ఆధునిక మానవుడి
అంతిమయాత్రకు ముందు

1.
మనుషులెప్పుడో సచ్చిపోయిన్రు. ఇప్పుడు కదలాడుతున్నవన్నీ వాళ్ల నీడలే. నీడలంటే యాదికొచ్చింది…మాడుపలిగే ఎండపూట సెర్వులోని అలలు గట్లమీద గీస్తున్న సజీవచిత్రాలు ఎంత బాగుంటయో! చెరువుకోళ్లు వాటి ముక్కులతో పొడుత్తాంటె..ఎంత అబ్బురమో! సూపున్నోడి దునియానే వేరనిపిత్తది.
2.
గిజిగాని గూడు ఎంతందంగ వుంటదో కదా! చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలా ఎవ్వలకు అందకుంట దిగుడుబాయి లోపలికి తొంగిసూసుకుంట గాలి అలలకు ఉయ్యాలూగుకుంట శెప్పలేని సౌందర్య దృశ్యమది. మనసు కాన్వాసుపై అలా ముద్రించబడుతది స్పష్టంగా…
3.
సూరెంబడి చిటపట చినుకులు ముత్యాల్లా రాలి పడుతాంటె రెండు చిట్టి సేతుల్తో దోసిట్ల నింపుకుని సముద్రమంత సంబురం మోత్తానట్టనిపిత్తది. మొగులు కురవడం మానేశి ఏడు రంగుల చీరను ఆరేసుకునుడు జూశి గాల్లోకి ఎగురుతూ కేరింతలతో సప్పట్లు కొడుతూ వ్వాహ్ ..కోటికాంతుల నీలికళ్లు మిలమిల మెరిసినట్టుంటది. అందితేనా… ఏడురంగుల కొమ్మలెక్కి కోతి కొమ్మచ్చి ఆడేటోల్లమే!
4.
ఉహుహుహు…సలి.సలికి ఏడ గడ్డకట్టిపోతమోనని భయ్యం. బైటికత్తె సచ్చినట్టె ఇగంతోటి.అమ్మ కౌగిట్లో వెచ్చగ తల్కాయనటూ ఇటూ తిప్పుకుంట బిర్రుగ పట్టుకుని నిద్రలో ఓ కలల ప్రపంచం. నెగడు ముందు కూసోని ప్యాలాల జొన్నలేగిచ్చుకుంట బొడిగెల్ని పంటికిందేశి కట్టర కట్టర నములుకుంట కండ్లల్ల ఎర్రెర్రని కాంతులతో నులివెచ్చని సూర్యోదయాలు.
5.
సాయంత్రాలు అరుగుమీది ముచ్చట్లకు కరిగిపోతున్నప్పుడు అమ్మ జోలపాటలా రివ్వున వీచేగాలి స్పర్శకు కూర్పాట్లు పడుతున్న బాల్యం. నాయినమ్మ చెప్పే జానపథ కథలకు ఊ..కొడుతూ రెక్కల గుర్రంపై సవారీ జేసుకుంట ఊహల్లో అలా అలా సందమామ సంకెక్కి గోరుముద్దల తీపి రుశిని ఆస్వాదిస్తూ బతికిన గడియలు.
6.
ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసిన టీ.వీ తెరపై చీకటి దృశ్యంగా శేషమైన ఆధునిక మానవుడు శిథిలమవుతూ అస్పష్టంగా కదలాడుతున్న కాలపు వొడిలో దీర్ఘనిద్రలోకి జారుకుంటూ…

బండారి రాజకుమార్‍

బండారి రాజకుమార్: వరంగల్ రూరల్ జిల్లా పాతమగ్ధుంపురం స్వస్థలం.గరికపోస, నిప్పుమెరికెలు, గోస , వెలుతురు గబ్బిలం అనే 4 వచన కవితా సంపుటాలు ప్రచురించారు.

1 comment

  • ఏ పిచ్చితనం రా భై, ఇలా మాటాడితే మనసొప్పుకోదు. మనం జచ్చి చాల్రోజులైంది…నువ్ మళ్ళీ చెరువు ముక్కుతో గట్టుని పొడుస్తోంటే, గిజిగాడి గూడు మిఠాయ్ పొట్లామంటే ఎట్టా బతికేది.

    ఈ సమాధి నిద్ర బాగుంది. లేవకుండా కొన్ని మందు బిళ్ళలు మింగుతూ కూడా ! నువ్వే కంపెనీ నుండి ఊడిపడ్డావ్, కొత్త బైలాస్ రాసుకొస్తున్నావ్

    మమ్మల్నిట్టా ఏ కన్ఫ్యూషన్ లేకుండా బతకనీరా తమ్మీ ! గుండెని ముల్లుతో గెలకకు సుమీ ! ప్రేమా లేదు, మమతా లేదూ, ఈ నటన బాగుంది. ఇది సిల్వర్ స్క్రీమింగ్ !

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.