. గంటల చప్పుళ్ళకు పెనుగాలుల్లో నెమలిపురిలా మట్టల్ని విప్పిన కొబ్బరి చెట్టులా ఊగిపోతున్నాను (జారుడు బల్లపైకి)

  – సంధ్యలో నామీద ఆకళ్ళు రెండూ మషీన్ గన్లై మెరిశాయి. ఒంటినిండా దిగబడిన తారలతో నింగిలా రాతిరంతా జాగరణ (మెరిసే కళ్ళు)

  మరల మరలా చదించేలా ఉన్నాయి.
  మది హత్తుకునే కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏

 • నది పారుతున్నట్లు సాగుతుంది సార్ మీ వచనం.కొత్తపల్లి కవిత్వంలో క్లిష్టతా,అస్పష్టత ఉండవు గానీ త్వరగా అర్థం కావు-చాలా నిక్కచ్చిగా చెప్పారు సార్ .ఆ కవి పాదాలు చదువుతుంటే మనసు కంటే ముందు మెదడే పనిచేస్తుంది.శైలి,శిల్పం లగురించి బాగ చెప్పారు సార్

 • బ్యాంకు చీఫ్ manager గా ఉద్యోగం చేస్తూ ఇలా కవిత్వం రాయడం కవిత్వాన్ని సమీక్షించడం చూస్తుంటే.. నాకు చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ అనిపిస్తుంది….
  శ్రీమన్నారాయన గారి కవిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు…మీలో కవిత్వం అనే తరగని ఊటబావి ఉంది!!
  మీ ఈ గొప్ప సమీక్షకు అభినందిస్తూ…మీరు ఓ గొప్ప కవిగా తరాలు గుర్తుండిపోయ్యే గొప్ప రచయితగా ఎదగాలని మనసారా కోరుకుంటూ…శలవ్

 • శ్రీరామ్ గారు మీరు చాలా పిట్టలని వెలుతురులో కి, సాహిత్య వినీలాకాశంలోకి ఎగిరేలా చేస్తున్నారు.
  1974 వచ్చిన అనుభూతివాద ప్రధానంగా వచ్చిన అద్భుతమైన కవితా సంపుటాల్లో వెలుతురు పిట్టలు కూడా ఒకటి. దీని ప్రధాన లక్షణం మార్మికత, అస్పష్టత. అనుభూతివాద కవిత్వం లో భావచిత్రాలు చాలా ప్రధానమైనవి. ఇవి కేవలం మనం మనోఫలకాలపై ఎవరికి వారే గీసుకునే ఒక abstract పెయింటింగ్ లాంటింది.
  ఈ కాలంలో లో మళ్లీ భావ చిత్ర ప్రధానమైన కవిత్వం కనిపిస్తోంది కాని కవులు చాలా జాగ్రత్తగా రాయవలసిన అవసరం ఉంది ఎందుకంటే అస్పష్టతే ఎక్కువ అయితే చదివాక ఏ అనుభూతినీ కలిగించదు ఈ కవితా సంపుటి గురించి చాలా మంచి విశ్లేషణ చేశారు

 • మొదట మీకు హృదయపూర్వక అభినందనలు!
  సాహిత్య పిపాసకులైన మీ సాహితీ పరిజ్ఞానం సమృద్ధిగా ఉంది !
  మీ విశ్లేషణా ప్రజ్ఞ శ్లాఘనీయం !
  చదివించుకు పోయే మీ శైలి, భాషా పరిజ్ఞానం అద్భుతం!
  మొత్తానికి మీరు పరిపక్వత కలిగిన సాహితీ సేవకులు !
  మరిన్ని సాహితీ విశ్లేషణ లు చేసి సాహితీ ప్రముఖుల మన్ననలు పొందుతారని కాంక్షిస్తూ…
  మీ మిత్రుడు యు.కె.మేఘ (హిమాగ్ని)

 • మీలోని గొప్ప విమర్శకుడికి ఈ వ్యాసం నిదర్శనం!

 • “ఈ ఉద్రిక్తత సడలిపోయాక, ప్రశాంత సాగరంపై ప్రమిదలాంటి పడవలో, దీపంలాంటి తెరచాప; ఏ తీరాన్ని మేల్కొలుపుతుందో” అనంటాడు ఇప్పటి యెవ్వనం అన్న కవితలో.

  అలానే ఇంకోచోట పరివర్తన అనే కవిత లో “పడమటి కొండల పై కాంతి శిరస్సు నరికి, అంటుకున్న రుధిరాన్ని సముద్రంలో కడిగేసుకుని ఆకాశం లోకి చేరుతుంది విదియనాడు చంద్రాయుధం” అంటాడు. ఇలా చెప్పినప్పుడు కవి చేసిన మాయ కేవలం అతని ఊహాశాలీనత అని సర్దుకుంటాను. ఆ అంశం ఎంత ఒత్తుగా అల్లుకుంటే అంత లోతైన భావచిత్రం ఏర్పడుతుంది. ఆ భావచిత్రం తేలిగ్గా అనిపించనప్పుడు ఆ కవితా వాక్యం ముందునుండి వెనక్కి, మళ్ళీ వెనక నుండి ముందుకీ (?) ఒకట్రెండుసార్లు చదువుకుంటాం. కవిత ఆ మాత్రం మనల్ని తన మర్మం వెతకమని డిమాండ్ చేయడాన్ని కాదనం. అయితే ఆ క్రమం మనకేమనిపించిందో అదే మనకి నచ్చి మనం మెచ్చిన వాక్యమవుతుంది. ఇతని అభివ్యక్తి వేరు. అభిమతం కూడా. కవిత్వ రూపం పట్ల, దాని భావం పట్ల అప్పటిదాకా ఉన్న కొన్ని ప్రమాణాల్ని శ్రీమన్నారాయణ కాదన్నట్టు తోస్తుంది. కవిత్వంలో వస్తు రూప సంవిధానాన్ని కొత్త కోణంలోంచి చూడమన్నట్టు తోస్తుంది. అతని అనుభూతిని ప్రధానమైన దినుసు చేస్తాడు కవి. కవిత్వంలో ‘అద్వయంభైకొ’ అనే వాడుక ఉంది. అద్వయమంటే అత్తలూరి, అబ్బూరి, భై అంటే భైరవయ్య, కొ అంటే కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ అని. వీళ్ళకి నిరసన కవులని పేరు. సామాజిక రుగ్మతలపై రంగు రంగుల బ్రోచర్లు వేసేవారని, శ్రీ శ్రీ వీళ్ళ కవిత్వాన్ని నిరసనాయులు అని వ్యఖ్యానించినట్టు చెప్తారు.

  దృశ్యావిష్కరణలో కొత్తపల్లిని ఇస్మాయిల్తో పోల్చి మాట్లాడ్డం ఉంది. సినారె ఇస్మాయిల్ని చెట్టు కవి అని కొత్తపల్లిని పిట్ట కవి అని సంభోధించారని ఆయన మిత్రుడు సన్నిధానం తన లేటెస్టు ప్రమేయ ఝరిలో ప్రస్తావిస్తాడు.

  అయితే ఈ వెలుతురు పిట్టల కవితా సంకలనంలో చాలా కొన్ని కవితలు సరళంగా ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే… మీరు ఎంత విశ్లేషించారో అర్థమవుతోంది.. ముందుగా మీరు తెలుసుకుని.. తెలియనివారికి తెలియజేసినందుకు ధన్యవాదాలు.. సమీక్ష కూడా చాలా సాంద్రతతో ఉండటం మళ్లీ మళ్లీ చదివించింది. మీరన్నట్లు శ్రీమన్నారాయణ కవిత్వంలానే… బాగుంది శ్రీరామ్ జీ.. అభినందనలు..

 • ఎంత స్టడీ చేశారు, వెలుతురు పిట్టలకు ముందు, తర్వాత… పిట్టల వెంబడి కూడా. మంచి విశ్లేషణ అందించారు, అభినందనలు.

 • సమీక్ష చాలా బాగుంది.
  అభినందనలు
  వెలుతురు పిట్టను 1974 నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకురావటమే కాకుండా, ఇక్కడ సి.నా.రె , తిలక్, శ్రీశ్రీ, దేవులపల్లివారు లాంటి మహా కవుల కవిత్వాన్ని ప్రస్తావించటం ఇంకా నచ్చింది 👌👌

 • వెలుతురు పిట్లల కు 1976 లో గంగాధర సాహితి పురస్కారం ఇచ్చ్చారు. అప్పటినుండి 2019 లో శాంతి నారాయణ కి ఇచ్చారు . శ్రీమన్నారాయణ కవిత్వాన్ని ప్రతి ఏడూ గుర్తు చేసుకొంటూ సభ ప్రారంభిస్తారు . ఎందుకంటే అది సమస్త ఇచ్చిన మొదటి పురస్కారం . శ్రీమన్నారాయణ కవిత్వం ఎప్పుడు ఒక అద్భుతం.
  కిరణ్ క్రాంత్ చౌదరి
  తిరుపతి

 • అద్భుతమైన విశ్లేషణ….చాలా బాగుంది తమ్ముడూ….

 • నీ భావ వ్యక్తీకరణతో కూడిన విశ్లేషణలో ప్రగాఢమైన నీ సొంత ముద్రే తప్ప.. ఇతరత్రా ఏ ముఖచిత్ర కవితాస్పర్శలూ కనిపించవు.. హృద్యమీకైనా విమర్శనాత్మకమైన నీ స్పందన.. శ్రీమన్నారాయణ కవితాత్మక దృశ్యచిత్రాన్ని బొమ్మకట్టించింది.. అభినందలు మిత్రమా!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.