ఒక్క ఆశ!

అయ్యా కాయలన్నీబండికెత్తాను. ఒక్క కాయ ఇయ్యయ్యా. శ్రీకాంత్ వాళ్ళు ఫ్రిజ్ తెచ్చారంట.  ముక్కలు కోసి దానిలో పెట్టుకుని తింటే చల్లగా బాగుంటయ్యంట. ఒక కాయ నానా ప్లీజ్.’ పదోసారి అడుగుతున్నాడు శీనుగాడు శంకరయ్యని.

ఒకటే గోల పొద్దుగాల నుంచి. కొన్న యాబై కాయల్లో దెబ్బ తగిలి ఐదు పగిలినాయి. మిగిలిన కాయలన్నీ అక్కడే పడు న్నాయ్. నిన్నా బండెయ్య లేదు. ఇయ్యాలన్నా ఎయ్యకుంటే డబ్బులెట్లా. ఇయ్యాల బేరం బాగుంటే రేపిత్తాలే.’

ఒక్క కాయిత్తె నీ పున్నెమేం పోద్ది. సిన్నపిల్ల గాడు అడుగుతుంటే పొద్దుగాల నుంచి.’

నాన్నా  ఒక్కటే ఒకటి ప్లీజ్.’ శీనుగాడి కళ్ళల్లో నీళ్ళు. వాడి దోస్తుకిచ్చిన మాట పోతోందని వాడి బెంగ.

బేరం బాగుంటే రేపు అన్నానా. ఇరవై  ఇయ్యాల ఇరవై ఐదు  రేపు. ఎండా బాగుంది. బేరం గట్టిగా ఉంటే రేపు సినిమాకే తీసికెల్తా. సరేనా.’

సినిమా వద్దు నాకు కాయే కావాలిమారాం చేస్తున్న సీనిగాడిని అదిలించి  తలకు గుడ్డ చుట్టి  నీళ్ల సీసా బండికి తగిలించి బయలుదేరాడు. ఎండ విరగ్గాస్తోంది. స్కూళ్ల దగ్గర, కాలేజ్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ సెంటర్ లో మార్చి మార్చి తిరిగి అమ్ముతున్నాడు. మూడు గంటల కల్లా కాలేజీలు ఉండే సెంటర్ దగ్గరికి చేరాడు. పరీక్షలకు పిల్లల్ని దింపడానికి వచ్చిన వాళ్లంతా ఉన్నారు. ఎండ ఇంకాసేపుంటే ముక్కలన్నీ అయిపోతాయి. కాసేపట్లో పరీక్ష అయిపోతుంది. ఏడు కాయలైపోయాయి. ఇంకో ఐదు ఈజీగా తెగుతై. పక్కనే ఉన్న సోడా బండి దగ్గర గోలీ సోడా కొట్టించాడు. తను ఎప్పుడూ తన ముక్కలు తినకపోయినా గోలి సోడా మాత్రం చాలాసార్లు తాగుతాడు. హాయిగా ఉంది. పిల్లలు బయటకు వస్తున్నారు. సీనిగాడంత వాళ్ళే.

బాబు, రండి చల్లటి పుచ్చకాయ ముక్కలు.’ అరుస్తుండగా మెల్లగా గాలి తిరిగింది. అనుకోకుండా సన్నగా తుంపర. ‘రండి బాబు రండిపిలుస్తున్నాడు. గాలి పెరుగుతోంది. వాన తుంపరలు పెద్దవౌతున్నై.‘తూ దీనమ్మ వాన టయానికి…’ పెద్దవాళ్లంతా పిల్లల్ని తీసుకుని బయలు దేరుతున్నారు. వాన జోరందుకు  గాలి ఊపందుకుంది. బండిని పక్కకు లాగి  పట్టా కప్పి చక్రాల దగ్గర ఇటికరాయి పెట్టి టీ బంకు దగ్గరకు చేరాడు. హోరు గాలికి చెట్లు ఊగిపోతున్నై. కళ్ళెత్తి చూడలేకపోతున్నాడు. గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి. పుచ్చకాయల బరువుకి బండి ఊగి ఊగి రాయి తప్పించుకు పక్కకి జరిగింది. గాలి తోసుకు పోతోంది. బండి వెనకే పరిగెడుతున్నాడు. అందుకోలేక పోతున్నాడు. బండి అడ్డం తిరిగి ఆటోను కొట్టుకు పక్కకు పడింది. కాయలన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి. లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, గాలి! కాయలన్నీ చెదిరి ముక్కలై రోడ్డంతా చితికి ఎర్రగా నీళ్లు. తెరలు తెరలుగా వస్తున్న గాలిలో శీనుగాడి మాటలు, కన్నీళ్లు విన వస్తున్నై. ‘ఒక్క కాయ నాన్న ఒకటే ప్లీజ్అంటూ. జేబులో తడిసిన నోట్లు నవ్వుతున్నట్లున్నై. బయటి వాన వెలిసింది. బండిని లేపుకుంటున్న శంకరయ్య గుండెల్లో ఇంకా ఉరుముతూనే ఉంది. 

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

6 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.