నువ్వున్న ఇంటికి
టు లెట్ బోర్డు పెడితే…

ఇల్లు వెతికేటప్పుడు ‘tolet’ అని కనిపిస్తే చాలు ఎంతో ఆనందం. మరి అదే ‘tolet’ బోర్డు నీ ఇంటికే ఉంటే, ఆ పాటికి నీకింకో కిరాయిల్లు దొరక్కుంటే?

మనం ఎప్పుడైనా పెళ్లి కార్డు ఇవ్వడానికో లేదా ఇంకేదైనా పని మీద చాలా రోజుల తర్వాత చుట్టం  ఇంటికి పోయేటప్పుడు “వీళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కో ఇంట్లో ఉంటారురా, వీళ్ళ అడ్రస్ కనుక్కోవడం పెద్ద తలనొప్పి”

“హహ, అవును రా బాబు” అని నవ్వుతాడు మనతో ఉన్నోడు – ఇది ఒక నిమిషపు కాలక్షేపం మనకి

వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తాం. చాలా దీనంగా ఉంటాయి వాళ్ళ ముఖాలు. అయినా నవ్వుతూ ప్రశాంతత ప్రదర్శించే ప్రయత్నం. అటు ఇటు కదలరు కదిలితే ఇరుకు ఇల్లు అనే విషయం తెలిసిపోతుంది అని. టీ తీసుకొస్తానని లోపలికి పోబోతుంది ఆ ఇంటావిడ ఇంట్లో పాలు ఉన్నాయో లేవో అనే సందేహం వస్తుంది మనకు. ఇప్పుడే తాగేసి వస్తున్నాం అని అబద్ధం చెప్తాం. (అక్కడికేదో గొప్ప సాయం చేసినట్టు అలా అబద్దం చెప్పే ఆలోచన వచ్చినందుకు లోపల తెగ ఆనందపడిపోతుంటాం ఎంత మంచోడిని నేను అనుకుంటూ), ఇక  వెళ్ళొస్తాం అని లేచి బయదేరుతాం వాళ్ళు కూడా మనం పోతుంటే బైటికొచ్చి అలానే చూస్తూ నిలబడతారు. మన వీపు మీద డోర్ విసరరు. ‘పాపం రా, ఎం కష్టమొచ్చిందో అంత ఇబ్బందిగా, దిగులుగా ఉన్నారు’ అని అనగానే ‘అవును రా, పాపం’ అంటాడు మనతో వచ్చినోడు. ఇది తిరుగు ప్రయాణం లో ఓ నిమిషం కాలక్షేపం, అంతే. ఆ తరువాత ఎవరి జీవితాల్లోకి వాళ్ళు, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి సుఖాలు వాళ్ళవి. ఇలా ఎవరికి వారు వారి వారి జీవితాల్లో హాజరు వేసుకొని అలా కూర్చోవడమేనా జీవితం అంటే! వేరే వాళ్ళ జీవితాల్లో బతకడం కాదు, వారి జీవితల్లోకి వెళ్లి వారి ఆనందాలు, బాధలు పంచుకోవడమే కదా బతుకంటే? ఒక ఆకు జీవితంలో, పేదోడి జీవితంలో, ఉన్నోడు జీవితంలో, హంతకుడి జీవితంలో… ఇలా అందరి జీవితాల్లోకి దూరాలి. ఒక్క జన్మలోనే 100 బతుకులు బతకాలి. కానీ మనం ఈ పని చేయం. మనది మనం బతకడమే పెద్ద భారం. ఇందుకోసమే సాహిత్యం, సినిమా పుట్టింది. ఇతరుల బతుకులు ఎలా వుంటాయో చూయించడానికి, కొందరి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలియచేయడానికి తద్వారా జీవన విలువలు తెలియజేయడానికి, మనలో మానవత్వం నింపడానికి పుట్టినవి ఈ రెండు కళలు. కానీ మనం కామెడీ సినిమాలు, ఫైట్లు, ఎవరో కొందరు విచిత్రమైన వేశాలతో సృష్టిలో ఎవరికి సాధ్యం కాని శక్తులతో సృష్టినే కాపుడుతుంటే ఆ సినిమాకి(superhero సినిమా) 1000 రూపాయలు పెట్టి పోతాం. అయితే, ఒక జీవితాన్ని చూపించే వాస్తవిక కళాత్మక ధోరణులతో వచ్చిన సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కి కూడా నోచుకోలేవు మన దగ్గర. ఇక సాహిత్యం గురించి వదిలేయండి అది చదివే వాళ్ళు ఎవరున్నారు- రాసేవారే చదివేవాళ్ళు, చదివేవాళ్లే రాసేవారు. ఇదంతా రాయడానికి కారణం realistic సినిమాని ఒక జోకులా, ఒక నసలా జనాలు(చాలామంది) భావించడం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఇతరుల అభిప్రాయాల్ని మనం influence చేయకూడదు కానీ ఒక్క విషయం – ఒక వాస్తవిక సినిమా నేర్పినన్ని పాఠాలు మీ తల్లిదండ్రులు కూడా నేర్పలేరు. ‘టు లెట్’ సినిమా దర్శకుడు చెజియాన్ కూడా వాస్తవిక సినిమాలు ఇక్కడ అస్సలు చెల్లవు అంటాడు, నా సినిమాకి గనక ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డులు రాకపోయివుంటే ఈ సినిమాని ఒక్కరైనా చూసేవారా అని ప్రశ్నిస్తాడు ఒక ఇంటర్వ్యూలో. ఇక ఈ దర్శకుడు చెజియన్ గురించి ఏమని చెప్పాలి- బాలచందర్, బాలు మహేంద్ర ల ఆత్మలు ఇతనిలో చేరి ఈ సినిమా తీయించినట్టుగా ఉంటుంది ‘tolet’. అంత పర్ఫెక్ట్ గా తీశాడు చెజియన్. తమిళ్ సినిమాకి దొరికిన మరో ఆణిముత్యం.

2007లో కొత్త కొత్త మల్టి నేషనల్ కంపెనీలు, IT బూమ్ రావడం మూలాన మెట్రోసిటీ లో ఉండే జనాల లైఫ్ స్టైల్ మారిపోయింది దాని వల్ల కిరాయిలు, ధరలు అన్ని పెరిగిపోయాయి, ఎప్పుడు నిండుగా ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పర్సులు అన్నిటి ధరల్ని అమాంతంగా పెంచేసాయి, ఆ ప్రాంతాల్లో ఎప్పట్నుంచో బ్రతుకుతున్న మధ్యతరగతి కుటుంబాలు, కూలీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి, వాళ్ళు ఎప్పట్నుంచో వాడుతున్న వస్తువులు ఇప్పుడు కొనలేని పరిస్థితి,కొన్ని ఏళ్లుగా అదే ఇంట్లో కిరాయికి ఉంటున్న వాళ్ళకి వచ్చే నెల నుంచి కిరాయి పెరుగుతుంది అనే వార్తలు, అసలు ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు కిరాయికి దొరకడం ఎంత కష్టమైపోయిందో చూయించడమే ఈ సినిమా కథ.

తీసినప్పుడల్లా ‘కిర్..ర్ర్ ‘ అని శబ్దం చేసే చెక్క తలుపులు, కాస్త ఎత్తి మూస్తే తప్ప లాక్ నట్టులోకి దిగని బేడాలు, కట్టె పెట్టి తిప్పేంత వరకు లెట్రీన్ గుంటని బ్లాక్ చేసి దాచేసే నీళ్లు, ఎన్ని గుడ్డలు చుట్టినా కారుతూనేవుండే నల్లా, కీచ్ కీచ్ అంటూ ఇంట్లోకి బైటికి తిరిగే పిచ్చుక, ఏవేవో బొమ్మలు వేసి గోడ మొత్తం నింపేసే పిల్లాడు(కొడుకు), పిల్లాడు గీసిన చోటు చూసి తిట్టకుండా గీసిన బొమ్మని చూసి ఆనందించే అమ్మ నాన్న(అముద, ఇలాంగో) ఇది వాళ్ళ జీవితం, బయట మనం రోజు చూసే ఒక మధ్యతరగతి కుటుంబమే వీళ్ళది కూడా.

తలుపులు తీస్తూ మొదలవుతుంది సినిమా అప్పుడే బీచ్ కి వెళ్లి వస్తారు, తీసుకెళ్లింది దగ్గర్లో ఉండే తీరానికె అయినా తీసుకెళ్లినందుకు ఎంతో ఆనందపడుతుంది అముద(భార్య) కృతజ్ఞతలు కూడా చెప్తుంది భర్తకు, కుటుంబాన్ని బీచ్ కి తీసుకెళ్లడం చాలా మామూలు విషయమే కానీ మాములు విషయాలే జీవితం అయిపోయిన వాళ్ళకి అవే పెద్ద విషయాలు కదా (నిరీక్షణ సినిమాలో డైలాగ్)

ఇంట్లో దోశలు వేస్తుండగా ఓనర్ పిలుస్తుంది, సినిమాలో ఓనర్ పాత్ర  బయట చాలా మంది ఓనర్స్ కి ప్రతీకగా ఉంటుంది: నవ్వుతు మాట్లాడుతూనే అవమానించే ఓనర్, టెనెంట్స్ ని బానిసలా చూసే ఓనర్, నీళ్ళయిపోయాయి మోటార్ వేయండని చెప్పినప్పుడు గుడ్లెల్లబెట్టి ట్యాంక్ మొత్తం మనమే కాళీచేసినట్టు చూసే ఓనర్, బట్టలు అరేసినప్పుడు క్లిప్పులు దొంగలించే ఓనర్, బైటికెళ్లేటప్పుడు గేట్ బేడం వేస్తున్నామా లేదా అని తలుపు చాటుకు దాక్కొని చూసే ఓనర్. ఇలాంటి ఒక టిపికల్ ఇండియన్ ఓనర్ తను. అముద ని పిలిచి ఇల్లు కాళీ చేయమని చెప్తుంది ఇలాంగో కి. ఎం చేయాలో అర్థంకాని నిస్సహాయతలో కోర్టులో కేసు వేస్తా (ఏమి అర్థంకానప్పుడు వాడే వాక్యం) అంటాడు. పిచ్చా నీకు అని తిడుతుంది అతని భార్య. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టదు, అముద ఎం చేయాలో ఇలాంగో కి చెప్తుంది కానీ ఇలాంగో పట్టించుకోకపోవడంతో మేరీ మాత ను ప్రార్ధిస్తూ ఏడుస్తుంది. అముద చాలా ధైర్యవంతురాలు కానీ అవమానాన్ని అస్సలు భరించలేదు. అందుకే ఓనర్ ఇల్లు కాళీచేయమనడం తట్టుకోలేకపోతుంది తను.

తెల్లారి లేచి ఇల్లు వెతికే పని మీద పడతాడు ఇలాంగో. కిరాయి ఇల్లు వెతుక్కునే క్రమంలో వారికి ఎన్నో ఇబ్బందులు. ఎన్నో షరతులు, ఆంక్షలు ఎదురవుతాయి. కొన్ని సన్నివేశాలు ఇలా ఉంటాయి : గేట్ ముట్టకముందే బయటకు ఉరికొచ్చి ‘మాంసం తింటారా’ అని అడిగే బాపనాయన. మీరు హిందువులేగా? దేవుణ్ణి పూజిస్తారుగా? మరి నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావ్ ఇంకోసారి వేసుకోకు అని ఆంక్షలు పెట్టే ఇంకో పెద్దమనిషి. టీవీ సౌండ్ తక్కువ పెట్టుకోవాలని ఒకరు, సినిమా వాళ్ళకి ఇవ్వమని ఇంకొకరు….

ఒక ఓనర్ ఎలాంటి షరతులు పెట్టకుండా ఇల్లు చూసి రండి మీకు నచ్చితే వారంలో కాళీ చేయిస్తా అంటాడు, వీళ్ళు ఆ ఇంటికి వెళ్లి బయటే నిలబడి కిటికీలోంచి చూస్తారు: ముసలి దంపతులు, చెయ్యి విరిగి కట్టు కట్టుకొని కుర్చీలో కూర్చున్న ముసలాయన, గూని వల్ల వంగి నడుస్తూ అతనికి మందులిచ్చి నీళ్లు తాపిస్తూ అతని భార్య. ఇది చూసి ఏమి మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళు కనీసం ఇల్లు ఎలా ఉందో కూడా చూడరు. ఇల్లు కాళీ చేసే డెడ్ లైన్ దగ్గరికొచ్చింది. షరతులు లేకుండా బడ్జెట్లో ఇంకో ఇల్లు దొరికేలా లేదు, ఈ ఇల్లు తీసుకోవడం తప్పనిసరి వాళ్ళకి, అట్లాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కూడా ఆ ముసలి దంపతుల గురించి ఆలోచించి తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంత గొప్ప సన్నివేశం, ఎంత బాధాకర సన్నివేశం.

మన మనసు స్వచ్చంగా, మంచిగా ఉంటే అంతా మంచిగా కనిపిస్తుంది అని ఎవరో చెప్పారు. అతన్ని అస్సలు నమ్మకండి, అది పచ్చి అబద్ధం. మనసు మంచిదైతే నీకు కనిపించేవన్నీ వ్యధలే, మనుషుల ఇబ్బందులే, సమాజంలోని కనపడకుండా దాక్కున్న తప్పులే. నువ్వు సుఖంగా ఉంటే ప్రపంచం మొత్తం సుఖంగా ఉన్నట్టు భావించడం ఏమాత్రం రైటు?

కిరాయికి ఇల్లు దొరక్క పిచ్చోడిలా తిరుగుతుంటే పెద్ద సుత్తిలతో ఇల్లు కూలగొట్టడాన్ని ఎంతో కోపంగా, ఆక్రోశంతో, బాధగా, నిస్సహాయంగా చూస్తాయి ఇలాంగో కళ్ళు. అర్థంకాని ప్రశ్నలు, అర్థమేలేని ప్రశ్నలు ఆ చూపులో. మొదటి సినిమాలోనే అంత గొప్పగా ఎలా నటించగలిగాడో. ఊరంతా తిరిగినా ఒక్క ఇల్లు దొరకదు ఇక చేసేదేమీ లేక ఇప్పుడుంటున్న ఇంటికి వస్తే ‘tolet’ బోర్డు తగిలించి ఉంటుంది. పిల్లాడు అది చూసి నవ్వుతాడు, తల్లిదండ్రుల గుండెల్లో గుబులు ఆ tolet బోర్డు చూసి. ఆ బోర్డు చూసి ఇల్లు చూడడానికి వస్తారు జనాలు, వాళ్ళు వచ్చినప్పుడు తినడం మధ్యలో ఆపి గిన్నెలు మూలకు జరిపి, చొక్కా వేసుకొని మెతుకులు అంటుకున్న వేళ్ళని కనిపించకుండా దాచి ఓ మూలకి నిలబడి వాళ్ళకి పూర్తి స్వతంత్రం ఇస్తారు, వాళ్ళు అన్ని షెల్ఫు లని గెలుకుతారు సానిటరీ పాడ్స్ దాచుకున్న షెల్ఫ్ తో సహా. అముద ఏదో తప్పు చేసినట్టుగా తల కిందికేసి అవమానభారం మోస్తుంది.

ఇక ఇలాంగో personal జీవితానికి వస్తే -ఇతనొక సినీ ప్రేమికుడు సత్యజిత్ రే, రాబర్ట్ బ్రెస్సన్, కురోసవా వంటి ప్రపంచ దర్శకుల సినిమాలు చూస్తాడు. మామూలుగా ఈ దర్శకుల సినిమాలు చూసేవారందరిలో ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఉంటుంది: వాస్తవంలో ఎక్కువసేపు బతకలేకపోవడం, ఊహించుకునే ప్రపంచానికి వాస్తవిక ప్రపంచానికి ఏమాత్రం పొంతన ఉండకపోవడం వల్ల అంతా మాయలా అనిపిస్తుంది వాళ్ళకి. అయితే సినిమా మీద ఇంత ప్రేమ ఉన్న అతను పచ్చడి తయారుచేసే కంపెనీలకు advertisement లు రాయాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితులే వాళ్ళలో కాంప్లెక్స్ కి కారణాలు.

పచ్చళ్ళ యాడ్ షూటింగ్ జరిగుతుండగా అతని స్నేహితుడితో సంభాషణ ఇలా ఉంటుంది :

‘ఇల్లు దొరికిందా?’

‘లేదు, సినిమా ఫీల్డ్ అనగానే గెంటేస్తున్నారు’

సినిమా వాళ్ళని నమ్మి యాభై ఏళ్ళ ఈ రాష్ట్రాన్నే రాసిచ్చారు కానీ సినిమా వాడికి ఇల్లు కిరాయికి ఇవ్వరు, ఎంత విచిత్రం!, పది వేల కంటే ఎక్కువ కిరాయి ఉన్న ఇల్లైతే ఎలాంటి కండిషన్స్ పెట్టరు కానీ ఈ బడ్జెట్ ఇల్లు అంటేనే సవాలక్ష ప్రశ్నలేస్తారు, ఏంటో’ అని చెప్పి ఒక IT కంపెనీ ఐడీ కార్డ్ ఇస్తాడు. ఇది చూపిచ్చి ఎంప్లొయ్ అని చెప్పు ఇల్లు ఇస్తారు నాకు ఇలానే దొరికింది ఇల్లు అని భోదిస్తాడు.

‘ఒక్క రెండు గంటల సినిమా తీయడానికి ఇంకా ఎంత కాలం ఎదురుచూడాలి’ అని అడుగుతాడు ఇలాంగో

‘చూడాలి ఎంతకాలం అయినా ఎదురుచూడలి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ, కోపం ఇవే ఒక కళాకారుడికి ముడిసరుకు. ఏ కష్టమైనా ఎంతో కాలం ఉండదు, ఏ నిమిషాన్ని వదలకు ఇదంతా కథలా ఎలా మార్చాలనేదే ఆలోచించు.’ అంటాడు స్నేహితుడు.

అతని చుట్టు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సిన్సియర్ (ఈ పదం వాడడానికి కారణం మీకు సినిమా చూసినప్పుడు అర్ధమవుతుంది) గా ఒక స్క్రిప్ట్ రాసి నిర్మాతని ఒప్పించగలుగుతాడు కానీ ఆ నిర్మాత స్క్రిప్ట్ కి మాత్రమే ఒప్పుకుంటాడు ఇతనికి కాదు, ఒక 50000 లు ఇస్తాను స్క్రిప్ట్ ని నాకు అమ్మేసెయ్ అంటాడు. ఏమి తోచని పరిస్థితి అతనిది. ‘యాభై వేలు తీసుకోని ఇంటి సమస్యలు చక్కబెట్టుకోనా? అమ్ముకోవడానికా ఇన్నాళ్ల నుంచి కష్టపడి రాసింది? ఇది అమ్ముకుంటే నాకు ఇంకో కథ రాసే ధైర్యం వస్తుందా?’ ఇలాంగో బుర్రలో ఈ ప్రశ్నలన్నీ చిందరవందరగా తిరుగుతుండగా కరెంటు వస్తుంది. ఆన్ చేసే ఉన్న ఫ్యాన్ ‘గువ్వ్..వ్’ అని నెమ్మదిగా తిరుగుతుండగా లేచి ఫ్యాన్ బంజేయబోతాడు. అప్పటికే ఆ ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్న పిచ్చుక.. రెక్కలు రాలి కింద పడిపోతుంటాయి, తల పట్టుకొని మధనపడుతుంటాడు. పక్షిలా స్వతంత్రంగా ఎగిరే నేను ఈ ప్రేమ, పెళ్లి, సంసారంలో పడి ఈ పక్షిలాగే రెక్కలు తెంచుకున్నానా! నన్ను స్వతంత్రంగా ఎగిరేలా చేసిన ఈ సినిమా కలని తుడిచేసానా అనట్టుగా తల పట్టుకుని బాధపడుతుంటాడు, అప్పుడే భార్య వచ్చి ఖర్చులు, లెక్కలు చెబుతుంది. అప్పటికే దీర్ఘాలోచనలో పడి తిక్కగా ఉన్న అతనికి అముద చెప్పేదంతా తలనొప్పిగా తోస్తుంది. అతని చేతగానితనాన్ని, అసమర్థతని ఎత్తిచూపుతుందని అనిపించి కోపం తెచ్చుకుంటాడు, ఒక క్షణం ఆమె చెప్పేది కరెక్టే కదా అనిపిస్తుంది. కోపం ఇంకా పెరిగిపోతోంది. అప్పుడు అతను అందరిలాగే(టిపికల్ తెలుగు భర్త) భార్యని కొడతాడు. అతనిలో ఉన్న ఆలోచనల్ని దారి మళ్ళించే పని అది, దానికి ‘ఆమె’ బలి.

చివరికి 3500 అనుకున్న బడ్జెట్ కాస్తా 6000 అవుతుంది. ఒక IT ఉద్యోగి అని అబద్ధం చెప్తే కానీ ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఆ తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆంక్షలు, ఎన్ని ప్రశ్నలు. చివరికి ఇల్లు దొరుకుతుందా వాళ్ళకి?

మీరు సినిమా చూస్తారు అన్న నమ్మకంతో నేను క్లైమాక్స్ గురించి రాయటం లేదు.అయినా క్లైమాక్స్ లో ప్లాట్ ట్విస్టులు పెట్టి కథని తిరగల మరగల చేసే సన్నివేశాలు ఏమి ఉండవు. ఇదొక జీవితం, మీ జీవితం ఎలా సాగుతుందో అలానే కాకపోతే మీ అంత సాఫీగా సాగకపోవచ్చు. మీ అనందం కోసం కథ క్లైమాక్స్ రాయటం లేదు. ఇక చివరిగా యాక్టర్స్ గురించి చెప్పాలంటే – వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు బతుకుతుంటే ఎక్కడో దాక్కొని దర్శకుడు చిత్రికరించారేమో అనుకునేంత గొప్పగా నటించారు అందరూ.

‘నాన్న, ఈ టీవీ మనదేనా?’

‘హ, మనదే’

‘మరి ఆ బండి?’

‘అది కూడా మనదే’

‘మరి ఈ ఇల్లు మాత్రం మనదెందుకు కాదు?’.

(సమీక్షలో ‘మీ’ అని వాడిన ప్రతిసారి నేను ఉద్దేశించేది realistic సినిమాలని ద్వేషించే కమర్షియల్ సినిమా ప్రియులని).

డేగల‍ హిమసాయి

Degala Himasai is from Suryapet of Nalgoinda district, Telengana. He lives in Hyderabad now. Describes himself as ‘employed at Wandering in the abandoned places’. He is already known to Rastha readers after his free translation of Chekhov’s Short story as ‘thummu’ and also his review of the movie ‘Pick packet’. This, he says is one of his first attempts in writing fiction in English.

2 comments

  • ఈ దర్శకుడి alter ego కథానాయకుడి లో వుంది. కోల్కతా ఫిల్మ్ ఫెస్టవల్ లో ఈ సినిమా చూశాను రెండేళ్ల క్రితం. దర్శకుడు చెలియన్ వచ్చాడు. ఆయన ఎన్నెన్నో బెంగాలీ సినిమాల స్క్రిప్టులు తమిళంలోకి అనువాదం చేశాడట! మీ సమీక్ష అతని కృషికి న్యాయం చేసింది. ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.