రాళ్లవానలో శ్రీశ్రీ

మరణించి ఇన్నాళ్లయినా, మరణించని వారిలో శ్రీశ్రీ ఒకరు.

శ్రీశ్రీ జనంలోనే కాదు, తన విమర్శకుల్లో కూడా వున్నాడు. మెచ్చుకునే వాళ్ల వల్లనే కాదు,  విమర్శకుల వల్ల కూడా వున్నాడు. విమర్శలకు ఆస్కారం లేకపోతే దేవుడయ్యే వాడు. పెద్దల పండుగ నాడు తనకూ ఒక నైవేద్యం పెట్టి, మన పని మనం చూసుకునే వాళ్లం.

శ్రీశ్రీ మీద విమర్శలున్నాయి. విమర్శలకు తగినంత సరుకు తానే చక్కగా పళ్లెంలో సర్ది సరఫరా చేశాడు.

ఒకటి కాదు రెండు కాదు, చాల వాటికి ఇప్పటికీ తనే రెఫరెన్స్ పాయింట్.

ఎందుకు మొదలయ్యిందో గాని, ‘ముఖపుస్తకం’లో ఇటీవలొక ‘మహా’ దుమారం చెలరేగింది. ఇంకా రేగుతూనే వుంది. అంత రిలవెంట్ శ్రీశ్రీ, ఇప్పటికీ.

దుమారం కేవలం శ్రీశ్రీకి పరిమితం కాదు, జనరల్ గా కమ్యూనిజానికి సంబంధించినది కూడా… అని…  రాను రాను పొగమంచు తొలగి దృశ్యం స్పష్టమవుతున్నది. జరగాల్సిన మరో గ్రేట్ డిబేట్ కు శ్రీశ్రీ తో శ్రీకారం. తెలీడం లేదూ అతడెంత రిలవెంటో.

‘నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరే
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే.’

వీరంటే ఎవరు? మనమే. నేనూ, నువ్వూ!

మన లోని నిబిడాశ్చర్య, నిర్దాక్షిణ్యాలే.  

***

శ్రీశ్రీ మహాకవి ఔనా కాదా అనేది మరీ నాసిరకం చర్చ. ఉన్న వస్తువుకు ఏం పేరు పెడదాం అనే చర్చ.

తన కాలం మీద, తదనంతర కాలం మీద మరెవరి కన్న ఎక్కువ ప్రభావం నెరపిన కవి శ్రీశ్రీ.

ప్రభావం కవితా రీతికి, శైలికి, జీవన వైఖరికి… అన్ని కవితా పార్శ్వాలకు సంబంధించినది.

సాహిత్యంలో తన కాలాన్ని నడిపించి, తదనంతర కాలానికి (అత్యధికులకు) నమూనా అయ్యాడు గనుకనే శ్రీశ్రీ మహాకవి. అది పదవి కాదు. పాలకులిచ్చిన బిరుదు కాదు. కాలం అతడినలా గుర్తు పెట్టుకుంది.

ఒకాయన్ని నడ్డిముక్కు సుబ్బారావు అంటాం. అది వాళ్లమ్మ నాన్న పెట్టిన పేరు కాదు. పదవి కాదు. మునుపు విజయవాడలో లాగ వీధికి వంద మంది సుబ్బారావులున్న చోట మిగిలిన సుబ్బారావుల్నించి వేరుచేసి చెప్పడానికి పనికొచ్చిన ఒక మాట.

అప్పటి కమ్యూనిస్టు పార్టీ వాళ్లు… నే చదివినది జ్ఞాపకమున్నంత వరకు, నాటి సిపిఐ నేత చండ్ర రాజేశ్వర రావు శ్రీశ్రీని మహాకవి అని ప్రస్తావించారు.

చాల మంది కోసం చాల మంది ‘మహా’ ప్రయోగం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి…. ఇలా చాల మందిని ఆ పీట వేసి కూర్చోబెట్టారు. ఆ పదం… పదవి కాదు… పదం… శ్రీశ్రీ కి అతుక్కుపోయింది, అచ్చం పక్కింటి సుబ్బారావుకు నడ్డిముక్కు అతుక్కుపోయినట్టే.

‘మహా’ అనే మాట ఇది రాస్తున్న నాక్కూడా ఇష్టం లేదు. నా కారణం వేరు. మహా కవి, మహా పండితుడు అనే మాటలు మెగా లేదా మెటా న్యారేటివ్ (మహా కథనం) లకు కుదురుతుంది. తదనంతరం రూపొందాల్సిన చైతన్యానికి ‘మహాకథనం’ అడ్డంకి అవుతుంది. ప్రతి మహా కథనం మనుషుల మెదళ్ళ మీద ఒక దెయ్యపు భారమై కూర్ఫుంటుంది.  

తాత్వికంగా ‘మహా కథనాల’కు కాలం చెల్లింది. భారం వొదిలింది. ఇప్పుడన్నీ లిటిల్ న్యారేటివ్ లే. అన్నీ చిన్న చిన్న కథనాలే.

ఇది ఏకశిలాసదృశ ‘సంస్థ’ల కాలం కాదు, సమాఖ్య (ఫెడరేషన్‍) ల కాలం.

జీవితమిప్పుడు పరస్పరం సంఘర్షించే, కలుసుకునే పలు చిన్న కథనాల సంపుటి.

మనం బతుకుతున్నది ఆధునిక జీవితం కాదు. ఉత్తరాధునిక జీవితం. ఇది పాత క్యాపిటలిజం కాదు, ‘లేట్ క్యాపిటలిజం’. పెట్టుబడిదారీ విధాన‍ంలో అత్యున్నత దశ. అత్యున్నతమంటే ఆపై పురోగతి లేదు అని అర్థం. మరోమాటలో, పెట్టుబడిదారీ విధాన‍ం చివరాఖరి దశ.

ఇటీవలి పరిణామాలు చూద్దాం.

ఒకప్పుడు సమాజానికి దేవుడు కేంద్రం. దేవుడిని తోసేసి మానవుడు సమాజ కేంద్రమయ్యాడు.

అక్కడితో ఆగలేదు. ఇవాళ ఒకే (రకం) మానవుడు అందరికి ప్రాతినిధ్యం వహించలేడు. మానవుడు లేడు. మానవులు ఉన్నారు. మనుషులందరు ఒకే మూస కాదు. ఉన్నోళ్లు, లేనోళ్లు, ఉండీ లేనోళ్లు, దొంగలూ గూండాలు… అని పలు ఆర్థిక వర్గాలు.

అందులో మళ్లీ… స్త్రీ పురుషులుగా, ‘మెజారిటీ’, ‘మైనారిటీ’లుగా, కులాలుగా, గిరిజనులూ గిరిజనేతరులుగా… అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ముక్కలు ముక్కలైన సామాజిక సమూహాలం మనం.

ఒకే సమూహం కానప్పుడు ఒకే మహా కవి ఎలా వుంటాడు? ఉండడు. పలువురు మహాకవులుంటారు. ఒక్కో సమూహానికి కనీసం ఒక మహాకవి. తన సమూహంలో ‘పోయెట్ పార్ ఎక్సలెన్స్’ కావడానికి పలువురు పోటీ పడొచ్చు.

ఇవాళ ఒకాయన ‘నాకు శ్రీశ్రీ మహాకవి కాడ’ని అనడం పెద్ద విడ్డూరం కాదు. నిజమే, ఆయనకు కాడు. నాకు ఔను. నేను మునుపటి సమూహంలో వున్నాను కాబట్టి. నాకు కంఫర్టబుల్‍ గా వున్న సమూహాన్ని వొదిలి ఆ ఒకాయన సమూహంలోనికి రాలేను. మా మధ్యన… మంచికి చెడుకు పరస్పర సంఘీభావం వుంటుంది. కలవడం కుదరరదు. అందుకు ఆ సమూహం ఒప్పుకోదు. ‘సర్సరేలే, మా స్థలాన్ని మాకు కాకుండా చేద్దామని కదూ’ అని కోప్పడుతుంది. కోపం న్యాయబద్ధం.

ఇదొక వ్యవస్థ. ఇదొక పెద్ద వల. అందరం కలిసి ఈ వలను ఎత్తుకుపోలేమా?

ఎత్తుకుని గగనానికెగసినా వల వుంటుందని చిన్నయసూరికి తెలుసు.

ఇక చేయాల్సిన పని వలను కొరికేసి చీల్చేసి చించి పోగులు పెట్టడమే.

ఇప్పటికిప్పుడు మాత్రం అందరం ఒకే సమూహంగా లేం.

మునుపు ఇలా లేదు. అప్పుడు నాకే కాదు, ఇప్పుడు జీవించి లేని శివసాగర్ కు, అజంతాకు కూడా శ్రీశ్రీ మహాకవే. ఆనాడు నాకు, శివసాగర్ కు, అజంతాకు, శ్రీశ్రీకి అందరికీ… ఒకే సమూహం. ఆ సమూహానికే సత్యమూర్తి, సీతారామయ్య, నాగిరెడ్డి, రామచంద్రయ్య, పుల్లారెడ్డి, మధుసూదన రాజ్ యాదవ్, కూర రాజన్న, మారోజు వీరన్న నాయకత్వం వహించారు. ఆ సమూహంలో మహాకవి శ్రీశ్రీ యే.

శ్రీశ్రీ లో గని, వని, కార్ఖానా, కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి, సాలెల మగ్గం, పొలం హలం వంటి చప్పన్నారు శ్రామిక వృత్తులున్నాయి. లేనిది మంత్ర, తంత్రాలతో బతికే బ్రాహ్మణులే.

ఆ కాలం సాహిత్యం ప్రధానంగా ఇద్దరి ప్రభావంలో నడిచింది. ఒకరు శ్రీశ్రీ, మరొకరు బాలగంగాదర తిలక్. తిలక్ పాలకులకు తగినట్లు తన్మయత్వం, నిశ్శబ్దం, శాంతి గీతాలు పాడుతూ వుండిపోయాడు. ఆయనకు అమెరికా హింస, వీత్నాం హింస ఒకే రకం. మనుషులందరు ఒకటే. తిలక్ ‘మానవ వాది’. (అంటే మానవ కేంద్రక వాది).

మనుషులందరు ఒకటి కాదు, వున్నోళ్లు లేనోళ్లు అని తేడా వుందన్నాడు శ్రీశ్రీ. ‘జమీందారు రోల్సు కారు మాయంటావా, నా ముద్దుల వేదాంతీ, మిధ్యంటావా’ అని నిలదీశాడు. ‘ఈ రాజ్యం మీదేనండీ ఈ రాజ్యం మీరేలండీ’ అని శ్రామికులను ప్రేరేపించాడు.

ఆ ఇద్దరిలో శ్రీశ్రీ మాట ఎక్కువ హితం అయిన వారే ఎక్కువ.

వాళ్లిద్దరూ బాపనోళ్లు కావడం చారిత్రకం. అది అన్యాయమైతే చర్చించాల్సింది కూడా చారిత్రకంగానే.

మన వాంఛలు కాదు, వాస్తవాలే నిర్ణేతలు.

(చరిత్ర విచిత్రాలు చేస్తుంది. రాముడి చేతిలో హతుడైన శంభూకుడు శూద్రుడు. దళితుడు కాదు. ఏకలవ్యుడు గిరిజనుడు. దళితుడు కాదు. అయినా వాళ్లివాళ కేవలం దళితుల మీద అగ్రవర్ణ దళనానికి ప్రతీకలయ్యారు. శూద్రులైన రెడ్డి లేదా చౌదరి ఆ ఇద్దరి వెనుక దాక్కోడం లేదు. ఆ దశ రామస్వామి చౌదరితోనే అయిపోయింది. కారణం సాంఘికార్థిక చరిత్రే.)

ఇవాళ ఏ సమూహానికి ఆ సమూహంలోని వారే మహాకవులు..

ఇట్టా, ఇన్ని సమూహాలైతే, ఎవరికి వాళ్లం అయిపోతే, అందరం కలిసి అన్యాయాన్ని ఎదిరించడమెలా?

ఎవరికి వాళ్లంగా వుండి, వుమ్మడి అంశాల మీద కలవగలమా? లేదా?

కొందరు ‘కలవగలం’ అంటారు, కొందరు ‘కలవలేం’ అంటారు. ఇద్దరి మాటా నిజాయితీగా చెప్పిందే.

కలవలేం అనడానికి ప్రేరేపించే పరిస్థితులు తగ్గిపోయి, కలవగలం అనడానికి వూతమిచ్చే పరిస్థితులు పెరిగే కొద్దీ మనుషులం కలుస్తాం. ఆ పరిణామం పోరాట క్రమంలో జరగాల్సిందే. ఊహల్లో కాదు, ఊహాజనిత వివాదాల్లో కాదు.

ఇవాళ మనల్ని కలిపేది ఎప్పటికప్పుడు తోసుకు వచ్చే ఇస్యూస్‍ మాత్రమే. ఇస్యూస్‍ మీద క‍ల‍వడానికి ‘మహా’కథనాలు అవరోధం కాకుండా చూసుకుందాం.

ఇస్యూస్ అంటే ప్రజా సమస్యలు. అంతిమంగా అందర్ని కలిపేవి ప్రజా సమస్యలే. మనుషులందరి సమస్య ఒక్కటే అయినప్పుడు… ఒకటే అయిన మేరకు… మనుషులందరు ఒకటే అవుతారు.

కలవకపోవడమూ లేదు. కలగలిసిపోవడమూ లేదు. ఇస్యూ మేరకే కలవడం, విడిపోవడం.

***

శ్రీశ్రీ చుట్టూ చెలరేగిన దుమారంలో రెండో సంగతి నైతికత. శ్రీశ్రీ వ్యభిచరించాడు. అలాంటి వాడు మహాకవి ఎలా అవుతాడు అని.

ఈ విమర్శ శ్రీశ్రీ మీద తప్పక చేయాల్సిందే. చేశారు. చేస్తారు. అది మంచి పని.

మహాకవి అని కాదు. ఏ మనిషి మీదైనా ఆ విమర్శ పెట్టాల్సిందే.

కాని, శ్రీశ్రీ మీద పెడుతున్న ఈ న్యాయమైన విమర్శ ఇంకే కవి మీదైనా… ఏ పెద్ద, చిన్న కవి మీదైనా పెట్టగలరా?

సమాధానం తెలిసిందే.

పెట్టలేరు.

ఎందుకంటే, ఇతర కవుల/రచయితల సంగతి మనకు తెలీదు. వాళ్ల ‘పాపాల చిఠాలు’ కర్ణాకర్ణిగా విన్నాం. అవి నిజమయినా, రుజువు చేయలేం.

శ్రీశ్రీ విషయంలో రుజువు అనే సమస్యే లేదు. దానికి అయనే ప్రత్యక్ష సాక్షి. ‘మరణ వాంగ్మూలం’ వుంది. ‘అనంతం’ అనే తన పుస్తకంలో తానే రాశాడు. ఆ పుస్తకం తెలుగులో అద్వితీయం, మరి చాల వాటికి శ్రీశ్రీ అద్వితీయుడైనట్లే.

శ్రీశ్రీ కాకుండా ఇంకెవరూ అలాంటి పుస్తకం రాయలేదు. రాసి తామేమిటో తామే చెప్పలేదు. చెప్పి ఇక విసరండి రాళ్లు, ఇదీ నేను అని అచ్చేయలేదు.

ఏసుక్రీస్తు కథ ఒకటుంది. నేను బైబిల్ చదువుకోలేదు. విన్న కథే. ఒక వేశ్య మీద రాళ్లేయబోతున్న వాళ్లతో క్రీస్తు అన్నాడట ‘మీలో ఆ పాపం చేయని వారెవరో మొదటి రాయి విసరండి’ అని.

శ్రీశ్రీ విమర్శకులలో చాల‍ మందికి ఆయన మీద రాయి విసిరే కనీస హక్కు కూడా లేదు.

వీళ్ల గొప్పతనం ఒక్కటే. శ్రీశ్రీ వలె నిజాయితీగా చెప్పకపోవడం. ఎవరూ భుజాలు తడుముకోనక్కర్లేదు. ఈ మాట నేను ఏ ఒక్కరి గురించో అన‍డం లేదు. చాల‍ మంది గురించే అంటున్నాను. ఇది రాస్తున్న ఈ క్షణంలో చాల పేర్లు నా మనస్సులో తిరుగుతున్నాయి. వాళ్లు నా కన్న పెద్ద వాళ్లు, చిన్న వాళ్లున్నూ.  సో కాల్ద్ అగ్రవర్ణులూ, దళితులున్నూ. వాళ్ల సంగతి నాకు తెలుసు గాని, రుజువులు లేవు గనుక, రుజువులిచ్చే రుజువర్తన వారిలో లేదు గనుక… ఆ పేర్లిక్కడ చెప్పను.

శ్రీశ్రీని విమర్శించండి. వ్యక్తిగా కూడా విమర్శించండి.

అదే సమయంలో ‘అనంతం’ లోని మనిషి నిజాయితీని కించపరచొద్దు.

మనుషులు నిజాయితీగా మాట్లాడడాన్ని కొంచపరచొద్దు.  

‘అనంతం’లో అవన్నీ చెప్పాల్సింది కాదని, ఎడిట్ చేసుకోవాల్సిందని అనొద్దు. అలాంటి నిజాయితీ అందరిలో వర్ధిల్లాలని కోరుకుందాం. లేకుంటే అబద్ధం (హిపోక్రసీ) నుంచి మనకు విముక్తి లేదు. అబద్ధం నుంచి విముక్తి లేకుంటే కుల, వర్గ దోపిడీ నంచి విముక్తి లేదు.

వేమన కామి అయినా మహాకవేనంటే చాల మంది ఔనంటారు. శ్రీశ్రీ విషయంలోనూ ఈ కాలమానిక వర్తించాలి.

వాళ్ల కాలంలో వాళ్లు ఒక విలువను పాటించలేదని రంకెలెందుకు? మన కాలంలో మనం పాటిద్దాం ఆ విలువను. మనలో ఎవరైనా పాటించకపోతే, పాటించాలని వొత్తిడి తెద్దాం.

వేషాలేస్తే, వాళ్ల మాస్కులు చించేద్దాం.

14-5-2019

హెచ్చార్కె

12 comments

 • Hats off హెచ్చార్కె గారూ. అత్యద్భుతమైన వ్యాసం. Historical Materialism పూర్తిగా అర్థమై, దాన్ని సమాజానికి అన్వయించడంలో పూర్తి క్లారిటీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ వ్యాసం రాయగలరు.

 • మహా గా ఉంది వ్యాసం.
  అయినా నాకో డౌట్. అసలు లేని రాముడు లేని శంబకుణ్ణి చంపడమేమిటి. లేని లక్ష్మణుడు లేని సూర్పణక ముక్కు చెవులు కోయడమేమిటి. ఆ మాటలని దళిత మేధావులు పదే పదే ఉదహరించడమేమిటి ???.

 • శ్రీ శ్రీ జన్మదినోత్సవ సందర్బంగా ఆయన మీద అనవసరంగా లేవనెత్తిన విమర్శా చర్చలకు , భావాలకు , సరి అయినా జవాబు మంచి విశ్లేషణ . ఈ మాటలు “శ్రీశ్రీ చుట్టూ చెలరేగిన దుమారంలో రెండో సంగతి నైతికత. శ్రీశ్రీ వ్యభిచరించాడు. అలాంటి వాడు మహాకవి ఎలా అవుతాడు అని.

  ఈ విమర్శ శ్రీశ్రీ మీద తప్పక చేయాల్సిందే. చేశారు. చేస్తారు. అది మంచి పని.

  మహాకవి అని కాదు. ఏ మనిషి మీదైనా ఆ విమర్శ పెట్టాల్సిందే.

  కాని, శ్రీశ్రీ మీద పెడుతున్న ఈ న్యాయమైన విమర్శ ఇంకే కవి మీదైనా… ఏ పెద్ద, చిన్న కవి మీదైనా పెట్టగలరా?

  సమాధానం తెలిసిందే.

  పెట్టలేరు.

  ఎందుకంటే, ఇతర కవుల/రచయితల సంగతి మనకు తెలీదు. వాళ్ల ‘పాపాల చిఠాలు’ కర్ణాకర్ణిగా విన్నాం. అవి నిజమయినా, రుజువు చేయలేం.

  శ్రీశ్రీ విషయంలో రుజువు అనే సమస్యే లేదు. దానికి అయనే ప్రత్యక్ష సాక్షి. ‘మరణ వాంగ్మూలం’ వుంది. ‘అనంతం’ అనే తన పుస్తకంలో తానే రాశాడు. ఆ పుస్తకం తెలుగులో అద్వితీయం, మరి చాల వాటికి శ్రీశ్రీ అద్వితీయుడైనట్లే.

  శ్రీశ్రీ కాకుండా ఇంకెవరూ అలాంటి పుస్తకం రాయలేదు. రాసి తామేమిటో తామే చెప్పలేదు. చెప్పి ఇక విసరండి రాళ్లు, ఇదీ నేను అని అచ్చేయలేదు.” నాకు నచ్చాయి

 • Manchigaa విశ్లేషించారు
  Kavi mahaakaviyo kaado prajale నిర్ణయిస్తారు
  Vyakthi gata jeevithaallo evari bhaagothamemito athma vimarsha chesukovaali

 • శ్రీశ్రీ కి ఘనమైన నివాళి.
  నాకైతే రాసిందంతా ఏకీభావమే.
  నా భావం కూడా అదే.

 • శ్రీ శ్రీ పై ఈ మధ్య పడుతున్న రాళ్లని మీ వ్యాసం ద్వారా అద్భుతంగా ఏరి(ఒక్కొక్కరిని) పారేసిండ్రు.అయినా పోయిన వాళ్ల మీద వాదించడం వాళ్లకే చెల్లు….మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్….

 • బాగా రాశారు సార్.ఇప్పటికి ఒక కవి పేరు చెప్పమంటే భీముని భాగం శ్రీ శ్రీ పేరే చెబుతారు.అంత ఉంది ఆయన ప్రభావం.
  ఆయన పిడితుల గురించి రాశారు.అందులో
  ఆ కాలం నాటి సమాజం లో బాధితులు అందరూ ఉన్నట్టే.

  • ఎవర్నన్నా కవిత్వం చదువుతారా అనడిగితే ఆ మహ ప్రస్థానం నాకు ఇష్టమైన పుస్తకం సర్ అంటాడు ప్రతీ ఒక్కడూ…

   తెలుగు కవిత్వమింకా ఆయన గుమ్మం దగ్గరే పడిగాపులు కాస్తోందా అనేది నా అనుమానం గావొచ్చ్చేమో కానీ, అవాస్తవం కాబోదు.

 • ఒక ‘దుమారం’ మీద దుమారం మీద దుమారం!హింసనచణ, ధ్వంసరచన!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.