సాగిపో సాగిపో
అరుణోదయ గాయకా!

సాగిపో సాగిపో  సాగిపో ప్రజాకళాకారుడా
ఏలుకొనుము ఏలుకొనుము నూత్న ప్రజాసంస్కృతీ

తూర్పుదిక్కు అరుణారుణ కాంతులీనె చూడరా
రైతుకూలి కాడిగట్టి పొలం దిక్కు సాగెరా
ఫ్యాక్టరీలో పొగగొట్టం వేడిపొగలు చిమ్మెరా
జగమంతా నిదురలేచి అరుణోదయమాయెరా
సాగిపో సాగిపో సాగిపో ఇంక జాగు చేయకా
నీ కంజిర మ్రోతలకే శతృ గుండెలదరగా

నీ గళాన రవలించిన వీరగాధలను వినీ
కనుల నీరు దాచుకునీ కష్టజీవి జలదరించ
నీ పాటలు కలిగించే విశ్వాసమును గొనీ
అణగారిన జనం లేచి జబ్బ చరిచి నిలువగా
సాగిపో సాగిపో సాగిపో అరుణోదయ గాయకా
వినిపించుము వినిపించుము జనవిప్లవ గీతికా

నక్సల్బరి నిప్పురవ్వ నలు దిశలా పాకగా
శ్రీకాకుళ జనం పోరు సందేశము పంపగా
గోదావరిలోయ లోని గిరిసింహం లేవగా
సిరిసిల్లా జగిత్యాల కదం తొక్కి సాగగా
సాగిపో సాగిపో సాగిపో ఝంఝానిలోద్దీపకా
ప్రద్రర్శించు ప్రదర్శించు ప్రళయనృత్య నాటికా

వేనవేల వత్సరాల వక్రీకృత చరితలో
పండిత పరిషత్తుల పాము పడగ నీడలో
జనం పాట అణిగిమణిగి బ్రతుకునీడ్చుచుండెరా
జనం పాట జనం బాట వున్నతమని చాటరా
సాగిపో సాగిపో సాగిపో రణగీతా రచయితా
రచియించుము రచియించుము చావెరుగని కవితలన్

రామారావ్ జముకు మోగి కీర్తించిన బాటలో
పోట్టియార్, నేరూడా రక్తజ్వలిత గీతితో
పాల్ రాబ్సన్ వొణుకెరుగని నిర్భయమగు గొంతుతో
తంత్రి కలిపి అడుగు కలిపి గొంతు కలిపి సాగరా
సాగిపో సాగిపో సాగిపో ప్రజాకళాకారుడా
ఏలుకొనుము ఏలుకొనుము నూత్నప్రజా సంస్కృతీ

(‘రస్తా’ సంపుటి నుంచి,  రచయిత చేసిన రెండు మూడు మార్పులతో…)

హెచ్చార్కె

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.