నా ‘విపశ్యన’ ధ్యాన
మార్గంబెట్టిదనిన…1

పదేళ్ళ క్రితం మా ఊళ్ళో దీపావళి సంబరాలలో  మా బుడ్డోడు డ్యాన్స్ చేస్తాడని తీసుకొళ్ళా. ఇంకా టయిం అవకపోవడంతో అమ్మలక్కలందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నాది సరికొత్త మొఖం.. ఒకరిద్దరి వైపు చూసి చిరునవ్వు  నవ్వి కలుపుకుందామంటే, వాళ్ళందరూ ఒకరికొకరు బాగా పరిచయస్తులు. వాళ్ళల్లో వాళ్ళు బోలెడు కబుర్లు చెప్పుకుంటూ గల గలా మాట్లాడేస్తున్నారు. పలకరిద్దామనుకున్న నన్ను పెద్దగా  పట్టించుకోలేదు. పలకకపోతె మానె గానీ చాలా కాలానికి అలా గలగలలాడే మాటలు వినడం ఎంత బాగుందో. మాటల్లో రాణీ గారని ఒకావిడ ‘విపశ్యన’ కి వెళ్ళొచ్చానని దాని వివరాలు చెప్తుంటే వివశనై విన్నాను. అప్పటి నుంచీ జీవితం లో ఒక్కసారైనా అక్కడికెళ్ళాలని కోరిక పుట్టింది. ఆ రోజు విన్న వివరాలను బట్టి మా  టొరంటో పరిసర ప్రాంతాల్లోనే ఇంటికి దాదాపు 100 కిలో మీటర్ల దూరం లో బ్యారీ అనే ఊరిలో ఉంది. అది పూర్తి రెండు వారాల లెక్క.

నాకు 2 వారాల సెలవు ఉంటుంది యాడాదికి. కానీ సంవత్సరం మొదట్లోనో మధ్యలోనో సెలవు వాడేసుకున్నాక నాన్నకో అత్తయ్యకో నన్ను చూడాలనిపిస్తేనో! వారికేదయినా అనారోగ్యం అనిపించి నాకు వాళ్ళని చూడాలనిపిస్తేనో!! అమ్మొ వాళ్ళకన్నా ఎక్కువేముంది.  అని ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం సెలవులని డిసెంబరు దాకా దాచేదాన్ని. వాళ్ళతో రోజూ మాట్లాడుతుండేదాన్ని…మేము దేశానికి కొత్త కాబట్టి వాళ్ళు మా కష్టాలు అర్థం చేసుకుని “మేము బానే ఉన్నాము, నువ్వు ఆదరాబాదరా పిల్లలని వదిలి మా కోసం పరుగులు పెట్టే పనులు పెట్టుకోకు, మాకిక్కడ అందరూ ఉన్నారు, పిల్లలని బాగా చూసుకో చాలు’ అనేవారు. డిసెంబరు లోపు సెలవులు తీసుకోకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చివరలో అప్పుడో సగం పూట ఇప్పుడో సగం పూట ఆ సెలవులన్నీ ఆదరా బాదరా వాడేసుకోవడం సరిపోయింది.. ఇంటి దగ్గర పెద్దవాళ్ళని పెట్టుకుని ఈ రెండు వారాల సెలవుతో ఆట గదరా శివా ఆట గద కేశవా.. కదా….అందుచేత పైన అనుకున్నవన్నీ కంఫర్టబుల్ గా మరిచిపొయ్యా..

క్రిందటేడు “అమ్మా లేదు నాన్నా లేడు అత్తా లేదు మామా లేడు ఏక్ నిరంజన్” అన్నట్టు అనాధనయ్యాకా ఎందుకొ హెడ్డులొ నెప్పి మొదలయ్యింది. దానికి తో డు, కాస్త తిక్క పిచ్చీ వంటివి కూడా  అంటాయని మా పురజనుల ఉవాచ. హెడ్డూ లేదు గుడ్డూ లేదని తీసిపడేసినా నేనున్నానంటూ సతాయించి పడేసింది. మైగ్రెయిన్ అంటారొకరు, మతిమరుపు అంటారొకరు. బ్రెయిన్ ఉందంటారొకరు అసలు మిస్స్ అయిందేమో అంటారింకొకరు.. వాళ్ళిచ్చిన మందులు మాకులు ఏవీ పని చెయ్యలేదు. అప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు; విపశ్యన కి వెళ్ళకపోయారూ; అన్నారు అంతే.. నా దోస్తు శ్రీవాణి తో కలిసి విపశ్యన కి అప్లై చేశా…అబ్బో  అదంత వీజీగా అందే పండు కాదు. కానీ అది రానప్పుడల్లా వెళ్ళాలని తాపత్రయం అధికం అయ్యింది. చాలా సార్లు రాలేదు.. పదే పదే ప్రయత్నిస్తూ ‘నాకు హెడ్డులో నెప్పి ఉంది.. మీ వల్ల అది ఎక్కువయితా ఉండాది. ఇస్తే ఇయ్యుర్రి లేకుంటె పొర్రి. యాంది మీ యవ్వారమని’ అప్లికేషన్ లో దులిపి పడేశా (నాకంత సీన్ లేదని మీకు తెలుసని నాకు తెలుసుగానీ.. అట్టా గొప్పగ సెప్పుకుంటాంటే మంచిగ్గొడతదబ్బా..)….వెంటనే రమ్మనేశారు. కానీ నా వైద్యునితో ‘ఈ వైద్యం నాకు అవసరమేనని అక్కడికొచ్చాక నా తిక్క వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగించననీ’ సంతకం పెట్టించుకు రమ్మన్నారు. అయ్యా బాబూ అని కాళ్ళా వేళ్ళా పడదామంటే చేతికి గ్లవ్సూ కాళ్ళకి సాక్సూ ఉన్నాయి… బతిమాలి బామాలి, డబ్బు చెల్లించి (లంచం కాదులెండి.. మెడికల్ లెటర్ కి ఫీస్ ఉంటుంది) ఒక ఉత్తరం పుచ్చుకుని ఆఫీసుకెళ్ళా. ఈ ఉత్థరం చూపిస్తే దెబ్బకి సెలవిస్తారని నిండా ఆశమనకి !!!

పేరుకి నాలాగే చార్టర్డ్ అక్కవుంటెంట్ అయినా అవసరమైన చదువులు చదివడానికి ఓపిక అయిపోయిన మా బాసిణి ఇంటికి పొయ్యాక ప్రతి రోజు హిందీ సీరియల్సే కాకుండా క్రయిం పెట్రోల్ లాంటి విషపూరితాలు చూసి చూసి ఉందేమో,…”ఆశారాం బాపూ నించి నిత్యానంద స్వామి వరకు చూసేశాను. ఆశ్రమాలు గీశ్రమాలు జాంతా నై.. మత్తు మందు ఇచ్చి నిన్ను ఎవరికో కూలి పని చెయ్యడానికి అమ్మేస్తారు, నేను పంపను ఫో” అంది. “చీ కూలి పనెందుకు చేస్తా.. రిచ్చీ గా అక్కవుంటెన్ట్ పని అడుగుతాలే”  అన్నా.. “జోకులొద్దు మంత్ ఎండ్ కూడా ఉంది అసలు పంపను గాక పంపను” అంది. “కాదబ్బా కెనడా డే సెలవు కదా.. ఆ రోజు పగలూ రాత్రీ కూడా ఆఫీసుకొచ్చి మర్నాడు నువ్వొచ్చేలోపు పనంతా పూర్తి చేస్తాగా “అని ప్రామిస్ చేశా కామ్ గా.. ‘ఇదో ఇదే నాకు నచ్చనిది. నేను ఇర్రిటేట్ అయినప్పుడు నువ్వు కామ్ గా ఉంటావు అదే నాకు నచ్చదు. ఇప్పుడు ఈ మెడిటేషన్ లూ అవీ చేసొచ్చి నువ్వు ఇంకా శాంతం గా ఉంటే నాకు ఇర్రిటేషనొస్తుంది.. నేను పంపే ప్రశ్నే లేదు ‘ అంది..”ప్రామిస్ అబ్బా వచ్చాక నీకంటే గాట్టిగా అరుస్తా.. కనిపించిన వాళ్ళందరినీ తిట్టిపోస్తా, నీకు ఎవరెవరిమీద కోపముందో చెప్పు వాళ్ళందరినీ కరుస్తా చరుస్తా.. నా తల్లివి కదూ” అని బతిమాలా.. .. ‘చస్తే ఇవ్వను’ పొమ్మంది.. నేను చివరి అస్త్రం గా  వైద్య మైదానం (medical ground) పెట్టేసి’ ఇప్పుడేమంటావ్’ అని కళ్ళెగరేసా.. కోపం గా ఒక చూపు చూసి.. ’10 రోజులు మాట్లాడకుండా ఉంటే చస్తావు. 4 గంటలని లేచి ధ్యానం చెయ్యడమేంటి నా మొహం.. నేను టికెట్ కొనిస్తా కానీ 4 రోజులు బహమాస్ కో బీచీకో పొయ్యిరా” అంది..పట్టువదలని విక్రమార్కి లా నేను నా వైద్యుడిచ్చిన కాగితం పట్టుకుని మాటా పలుకూ లేకుండా నించున్నా.. “నీ చావు నువ్వు చావు ఎవరి ఖర్మకి ఎవరు బాధ్యులు” అని వెకేషన్ మీద సంతకం పడేసింది విసుగ్గా…!! మెడికల్ లెటర్ తో పాటు సెలవు చీటీ కూడా విపశ్యన అధికారులకి పంపించేశా హడావిడిలో. దాంతో వాళ్ళకి నేనేంటో నా యవ్వారమేంటో బాగానే తెలిసిపోయినట్టుంది..

మరునాడే ప్రయాణము. 10 రోజులు కనబడను కాబాట్టి బాధ్యతలప్పగించే వారికి అప్పగించడాలు.. రాత్రి 2 వరకు ఆఫీస్ లో ఉండి పని పూర్తి చెయ్యడాలు అన్నీ అయ్యాయి కానీ 10 రోజులు ఉతుకుళ్ళు కడుగుళ్ళు లేకుండా బట్టలు అవీ తెచ్చుకోమన్నారు కదా, ఆ పని మాత్రం అవ్వలేదు. ఆఫీసు నించి ఇంటికొచ్చేటప్పటికి 2.30. ఇంక ఓపిక లేదు బట్టలే కదా పొద్దున్నే లేచి చూసుకోవచ్చు 12 దాటాక కదా బయల్దేరేది అని 3 గంటలకి పడుకుండిపొయ్యా..

పొద్దున్న ఉలిక్కిపడి లేస్తే 6 అయ్యింది..అదేంటి సీతయ్య  తెల్లారి 5 కి లేవాలే అని ఖంగారు.. లేపేసా.. చాలా కూల్ గా ‘ఇవ్వాళ వర్క్ ఫ్రం హోం’ అన్నారు.. నాకు గుండెల్లో రైళ్ళు, కార్ లూ , స్పీద్ బోట్లూ అన్నీ పరిగెత్తాయి..అసలు నా ప్లాన్ వేరు. షార్ట్ కట్ గా ఒక టిఫినీ బాక్స్ లో టిఫినీ పెట్టేసి ఆయన్ని తోలిచ్చేద్దారి. పిల్లలెలగూ ఏది పెట్టేస్తే అది తినేస్తారు. వాషింగ్ మిషన్ లో 10 రోజులకి సరిపడే బట్టలు పడేసి,  ఇల్లు గిల్లు (గిల్లు అంటే స్నానాల గదులు వగైరా) క్లీన్ చెయ్యడానికి వీజీగా 3 గంటల పైన పడుతుంది. ఇంకో గంట స్నానం పానం, ఇంకో గంటలో ఉతి కిన బట్టలు మడతలు పెట్టి అన్నీ సర్దుకోవచ్చు అనుకున్నా.. పూర్తి కంఫ్యూషన్.

‘అబ్బా! ఈనేంటిలా ఇంటికాడికెంచి పని అని ఝలకిచ్చాడు. ఈ లెక్కన  ఇప్పుడు నాస్తా, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వండాలన్నమాట… చీ పాడుబతుకు ఒక్కటయినా అనుకున్నవి అనుకున్నట్టు జరగవు’ అని నిట్టూరుస్తూ లేచా కానీ మనసు మనసులో లేదు. పోనీలే పొయ్యేది పొయ్యెలిగించడానికైతే నుయ్యిమీద బియ్యమెందుకూ అనుకుంటూ. (ఈ సామెతేంటని మీరు ఖంగు తిన్నారు కదా… ఏమో నాకూ తెల్దు.. అలా వచ్చేసిందంతే!!!  .. బాగుందని ఉంచేసా.. మీకు నచ్చితే నా పేరు చెప్పుకుని వాడేసుకోంది.. ఫ్రీ నే )ఎలాగోలా అన్నీ అయ్యాయనిపించి.. కొద్దో గొప్పో మర్చిపోకుండా అన్నీ పెట్టుకుని పెద్దోడు దింపేస్తే అక్కడికి చేరి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా..

నాకసలే  అసహ్యమెక్కువ…ఫ్రీ గా ఇస్తామంటున్నారు రూం లు ఎలా ఉంటాయోనని అనుకుంటూ వెళ్ళా.. నీట్ గా ఉంది రూం.. బాత్రూం తలుపు తీసి భయం గా చూశా.. పువ్వులా ఉంది.. హమ్మయ్య అనుకుని సామాన్లు పెట్టేసి నిర్ణీత సమయానికి వాళ్ళు రమ్మన్నచోటికి వెళ్ళా… 55  మంది ఆడవాళ్ళు 40 మంది మగవాళ్ళు ఉన్నారక్కడ.. 25 నించి 35 లోపు వాళ్ళు 75% ఉండడం నాకు పరమ విస్మయాన్ని కలగజేసింది.. …

వారు నిర్దేశించిన ప్రకారము 95 మంది విద్యార్థులు మరియు వాలంటీర్ లు 5 గురు అందరం వంటగది ముందర నించున్నాము.  అడవి ప్రాంతం కదా, ఎప్పుడూ రుచి చూడనట్టు దోమలు రక్తాన్ని పీల్చేస్తున్నాయి. అక్కడ ఉన్నవారందరూ కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నట్టు వాటిని టపా టపా అని కొడుతూ హత్యలు చేసేస్తున్నారు.. ఆర్గనైజర్ అందరి వైపూ చూసి.. ‘అమ్మలారా అయ్యాలారా… ఇక్కడ అహింస మొదటి సూత్రము. దయచేసి ఈ నిమిషం నించీ జంతు హింస నిషేధించండి. దోమలని సుకుమారంగా అలా బుజ్జగించి వీవెన విసిరినట్టు విసరండి అవి ఎంతో పుణ్యం చేసుకున్నాయి కనక ఇక్కడ పుట్టాయి. అవి కారణ జన్ములు. వచ్చే జన్మలో ఇక్కడ తపమాచరించాలని కోరికతో ఇక్కడ పుట్టాయి’ అని చెప్పారు… వార్నాయనోయ్. ‘వీటిని బుజ్జగించాలా నా తల్లా’ అన్నట్టు చూశారు అందరూ. ‘అలాగే పాములు, జింకలు, కొండొకచో భల్లూకాలు, నెమళ్ళు, తేళ్ళు కనిపించవచ్చు, వాటిని సున్నితం గా ‘పో అమ్మా పోయిరా’ అనండి కానీ మందలించవద్దు.. మిమ్మల్ని అందరూ ఎలా గౌరవించాలనుకుంటారో వాటినీ అలానే గౌరవించండి’ అని చెప్పగానే నాకు గుండె గుబగుబలాడింది.. కొద్దిగా తిండి పెట్టి (అదొక్కరోజే సాయంత్రం భోజనం పెడతారు..) 6 గంటలకల్లా మవునంగా ధ్యాన మందిరం కి వెళ్ళమన్నారు..

                        (అదిగో అప్పుడే ఎక్కడికీ..ఇంకా చాలా ఉంది.. ..)

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

7 comments

 • హాస్య నాటికలు మీరు రాసినట్లు పరిచయంలో చదివాను. దయచేసి నాకు మెయిల్ చేయగలరా…
  డా.ఎం.హరికిషన్ , కర్నూల్.
  Mail: drmharikishan@rediffmail. కం
  విపశ్యన ధ్యానం పది రోజుల కిందట మా శ్రీమతి వెళ్లి వచ్చింది. ఆమె చెప్పినది మరలా చదువుతున్నట్లు అనిపిస్తూ ఉంది.

 • విపాసన యోగా నీలాంటి కర్మయోగులకు కావాలా నిజంగా! ఏది ఏమయినా నీ బిజీ ష్కెడ్యూల్స్ నుంచి విముక్తురాలవయి బ్రేక్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది లక్ష్మి.

 • చాలా బాగుంది లక్ష్మి గారూ.అయితే ఇది నిజంగా అనుభవమౌనో కాదో గాని, అనుభవంగా చదువరులని నమ్మించారు.అభినందనలు.

 • పుర్తిగా చదివాక నీకోసంగతి చెప్పాలి– అందుకే సశేసం హహ్ అహహ్ అహహ్

 • అద్భుతం..చించేశారు..మీ రస్తా మరి వదలకుండా..చివరి వరకు మీతో నడిచేసి..నాకు ప్రస్తుతం అపశ్య అయిన ఆ విపశ్య న..మీ ద్వారా ఔపోసన పట్టేయలనున్నంత జోష్ వచ్చేసి..
  వేరే పని చేయటానికి లేచి వెళ్లి వచ్చేసరికి..పోయింది..ఎప్పటి లాగే ..ఏ జోష్ నాలో ఎక్కువ సేపు ఉండవు కదా..

 • మీరు వెళ్లిన దారి వెంట పరుగులు పెట్టిస్తున్నారు లక్ష్మి గారు …
  విపశ్యన ధ్యానం నిజంగా చక్కటి మార్గం ..

 • Lakshmi! మీరు రాసినది దేనిగురించి,ఏమిటి అని తెలియక చదవటానికి ప్రారంభంచేశాను. దృశ్యమై కళ్ళముందు కదులుతూపోయింది.ఎక్కడినుంచి వచ్చింది ఈ శక్తి, ఈ ఓపిక అని ఆశ్చర్యం! కళ్ళకు కట్టినట్లు రాశారు. !!! Next episode కు వేచివున్న!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.