అమర ప్రేమకు చివరి పరీక్ష ‘అమోర్’

ది పారిస్ లోని ఒక ఎగువ మధ్యతరగతి అపార్ట్మెంట్ భవనం. ఒక అపార్ట్మెంట్ నుండి అసహజ దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు కలిసి వచ్చి తలుపులు విరగ్గొట్టి సోదా చేస్తారు. పడక గది మంచం మీద  పువ్వులతో అందంగా అలంకరించిన ముసలావిడ ఏనా (ఇమ్మాన్యూల్ రివా) మృతదేహం కన్పిస్తుంది వారికి.

సినిమా కథ ప్రారంభ సన్నివేశానికి ముందు కొన్నినెలలు వెనక్కి వెళుతుంది. అది సంగీత విద్వాంసుల కుటుంబం. ఎనభైలలో వున్న ఏనా, ఆమె భర్త జార్జెస్ (జీన్-లూయిస్ త్రింతినా) పదవీ విరమణ పొందిన పియానో ఉపాధ్యాయులు. ఆ రోజు  ఏనా పూర్వవిద్యార్థి అలెగ్జాండర్ కచేరి. ఆ వృద్ధ ప్రేమ జంట ఆ కన్సర్ట్లో పాల్గొంటారు. ఆ ప్రియశిష్యుడు వారికి కృతఙ్ఞతలు చెప్పి, వారి నివాసానికి వస్తానని వాగ్దానం చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే వారి అపార్ట్మెంట్లోకి దొంగలు ప్రవేశించే విఫలయత్నం చేశారన్న సూచనలు కనిపిస్తాయి. ‘ఈ రోజు నువ్వు అందంగా కన్పిస్తున్నావ’ని చెప్పి ఆమె దృష్టి మళ్ళించడానికి ప్రయత్నిస్తాడు భర్త. అది అనవసరపు పొగడ్త అని కూడా అనలేము. మనసులు, అభిరుచులు కలిసి జీవితాంతం అన్యోన్యంగా కలిసున్న అమరప్రేమికులు వారు. అతడికి ఆమె సదా అందంగానే కన్పిస్తుంది. ‘జీవితంలోని మధుర క్షణాలు నెమరువేసుకోగలిగితే వృద్ధాప్యం భారం కాకుండా వుంటుంది’ అనంటాడు తర్కింగ్టన్. కానీ ఆ ప్రేమికులు ఎనభయ్యో వడిలో కూడా మధురక్షణాల కొనసాగింపులోనే వున్నారు. జీవితానికో స్పష్టమైన గిరిగీసుకుని, ఒకరికొకరు తోడుంటే చాలు ఎవరిమీదా ఆధారపడకుండా బతికేయగలమన్న ఆత్మవిశ్వాసం వారిది. వారి కుమార్తె ఇవా కూడా మ్యూజిక్ టీచరే. ఒక బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకుని వేరేచోట వుంటుంది. కూతురి మీద కూడా ఆధారపడకూడదన్నది వారి నిర్ణయం.  

ఒకరోజు అల్పాహారం తింటుండగా ఏనాకి స్ట్రోక్ వస్తుంది. మాటలేవీ విన్పించనట్టు నిశ్చేష్టంగా ఉండిపోతుంది. కొద్దిసేపట్లో కోలుకుంటుంది. కానీ కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో గుర్తురాదు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. తల్లి ఆసుపత్రిలో వుండగా ఇవా తండ్రితో కలుస్తుంది. ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగడంలేదని ఆమె సంభాషణ ద్వారా తెలుస్తుంది. అమ్మ సంగతేమిటని అడిగితే – ‘ఆమె కరోటిడ్ ధమనిలో వున్న బ్లాకేజిని శస్త్రచికిత్స చేసి తొలగించాలి’ అని చెబుతాడు తండ్రి. ఇంటి దగ్గర సంరక్షణ ఎలా అని అడిగితే, ‘నర్సును పెడతాను, లేదా నేనే చూసుకుంటాను’ అని చెబుతాడు. ‘మీ దాంపత్య జీవితాన్ని దగ్గరగా చూసిన దాన్ని. నాకా భరోసా వుంది’ అని బదులిస్తుంది ఇవా. శస్త్రచికిత్స విఫలం కావడంతో కుడి భాగమంతా పక్షవాతానికి గురై వీల్ చైరుకు అతుక్కుపోతుంది ఏనా. సహజంగా డాక్టర్లంటే ఇష్టముండదు ఆమెకు. ‘మరోమారు ఆసుపత్రికి తీసుకువెళ్లరని మాటివ్వండి’ అంటుంది భర్తకు. ఒప్పుకుంటాడు భర్త. తనకే ఊతం వుంటే బాగున్ననిపించే వయసులో అతడు ఆమెకు అన్నీ తనే అయి, బాత్రూంకి తీసుకెళ్లడం దగ్గర్నించి చిన్నపిల్లకు చేసినట్టు శ్రద్ధగా సపర్యలు చేస్తుంటాడు. ఏనాకు ఇది ఏ మాత్రం  నచ్చడం లేదు. ఏది వద్దనుకుందో అదే జరిగింది. తను భర్తకు గుదిబండలా మరానని బాధపడుతుంది. ఒక రోజు కిటికీ నుండి కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి వ్యర్ధప్రయత్నం చేస్తుంది. ఆమెకు ధైర్యం చెపుతాడు జార్జెస్. కానీ అరుదైన సందర్భాల్లో అతడి చిరాకు ప్రకటితమైపోతుంటుంది.

ఓ రోజు మాజీ విద్యార్థి అలెగ్జాండర్ వారింటికి వస్తాడు. తనకేమీ కానట్టు, తన పరిస్థితి తాత్కాలికమే అన్నట్టు హుందాగా నటిస్తుంది ఏనా. పియానోపై తనకిష్టమైన ట్యూన్ వేయమని శిష్యుడికి అభ్యర్దిస్తుంది. త్వరలోనే ఆమెకు మరో స్ట్రోక్ వస్తుంది. దాంతో ఆమెకు మతిభ్రంశంతో పాటు మాటతడబడుతుంది. ఏం చెబుతుందో అర్ధం కాకుండా ఎదో గొణుగుతుంది. ఆమెను ఆ స్థితిలో చూడడం చాలా కష్టంగా వుంటుంది జార్జెస్ కు.

వారానికి మూడు రోజులు నర్సును ఏర్పాటుచేస్తాడు. అవాంఛిత అతిథిలా కుమార్తె వస్తుంది. ‘అమ్మను ఈ స్థితికి ఎలా తెచ్చావ్?’ అని నిలదీస్తుంది. ఆసుపత్రిలో అడ్మిట్ చేయమని గొడవ చేస్తుంది. ‘ఆసుపత్రికి పంపనని మీ అమ్మకు మాటిచ్చాను. మాట తప్పలేను’ అని తెగేసి చెబుతాడు జార్జెస్. అమ్మ బాధ్యత నాకు వొదిలేయ్ అని చెప్పే ధైర్యం కూడా లేదు కుమార్తెకు. మరో నర్సును నియమిస్తాడు, కానీ ఆమె తన భార్యతో దురుసుగా ప్రవర్తించిందని ఆమెను వెంటనే తొలగించేస్తాడు.

రోజులు గడుస్తుంటాయి. ఏనా పరిస్థితి మరింత దిగాజారుతూనే వుంది. ఏనా ఆలోచన ఏమిటో, ఆమె దీనమైన చూపులకు అర్ధమేమిటో తెలీదు. భోజనం పెడితే తినదు. తిండి మానేసి చావాలనుకుంటుందా? మంచి నీళ్లిస్తే వుమ్మేస్తుంది. కోపం వచ్చి చెంప చెళ్ళనిపిస్తాడు. మళ్ళీ బాధపడతాడు. ఏనా మోహంలో తేజస్సు తగ్గింది. జార్జెస్‌ కూడా బాగా అలసిన వాడిలా, ముసలాడిలా కనిపిస్తున్నాడు. క్షణమొక యుగంగా గడుస్తోంది. నరకం కళ్లముందు కనిపిస్తోంది. తన ప్రియాతిప్రియ భార్యకు ఈ క్షోభ ఇంకెంతకాలం? విముక్తి మార్గమేమిటి?

ఒకరోజు జార్జెస్ ఏనా పడక పక్కనే కూర్చుని తన చిన్ననాటి కథ చెబుతూ ఆమెకు శాంతపరుస్తాడు. ఆమె నిద్రలోకి వెళుతుందనగా ఒక దిండుతో ముఖాన్ని అదిమిపట్టి ఆమెను చంపేస్తాడు. బజారు నుండి అందమైన పుష్ప గుచ్చాలు తెస్తాడు. అన్నిటినీ చక్కగా నీళ్ళలో కడిగి కత్తిరిస్తాడు. వార్డ్రోబ్ నుండి ఏనా కోసం అందమైన డ్రెస్ ఎంచుకుంటాడు. తన గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఒక పొడవైన లేఖరాస్తాడు. తనను వెక్కిరించడానికా అన్నట్టు వచ్చిన పావురాన్ని పట్టుకుని కూడా చంపకుండా వదిలేశానని ఉత్తరంలో రాస్తాడు. ఇంతలో వంటగదిలో గిన్నెలు కడుగుతున్న చప్పుడు! ఈ సమయంలో ఎవరబ్బా అని లోపలికెళ్ళి చూస్తే భార్య గిన్నెలు కడుగుతూ, ‘బయటకు వెళ్ళాలిగా? కోటు వేసుకుని తయారై రండి” అంటుంది! ఆమె వెనకాలే తను బయటికి నడుస్తాడు. ఆఖరి దృశ్యంలో వారి కుమార్తె ఇవా ఆ అపార్ట్ మెంట్లో ఒంటరిగా కూర్చుని ఒక అమరప్రేమ జంటకి సాక్ష్యంగా నిలిచిన ఆ గదిని కలయజూస్తుంది.

కథలో చెప్పే అంశాన్నీ, పాత్రదారుల మనోగతాన్ని వివరించేలా వుంటుంది సినిమా చిత్రీకరణ అంతా. ఆ అపార్టుమెంటే వృద్ధ జంట ప్రపంచం! కాబట్టి ఆ అపార్ట్ మెంట్ దృక్కోణం నుంచే సినిమా అంతా సాగుతుంది. కెమెరా అపార్ట్ మెంట్ లోపలి భాగంలోనే తిష్టవేసి వుంటుంది. పోలీసులను, వేరే కేర్టేకర్లనూ బయటినుండి లోపలి వస్తున్నట్టు చూపుతుంది. అలానే బయటికి వెళ్ళే పాత్రదారులను కూడా లోపల్నుంచి బయటికి వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఆఖరు దృశ్యంలో వారి కుమార్తె కూడా ఒక గదిలో కూర్చిని అపార్ట్ మెంట్ మొత్తాన్ని పరికించి చూస్తుంది. గదుల్లో వుండే హీనమైన వెలుతురు వారి ప్రస్తుత జీవితదశకు అద్దం పడుతుంది. ఒక కిటికీ ఆ మాత్రం తెరుచుకుంటే అందులోంచి కొంచెం వెలుతురుతో పాటు ఒక పావురం లోపలికి ప్రవేశిస్తుంది. తమ ప్రపంచంలోకి పావురం కూడా నిషేధమే! తమదైన ప్రైవసీ, తమదైన స్వేచ్ఛ కావాలి వారికి. సొంత కూతురు కూడా అనావశ్యక అతిథిగా కన్పిస్తుంది వారికి. పావురం సినిమా ఆఖర్లో మరోసారి వచ్చినపుడు, దాన్ని పట్టుకోడానికి ముసలి భర్త కసితో ప్రయత్నించడం అతడి మన:స్థితిని వర్ణిస్తుంది. పగటి పూట కూడా కిటికీల్లోంచి బయటికి తొంగిచూసే ప్రయత్నం చేయదు దారియుస్ ఖొండ్జీ కెమెరా. పాత్రదారుల క్లోజప్ దృశ్యాలు ఇది వారి సినిమానే అనీ, వారి కథే అనీ చెప్పకనే చెబుతాయి. ఆఖర్లో వారి కుమార్తెను లాంగ్ షాట్లో చూపుతారు. దానర్ధం ఆమె తన తలిదండ్రుల ప్రణయగాధకు మూడోవ్యక్తిగా నెమరువేసుకుంటుందని చెప్పడానికే! ఇది మ్యూజిక్ టీచర్ల కథ అయినా పాత్రల మనోదశ రీత్యా నేపథ్య సంగీతం వినిపించదు. షాకిచ్చే ముగింపు తర్వాత మౌనంగానే ఎండ్ క్రెడిట్స్ పైకి లేస్తాయి.

తమ ఇంట్లోని ముసలి అవ్వ తనకు స్వేచ్చామృత్యువు ప్రసాదించమని ప్రాధేయపడిందనీ, ఆమె కథ ప్రేరణతోనే ఈ సినిమా తీసినట్టు చెప్పాడు దర్శకుడు మైఖేల్ హనీకే. ఈ ఆస్ట్రియన్ చిత్రనిర్మాత రచించి, దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ సినిమా ‘అమోర్’. వృద్ధ జంటగా నటించిన వారిద్దరూ ఫ్రెంచి సినిమాకు సుపరిచితులే. మొదట్లో వీరు వొప్పుకోలేదు. కానీ స్క్రిప్టు విన్నాక సరేనన్నారు. నటీనటులు తమ కళ్ళతోనే ఎన్నో భావాలు వ్యక్తపరిచారు. ఈ సినిమా 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డి ఓర్ గెలిచింది. 85 వ అకాడెమి పురస్కారాలలో అత్యుత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. 85 ఏళ్ల వయస్సులో, ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా అవార్డుతో రికార్డు సృష్టించింది ఎమ్మాన్యులె రివా. నాలుగు యూరోపియన్ ఫిల్మ్ అవార్డులు, మూడు నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ పురస్కారాలు, రెండు బాఫ్టా అవార్డులు దక్కించుకుంది ఈ సినిమా. ‘ప్రేమ – జీవితం- వృద్ధాప్యం- మరణం’ అనే విషయాలపై తాత్వికమైన ఆలోచనలు రేపిన ఈ సినిమా 21 వ శతాబ్దం నాటి 42 వ అత్యుత్తమ చలనచిత్రంగా గౌరవం దక్కించుకుంది.

దరకుడు మైఖేల్ హెనెక్

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.