తోబా టేక్ సింగ్, 2016

కె. సచ్చిదానందన్

(మలయాళమూలం: కె. సచ్చిదానందన్. ఆంగ్లానువాదం: కె. సచ్చిదానందన్. ఇది ఆంగ్లం నుండి తెలుగు)

(సాదత్ హసన్ మంటో రాసిన ప్రసిద్ధ కథ తోబా టేక్ సింగ్ ను స్మరిస్తూ రాసిన కవిత యిది. భారతదేశ విభజన జరిగినప్పుడు ఒక శరణాలయంలోని పిచ్చివాళ్లను ఇండియాకూ పాకిస్థాన్ కూ కేటాయిస్తుంటే, ఒక పిచ్చివాడు రెండు దేశాల సరిహద్దులైన ముళ్లకంచెల మధ్య ఉండటాన్ని ఎంచుకుంటాడు. ఇదీ ఆ కథ.)

నా పేరు: ఉన్మాది
పుట్టడానికి పూర్వం నేను ఏ దేశంలో
పుట్టాలనుకుంటున్నానో ఎవ్వరూ అడగలేదు నన్ను
మీరిప్పుడు నా తల దగ్గర తుపాకీ పెట్టి
జన్మభూమి స్వర్గం లాంటిదనీ
దాన్ని నేను ప్రేమించాలనీ అంటున్నారు

అయ్యా!
మురికికాలువ దగ్గర నివసించే అనాథబాలుడు
తన మురికికాలువ ఏ దేశానికి చెందిందో పట్టించుకుంటాడా?
బిచ్చగత్తె తన వీధి ఏ దేశానిదో లక్ష్యపెడుతుందా?
అయ్యా!
తన పేరు జనాభా జాబితాలో గాని
వోటర్ల లిస్టులో గాని లేనివానికి
తన దేశం ఏదనేది ముఖ్యమా?

నా తల్లెవరో నాకు తెలియనప్పటికీ
నేను వందే మాతరం పాడుతాను సార్ 1.
ఆ సుజలాలనూ సుఫలాలనూ వర్ణించి
నన్ను బెదరగొట్టకండి సార్.
నేను తినే కుళ్లిన పండ్లనూ
ప్రాణం నిలుపుకునేందుకు తాగే
గొట్టపు నీళ్లనూ నిస్సందేహంగా మీరు సూచించడం లేదు
అని నేనంటే ఏమంటారు మీరు?

సార్, నేను ఏ ప్రదేశానికీ చెందనివాణ్ని.
మీ సరిహద్దుల దగ్గర పహరా కాస్తున్నందుకు
నాకెవ్వరూ డబ్బివ్వటం లేదు

నేను దేశద్రోహిని సార్
కృతజ్ఞత చూపని ఈ దేశం కోసం
జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక మూర్ఖుణ్ని
ఏ పిస్తోలుతోనైతే చంపారో
అదే పిస్తోలుతో అంతం చెయ్యండి నన్ను 2

నా మాంసాన్నీ రక్తాన్నీ
పస్తులుంటున్న నా సోదరికి
పంపటం మరచిపోకండి

నా దేశవాసులారా!
నా మృతదేహాన్ని ప్రజల దర్శనంకోసం పెట్టకండి దయచేసి.
ఒక దేశం ఒక శవం చుట్టూ తిరగడం
ఏమంత కమనీయ దృశ్యం కాదు

నా కళ్లను ఒక అనాథబాలునికి దానం చెయ్యండి
అతడు పెరిగి పెద్దవాడై
మీ మురికి ద్వేషం అంటని సౌహార్ద స్వర్గాన్ని
నా కళ్లతో దర్శించనివ్వండి

వందే మాతరం! మాతను కీర్తించు!

  1. వందే మాతరం (మాతను కీర్తించు) భారతదేశంలో జాతీయ ఉత్సవాలప్పుడు పాడే    దేశభక్తిగీతం. మన జన్మభూమిలో సుజలాలు, సుఫలాలు (మధురమైన జలాలు, ఫలాలు) ఉన్నట్టు ఆ పాటలో చెప్పబడింది.
  2. ముస్లిములను ద్వేషించే హిందుత్వ భావజాలాన్ని కలిగిన నాథూరాం గోడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన ఉదంతానికి సంబంధించినది. 

(ఈ రచన శీర్షిక మీది ఫోటో: సాదత్ మంటో)

ఎలనాగ

ఎలనాగ: అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. కరీంనగర్ జిల్లా, ఎలగందుల లో పుట్టారు (1953).
వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టరైనా ప్రాక్టీసు చెయ్యటం లేదు. సాహితీ వ్యాసంగమే వ్యాపకం. మొదలు నైజీరియాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో పని చేసి, 2012 లో రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ. చాల కథలు, కవిత్వం అనువాదాలు చేశారు. వివిధ రచయితల కవితలు, కథలు, సాహితీవ్యాసాలను ఆంగ్లం నుంచి తెలుగు కూడా చేశారు. సొంతంగా చాల కవిత్వం రాశారు. వీరి గళ్ళ నుడికట్టు ప్రసిద్ధం. చాల బహిమతులు కూడా పొందారు.

4 comments

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.