మరికొన్ని రజనీ గేయాలు: రాజమకుటం

 రాజమకుటం చేజిక్కించుకోవటం కోసం స్వంత అన్న అయిన మహారాజును చంపించిన ప్రచండుడు  రాకుమారుణ్ణి పట్టాభిషేక సమయంలో విషప్రయోగంద్వారా అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నుతాడు.  వీరికుట్ర ముందే తెలుసుకున్న యువరాజు ప్రతాపుడు విషం వల్ల మతిభ్రమించిందని అందరినీ నమ్మించడానికి పిచ్చివాడిలా నటిస్తాడు.

ఈలోగా ప్రచండుడి దుర్మార్గానికి బలైపోయినవారి కుటుంబాలవారినుండి తిరుగుబాటు మొదలవుతుంది. కథానాయిక ప్రమీల ఈ ముఠాలో ముఖ్యసభ్యురాలు.   విద్రోహాన్ని అణీచివేయడానికి సైన్యం విఫలప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రచండుని కుమారుడు భజరంగుడు కూడా విద్రోహుల్ని పట్టుకోవటం కోసం అట్టహాసంగా సైన్యంతో బయల్దేరతాడు. విప్లవకారులు వినోదుల్లాగా వేషాలువేసుకుని అతన్ని మాయచేసి వారి వినోదప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. కోటలో ప్రవేశిస్తారు.  

సైన్యం జరిపిన దారుణాలన్నీ యువరాజు పేరుమీద జరిగేలా ప్రచండుడు చేయడం వల్ల విప్లవకారుల గురి రాకుమారుడు ప్రతాపుని మీద ఉంటుంది.  వినోద ప్రదర్శన సమయంలో అతన్ని సంహరించాలని వారి ఎత్తుగడ. ఈ సందర్భానికి ప్రమీల పాడినట్టుగా రజనీకాంతరావుగారు వ్రాసిన తమాషా మాటల పాట ‘ఠింగన ఠింగన ఢిల్లా’

ఠింగన ఠింగన డిల్లా
కొంగన్న ముక్కున జెల్లా
రంగు ఫిరాయించి భంగు బనాయించి కొంగు ఠలాయించి దొంగదారికొట్టె పిల్లా

కత్తికన్న కన్నువాడీ
కాలే అగ్నికన్న వేడీ
కల్తీ లేని టక్కులాడీ
కావాలంటే నీకు జోడీ
కల్లబొల్లి పాడి కిల్లాడి ఆటాడి వల్లో పట్టిందంటే కాలం మూడేరా నాకోడి

ఠింగన ఠింగన డిల్లా
కొంగన్న ముక్కున జెల్లా
రంగు ఫిరాయించి భంగు బనాయించి కొంగు ఠలాయించి దొంగదారికొట్టె పిల్లా
ఠింగన ఠింగన డిల్లా

పైపైన చూస్తే ప్రతాపుడిని మట్టుపెట్టడం ఉద్దేశంగనక అతన్నే పరోక్షంగా ఉద్దేశించి తికమక మాటలతో పాడిన పాటగా అనిపిస్తుంది. కానీ ఇది పాక్షిక సత్యం మాత్రమే.  

ఠింగన అంటే పొట్టివాడు అని అర్థం ఉంది. డిల్ల అంటే పిరికితనం. పిరికి పొట్టివాడు వాడు ఇక్కడ భజరంగడు.

(కొంగ జపం నటించి ఒడుపుగా జెల్లను పట్టుకున్నట్టు) కొంగన్న ముక్కున జెల్ల అంటే తనచేతికి చిక్కిన ప్రతాపుడు.

పల్లవి సింహాసనాలమీద కూర్చుని నాట్యం చూసున్న ఈ ఇద్దరినీ ఉద్దేశించినది.  

తాను వేషం మార్చి (రంగు ఫిరాయించి), మత్తెక్కించి (భంగు బనాయించి), కడకొంగు విసుర్లతో వాళ్ళను చిత్తుచేసి, వచ్చిన పిల్లనని చెప్తోంది. ఇక్కడ దొంగదారి, దారి కొట్టడం అన్న రెండు మాటలని కలిపి దొంగదారి కొట్టే పిల్ల అన్నారు రజని.  

ఆమె లెక్కలో యువరాజు తన అన్నను చంపించినవాడు. అలాంటివాడు కంటబడ్డాడు. అతని మీద పగ వల్ల తన కంటిచూపు కత్తి కన్నా పదునుగా, నిప్పు కన్నా వేడిగా ఉంది. తను కల్తీ లేని టక్కులాడి, ఈ క్షణంలో అతనికి సరైన జోడీ. తను ఆడేవి కల్లబొల్లి మాటలు కిల్లాడీ ఆటలు. తన వల్లో పడితే అతనికి కాలం మూడినట్టే.

పైన కొంగకు చిక్కిన చేపతో పోలిక, ఇక్కడ వలలో పడ్డ పక్షితో (కోడి) పోలిక గమనించండి. భావగర్భితమైన మాటలతో కూడిన పాట అని స్వయంగా రజని రాసారు ఈ పాట గురించి.

జిక్కీ అమోఘమైన కంఠంలో, రజని వరసతో, మాస్టర్ వేణు వాద్య సంయోజనంతో చూడ్డానికేగాక వినటానికి చాలా బాగుండే పాట ఇది.  సినిమా టైటిల్స్ లో రచన నాగరాజు అని ఉంటుంది. అది రజనీకాంతరావు బావగారు అయిన బుద్ధవరపు నాగరాజు గారి పేరు. తన పేరు వాడటం కుదరదు కాబట్టి ఆయన పేరు వాడారు రజని.

రాజమకుటం సినిమాలోని ‘ఊరేది పేరేది’, ‘ఠింగన ఠింగన’ పాటలు మాత్రమే తనవిగా రజని జ్ఞాపకం చేసుకున్నారు.

కానీ సినిమాలో నాగరాజు పేరుతో ‘అంబా జగదంబా’ అనే మరో పాట ఉంది. తను సినిమాకు వ్రాసిన కొన్ని పాటలు గుర్తు లేవని, కారణం అవి కుంతీదేవి కన్న కర్ణసంతానం వంటివని రజనీకాంతరావు వ్రాసారు.  బోనస్ గా ఆ కోవలోకి చేరే ఈ పాట కూడా చూడండి.

అంబా జగదంబా కరుణాలయ భవానీ
విజయ దాత్రీ చరాచర విశ్వనేత్రి
అంజలిదే జననీ  దేవీ ..

కంజదళాక్షి కామితదాయిని
కాళరాత్రి కరుణారసవాహినీ
అంజలిదే జననీ  దేవీ ..

మగువవనీ నా మనసే నీదని
మమ్మేలుదువని వేడుకొంటిని
విజయ సాధనకు వెడలిన నా ప్రియు
ప్రతిన ఫలింపగ పాలింపగదే
అంజలిదే జననీ  దేవీ ..

ఎంతో ప్రమాదంతో కూడుకున్న పనిమీద వెళ్ళిన ప్రియుడు క్షేమంగా రావాలని కోరుకుంటూ ప్రమీల కాళికా దేవిని ప్రార్థిస్తూ పాడే పాట ఇది.

ఇందులో కూడా మనం సామాన్యంగా చూడని కొన్ని మాటలు ఉన్నాయి.  విజయదాత్రి (ధాత్రి కాదు, దాత లాగా అన్నమాట), విశ్వనేత్రి మొదలైనవి.  

ఒక వింతైన ప్రయోగం, ‘ కాళరాత్రి కరుణ రసవాహిని’ అనడం.  కాళికాదేవిని కాళరాత్రి అన్నారా, లేక, ఈ కాళరాత్రిలో కరుణచూపే రసవాహిని అన్నారా అనే అందమైన సందేహం కలుగుతుంది.

అలాగే ‘మగువవని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకొంటిని’ అనడంలో స్త్రీ (ప్రమీల) హృదయక్షోభ సాటి స్త్రీ (జగదంబ) కే అర్థమవుతుంది అన్న అర్థం ఉంది. ఇది సినీ భక్తిపాటలలో అసామాన్యమైన ఆలోచనే.

సామరాగంలో శుద్ధ శాస్త్రీయ పద్ధతిలో స్వరపరిచిన ఈ పాట మధురమైనది. ఈపాట స్వరం కూడా రజనీ నాదమే అయి ఉండాలి. (ఈ పాట వింటే ప్రసిద్ధిగాంచిన మానస సంచరరే గుర్తుకొస్తుంది).

రజనీకాంతరావుగారి సినిమా పాటలు అరుదైనవి, అపురూపమైనదవి, అందమైనవి.  రాజమకుటం లో ఉన్న మూడూ సంగీత సాహిత్య పరంగా విభిన్నమైనవి. ఆయన సినిమాకు ఎక్కువ పనిచేయకపోవటంవల్ల మనం ఏమి పోగొట్టుకున్నామో ఈ పాటలు చెబుతాయి.  

ఈ వ్యాసాలలో సామాన్యంగా ఒకకవీ ఒకపాట మాత్రమే చూస్తూ వస్తున్నాం.  రాజమకుటం సినిమాలోని రజనీగేయాలన్నింటి గురించి వ్రాయాలనిపించింది అనేకంటే అవే నాతో వ్రాయించాయి అనడం ధర్మం.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.