పైనాపిల్ జామ్

‘పైనాపిల్ జామ్ దొరుకుతుందా?’

‘చూస్తానుండండి’

షాపు లో ని వ్యక్తి వెతుకుతున్నాడు. పైన అరలో ఉన్నట్లుగా ఉంది. తీసి గుడ్డతో తుడిచాడు.

‘అయితే ఇంకా టైం ఉందో లేదో తెలియదు.చాలా రోజులైంది తెప్పించి’

‘సరిగా చూడండి. వారం నుంచి చాలా షాపులు తిరిగాను.’

‘మంచిదే. ఇంకా రెండేళ్ల టైం ఉంది. ఇవ్వనా?’

‘ఎంత?’

‘వంద రూపాయలు’. చేతిలోకి తీసుకున్నాడు ముసలాయన. చాలా సంతోషంగా తడిమి చూసుకున్నాడు. వాసన చూడ్డానికి మూత తీస్తే చక్కటి సీల్. లేత పసుపు రంగులో ముచ్చటైన చిన్న బాటిల్. సంతోషంగా సంచిలో పెట్టుకున్నాడు. ‘అసలే గుంతల రోడ్లు. జాగ్రత్తగా తీసుకెళ్లాలి’ అనుకుంటూ సైకిల్ హ్యాండిల్ కి తగిలించి మళ్ళీ సిట్టింగ్ రాడ్ కి మెలిక వేసాడు ఆ కాకీ సంచీని. రాత్రి ఏడవుతోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్న లైట్లను భరిస్తూ ఇంటి వైపు బయలుదేరాడు. ‘ఇవాళ తన పుట్టిన రోజు. నాకు ఏది గుర్తు ఉండదు అనుకుంటుంది. ఇన్నాళ్లయినా ఒక్క కోరికా కోరదు. కనీసం తనకి ఇష్టమైన పైనాపిల్ జామ్’. సంతోషంగా తనలో తాను మాట్లాడుకుంటుండగా సైకిల్ గుంటలోకి దిగింది. హ్యాండిల్ బార్ కు బాగానే తగిలింది సంచి. ఆపి సంచి తడిమి చూసుకున్నాడు. బానే ఉంది బాటిల్. గబగబా ఇల్లు చేరాడు. ‘ఈరోజు సర్ ప్రైజ్  చేస్తాను.’ స్నానం చేసి వచ్చేసరికి ఆమె టేబుల్ మీద డిన్నర్ కి సిద్ధం చేస్తోంది. ‘ఈరోజు నీకు ఇష్టమైనది తెచ్చాను, చూడు’ అన్నాడు చాలా హుషారుగా.

‘ఏమిటో అంత గుర్తుపెట్టుకుని తెచ్చింది?’

‘చూస్తే నీకే తెలుస్తుంది.’

నవ్వుతూ సంచీలోంచి మూత పట్టుకుని పైకి తీశాడు. సగానికి పగిలిన బాటిల్ బయటికి వచ్చింది. నివ్వెరపోతూ టేబుల్ మీద సంచీ పెట్టి లోపలికి చూశాడు. సంచీలో మిగిలిన సగం బాటిల్, గాజుపెంకులు అతుక్కున్న జామ్ వున్నాయి. నవ్వు మాయమైంది. ‘సారీ’ అన్నాడు నివ్వెరపోతూ.

 

ఆమె పక పకా నవ్వుతోంది.

‘నీకు షుగర్ వచ్చినప్పటి నుంచి నేను స్వీట్స్ తినడం మానేయడం  మర్చిపోయావు.’

ఇంకా నవ్వుతూనే ఉంది. నిస్సహాయంగా పెద్దాయన కుర్చీలో కూలబడ్డాడు. అతని దగ్గరికి వచ్చి ఆమె ఆయన తలను  దగ్గరగా తీసుకొని ముద్దాడింది.

‘వర్రీ అవకు. నువ్వు ఆరోగ్యంగా ఉండడమే 70 ఏళ్ల నా బర్త్ డే గిఫ్ట్’ అంది.

గద్గద స్వరంతో అన్నాడు ‘ హేపీ బర్త్ డే’. ఆ చేతుల స్పర్శ ఈ రోజెందుకో చాలా బాగుంది. ఇప్పుడు ఇద్దరికీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నై.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.