తిరుగబడుతున్న “ఉబర్” కారు!

మనం మెసేజ్ పంపిన నిముషాల్లో కారు మన ఇంటి ముందుకు వచ్చి కారుచౌకగా మనల్ని గమ్యస్థానం చేరుస్తున్న “ఉబర్” సేవలకు ఉబ్బి తబ్బిబవుతుంటాం. కార్ల ధరలే కాదు పెట్రోల్  ధరలు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి అమెరికా ఆయా దేశాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల, పన్నుల వల్ల. అయినా “ఉబర్’’ లో షికారు చౌకగా ఎందుకుందో ఆలోచిస్తున్నామా? కారు “ఉబర్” కంపెనీది కాదు, అందులో వాడే పెట్రోల్ ఉబర్ ది కాదు. డ్రైవర్ “ఉబర్” ఉద్యోగి కాదు. “ ఉబర్ ” ఎవరు? తెలియకేం ఓ పేద్ద కార్పొరేట్ కంపెనీ అంటారా?  టెక్నాలజీ సహాయంతో మనకూ, కారు ఓనరు అయిన డ్రైవర్ కూ మధ్య వచ్చి చేరిన దళారి. ఛార్జీలు తగ్గాయని, బేరాలాడ్డం, టిప్ లు ఇచ్చుకోవడం లేదని చాలా హాయిగా వుందని ఫీలవుతున్నాం. కానీ దళారికి దక్కుతున్న సొమ్ము ఎంతో తెలిస్తే మూర్ఛపోవడం ఖాయం. మరి ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది కారు డ్రైవర్ల పరిస్థితి ఏమిటీ? అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే. ఒక్కరు కూడా ఉబర్ కు రెగ్యులర్ ఎంప్లాయి లేరంటే అతిశయోక్తి కాదు.  పని గంటలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు, ఆరోగ్య భద్రత లేదు, ఆర్థిక భద్రత లేదు సెలవులు లేవు, బోనస్ లు, పెన్షన్లు ఏవీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే గత మూడేళ్ళుగా ఈ డ్రైవర్లు భయంకరమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.

మే 8 వ తేదీన, ప్రపంచ వ్యాప్తంగా ‘’ఉబర్ ‘’ డ్రైవర్లు తమ హక్కులకై సమ్మె ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే వారికి మద్దతుగా ‘’కాంట్రాక్ట్ ఉద్యోగాల  పేర ఆడుతున్న ఆటలను కట్టడి చేయాల్సిన సమయం వచ్చింద’’ని హెచ్చరిస్తూ, “ఉబర్” వంటి కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్న డ్రైవర్ల ను రెగ్యులర్ ఎంప్లాయిస్ గా పరిగణించాలని, హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీలో తమ వంతు చెల్లింపులు అమలు చేయాలని అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన డెబ్రా ఆన్ హాలండ్ (Debra anne Haaland) ఒక బిల్లు ప్రవేశపెట్టారు.  

“నెల జీతం ఎప్పుడొస్తుందని ఎదురుచూడ్డం తెలిసినదాన్ని. ఫుడ్ స్టాంప్ క్యూలో నిలబడడమంటే ఏమిటో తెలిసినదాన్ని. గ్రోసారీ షాపులో కావలసినవన్నీ బుట్టలో వేసుకొని బిల్లు చెల్లించేటప్పుడు చాలినంత డబ్బు చేతిలో లేదని, కొన్ని సరుకుల్ని  వెనక్కి ఇవ్వడమంటే ఏమిటో తెలిసినదాన్ని. అందుకే మా శ్రామిక కుటుంబాలు నన్ను ఎన్నుకొని కాంగ్రెస్ కు పంపారు. పేదరికం తెలిసిన దాన్ని కాబట్టే ‘’ఉబర్’’ డ్రైవర్ల సమ్మెను సమర్థిస్తూ, కంపెనీ డ్రైవర్లందరినీ పూర్తికాలం కార్మికులుగా గుర్తింపునిస్తూ వారికి అన్ని హక్కులు కల్పించాలని కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టానని “డెమోక్రసీ నౌ “ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు డెబ్రా ఆన్ హాలాండ్. ఈమె న్యూ మెక్సికో రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ పార్టీ ద్వారా  కాంగ్రెస్ కు ఎన్నికైన మొదటి నేటివ్ అమెరికన్.

టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతున్నది. కానీ శ్రామికుల పనిగంటలు తగ్గకపోగా పెరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కొత్తకొత్త మార్గాలలో శ్రామికుల్ని దోపిడి చేసి లాభాలు పెంచుకుంటున్నాయి. శ్రామిక ప్రజలు తిరిగి బానిసత్వంలోకి నెట్టబడుతున్నారు. వందేళ్ల క్రితం అంటే 1900 లలో సాధించుకున్న పనిగంటలు, కార్మికుల హక్కులు నేడు కార్పొరేట్ పాదాల కింద నలిగిపోతున్నాయి. ఇప్పుడు  కార్పొరేట్ కంపెనీలు పూర్తికాలం కార్మికుల్ని కోరుకోవడం లేదు. కన్సల్టెంటులు, కాంట్రాక్టర్లు, పార్ట్ టైం వర్కర్ల నే పేర్లతో కార్మికుల్ని తీసుకుంటున్నాయి. దీనివల్ల పూర్తికాలం (రెగ్యులర్) కార్మికులకు ఇచ్చే సౌకర్యాలు కానీ, సెలవులు, పనిగంటలు కానీ వుండవు, పైగా సోషల్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్సులు వగైరాలకు మాచింగ్ మనీ చెల్లించక్కర్లేదు. అన్నిటి కన్నా ముఖ్యం ఎప్పుడనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగిని తొలగించవచ్చు. ఇన్ని రకాలుగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు తమ ఆటల్ని సాగిస్తున్నాయి. రెండు మూడు నెలల క్రితం “అమెజాన్” కంపెనీలోని శ్రామికుల సమ్మెతో  ఆ కంపెనీలో అమలవుతున్న అమానవీయ పరిస్థితులు బయటకు తెలిసివచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మరో అతి పెద్ద కార్పొరేట్ కంపెనీ “ఉబర్” లో పనిచేస్తున్న డ్రైవర్లు మే 8న చేపట్టిన సమ్మెతో వీరి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.

అమెరికాలోని అన్ని ముఖ్య నగరాల్లో “ఉబర్’’ డ్రైవర్లు సమ్మెలో భాగంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మే 8న “ఉబర్” కంపెనీ 91 బిలియన్ డాలర్లతో పబ్లిక్ ఇష్యూతో షేర్ల్ అమ్మకాలకు ముందుకు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని  ఉబర్, లిఫ్ట్ కంపెనీల డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ఒక రకంగా షేర్లు కొనేవారికి ఒక హెచ్చరికను కూడా పంపగలిగారు.

“ఉబర్” 2009లో రంగప్రవేశం చేసింది. కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి, మనం మెసేజ్ పంపిన కొన్ని నిముషాల్లోపలే ఇంటి ముందుకు కారు వచ్చి తీసుకెళ్ళే పరిస్థితిని తీసుకవచ్చింది. ఇప్పుడు ఉబర్, లిఫ్ట్ కంపెనీల కింద పనిచేస్తున్న డ్రైవర్లు ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది కాగా ఒక్క అమెరికాలోనే 11 లక్షల మంది డ్రైవర్లు వున్నారు. మూడు నాలుగేళ్ళ క్రితం వరకు అమెరికాలోని డ్రైవర్ల పరిస్థితి బాగానే వుండేదని అంటారు భైరవీ దేశాయ్. ఈమె న్యూయార్క్ లో  పచ్చ కార్ల (టాక్సీ) వర్కర్స్ యూనియన్ అలయెన్స్ కో -పౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. ఈమె పనిచేస్తున్న ఈ యూనియన్ లో 22,000 మంది డ్రైవర్లున్నారు. గతంలో గంటకు 30 నుంచి 37 డాలర్ల్ వరకు సంపాదించే వారు. కారు కు గ్యాస్, కారు కొన్నందుకు చెల్లించే లోన్, కారు ఇన్సూరెన్స్ వగైరాలకు పోను నెలకు 4 వేల డాలర్లు చేతికి వచ్చేవి. కానీ “ఉబర్” వల్ల మొదట్లో మైలుకు 3 డాలర్ల నుంచి 2.60 డాలర్ల వరకు రేట్లు వుండేవని గంటకు గతంలో లాగానే 30 డాలర్ల దాకా వచ్చేవని చెప్పారు. కానీ  “ఉబర్” అందర్నీ ఆకట్టుకొని తానే పేద్ద కంపెనీగా ఎదగడానికి ఛార్జీలను బాగా తగ్గించిందని, మైలుకు 1 నుంచి 1.50 డాలర్లకు తగ్గించడం, టిప్ చెల్లింపును తొలగించడం తదితర కారణాలతో డ్రైవర్లు గంటకు 10 డాలర్లు మాత్రమే సంపాదించగలుగుతున్నారని, అందులోంచే కారుకు గ్యాస్, ఇన్సూరెన్సులు, రిపేర్లు లేదా లోన్లు వగైరా చెల్లించుకోవాల్సి వుంటుందని, ఇవన్నీ పోగా ఇంటికి ఉత్తి చేతుల్తోనే వెళ్ళాల్సి వస్తున్నదని, “ఉబర్” లో పని చేసే సి ఇ ఓ, ఎగ్జిక్యూటివ్ లు మాత్రం మిలియన్ల కొద్ది డాలర్లు జీతాలుగా తీసుకుంటున్నారని వివరించారు..

డ్రైవరు  పనిచేయాలంటే తను తినాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన ఆరోగ్యం చూసుకోవాలి, వచ్చిన డబ్బు తన కోసం, కుటుంబం కోసం  వ్యయం చేస్తే కారు లోను వగైరాలు చెల్లించలేకపోతే బ్యాంకులు కారునో, ఇంటినో వేలం వేస్తాయి. అప్పులు చెల్లించలేక మానసికంగా కుంగిపోతూ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా న్యూయార్క్ లో డ్రైవర్ల ఆత్మహత్యల గురించిన వార్తలు వింటున్నాం.డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తాము  సహాయం అందించగలమని వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా వస్తుంటాయి. కానీ డ్రైవర్లు కోరుకుంటున్నది నాలుగేళ్ళ క్రితం అంటే 2012, 13, 14 ల్లాగా వుంటే చాలు, 16, 17, 18 ల్లాగా వద్దు అంటున్నారు. నాలుగేళ్ళ క్రితం లాగా తమకు సంపాదనుంటే చాలు ఎవరి సహాయం అవసరం లేదని, తాము ఆత్మహత్యలు చేసుకోమని, మానసిక వత్తిడికి లోనయి, చికిత్స కోసం డాక్టర్ల వద్దకు పోమని, నిబ్బరంగా బతుకుబండి లాగ గలుగుతామని అంటున్నారు.

కొంత అనుభవంతో, కొన్ని అంచెనాలతో బతుకును బాగుచేసుకుందామని తెగువతో ప్రయత్నించే రైతులు (కొద్దిగా సొంతభూమి ఉండో, కౌలుకు తీసుకొని  పనిచేసే రైతులు), డ్రైవర్లు …ఇలాంటి దిగువ మధ్యతరగతి ప్రజలు తమ అంచెనాలు తలకిందులైపోయి అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్న కార్పొరేట్ సెక్టారు వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. శ్రామిక ప్రజలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తూ, అంతిమంగా ఆత్మహత్యలకు పురికొల్పుతున్న “ఉబర్”, “అమెజాన్” లాంటి మరెన్నో కార్పొరేట్ కంపెనీలను కట్టడి చేయాలి. కార్పొరేట్ సెక్టార్ కు  ప్రత్యామ్నాయంగా కో ఆపరేటివ్ ల ఆవశ్యకత పెరుగుతోంది. ప్రజలచే ఎన్నుకోబడి, ప్రజలే నిర్ణేతలుగా, ప్రజలచే నడపబడి, ప్రజలకే ఫలితాలు అందించే కోఆపరేటివ్ లు ఏర్పాటు కావాలి.

 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.