‘ది ట్రూమాన్ షో’:
ఒక నిజమైన సెటైర్

ప్రస్తుత మన జీవితాల్లో..టీవీ సోషల్ మీడియా, ట్విట్టర్, సెల్ ఫోన్, సీక్రెట్ కెమెరాలు ఒక ప్రధానమైన భాగమైపోయాయి. ఇవి పెరిగిపోవటం వలన మనిషిలో కూడా రియాలిటీకి వర్చువాలిటీకి మధ్యన నిరంతర ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఫిక్షన్ vs, నాన్ ఫిక్షన్ లో స్థానంలో ఇపుడు వర్చువల్ vs రియల్ అనేవి వచ్చి చేరాయి. మనిషి రోజురోజుకీ పరాయీకరణ చెందుతూ పోతూ రియాలిటీ కంటే వర్చువాలిటీ మీద ఎక్కువగా ఆధారపడటం మొదలెట్టాడు. ఐతే మనిషెప్పుడూ వర్చువల్ జీవితాన్నీ వర్చువల్ సంబంధాల్నీ కోరుకోడు. అందుకే వాడిలో నిరంతర సంఘర్షణ ఏమంటే, వర్చువాలిటీని వదిలి రియాలిటీ వైపు పోవడం ఎలా అనేదే. మనిషిలో ఈ tendency towards reality over virtuality పెరిగే కొద్దీ మీడియాలో లేదా సమాజంలో జరిగిన లేదా జరుగుతున్న సంఘటన నిజమైనదే అని నొక్కి చెప్పాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. సమాజంలో ఈ వర్చువల్ ట్రాప్ లోకి పడిపోయిన వ్యక్తులు నిజ జీవితాల్నించి దూరమై తమలోని distant to reality ని భర్తీ చేసుకోవటానికి voyeuristic గా మారటం జరుగుతుంది. అందుకే ఇపుడు reality shows కి డిమాండ్ కూడా ఎక్కువ. లేదా ఒక సినిమా కథ నిజంగా జరిగిన కథ అని చెబితే వచ్చే లాభాలూ ఎక్కువే. Bio pic లూ, రియాలిటీ షోలు మనుషుల్లో ఉండే ఈ voyeuristic tendencies ని సంతృప్తి పరుస్తూ ఉంటాయి. ఐతే మనుషులు దేనికి సంతృప్తి పడతారో తెలిసిన కన్సూమరిజం వీటినే తమ business expansion కి అస్త్రాలుగా మార్చుకుంటుంది. దీనిలో లాభపడేవాడు బూర్జువా వర్గం వాడు కాగా, దీనిలో పావుగా మారేవాడు ఒక సామాన్యుడు. అన్నం నీళ్ళు వదిలి బిగ్ బాస్ షోకి కళ్ళు అప్పగించి చూసే ఒక సందర్భం ప్రస్తుతం ఉంది, కానీ ఇలా జరిగే అవకాశం ఉందని ఇరవై ఏళ్ల క్రితమే సినిమాగా వచ్చి ప్రేక్షకులనూ విమర్శకులనూ అబ్బురపరచిన సినిమా The Truman Show.

సెలెబ్రిటీలనబడే వారిని ఒక పదిమందిని ఒక ఇంట్లో బంధించి వాళ్ళకు కృత్రిమమైన జీవన స్థితిగతులను కల్పించి, ఆయా సందర్భాలలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని సీక్రెట్ కెమెరాలతో చూస్తూ, దానిని అశేష జనవాహినికి చూపిస్తూ సొమ్ము చేసుకోవడమే‌ బిగ్ బాస్ షో. ఐతే ఆ సెలెబ్రిటీల ప్రవర్తనలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి చూపించి తమకు ఇష్టమున్న అభిప్రాయాన్ని ఆవ్యక్తి మీద కలిగించి వాళ్ళను గెలిపించడం లేదా ఓడించడం వంటి ఈ బిగ్ బాస్ షో లో చూస్తుంటాం.

ఐతే ది ట్రూమాన్ షో అంతకు మించినది. అంతకంటే లోతైనది.

ఒక పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక టీవీ కార్పోరేట్ కంపనీ అతడిని తల్లిదండ్రులనుండి హైర్ చేసుకుంటుంది. అతడు పుట్టినప్పటి నుంచి ప్రతీ ఒక్క అంశం సీక్రెట్ కెమెరాల ద్వారా 365 రోజుకు ,24 గంటలు లైవ్ ప్రసారం జరుపుతూ ఉంటుంది. బిగ్ బాస్ షోలో ఉన్న సభ్యులకు తమపై సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుసు. కానీ ట్రూమాన్ కి అదేమీ తెలియదు. అతడి జీవితం ఒక ప్రీ డిజైన్డ్ స్టూడియోలో కొన్ని వేల కెమెరాల మధ్యన బంధితమై ఉంటుంది. అతడి పుట్టుక, చదువు, పెళ్ళి, అలాగే అతడి జీవితంలోని ప్రతీ అంశం కూడా ఈ సీక్రెట్ కెమెరాలు ద్వారా ప్రతి క్షణం ప్రపంచానికి తెలపుతూ ఉంటాయి. అతడి చుట్టూ కొన్ని వేలమంది నటులు నటిస్తూ ఉంటారు. వాళ్ళెవరూ నిజమైన జీవితానికి చెందిన వారు కాదు. ఆ కార్పోరేట్ సంస్థలో పని చేసే నటులు మాత్రమే. అతడు పని చేసే స్థలం, అతడి ఇల్లూ, అతడు నివసించే సీహావెన్ ద్వీపం అన్నీ కేవలం సెట్టింగులే. అతడి మిత్రులు, సహచరులూ, బంధువులూ, చివరకు భార్య అందరూ కూడా నటులే. అతనికి తెలియకుండా వాళ్ళందరూ అతడి జీవితంలో భాగమై ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు ఇతడి జీవితం ఒక టీవీ షో అని. అతడికి మాత్రం తెలియదు. అతడి భార్య అతడితో మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని వస్తువులను ప్రమోట్ చేస్తున్నట్లుగా టీవీ లోని అశేష జనవాహినిని ఉద్దేశించి చెబుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ షోలో కమర్షియల్ బ్రేక్స్ లేవు. కనుక 24 గంటల లైవ్ షోలో కనిపించే ఎన్నో వస్తువులు నిజానికి అడ్వర్టైజ్మెంట్లు. ఆ షోలో చూపబడుతుండటం వలన ట్రూమాన్ వాటిని వాడుతూ ఉండటం వలన బయట ప్రపంచంలో వాటికి గిరాకీ ఎక్కువ.

దీనంతటికీ మాస్టర్ ప్లాన్ చేసింది, టీవి కార్పోరేట్ సంస్థ యజమాని క్రిస్టోఫ్. ట్రూమాన్ కోసం కొన్ని వేల ఎకరాలలో లైఫ్ టైం సెట్టింగ్ వేసి చివరికి సూర్య చంద్రులనూ, సముద్రాన్నీ, సముద్రంలో అలలనూ తుఫాన్లను కూడా ఆర్టిఫిసియల్ గా సృష్టించగలుగుతాడు. ట్రూమాన్ బయటి ప్రపంచానికి ఓ పెద్ద స్టార్. అతడి జీవితంలోని ప్రతీ సంఘటనా ప్రతీ వ్యక్తీ క్రిస్టోఫ్ యొక్క మాస్టర్ డైరెక్షన్ లో భాగాలే. ట్రూమాన్ నిజాన్ని తెలుసుకోకుండా క్రిస్టోఫ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ట్రూమాన్ ఆ ద్వీపాన్ని వదిలిపోకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తాడు. ట్రూమాన్ ప్రవర్తన అతడి జీవితంలోని ఘర్షణ క్రిస్టోఫ్ కి కాసుల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే ప్రజలలో voyeuristic tendencies వుంటాయి. 24 గంటలూ ట్రూమన్ జీవితంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ తో టీవీల ముందు కూర్చుని చూస్తున్నారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతుంటుంది ట్రూమాన్ షో. ఐతే తన జీవితంలో అజువల్ గా కనిపిస్తున్న రొటీన్ ని ట్రూమన్ పసికడతాడు‌. తాను ప్రేమించిన అమ్మాయి, ఒక సందర్భంలో అతడు ఏ విధంగా ఒక ఫాల్స్ ప్రపంచంలో బతుకుతున్నాడో చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ట్రూమన్ తన జీవితంలోని ట్రూత్ ని వెతకటం మొదలెడతాడు. తనను ఎవరో నడిపిస్తున్నారని తెలుసుకుంటాడు. తన జీవితం ఒక ఫేక్ జీవితమని దానినుంచి బయటపడే ప్రయత్నం చేసి చివరకు విజయం సాధిస్తాడు. తన ప్రేయసి దగ్గరకు వెళ్ళిపోతాడు.

ఐతే ట్రూమాన్ షో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా మాత్రమే కాదు‌. కేవలం ఒక రియాలిటీ షోకి సంబంధించినదే కాదు. ఇది చేసే విమర్శ చాలా లోతైనది. చాలా పొరలుగలది. ఇది క్యాపిటలిస్టిక్ సొసైటీ మీద వేసిన అద్భుతమైన సెటైర్. కన్సూమరిజం లో లాభార్జన ముఖ్యమై వ్యక్తి విలువలు ఎలా పతనం చెందుతాయనేది సెటైరికల్ గా చూపిన సినిమా ఇది. క్రిస్టోఫ్ బూర్జువా వర్గానికి ప్రతినిధి ఐతే ట్రూమాన్ , శ్రామిక వర్గానికి ప్రతినిధి. కెమెరా యాంగిల్స్ లో కూడా ఈ భేదాన్ని స్పష్టంగా చూపిస్తాడు దర్శకుడు.  కన్సూమర్ సమాజం తన కోసం వ్యక్తులను సృష్టించుకుంటుంది. డబ్బు సంపాదనకు ఒక ట్రూమన్ షో కావాలి‌. ట్రూమన్ షో కోసం ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి తన స్వంత వ్యక్తిత్వాన్ని కాకుండా సమాజం నిలబెడుతున్నటువంటి వ్యక్తిత్వానికి, ఆ షో అధినేత ఆశిస్తున్న వ్యక్తిత్వానికి లోనై ఆ సమాజంలోనే (ఆ టీవీ షో లోనే) బందీ ఐవుండాలి. ట్రూమాన్ ఒక సరకు అయి, అతడి జీవితం capitalise అయ్యి అతడి స్వేచ్ఛనూ, అతడి ప్రైవసీ ని ఎలా తొలిచేస్తుందో చెబుతుందీ కథ. నిజానికి ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ సమాజంలో మన జీవితాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. మనకు తెలీకుండానే మన జీవితాల్ని బూర్జువ వర్గం శాసిస్తూ ఉంటుంది. మనం ఏం తినాలో, ఎక్కడ చదవాలో, ఎక్కడ పడుకోవాలో, ఏం చూడాలో, ఏం వినాలో, ఎక్కడ చావాలో కూడా అదే వర్గం మీడియా ద్వారా మన బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. మనల్ని మనలోని సత్యాన్ని కనుగొననీయకుండా సత్యానికి దూరంగా ఉంచగలుగుతుంది. తాను సత్యమనుకున్నదాన్నే మనకూ సత్యమని గోచరించేలా చేయగలుగుతుంది. క్రిస్టోఫ్ తాను సృష్టించిన సమాజాన్ని పైన్నుంచి అందరికంటే ఎత్తునుంచి ఒక బర్డ్ ఐ వ్యూ లాగా చూడగలుగుతాడు‌. అతడే ఈ సమాజాన్ని శాసించగల దేవుడు. ఐతే సినిమా చివర్లో సత్యాన్ని తెలుసుకొన్న ట్రూమాన్ తో క్రిస్టోఫ్ అంటాడు. “నేను నీ కోసం ఒక మెరుగైన సమాజాన్ని సృష్టించాను. ఇక్కడ అందరూ నటించే వాళ్ళే అయినా నాతో సహా అందరూ నీ మేలును కోరుకునే వారే. కానీ బయట సమాజం అలా లేదు. నిన్ను బయట ఉన్న సమాజపు దౌష్ట్యం నుంచి కాపాడాను. ఇపుడు అదే సమాజపు దౌష్ట్యం లోకి నీవు వెళ్ళి బతకలేవు” అని చెబుతాడు. వ్యక్తి స్వేచ్ఛను హరించే ఏ ఉటోపియన్ సమాజమైనా బహుశా ఇలాగే   మాట్లాడుతుందనుకుంటాను. కానీ వ్యక్తిగా ట్రూమన్ తనదారి తాను చూసుకుంటాడు. పీటర్ వెయిర్ దర్శకత్వం, ట్రూమన్ గా జిమ్ క్యారీ నటన ఈ సినిమాను ఆల్టైమ్ క్లాసిక్ గా నిలబెడతాయి.

(ఐతే ఈ సినిమాను ప్రస్తుతం ఉన్న మీడియా ఎథిక్స్ కోణంలో కూడా అనలైజ్ చేయవచ్చు. ఇలా ఒక సినిమా ను అనేక కోణాల్లోంచి చూడగలిగేలా చేయటంలో మనిషిని ఆలోచింపజేసే లా చేయటంలో ఈ సినిమా నూరుశాతం సక్సెస్ సాధించింది. తప్పక చూడవలసిన సినిమా).

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.