పర్యావరణ రక్షణకై
భవిష్యత్తు విజ్ఞాపన

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం పెరుగుతూ భూకంపాలు, కార్చిచ్చులు ( వైల్డ్ ఫైర్స్), తుపాన్లు, వరదలు, టొర్నడోలు   పెరుగుతుంటే, మరోవైపు అత్యధిక దేశాల్లో రైట్ వింగ్ శక్తులు అధికారంలోకి వస్తున్నాయి.

తూర్పు దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘ఇదాయ్’ తుపాను తాకిడి నుంచి ఇంకా కోలుకోనేలేదు, నెల తిరిగే సరికి ‘కెన్నెత్’ అనే మరో తుపాన్ విరుచుకపడింది. ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలోని  మిడ్ వెస్ట్ రాష్ట్రాల్లో సంభవించిన టొర్నెడోలు, తుపాన్లతో అనేక ఇళ్లు, ఆఫీసు భవనాలు కుప్పకులాయి. 100 డిగ్రీల (ఫారెన్ హీట్) అధిక వేడి నమోదు కావడంతో పాటు అధికంగా వానలు పడి పొలాల్లో పంటలు కూడా పాడయ్యాయి. మిసిసిపి నదికి అంతరాయం లేకుండా వరదలు  ముంచెత్తుతున్నాయి. ఈ మే నెలలో 7 రాష్ట్రాల్లో 500 టొర్నెడోలు సంభవించినట్టు వాతావరణ వార్తలు తెలియజేస్తున్నాయి.  

‘’భూగోళం తగలబడిపోతున్నది. మా  పోరాటంతో ఫైర్ అలార్మ్ మోగిస్తున్నాం” అంటున్నారు ‘ఎక్సెటెంక్షన్ రెబలియన్లు’.

మార్చ్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా స్కూలు విద్యార్థులు క్లైమేట్ ఛేంజ్ (పర్యావరణం మార్పుల) కు నిరసనగా సమ్మె చేశారు. విద్యార్థుల సమ్మెకు కొనసాగింపుగా లండన్ లో ‘ఎక్సెటెంక్షన్ రెబలియన్లు’ ఏప్రిల్ 15 నుంచి పది రోజుల పాటు అహింసా యుత మార్గంలో శాసనోల్లంగనం చేయడం ద్వారా

నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రోడ్లకు అడ్డంగా పడుకొని, పాటలు పాడుతూ కొందరు, అక్కడే వండుకుంటూ, తినుకొంటూ మరికొందరు. కొందరు బ్రిటీష్ ట్రెజరీ ద్వారాలకు తమను తాము గ్లూ తో అతికించుకున్నారు. మరికొందరు లండన్ స్టాక్ ఎక్సెంజ్ కి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు తలుపులకు గ్లూతో అతికించుకున్నారు. ఎవరికి ఎలా అనిపిస్తే అలా చేశారు. ఫిల్ కింగ్ స్టన్ అనే పెద్దాయన ట్రైన్ రూఫ్  ఎక్కి తన 83 వ జన్మదినం జరుపుకుంటూ ఇలా సెలవిచ్చాడు “ఈ భూమిని మనం సొంతం చేసుకోలేం. భూమిని ఆస్తిగా భావించడం మన దౌర్భగ్యం. దీనివల్ల చాలా హాని జరిగింది. జరుగుతోంది. ఇప్పటికే భూమి నుంచి చాలా చాలా డబ్బు సంపాదించాం. పైగా ఇదే జీవితమార్గమని చెప్పుతున్నాం. కాదు ఇది మరణానికి మార్గం. ఇప్పటికే భూమి నుంచి చాలా వెలికితీశాం. భవిషత్తరాలకు ఏమి మిగల్చలేదు. ఇప్పటికైనా దీన్ని ఆపేద్దాం వచ్చే తరాల కోసం.‘’

బైటాయింపుల వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని, అనేక రకాల వ్యాపార లావాదేవీలు స్తంభిస్తున్నాయని   ప్రతి రోజు వేలాది మందిని అరెస్ట్ చేసినట్టు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే రోజుల్లో ఆస్ట్రేలియా, యు.కె. ఐర్లాండ్, కెనడా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, కొలంబియా, న్యూజిలాండ్ లలో, అమెరికాలోని న్యూయార్క్ లో అహింసా యుతంగా శాసనోల్లంగనం రూపంలో నిరసన ప్రదర్శనలు, బైటాయింపులు జరిగాయి. న్యూయార్క్ సిటీలో గ్రీన్ న్యూ డీల్ ను సమర్థిస్తూ రోడ్ల మీద నిరసన ప్రదర్శన నిర్వహించగా అనేక మంది అరెస్ట్ అయ్యారు. ‘ఎక్సెటెంక్షన్ రెబలియన్ల’ 10 రోజుల పోరాటాల ఫలితంగా ఏప్రిల్ 29న. లేబర్ పార్టీ నాయకుడు జర్మీ కార్బిన్ కోరికపై… యు.కె. పార్లమెంటు క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

అమెరికాలో ‘భవిషత్ తరాల నుంచి సందేశం, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ తో కలిసి’ (A Message from the Future with AOC) అని ‘గ్రీన్ న్యూడీల్’ వీడియో ఒకటి విడుదల అయింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకుంటూ హరితాన్ని (గ్రీన్) పెంచుకుంటూ ఉద్యోగ అవకాశాల్ని పెంచుకుంటూ పోవచ్చని బొమ్మలు గీస్తూ చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో చాలా పెద్ద సందేశాన్ని ఈ వీడియోలో రూపొందించారు.  ఫిల్మ్ మేకర్, యాక్టివిస్ట్ నోమి క్లైన్ ( Naomi klein) గ్రీన్ న్యూడీల్ ప్రాముఖ్యాన్ని పిల్లలకు వివరిస్తున్నట్లు ఈ బొమ్మల చిత్రం వీడియోను విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ మెంబర్ అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ (ఏఓసి) దీనికి స్క్రిప్ట్ రాయడమే గాక వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. ప్రముఖ ఆర్టిస్ట్ మొలీ క్రాబపిల్ బొమ్మలు గీసింది. ఇప్పుడు ఈ వీడియో అమెరికా అంతటా వైరల్ అయింది.

ఇక ‘ది గార్డెన్’ ఒక అడుగు ముందుకేసి రోజు రాసే వాతావరణ వార్తల్లో భాగంగా కార్బన్ లెవెల్స్ కూడా ప్రకటిస్తూ ఉంటామని చెప్పుకుంది.

గత వారంలో యూరో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అనేక దేశాల్లో రైట్ వింగ్ మెజారిటీ సాధించింది, జర్మనీలో గ్రీన్ పార్టీ రెండో స్థానం కైవసం చేసుకుంది. ఫిన్ లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్ లలో కూడా గ్రీన్ పార్టీ గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించడం ద్వారా యురో పార్లమెంటులో ఉనికిని చాటుకుంది. స్వీడిష్ పర్యావరణ యాక్టివిస్ట్ గ్రెటా థున్బర్గ్ స్ఫూర్తితో జర్మనీలో కూడా లక్షలాది మంది విద్యార్థులు పర్యావరణ సమస్యలపై 22 వారాలుగా సమ్మె చేస్తున్నారు. యూరో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో జర్మనీలో గ్రీన్ పార్టీ రెండోస్థానంలో గెలుపొందడానికి ప్రధాన కారణం పర్యావరణం సంక్షోభంపై పోరాడుతున్న విద్యార్థులే.

వాతావరణం మారిపోతోందని విజ్ఞాన శాస్త్రం (సైన్స్) చెబుతున్నా కొందరు మూర్ఖంగా తిరస్కరించడం చూస్తున్నాం. తిరస్కరించడంలో వారికి సొంతలాభాలున్నాయనేది తెలిసిందే. ఇటీవల మరణించిన పోలీ హిగ్గిన్స్ అనే బ్రిటీష్ బారిష్టర్ పర్యావరణ విధ్వంసాన్ని(ecocide) ఒక మేజర్ అంతర్జాతీయ నేరంగా గుర్తించాలని కోర్టులను, ప్రభుత్వాలను కోరుతూ ప్రచారం చేశారు. మారణహోమం (genocide), యుద్ధ నేరాలతో సమంగా ఎకోసైడ్ (ecocide)ను పరిగణించాలని, దీనికి బాధ్యులైన సి ఇ ఓ లను, డైరెక్టర్లను, మంత్రులను, ప్రభుత్వ అధినేతలను  ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో విచారించాలని ఆయన అనేవారు.

నేటి యువతరం, విద్యార్థిలోకం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి సమాయత్తమవుతున్నది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటూ, కొన్ని పైపై పూతలాంటి చిట్కాలను పాటిస్తేనే పర్యావరణం పూర్తిగా బాగుపడదని తెలుసుకుంటున్నారు. అసలు సమస్యను కనిపెట్టారు. బొగ్గు కోసమనో, ఖనిజాలకోసమనో, ఇంధనం కోసమనో భూమిని తవ్వి పోయడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. ఈ పనులు జరిగితేనే అభివృద్ధి అని, మరీ సబ్సిడీలు ఇచ్చి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని అప్పగించడం వీరు ససేమీరా అంగీకరించడం లేదు. ఈ కార్పొరేట్ కంపెనీలు తమ దోపిడీకి దోహదపడే ఫాసిస్ట్, జాత్యంకార, ప్రతీపశక్తులైన రైట్ వింగ్ ప్రభుత్వాలు ఉనికిలోకి రావడానికి ప్రొత్సహిస్తున్నాయని యువతరం గుర్తిస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గ్రీన్ న్యూడీల్ ‘ను  రూపొందించి ప్రపంచం ముందుకు వస్తున్నారు.  అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ బృందం రూపొందించిన ‘గ్రీన్ న్యూ డీల్’ గురించి ప్రపంచ ధిక్కార స్వరం నోమ్ చామ్ స్కీ ప్రోత్సాహకరంగా మాట్లాడ్డం గొప్ప ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ అనవచ్చు.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.