ప్రజల అవసరాలే
వుద్యమ చక్రాలు!

 

చాలిక చాలు… ఈ సాయంత్రానికి ప్రళయం రాబోతుందన్నట్టు గావు కేకలు..

ఆకాశం నుంచి అమృతం కురవ లేదు. అలాగని, కొంపలు మునగనూ లేదు.

ఇప్పటికిప్పుడు ఏం చేయాలో ప్రజలు అదే చేశారు. కులవాదాల కలగూర గంపకు చెక్ పెట్టారు.

ఆట ఫలితాన్ని ఒక మతవాదం వుపయోగించుకుంది.

మతవాదం గూబ కూడా పగుల్తుంది. దానికీ సమయం వొస్తుంది. ఆ శక్తి తయారవుతుంది, తయారు కావాలి, ఈ కల్వం నుంచే. ఏది తయారవాలన్నా దీన్నుంచే. ఏది నిలబడాలన్నా ఇక్కడే.

తక్షణం ఇండియాలో ప్రజాస్వామ్యానికి వొచ్చిన ప్రమాదమేమీ లేదని మన డూమ్స్ డే జోష్యులకు మనవి.

ముసుగు ప్రగతిశీలుర అడ్డగోలు వాదాలిక చాలు. భయపెట్టి, ఆభయహస్తం చాచే భగవద్గీతలు చాలిక చాలు.

ఒక మాట ప్రగతిశీలమో, స్వగతశీలమో తేలాల్సింది… జనానికి దానివల్ల ఏం వుపయోగం అనే గీటురాయి మీదనే.

అలనాడు రష్యాలో విప్లవం జరిగింది… జనం సోషలిజం, కమ్యూనిజం అనే సిద్ధాంతాల్ని కాచి వొడపోసి, వాటి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడడం వల్ల కాదు. వారిని నడిపించింది అదేనంటో కొందరి వాదం… వుట్టి ఇంటలెక్చువలిజం. ఇటీవల బాగా ప్రచారంలోకి వొచ్చిన మాటల్లో చెప్పాలంటే, అది బ్రాహ్మిణిజం.

ఆ పద్ధతి ఆలోచనలు వొదలనంత కాలం మనం బ్రాహ్మిణిజాన్ని వొదిలినట్టు కాదు. సో కాల్డ్ తాత్విక పరిభాషలో చెప్పాలంటే… భావవాదాన్ని వొదిలి గతి తార్కిక భౌతిక వాదాన్ని అనుసరించినట్టు కాదు. భౌతిక వాదులం కూడా కాకుండా సోషలిజం, కమ్యూనిజాల గురించి అరవడం.. కేవలం కంఠశోష లేదా నయవంచన?

సర్వజ్ఞ సింగ భూపాలం ఒక హానికర అపశృతి. సార్వజనీన సత్యమేదీ లేదు. సత్యం ఎప్పటికప్పుడు నిగ్గు తేలవలసిందే.

సత్యం అంటే…  ‘ఏం చేయాలనే’ ప్రశ్నకు జవాబు కూడా.

ప్రజల అవసరం ఏమిటో అదే చేయాలి. ఈ ఎన్నికల్లో తమకు అవకాశాలున్నంతలో ప్రజలు అదే చేశారు.  

ప్రజల విజ్ఞత మీద నమ్మకమున్న వాళ్ళకు ముందే తెలుసు. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో.

అదే జరిగింది.

తెలుగునాట… అబద్ధం మీద అబద్ధం చెప్పడమే రాజకీయం అనుకున్న ఒక నాయకుడు గాయాలు నాక్కుంటూ వైదొలగాడు. ఇదొక మంచి ఉదాహరణ, ప్రజలు తాము అనుకున్నది తాము చేస్తారనడానికి.

జనం అప్పటికే నిర్ణయించుకున్నారు. జనం డబ్బునే జనం మీద కుమ్మరించి వుక్కిరిబిక్కిరి చేయబోయాడు నాయుడు.

ఓటర్లు.. అందులోనూ ఆడవాళ్ళు… తాము ఏది సరైంది అనుకున్నారో అదే చేశారు. అబద్దీకులకు మట్టి రుచి ఎలా వుంటుందో కాస్త  చూపించారు.

కేంద్రంలో మతవాదం గెలిచిందని బాధ పడుతున్నాం. బాధ సరైనదే. కాని… బిజేపీ మతవాదాన్ని ఓడించి జనాలు ఎవర్ని గెలిపించాల్సింది?

వేదిక మీది శూన్యానికి బాధ్యత ఎవరిది?

‘తెలుగు చక్రం’ ఎంత నీతివంతమో గ్రహించలేక ప్రచారానికి దిగిన కేజ్రీవాల్, శరద్ పవార్ల బుర్రల్లో గుజ్జు వుందని జనం ఎలా అనుకుంటారు? చక్రాన్ని వాళ్ళూరికి పిలిపించి పాదాభివందనాలు చేయించిన బెంగాలీ అక్క ప్రజల మనిషి అని… జనం ఎందుకు, ఎలా అనుకుంటారు?

ఎటూ దిక్కు లేక ఎర్ర బెంగాలీలు సైతం కాషాయపు కషాయం మింగడం వెనుక వున్న మతలబు స్పష్టం.

ఈ పరిణామం జనం ముందు ఛాయిస్ లేదనడానికి ప్రబల సాక్ష్యం.

మోదీయులు మతవాదులే.

మరి, ఎదిరి పక్షం సంగతేమిటి? ఇవాళ కమ్నిస్టుల, వాళ్ళు అంటకాగిన వాళ్ళ కాళ్ళ కింది నేల కుల, మతాలు కాదా? 

ఈ దేశంలో ఎన్ని కులాలున్నాయో అన్ని పార్టీలు కలిసిన మంద.

ఇది ఎవరికి ప్రత్యామ్నాయం? దేనికి ప్రత్యామ్నాయం?

నేను ఫలానా కులం నాకు ఓటెయ్యి అనే వాక్యం నేతల నుదుళ్ళ మీద రాసి వున్నప్పుడు..  జనం… ఎవరికి వాళ్ళు… తమ కులాలకే… ఓట్లేసుకుంటారని తెలుసుకోడానికి పెద్ద తర్కజ్ఞానం అవసరమా?

కులాల ప్రాతిపదిక మీద సాగే ఏ రాజకీయమైనా ఇకముందు చేయగలిగే ఘనకార్యం అదే. దీని వల్ల ప్రజలకు ఒరిగేది… ఏమీ లేదు.

ఇంత విపులంగా కాకపోయినా….ఒక ఇంట్యూషన్ గా… ఈ వాస్తవం భారత ఓటర్లకు తెలుసు.

ఆ తెలివిడినే ‘ఇవియెం’లు రుజువు చేశాయి.

వైదిక ’మతం’ లేకుండా కులాలు లేవు. కులాలు లేకుండా వైదిక మతం లేదు. కులాల్ని అంగీకరిస్తున్నప్పుడే మనం మతాన్నీ అంగీకరిస్తున్నాం. కులవాదులుగా వుంటూ మతవాదాన్ని విమర్శించలేం. 

మనకు మరొక బ్యాక్లాగ్ కూడా వుంది.

మైనారిటీ మతాలతో పేట్రనైజేషన్.

మతాలన్నీ మంచివే, వుండనీ అనే ధోరణి.

‘కుల, మతాలు మనకు ఓకే’  అనుకుంటే… ఇక, తల చుట్టు చెయి తిప్పి ముద్ద నోట్లో పెట్టుకోడం ఎందుకు, నేరుగా నోట్లో పెట్టుకుంటే పోదా?

జనం అదే పని చేశారు. ఇన్ని కులాల కన్ఫ్యూజన్ కు కాకుండా కాస్త తేలిగ్గా తెలిసే ‘తమ’ మతానికి ఓట్లేశారు. వాళ్ళకు వేరే ఛాయిస్ లేదు. ఈ దేశంలో మెజారిటీ మతం… కుంచెం  కాదు… బాగా… మెజారిటీ మతం… వైదిక మతం. దానికి వాళ్ళు పెట్టిన పేరు ‘హిందూమతం’. ఈ నవీన నామకరణోత్సవానికి పురోహితుడు మన రాజ్యాంగమే..

ప్రజాస్వామ్యం ఒక సంఖ్యా సమస్య. మెజారిటీ ఎవరిదో వాళ్ళే ప్రజాస్వాములు. తాము హిందూమతస్థులం అనుకునే వాళ్ళదే మెజారిటీ. సో, వారే స్వాములు అయ్యారు. ఇందులో అంత అర్థం కాని న్యూమరాలజీ ఏమీ లేదు.

ఉన్న పరిస్టితిని మెజారిటీ మతవాదం చక్కగా వాడుకుంది. ఇంకా వాడుకుంటోంది. తెలంగాణాలో కేసియార్, ఆంప్ర లో (ప్రమాణ స్వీకారం కాకముందే) జగన్… స్వాముల, జీయర్ల పాదాల మ్రోల వాలిపోయారు.

జగన్ మారుమనసు పొందాడని అనలేం. అంత అమాయకుడు కాడతడు. పరిస్థితికి తలొంచాడనడమే ఎక్కువ నిజం. పెనుగాలికి తలొంచిన గడ్డిపోచ అతడు. బహుశా ఇది తన మొదటి అబద్ధం. చెక్ చేసుకోగలడా? ఏమో?  

ఇప్పుడు గాయాలకు మందు రాసుకుంటున్న జంతువు పేరు ‘సెక్యులర్ ప్రజా స్వామ్యం’ కాదు. ఇది కుల వాదం. పలు కులవాదాల మంద.

(ఇండియాలో చిన్న మతాలనేవి… అన్ని ప్రాక్టికల్ పర్పసెస్ కోసం… కులాలే.)

మీకు ప్రజాస్వామ్యం కావాలా?

అయితే, వొదిలెయ్యండి కులవాదాన్ని. వొదిలెయ్యండి మతవాదాన్ని.

కుల, మతవాదాలతో రాజీ పడుతున్న లెప్ట్, సెమీ లెఫ్ట్ అచలవాదులారా! సమాధుల నుంచి లేస్తున్న వీర బ్రహ్మేంద్రులారా! చాలు, చాలిక మీ నవీన కాలజ్ఞానాలు.

ఇది నిరాశా సమయం కాదు. ‘తోలుకాయమిది తూట్లు తొమ్మిది తుస్సుమనుట ఖాయమ’ని తత్వాలు పాడుకోడానికి. ఏక్ తార (లు) మీటుకోడానికి.

కుల, మతాలు కాదు. ఆ రకం డొల్ల నినాదాలూ కాదు. ప్రజల వాస్తవిక అవసరాలే ఉద్యమ చక్రాలు.

మార్క్సిజం, సోషలిజం సిద్ధాంతాలు మంచి కరదీపికలు. కాని, అవి నడవాల్సిన మన కాళ్ళకు ప్రత్యామ్నాయాలు కాదు.

ఆనాడు రష్యన్ ‘ఇన్సరెక్షన్ లో’ జనం బోల్షివిక్కుల వెంట నడిచింది మతం కోసం కాదు. సోషలిజం అనే నినాదం కోసం కూడా కాదు.

‘బ్రెడ్ అండ్ పీస్’ కోసం. రొట్టె కోసం, శాంతి కోసం. తక్షణం తమకు ఏం కావాలో దాని కోసం.

‘బ్యాటిల్షిప్ పోటెమ్కిన్’ సినిమా చూశారా? చూడండి. తిరుగుబాటు మొదలయ్యింది బువ్వల కాడనే.

శ్రీకాకుళం గిరి సింహం జులు విదిల్చింది… అక్కడి బుగతల దోపిడీ నుంచి తమ కొండఫలాల్ని కాపాడుకునే ఆర్తితోనే.

గోదావరిలోయ, సిరిసిల్లా, జగిత్యాల… ఎక్కడైనా చోదక శక్తి ప్రజావసరాలే.

అవి ఎన్నికలు కావొచ్చు, వీధిపోరాటాలు కావొచ్చు. జనాన్ని నడిపించేవి కుల, మతాలు కాదు, సిద్ధాంతాలు కాదు.

ఇస్యూస్.

అవి ప్రజల నిత్య జీవితాల్ని ఆఫెక్ట్ చేసే మానవ హక్కుల సమస్యలు కావొచ్చు. వారి కూడు, గుడ్డలను ప్రభావితం చేసే ఉద్యోగాలూ ఉపాధి సమస్యలు కావొచ్చు. జనుల నిత్యావసరాలుగా మారిన విద్య, వైద్యాలు కావొచ్చు.

సమస్యలు ఎప్పటికప్పుడు మారుతాయి. సమస్యలు ఎప్పుడూ వుంటాయి. సమస్యలతో డీల్ చేయడమే సామాన్యుడి జీవితం.

వాటి మీద మనం కదిలి, జనాన్ని కదిలించడం ఒక్కటే కుల, మతాల పీడ విరగడకు ఏకైక మార్గం.

కులమతాల్ని వాడుకుని జనాల్ని విడదీయడానికి మన వంతు కృషి మనం చేస్తూ, వేసే ప్రోగ్రెసివ్ గావుకేకలు… మన ఆత్మానందానికి తప్ప… దేనికీ పనికి రావు. మనలాంటి వాళ్ళను వొదిలించుకోడానికి సమస్త భారతం బెంగాల్ ఎర్ర కేడర్ల దారిలో నడిచే అవకాశం వుంది, జాగ్రత.

అఫ్ కోర్స్, నిరాశ అవసరం లేదు. ఇది కల్పాంతమనే ఏ జోష్యం వినక్కర్లేదు.

ప్రతి అడ్డంకి వద్ద, తనకు వీలైన మలుపును ఎంచుకుని నది ప్రవహిస్తుంది.

నేటి గందరగోళంలో దాగివున్న జీవశక్తి నుంచే కొత్త గొంతులు పెగుల్తాయి, కొత్త పిడికిళ్ళు లేస్తాయి.

మనం కాకపోతే మరొకరు… మనం మరణిస్తే మరొకరు… జనం మనుషులు తయారవుతారు. చరిత్రకు ఆ శక్తి వుంది. భయం లేదు.

ఇప్పుడు జనం కుల, మత వాదాన్ని ఒక చెంప వాయించారు.

రేపు చూడు మరో వైపు కూడా గూబ గుయ్యిమనిపిస్తారు.

ప్రజలే విజేతలు.

26-5-2019

 

హెచ్చార్కె

24 comments

 • సార్… ఎడిటోరియల్ గురించి ఇలా అనొచ్చో లేదో తెలియదు గానీ ఇందులోని చాలా అంశాలతో ఏకీభవించలేం.

  • ప్రభు, థాంక్స్. సంపాదకీయం అయితేనేం? మీరు ఏకీభవించలేనిది ఏ అంశాలతో, ఎందుకు చెప్పడమే సరైన పని. 🙂

 • “జనం అదే పని చేశారు. ఇన్ని కులాల కన్ఫ్యూజన్ కు కాకుండా కాస్త తేలిగ్గా తెలిసే ‘తమ’ మతానికి ఓట్లేశారు. వాళ్ళకు వేరే ఛాయిస్ లేదు. ఈ దేశంలో మెజారిటీ మతం… కుంచెం కాదు… బాగా… మెజారిటీ మతం… వైదిక మతం. దానికి వాళ్ళు పెట్టిన పేరు ‘హిందూమతం’. ఈ నవీన నామకరణోత్సవానికి పురోహితుడు మన రాజ్యాంగమే..” అని రాస్తూనే చివరలో “ఇప్పుడు జనం కుల, మత వాదాన్ని ఒక చెంప వాయించారు.” అని రాశారు. ఎంత కాంట్రడిక్షన్ ఆండీ. మొత్తం వ్యాసామంత అలాంటి కాంట్రడిక్షన్ లతోనే ఉంది .

  మా న్ధ్ర యునివర్సిటి లో ఓపెనయిర్ ఆడిటోరియమ్ ఉంది. ఇలాంటి వ్యాసం ఎవరయినా అక్కడ సమర్పిస్తు మాట్లాడితే ” అయితే వింతకీ నువ్వేతెతంతావ్. ఈ అభ్యుదయం , మార్క్స్ ఈ అస్థిత్వాలన్నీ వట్టి మాటలే నంతవెతి.”

  • చాల థాంక్సండీ. సంపాదకీయం ఎన్నికలకు ఒక ప్రాముఖ్యాన్నిచ్చింది. ఈ ఎన్నికలు జనాభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. జనాభిప్రాయమే ‘మన’కు కూడా అవసరం. మన పనులకు కూడా ప్రాతిపదిక.

   ఇప్పుడు జనం ఓ చెంప వాయించారని, రెండో చెంప కూడా వాయిస్తారని ఎడిట్ లో వుంది. మీరు చదివినట్లు లేరు. వాళ్లు వాయించిన చెంప పేరు పలు కుల, మత వాదాల మంద అని కూడా వుంది. ఇక మనం చేయాల్సింది ప్రజల సమస్యలపై పోరాటాలు. అదే ఎడిట్ సారం. ఇప్పుడు అవి జరగడం లేదని వేరే చెప్పాల? 🙂

 • అద్భుతమైన వ్యాసం. ఒక్కటే కరక్షన్ . జగన్ మొదటి అబద్దం ఆడలేదు. మొదటి సారి ‘తెలివి’ ఉపయోగించేడు.

  • థాంక్యూ సర్. ఔను, తాను ఎదిరించలేని దానికి తుపానులో గడ్డిపోచలా తలొంచి దాని ఇంపాక్ట్ తన మీద పడకుండా చూసుకున్నాడు. తుపాను నుంచి అలా తప్పుకోడం తెలివైన పనే గాని, (మనకు, ప్రజలకు) మంచిది కాదనుకుంటానండి.

 • మీ సంపాదకీయం చదివాకా నాకు ఇలా అనిపించింది !

  తెలుగు రాష్ట్రాల్లో
  రెండు పిచ్చి కుక్కలు
  కలిసి తిరుగుతున్నాయి
  పిక్కలు కనబడకుండా
  కాస్తా జాగ్రత్త పడండి ప్రజలారా !

  • థాంక్సండీ. కాపోతే కామెంట్ మరీ నిరాశావహంగా వుంది. 🙂

 • ఒంగోలులో టీడీపీ కమ్మఅభ్యర్థి & వైస్సార్సీపీ రెడ్డి అభ్యర్థి ఇరువురూ పోటీపడి ఓటుకి 2000 లెక్కన పంచారు. ఇందులో వైస్సార్సీపీ అభ్యర్థి ముందుగా పంచుడు కార్యక్రమము ముగించాడు. టీడీపీ అభ్యర్ధికి సకాలంలో డబ్బు సమకూరలేక,వెనకపడిపోయాడు.
  ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలుసు.
  ఫలితం రెడ్డి అభ్యర్థి 22000 ఓట్లతో గెలుపు.

  • థాంక్సండీ. ఏ జరిగిందనే దాని మీద మీ నిశిత పరిశీలన వుపయోగకరం. డబ్బు తదితర రుగ్మతలన్నీ వున్నా ఎన్నికలు జనాభీష్టాన్ని ప్రతిబింబించాయి. జనం అభీష్టం అలా ఎందుకుందో ఆలోచించడం మన పని.

 • ఎవరికి వారు తమ కులానికే ఓట్లేసుకున్న వితర్క సారాంశం ఈ ఎన్నికల్లో పూర్తిగా కనబళ్ళేదు. అప్రజాస్వామికానికి కొమ్ము కాసే కొన్ని శక్తులు కులానికతీతంగా తమ పని తాము చేసుకునిపోయాయ్. ఈ సారి రాష్ట్రంలో గెలుపోటముల్లో ప్రజల విచక్షణే ముఖ్య భూమిక అనుకుంటే చాలా ప్రశంశార్హం. మరి మిగతా రాష్ట్రాల్లో ? ఆ విచక్షణ దేన్ని మింగేసింది ? మీరు చెప్పిన ఇష్ష్యూసేమీ ఓట్లకి పనికిరాలేదు. ప్రజాస్వామ్యం గుడ్డిది. ఈ ఎన్నికలూ న్యూమరాలజిస్టు చేతికున్న రాళ్ళ ఉంగరమే. జస్ట్ టేకెవే సిద్దాంతం. పోరాడే ప్రతిపక్షం లేకపోతే ఇలానే ఉంటుంది. అబద్దాలకి ఎవడూ అతీతుడు కాదు. కాకపోతే అక్కడా శిశుపాలిడి న్యూమరిక్ వాల్యూ సిద్దాంతం ఉంటుంది.

  సరే, మీ సంపాదకీయం భిన్న కోణల్లో నడిచింది. జగన్ని గెలిపించిన ప్రజలమీద ఉన్న ప్రేమ, మోదీని గెలిపించినపుడు లేదు. వాక్యాల్లోకి కవిత్వం ఎక్కువొచ్చింది. ఇక చెంపల పగల కొట్టిన సంగతి నేను ఒప్పుకోను. బుగ్గలు నొక్కుకోవడమే సరి. కమ్మ పోయి రెడ్డీ వచ్చే ఢాం ఢాం ఢాం. 😂

  • శ్రీరామ్, శ్రద్ధగా చదివి వివరంగా స్పందించారు. కృతజ్ఞతలు. మన మధ్య దృష్టి భేదం వుంది. ఉంటం బాగుంది.

   రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ ప్రజలు స్పష్టమైన నిర్ణయం చేశారు. సో కాల్డ్ ప్రతిపక్షం పలు కుల వాదాల పలు మత వాదాల మంద. అది ఇప్పటికే అధికారంలో వున్న వాళ్ళకు కనీస ప్రత్యామ్నాయం కూడా కాదు. ప్రత్యామ్నాయం ఏర్పడాలి. ఆ ఖాళీ స్థలం ఖాళీగానే వుంది. పూరించే ‘మొనగాడు’ పుట్టే వరకు అది వుంటుంది, ఒక పెను అశాంతిగా. అది పుట్టడం ఈ ఐదేళ్ళలో జరగొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. ఆ మొనగాడు/మొనగత్తె పుట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి మన సమాజానికి, జనరల్ గా బూర్జువా డెమోక్రసీకి అలాంటి మన్నిక (రెసిలెన్స్) వుంది. అది కూలిపోవలసిన సంక్షోభం కనుచూపు దూరంలో కూడా లేదు.

   ప్రజల వాస్తవిక ఇస్యూస్ తీసుకుని పనిచేసే వాళ్ళే ఈ మతవాదానికి ప్రత్యామ్నాయం అవుతారు. అది ప్రస్తుతం గాయాలు నాక్కుంటూ కూర్చున్న కులవాద, మత వాదాల మంద మాత్రం కాదు. మతవాదానికి మతవాదం ప్రత్యామ్నాయం అయ్యేట్టయితే, ఇప్పుడు వున్న మత వాదం… మెజారిటీ జనాలకు ఇష్టమైన మతవాదం… చాలు అనుకున్నారు మెజార్టీ ఓటర్లు. ఒక ఖాలీని మాత్రం మిగిల్చారు. ఏరినా ఈజ్ క్లియర్

   ఇక రాష్ట్రంలో జరిగిన పరిణామం ‘కమ్మ పోయి రెడ్డి రావడం’ వంటి సింపుల్ విషయం కాదని నేను అనుకుంటున్నాను. దేరీజ్ లాట్స్ మోర్ ఇనిట్.

   బై ది బై. వచనంలో రేసింగ్ వాక్యాలుండడం కవిత్వం ఎందుకయ్యింది? కాదు. అది శైలి సమస్య. సంపాదకీయంలో కవిత్వం ఏమీ లేదు. ఇదేమంత సీరియస్ విషయం కాదు గాని, మీతో వున్న చనువు వల్ల చెప్పాలనిపించింది. 🙂

 • మార్క్సిజం, సోషలిజం సిద్ధాంతాలు మంచి కరదీపికలు. కాని, అవి నడవాల్సిన మన కాళ్ళకు ప్రత్యామ్నాయాలు కాదు. అన్నారు. ప్రపంచానికి మార్క్సిజం, సోషలిజం సిద్ధాంతాలు నడవడానికి పనికి రావంటే మరి దేనికి పనిచేస్తాయి? గుడ్డి వాడిచేతిలో ఎంత వెలుతురు ఇచ్చే కాగడాలు పెట్టిన ఏమిటి ఉపయోగం.
  మార్క్సిజం కాకుండా ప్రపంచాన్ని మార్చే మరేదైనా సిద్ధాంతం ఉంటే చెప్పండి.అందరం అదే దారిలోకి వెళ్ళిపోదాం.

  • సర్ మొదట నేను ఏం చెప్పానో అది చదవండి. ఇక్కడ మార్క్సిజం… పనికి రాదు అని ఎవరన్నారు? నేను అనని దానికి నేను ఎలా జవాబు చెబుతాను? కరదీపికలు చేతుల్లో వుంటాయి. కాళ్ళలో వుండవు. కరదీపికలు వెలుగునిస్తాయి నడవవు. దీపికలు ఇచ్చే వెలుగులో కాళ్లు నడుస్తాయి. మార్క్సిజం ఈజ్ గైడ్ లైన్ టు యాక్షన్. మార్స్కిజమే యాక్షన్ కాదు, మార్క్సిజం అనే దీపం చైతన్యం అనే వెలుగును ఇస్తుంది, చైతన్యాన్ని బట్టి ఆచరణ (నడక) వుంటుంది. సో, మీరు నిజంగా నడవదలిస్తే, మార్క్సిజం బాగా చదవండి, ఆపైన దాన్ని మీ దైనందిన జీవితానికి అన్వయించండి. కృతజ్ఞలు.

   • నాకు తెలియదు సార్. మీకు బాగా తెలుసు కాబట్టి మీ నుండి మార్క్సిజం కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అంత అసహనంగా సమాధానం ఇస్తారనుకోలేదు. మీ సమాధానాన్ని బట్టి నాకు “మార్క్సిజం అనే దీపం “మీ దగ్గర దొరికేలా లేదు.

    • అయ్యో, అసహనం ఏమీ లేదండీ. నేను అనని మాట అనలేదని చెప్పడంలో అసహనం లేదండీ.

     మార్క్సిజం ఒక దీపమని, దానికదే నడక కాదని తెలుసుకుని వుంటే మీరు మార్క్సిజం తెలుసుకున్నట్టేనండీ. అయినా దాని కోసం మార్క్స్ నే చదవండి. నా సంపాదకీయమూ కాదు మరొకరి పుస్తకమూ కాదు.

  • థాణ్క్సెలాట్ గిరిప్రసాద్ గారు.

 • ఎర్ర బెంగాలీలొక్కరే కాషాయకషాయం మింగారా?
  నిజామాబాద్ కాంగ్రేయులూ, తాము గెలవలేమని తెలిసిపోగానే, కారుకన్నా కాషాయమే (తమలాంటి స్తానికులకు) మేలు (లేదా తక్కువ కీడు) అనుకున్నారు.

  వచ్చే Assembly ఎన్నికల్లో కేరళాలో కాంగ్రేసు ప్రభుత్వం ఏర్పడి కమ్యూనిస్టులని స్తానిక ప్రత్యర్ధులుగా పరిగణిస్తే, అక్కడా ఇలాంటిది జరగకూడదన్న నియమం లేదు. కాంగ్రేసు ముస్లింలీగు రాజీ…..కీయాలదెబ్బకి కొంతమంది మాజీ కామ్రేడ్లు కమలం నీడలోకెళుతున్నారు. ఆసంఖ్య చట్టసభల్లోకెళ్ళటం just matter of time.

  కాషాయ వ్యతిరేకులు నిర్మాణాత్మకమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాకా ఆనక ఓట్లూ సీట్లూ సంగతి ఆలోచించాలి. మోదీని దింపేసాకా ఏమిచేస్తారో ఒక్క పెద్దమనిషైనా నమ్మకంగా చెప్పారా? ఆచెప్పిన పెద్దమనిషిని ఖండించకుండా మిగిలిన పెద్దమనుషులున్నారా?

  • రవి, చాల బాగా చెప్పారు. ప్రత్రిపక్షం కేవలం ప్రతిపక్షంగానే వుంది. ప్రత్యామ్నాయంగా లేదు. ఈ మంద దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం కాంగ్రెస్, తెలుగు దేశం తరహా పార్టీల చాతనయ్యే పని కాదు. ఆడవుల్లో వున్నా మైదానాల్లో వున్నా… ప్రజల్లో పని చేసే కమ్యూనిస్టులే దానికి నడుం కట్టాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.