పిడకలా పడి వుండకు
బంతి వలే ఎగురు!

“There’s no such thing as ruining your life. Life’s a pretty resilient thing, it turns out.” 
                                                                 –  Sophie Kinsella, The Undomestic Goddess

నీ జీవితం పాడైపోవడంలాంటిదేమీ ఉండదు.  పడి లేవడం  బతుకు  సహజ  తత్వం;  అది మళ్ళీ లేచి నిలబడుతుంది.’  

                                                                                                                          –సోఫీ కిన్సెల్లా

ఒక బంతిని గోడకేసి కొట్టండి. మీరెంత వేగంగా ఆ బంతిని గోడకేసి కొడతారో అంతే వేగంగా అది మళ్ళీ మీ దగ్గరకొస్తుంది. నేల మీద కూడా బంతిని మీరెంత వేగంగా కొడతారో అంతే వేగంగా అది మీ చేతిని తాకుతుంది. ఒక పేడ ముద్దని గోడకేసి కొట్టండి. అది పిడకవుతుంది కానీ తిరిగి వెనక్కి రాదు. మీరు జీవితంలో మీ చేతుల్లో లేని పరిస్థితుల వలన ఎంత పతనమైనా అంటే కిందపడ్డా బంతిలా వేగంగా తిరిగి నిలదొక్కుకోగలరా? ఉత్థాన పతనాలు అంటే ఎగుడు దిగుడులు జీవితంలో సహజం. ఎంతటివారికైనా ఇవి తప్పవు. ఎంత కిందపడ్డా తిరిగి స్ప్రింగు లాగా లేచి నిలబడగలిగిన వాడే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. విజయుడవుతాడు. అనితరసాధ్యమైన స్ఫూర్తిగీతమవుతాడు. అదే మహిళామణులైతే జాతికి మరింత స్ఫూర్తిదాతలవుతారు. ఉదాహరణకు ఇటీవల మరణించిన బహుముఖప్రజ్ఞాశాలి, చలనచిత్ర రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసిన కుమారి జయలలిత జీవితం నిత్యస్ఫూర్తిదాయకం. తాను ఎన్నుకున్న రంగాలలో ఎన్ని ఆటుపోట్లెదురైనా, పరిస్థితులు తనవారినందరినీ దూరం చేసినా, మహిళగా అన్ని రకాల వివక్షలు ఎదురైనా, తన చుట్టూ ఉన్న సమాజాన్ని మొక్కవోని ధైర్య సాహసాలతో ఎదుర్కొని, నియంత్రించి అత్యున్నత స్థాయికి చేరుకున్న విదుషీమణి, ధీర వనిత జయలలిత. అదీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నియంత్రించే నాయకుల లక్షణం. అంధురాలైనా కూడా తనవంటి వారికి సేవ చేయడానికి నడుం కట్టి విశ్వ విఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్, అంధులకు లిపిని తయారు చేసిన బ్రెయిలీ, వెయ్యి సార్లు విఫలమైనా బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, విఫలమైన కొద్దీ పట్టుదలను పదింతలు పెంచుకుని అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ – వీరే కాకుండా ఇంకా ఎందరో ఉత్థాన నైపుణ్యాలకు నిలువెత్తు ఉదాహరణలుగా నిలుస్తారు. స్థూలంగా చెప్పాలంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని విడిచే ఆలోచనను ఇసుమంతైనా రానీకుండా, ఎంతటి పతనాన్నైనా ఉత్థానం వైపు పరుగెత్తించే జీవన స్పృహ, జీవితం పట్ల ప్రేమను పెంచుకునే లక్షణాలే ‘ఉత్థాన నైపుణ్యాలు’ (Resilience Skills) అని చెప్పవచ్చు. మరి అటువంటి అనితర సాధ్యమైన లక్షణాలను అలవరచుకోవడం ఎలా?     

విషాదంలోను, సవాళ్ళెదురైనపుడు, తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు అంటే కుటుంబ సమస్యలు, బాంధవ్యాల సమస్యలు, తీవ్రమైన అనారోగ్యం, పని చేసే ప్రదేశంలో ఎదుర్కొనే సమస్యలు, ఆర్ధిక సమస్యలు – ఇటువంటి ప్రతికూల పరిస్థితులను  ఎదుర్కోవడానికి తన్ను తాను మలచుకోవడమే, తదనుగుణంగా ప్రవర్తించడమే ‘ఉత్థాన నైపుణ్యాలు’ (Resilience skills) అని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వచించింది.   

సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి:

సాధారణంగా మనమంతా ఉత్థాన నైపుణ్యాలు అవసరమైనప్పుడు చూపిస్తాము. అంటే కింద పడి అక్కడే ఉండిపోయే లక్షణాలు సాధారణంగా ఎవ్వరిలోనూ ఉండవు. పతన స్థాయి నుండి పతాక స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉత్థాన నైపుణ్యాలు సాధారణంగా మనందరం ప్రదర్శిస్తాము. అలాగని దు:ఖం, నిరాశ ఇవన్నీ అనుభవంలోకి రావని, అటువంటి భావోద్వేగాలు పట్టించుకోరని కాదు. ఉత్థాన నైపుణ్యాలు కలిగిన వాళ్ళు అటువంటి భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని, వాటికి బలైపోకుండా తిరిగి వేగంగా మామూలు స్థితికి చేరుకుని జీవితాన్ని ప్రగతిశీల దృక్పథంతో తీర్చిదిద్దుకుంటారు. జాతి, మత, కుల, వర్ణ, వర్గాలతో సంబంధం లేదు. ఉత్థాన నైపుణ్యాలు కొందరిలో ఉంటాయి, కొందరిలో ఉండవు అనే సిద్ధాంతాలేమీ లేవు. కొన్ని ప్రవర్తనలు, ఆలోచనలు, ఆచరణలు అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉత్థాన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు.  నిజానికి మనం ‘వాడు ఎంత కిందపడ్డా మళ్ళీ ఠక్కున పైకి లేచి నిలబడతాడు’ అని చెప్పుకునే వాళ్ళందరూ, ఉత్థాన నైపుణ్యాలను నిర్వచించే వాళ్ళందరూ అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్నవారే. నిరంతరం ఆ నేర్చుకునే లక్షణమే వారిని పతన స్థాయిలో పిడకలా ఉండిపోకుండా కాపాడుతుంది. మెదడును ఎప్పటికప్పుడు పతన స్థాయిలో ఉండకుండా పతాక స్థాయికి చేరడానికి తగిన లక్షణాలతో తీర్చిదిద్దాలంటే దానికి తగిన సానుకూల ఆలోచనల ఆహారంతో నిరంతరం శిక్షణనివ్వాలి.

నిరంతరం మెదడును ఉత్తేజంతో నింపుతూ, తట్టుకోలేని ప్రతికూల పరిస్థితులను సైతం అలవోకగా ఎదుర్కొనే మొండిపట్టుదల, అసమాన ధైర్య సాహసాలు చూపించే విధంగా ఏ విధంగా మన మెదడును, ఆలోచనలను, ఆచరణలను సన్నద్ధం చేయాలి? ఎటువంటి లక్షణాలను అలవరచుకోవాలి? మౌలికంగా ఉత్థాన నైపుణ్యాలు అలవరచుకోవడానికి పది లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. అవేమిటో చూద్దాం.

  1. అందరితో సత్సంబంధాలు పెంచుకోవాలి. దీనివలన మనలో భావోద్వేగాల నియంత్రణ బలపడి, మానసికంగా దృఢంగా తయారవుతాము. పని చేసే కార్యాలయంలోను, కుటుంబ సభ్యులతోను, వీరితో సంబంధం లేనివారితో కూడా సానుకూల సంబంధాలు పెంపొందించుకోవాలి.    
  2. సంక్లిష్ట పరిస్థితులను, యధాతధంగా చూసే నైపుణ్యాన్ని అలవరచుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని పరిష్కార సాధ్యం కానంత భయంకర సమస్యగా భూతద్దంలో చూడకూడదు. ఒక ప్రాచీన వియత్నాం సామెత ఈ స్థితికి అద్దం పడుతుంది. ‘గతంలో జరిగినదాన్ని నువ్వు మార్చలేవు. ఎందుకంటే అది గతం కాబట్టి. జరిగిపోయిన గతం పట్ల ఎలా స్పందించాలన్న నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది.’
  3. మార్పును ఆహ్వానించు: మార్పు జీవితంలో ఒక అంతర్భాగమన్న వాస్తవాన్ని  గుర్తించాలి. కాలగమనంలో మన నియంత్రణలో లేని పరిస్థితుల వలన కొన్ని లక్ష్యాలు సాధించలేమన్న కఠోర వాస్తవాన్ని కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి. అనవసర నిరాశకు, నిరుత్సాహానికి, నిస్తేజానికి లొంగిపోరాదు.
  4. ఆచరణ పునాదిగా అభ్యున్నతి వైపు: లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లక్ష్యాలేమీ లేకపోతే తక్షణం ఏర్పరచుకోవాలి. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగరాలని ఉబలాటపడ్డట్టు’ సాధించలేని లక్ష్యాలను పెట్టుకోకూడదు. మన శక్తికి తగిన, సాధించ కలిగిన లక్ష్యాలనే ఏర్పరచుకోవాలి.
  5. దృఢ నిశ్చయం, కృత నిశ్చయం అలవరచుకోవాలి. ప్రతికూల పరిస్థితులకు ఏ మాత్రం లొంగరాదు. సమస్యతో ముఖాముఖీ తలపడి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ అటువంటి సమస్య జీవితంలో తలెత్తకుండా పరిష్కరించుకోవాలి.
  6. వ్యక్తి వికాసం, వ్యక్తిత్వ వికాసం విలువ తెలుసుకోవాలి. విలువలు పాటిస్తూ, ప్రపంచానికి విలువను చేకూర్చే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
  7. అహంకారం పెంచుకోవాలి అంటే అభివృద్ధికి బాటలు వేసే సానుకూల అహంకారాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ ప్రపంచంలో నీ అస్తిత్వ ప్రాముఖ్యతను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే దిశగా దృష్టిని  కేంద్రీకరించాలి. నీ మీద నమ్మకం పెంచుకో. నీ అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముకో. అవి నీకు, నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి సమస్యా పరిష్కారానికి దారి చూపిస్తాయి.
  8. సదాలోచన, సరైన దృక్పధం: గులకరాళ్ళ వంటి సమస్యలను పర్వతాల్లా చూడకూడదు. పర్వతాలను చూస్తున్నప్పుడు మన ముందు గొప్ప సవాలు నిలిచిందని, దాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధమవ్వాలి. ఎవరెస్టు పర్వతం కూడా చంద్రుడి మీద నుంచి చిన్నగానే కనిపిస్తుంది. ఇక్కడ నాకో చక్కని తెలుగు పద్యం గుర్తుకొస్తోంది. ‘అనువుగాని చోట అధికులమనరాదు; కొంచెముండుటెల్ల కొదువకాదు; కొండ అద్దమందు కొంచెమై ఉండదా ‘ అంటే మనదికాని చోట అధికులమని విర్రవీగరాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనలను మనం తక్కువ చేసుకోవడం ఏ మాత్రం తక్కువతనంగా, చిన్నతనంగా భావించరాదు. కొండ కూడా అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది కదా’ అంటాడు వేమన.
  9. ఆశావాదమే అద్భుత కవచం: భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆశావహమైన అంశాలను పరిశీలించాలి. పసిగట్టాలి. నీకేది కావాలో అది గమనించాలి. నిన్నేది భయపెడుతుందో దాని కోసం వెదకకూడదు. అప్పుడు అక్కడ మనం చూసేదానికి, అసలు అక్కడ ఉన్నదానికి ఎప్పుడూ పొంతన కుదరక గందరగోళంగా ఉంటుంది.
  10. జర భద్రం: నిన్ను నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మీద నువ్వు ప్రేమ పెంచుకోవాలి. నిన్ను నువ్వు నిరంతరం ప్రేమించుకుంటే ఎటువంటి దుర్భర సమస్య నుంచైనా సునాయాసంగా బయటపడగలవు. నీ కనీస అవసరాల మీద, భావోద్వేగాల మీద దృష్టి పెట్టు, అంతే కానీ లోభిత్వాన్ని పెంచుకోకు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’! నీ మెదడును, మనసును, ఆత్మ శక్తిని దృఢంగా ఉంచుకో. పౌష్టికాహారం, నిత్య వ్యాయాయం, నిరంతర పరిశ్రమ, సానుకూల వైఖరి చక్కని జీవితానికి రాజమార్గమవుతాయి.

జీవితమే ఒక వైకుంఠ పాళి. అందులో కాటేసి పతనం చేసే కష్టాల పాములుంటాయి. ఉత్థానానికి ఊపునిచ్చే, బతుకునిచ్చే నిచ్చెనమెట్లుంటాయి. ఎగుడు దిగుడుల జీవితంలో ధైర్యమే ప్రాణవాయువు. సాహసమే ఊపిరిగా జీవించిన ఎందరో స్ఫూర్తిదాతలు ఉత్థాన నైపుణ్యాలు అలవరచుకుని వేయి పడగల నాగులా మారిన బతుకును తమ చేతిలోకి తీసుకుని ఆదర్శప్రాయులయ్యారు. చిన్న చిన్న విషయాలకు, పరీక్ష తప్పినందుకు, ప్రియుడో ప్రియురాలో తిరస్కరించినందుకు, తల్లిదండ్రులు తిట్టినందుకు జీవితాలను అంతం చేసుకునే యువతకు నేడు జీవితాన్ని చూసిన అనుభవజ్ఞులందరూ ఉత్థాన నైపుణ్యాలను నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. తమ జీవితాలను తమకు నచ్చినట్టు, నలుగురూ మెచ్చేట్టు తీర్చిదిద్దుకునే నైపుణ్యాలను నేటి యువత నిరంతరం సాధన చేయాలి. నిరంతరం జీవించడాన్ని సాధన చేయడమే జీవితం. Life has a practice of living you, if you don’t live it.’జీవితాన్ని నువ్వు జీవించకపోతే అది నిన్ను జీవిస్తుంది.అంటాడు ఫిలిప్ లార్కిన్.  జీవించండి. జీవించనివ్వండి. Live and let live. సర్వేజనాస్సుఖినో భవంతు!  

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.