ప్రేమ విలువను గానం
చేసిన నవ్య కవులు (2)

వడ్స్ వర్త్ తర్వాత పేర్కొనదగిన ముఖ్యమైన నవ్య కవులు లార్డ్ బైరన్, పెర్సీ బిషీ షెల్లీ, జాన్ కీట్స్.

బైరన్

జార్జి గార్డెన్ బైరన్ (1788 – 1824) రెండు విభిన్న పార్స్వాలు గల వ్యక్తి, కవి. ఓ వైపు విచ్చలవిడితనం మరోవైపు కవిత్వం పట్ల ప్రేమ అతన్ని ఒక వ్యక్తిత్వం లేని కవిగా మార్చాయి. తొలి దశలో వ్రాసిన అతని కవిత్వం అలంకార పూరితంగా వాగాడంబరంతో భావ సాంద్రత లేకుండా వ్యక్తీకరించబడింది. తర్వాతి కాలంలో షెల్లీ తో పరిచయం ఏర్పడిన తర్వాత మాత్రమే ఆయన కవిత పరిణితి చెందింది. తండ్రి విచ్చలవిడితనాన్ని, తల్లి వైపు బంధువుల ఆస్తిని వారసత్వంగా తీసుకున్న బైరన్ తన కవితలలో తననే నాయకుడిగా సృష్టించుకున్నాడు. ఎక్కువగా  బుద్ధిహీనులైన యువకులతో, స్త్రీలతో సావాసం చేసి తన జీవిత పతనాన్ని కోరి తెచ్చుకున్నాడు. చిన్నపాటి పొగడ్తలకి ప్రేమలకు లొంగిపోయిన అమాయక దయార్ద్ర హృదయుడు బైరన్. అనేక కవితా ఖండికలు వెలయించినప్పటికీ గొప్ప కవిత్వాన్ని అతను రాయలేకపోయాడు. ఆయన రాసిన వాటిలో ‘మాజపా’, ‘ద ప్రిజనర్ ఆఫ్ షిల్లన్’, ‘చైల్డ్ హరాల్డ్స్ పిల్గ్రిమేజ్’ పేరుపొందాయి.

సూర్యోదయాలలో, సూర్యాస్తమయాల్లో, మేఘాల్లో, పక్షుల్లో, పడమటి గాలుల్లో మనకు నిరంతరం ప్రకృతితో మమేకమై కనిపించే కవి షెల్లీ (1792-1822) మాత్రమే. నవ్య కవులలో షెల్లీ, కీట్స్ ది  ప్రత్యేకమైన పాత్ర.

తీవ్రమైన ఉద్రిక్తత, విప్లవ భావాలు, ధిక్కార స్వరం, ప్రత్యేక వ్యక్తీకరణ  షెల్లీ కవిత్వ విలక్షణత. ప్రభుత్వాన్ని, మతాన్ని, మత ప్రవక్తకులని చివరకు దేవుణ్ని కూడా లెక్కచేయని విప్లవ వాది షెల్లీ. ఎంత ఉద్వేగభరితమైన కల్లోల తరంగాల వంటి భావవ్యక్తీకరణ చేయగలడో  అంతకన్నా ప్రశాంతమైన సౌందర్య ఆవిష్కరణ కూడా చేయగలడు. షెల్లీ, బ్లేక్ లాగా స్వాప్నికుడు. లాంగ్ లాండ్ లాగా దార్శనికుడు. సునిశితమైన పరిశీలన, పాండిత్యం కలిగిన ఒక విలక్షణ కవి.

షెల్లీ చిన్నతనం నుంచి సుకుమారుడు. సౌందర్యవంతుడు. తన ప్రపంచంలో తాను బతుకుతూ ఉండేసరికి తోటి వాళ్ళంతా ‘పిచ్చివాడు’ అని ఏడిపించే వారు. షెల్లీ ఎంతో తీవ్రంగా ప్రతిస్పందించేవాడు. నిరంకుశత్వాన్ని నిర్వివాదంగా ఎదిరించేవాడు.  ఆక్స్ఫర్డ్లో చదువుకునే కాలంలో ‘నాస్తికవాద ఆవశ్యకత’ గురించిన వ్యాసం తో సంచలనం సృష్టించినందుకు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింపబడ్డాడు. గోడ్విన్ నుంచి స్ఫూర్తి పొంది అదుపులేని స్వేచ్ఛను ప్రేమించి విప్లవ వాదిగా తయారయ్యాడు. కవిత్వమంటే ఊహాత్మక వ్యక్తీకరణ అనీ అత్యద్భుత స్ఫూర్తిని పొందిన తర్వాత కవి మాట్లాడే భాష కవిత్వ మనీ అంటాడు. కవిత్వం జీవితానికి ప్రతీకగా ఉంటుందని, జీవితం కవిత్వానికి ప్రాణం అవుతుందని అంటాడు.   ఆయన కవిత్వావిర్భావం గురించి ఒక కవితలో

“ఒక తెలియని శక్తి తన ఛాయతో అలా తేలుతూ వచ్చి మనల్ని చూస్తుంది
వేసవి గాలులు ఒక పువ్వునుండి ఇంకొక పువ్వుకు వ్యాపించినట్లు
చంద్రకాంతి ఎక్కడ నుంచో ఒక కొండ వాలుగా  తాకీ తాకని చూపులతో
ప్రతి మనసునీ, ముఖాన్నీ తాకినట్లు
సాయం సంధ్య  లోని వివిధ వర్ణాలు, ఆనందాలు
నక్షత్ర కాంతితో లీనమై మేఘాల్లా మన జ్ఞాపకాలని సంగీత మయం  చేసినట్లు”-

కవిత్వ సృష్టి సహజంగా, అప్రయత్నంగా ఉండాలని అంటాడు.

షెల్లీ  కవిత్వమంతా తన సమాజం పట్ల అసంతృప్తి గురించి, ఆవేదన గురించి, దుర్మార్గుల పట్ల, మూఢవిశ్వాసాల పట్ల, మూఢ ఆచారాల పట్ల, నిరంకుశులకు వ్యతిరేకంగా చేయాల్సిన విప్లవం గురించి, స్వచ్ఛమైన  ప్రేమ గురించి, స్వేచ్ఛ గురించి, ఈ ప్రపంచం నుంచి క్రూరత్వాన్ని తొలగించడం గురించి, మానవత్వం ఉన్న ప్రేమను స్థాపించడం గురించిన భావనలు నిండి ఉంటాయి.

ఇతర రొమాంటిక్ కవుల లాగే షెల్లి  కూడా ప్రకృతి ప్రేమికుడు. ‘ఈ సృష్టిలో ఉన్న దైవ శక్తి మొత్తం ప్రకృతి రూపంలోనే  మనల్ని కనిపెట్టి ఉంటుంది’ అని నమ్ముతాడు. ప్రకృతిలో ఉన్న సర్వ ప్రాణులని సర్వశక్తుల్ని ఆ భగవంతుని యొక్క ఒకో  అంశగా చూపిస్తాడు. ‘ద క్లౌడ్’, ‘ఓడ్ టు స్కైలార్క్’, ‘ఓడ్ టు ది వెస్ట్ విండ్’, ‘టు నైట్’, ‘ఎలైస్టర్’ వంటి రచనలు షెల్లీ లోని కవిత్వ పటిమను వెలికితీసి చూపుతాయి.  ప్రకృతిలోని సర్వశక్తుల్ని మానవీకరించి చూపుతాడు. ‘ఓడ్ టు ది వెస్ట్ విండ్’ అనే కవితలో ప్రకృతిని సృష్టికర్త గాను లయకర్త గాను చేస్తే, ‘ క్లౌడ్’ అనే పద్యంలో మేఘానికి గల సర్వశక్తులను చిత్రీకరిస్తాడు.  

షెల్లీ ప్రేమను సకలోన్నతమైనదిగా భావిస్తాడు. ఈ విషయంలో షెల్లీని  ప్లేటో బాగా ప్రభావితం చేశాడు. షెల్లీకి ప్రేమ అంటే ఉన్నతమైన భావన. ‘ఏపీసైకిడియన్’ అనే కావ్యంలో ‘ప్రేమకు మరణం లేదని, ప్రేమ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా చిగురిస్తూ ఉంటుందని, మంచితనము, సత్యము – ఇవన్నీ కూడా నిజమైన ప్రేమనుంచే ఆవిర్భవింప పడతాయి’ అని చెప్పాడు.

షెల్లీ కవితలు జీవితపు బాధను సైతం విస్మరించవు. ‘స్కైలార్క్’ అనే కవితలో వేదనాభరితమైన జీవన వేదాంతాన్ని, జీవిత సత్యాన్ని తెలియజేస్తాడు.

“మనం ముందు వెనుకలు చూసి
మనకు దొరకని దాని గురించి బాధపడతాం
మన ప్రతి నవ్వులోనూ కొంత బాధ దాగి ఉంటుంది
మన సంతోషకరమైన పాటలన్నీ విషాదకరమైన ఆలోచనల గీతాలే
ఓ పక్షీ  నాకు నీవు ఆనందిస్తున్న ఆ సంతోషపు రహస్యాన్ని చెప్పు”

అంటాడు

‘ప్రోమీతియస్ అన్బౌండ్’, ‘క్వీన్ మాబ్’, ‘ద రివోల్ట్ ఆఫ్ ఇస్లాం’ వంటి నాటకాలు అతనిలోని విప్లవాగ్నిని  చూపుతాయి. కీట్స్ మరణానికి శోకిస్తూ వ్రాసిన ‘అడోనిస్’ అత్యద్భుత కవిత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

నవ్య కవుల అందరిలోనూ చివరి వాడైనప్పటికీ అత్యంత ప్రతిభావంతుడైన కవి జాన్ కీట్స్ (1795-1821). తమ సమకాలీనులకు, వారి భావాలకు, విధానాలకు దూరంగా ఉంటూ, ప్రకృతి ప్రేమికుడిగా సౌందర్యారాధకుడిగా నూటికి నూరుపాళ్లు నికాల్సయిన కవిత్వం వ్రాసిన మహాకవి జాన్ కీట్స్.

కీట్స్

గ్రీక్ లేక ఎలిజిబెత్ కవుల స్ఫూర్తి ఉన్నప్పటికీ తనకు కవిత్వం పట్ల గల  ప్రేమ, వ్యక్తీకరించగల ప్రతిభతో తన కొద్దిదైన జీవితంలోనే సాహిత్య చరిత్రలో అగ్రగణ్యుడిగా నిలిచిపోయాడు.  చాలా సున్నితమనస్కుడయ్యేసరికి తన కవిత్వం పట్ల విమర్శకుల మాటలకు కొంత బాధ పడ్డా, దాన్ని పట్టించుకోక తన కవితామార్గాన్ని  కొనసాగించి వారి నోరు మూయించాడు. జీవితంలో పేదరికం, క్షయవ్యాధితో తన ప్రేమకు దూరమైనా తన కవిత్వంతో చిరంజీవిగా నిలిచిపోయాడు. మ్యాత్యూ ఆర్నాల్డ్  చెప్పినట్లు ‘కీట్స్ హృదయం కఠినమైన ఇనుముతో, చెకుముకి రాయితో చేయబడింది’.

వైద్య వృత్తిలో విద్యార్థిగా అధ్యయనం కొనసాగిస్తూనే తన మొదటి కవితా సంపుటి 1877లో ప్రచురించాడు. చార్లెస్ కేడాన్ క్లార్క్  ఎంతో అభిమానించి అతన్ని బైరాన్, షెల్లీ ల స్నేహితుడైన లీ హంట్ కు పరిచయం చేశాడు. ఆ పుస్తకం విఫలమైనప్పటికీ కీట్స్ ఒక ప్రతిభావంతమైన కవిగా గుర్తింపబడ్డాడు.  1818లో కీట్స్ కొలరిజ్ ను కలిసాడు. 1818 – 1819 ల మధ్య అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు.

‘ఆతను వ్యక్తీకరించిన సున్నితమైన భావాలు, భాష, ఊహలు ఏ కవీ చేయలేడు’ అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కీట్స్ చిన్నతనం నుంచి గ్రీకు కవుల ఊహాశక్తిని అవపోసన పట్టాడనటంలో ఆశ్చర్యం లేదు. ‘ఎండీమియన్, లామియా, ఇసబెల్లా, హైపెరియన్, ద ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్, ఇంకా అతని దీర్ఘకవితలు, కీట్స్  సృష్టించిన కవితా శిల్పాలు. అతని కవితలలో ‘ఓడ్ ఆన్ అ గ్రేసియన్ అర్న్’, ‘నైటింగేల్’, ‘ఆటం’, ‘సైకి’ మన పంచేంద్రియాలను స్పృశించి, ప్రకృతి గొప్పతనాన్ని, మానవ జీవితపు అస్థిరత్వాన్ని, మానవ జీవితంలోని నిరాశ నిస్పృహలను ఎత్తి చూపుతాయి. కీట్స్ హృదయగతమైన నిజమైన సౌందర్య అన్వేషణను పట్టి చూపుతాయి.  

‘ఓడ్ ఆన్ అ గ్రేసియన్ అర్న్’ లో ఒక గ్రీకు గ్రహణ పాత్ర పై చెక్కిన దృశ్యాలను వర్ణిస్తూ, కళ మానవులను ఎలా చిరంజీవులను చేస్తుందో చెప్తాడు. సత్యము, శివము, సుందరమైన  అజరామరమైన కళను కీర్తిస్తాడు. ఈ కవిత కీట్స్ మాత్రమే చేయగల గొప్ప ఊహాత్మకతను తెలియచేస్తుంది. గ్రీకు కవులలా కీట్స్ మహాద్భుత సౌందర్య ప్రేమికుడు.

‘యింకా తాకబడని మౌన వధువా
నిశ్శబ్దానికీ మంద్ర గతిలో నడిచే కాలానికీ పెంపుడు బిడ్డా
కు చరిత్రకారిణీ, నీవుకాక మా కవితలకన్న మధురంగా
అందమైన కథలను ఎవరు చెప్పగలరు:’

అని ప్రారంభమయే ఈ కవిత ఓ యవనుల  గ్రహణ పాత్రపై చెక్కిన అనేక దృశ్యాలను వర్ణిస్తూ సాగుతుంది 

‘వినిన రాగాలెపుడూ మధురమే, కానీ విననివి మరింత మధురం కదా;
అందుకే మృదుమధురమైన వేణువులారా,
మ్రోగుతూనే వుండండి;
యీ బాహ్య కర్ణాలకు కాదు, మరింత ప్రియమైన
ఆత్మకు రాగాలందని పాటలను పాడుతునే వుండండి:
ఆ వృక్షచ్ఛాయల చేరిన యువతీయువకులారా,
మీ గీతాలాపననిక ఆపలేరు, యీ వృక్షతతులూ ఆకులిక రాల్చలేవు;
ఓ ప్రేమ పిపాసీ గమ్యానికి చేరువైనా సరే
నీవామెను ముద్దాడలేవు, అలాగని కలత చెందకు
ఆమె ఎన్నటికీ వడలిపోదు, నీ స్వర్గాన్ని అందుకోలేకున్నా
నీ ప్రేమ నిత్యం నిరంతరం మరి ఆమె సౌందర్యమో అమరం!

అంటూ ఆ దృశ్యం లోని చెట్లు ఆకులు రాల్చలేవనీ, వసంతానికి వీడ్కోలూ తెలుపలేరనీ, అక్కడి సంగీత కారుడు ఎప్పటికీ నిత్యనూతన గీతాలను మ్రోయించుతునే ఉంటాడనీ చమత్కరిస్తాడు. మానవజీవితం లోని క్షణ భంగురమైన ప్రేమ, కళలో అమరమై నిలుస్తుందని అంటూ –

‘ఆనందమయమైన ప్రేమా! అనంతానందమయ ప్రేమా!
చిరంతనంగా నులివెచ్చగా, యింకా అనుభవరంజకంగా
ఎప్పటికీ యిలాగే వెంటాడుతూ నిత్య యవ్వనంగా వుండు ;
బాధాతప్త విరక్త హృదయాన్ని జ్వరపీడిత ముఖాన్నీ
దహించుకుపోయే జిహ్వనూ మిగిల్చే
యీ వ్యధాభరిత హృదయానికతీతంగా’

నిలిచిపొమ్మని చెప్తాడు. మనమీ భూమిపై నేర్వవలసిన సత్యాన్ని వివరిస్తాడు. కళను వర్ణించే ఇలాటి ‘ఏక్ ఫ్రాస్టిక్’ కవితలు చాలా అరుదుగా సృజింప బడతాయి.

‘ఓడ్ టు అ నైటింగేల్’ అనే కవితలో ప్రకృతిలో నిరంతరంగా సాగే పక్షుల గానం అమరమైనదనీ మానవ జీవితం లోని వేదనలకతీతంగా సాగుతూనే ఉంటుందనీ తెలియచేస్తాడు. కవిత ఎత్తుగడ, వైవిధ్యమైన ప్రతీకలు, భావానికి పొసిగే భాష ఆ కవితనొక కళాఖండంగా తీర్చిదిద్దాయి.  

అలాగే ‘శరత్ కాలాన్ని’ ఉద్దేశిస్తూ వ్రాసిన ‘ఆటం’ కవిత ఎవరికీ తట్టని ఊహలని వర్ణిస్తుంది. శరత్తు ను వసంతకాలపు అద్భుతాలతో పోల్చుకు బాధపడవద్దని చెప్తూ  ‘నీ పాటలు నీకున్నాయ్’ అని సాయంకాలాన మిడతలు చేసే కచేరీలు, ఇళ్ళకు తిరిగివస్తూ గొర్రెలు చేసే అరుపులు , పిట్టల పాటలు, ఇవన్నీ ‘ఆటం’ యొక్క పాటలని ఎవరూ ఊహించని, పట్టించుకోని శబ్దాలను వర్ణిస్తాడు.

‘మెలాంకలీ’ కవిత జీవిత సారాన్ని, జీవన వేదాంతాన్ని వర్ణిస్తుంది. ‘వేదన’ విలువను అర్ధంచేసికున్న వాడే ఆనందాన్ని, సౌందర్యాన్ని అర్ధం చేసికోగలడన్న సత్యాన్ని తెలియచేస్తుంది.

కీట్స్  గొప్ప ప్రేమికుడు. తాను ఆరాధించిన ఇసబెల్లా జోన్స్, ఫానీ బ్రాన్, అతని కవిత్వంలోలాగే అతని జీవితంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తారు. అతని కవితల్లోని ప్రణయ మూర్తులుగా జీవిస్తారు. ఫానీ     బ్రాన్ను అమితంగా ప్రేమించినప్పటికీ తన క్షయ వ్యాధి వల్ల పెళ్ళాడలేకపోయాడు జాన్ కీట్స్. ‘ఈవ్ అఫ్ సెయింట్ ఆగ్నెస్’, ‘ఈవ్ అఫ్ సెయింట్ మార్క్’, ‘బ్రైట్ స్టార్’ వంటి కవితలు ఇసాబల్లాను సూచిస్తే,  మిగిలిన కవితలన్నింటిలోనూ ఫానీ బ్రాన్ సజీవంగా పలకరిస్తుంది.

కీట్స్ ఆమెకు రాసిన అనేక వందల ఉత్తరాలలో అతని ఆరాధన కనిపిస్తుంది.  ఒక ఉత్తరంలో-

“నా ప్రేమ నన్ను స్వార్ధ పరుడిని చేసింది. నీవు లేక నేను లేను. నిన్ను మళ్ళీ చూడడం తప్ప నేనేమీ గుర్తుంచుకోలేను. నా జీవితం అక్కడితో అంతమవుతుంది…. మనుషులు మతానికి ప్రాణాలర్పిస్తారని విని హతాశుడనయ్యాను  కానీ ఇంక ఇది జరగదు. నా మతం కోసం నేను అమరుడనౌతాను. నా మతం ఏమిటో తెలుసా? ప్రేమ! ప్రేమే నా మతం! దీనికై ప్రాణత్యాగం చేస్తాను. నీకోసం మరణిస్తాను” అని చెప్తాడు.

కీట్స్ చాలా రోజుల పాటు క్షయ వ్యాధితో నరకయాతన పడ్డాడు. అతన్ని చికిత్స కోసం రోమ్ నగరానికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 23, 1821న మరణించాడు. 25 సంవత్సరాలకే మరణించిన  కీట్స్ 1814 నుంచి 1820 వరకు నాలుగు సంపుటాలు మాత్రమే ప్రచురించాడు. కానీ అందరిలోనూ అగ్రగణ్యుడిగా నిలిచాడు. స్విన్ బర్న్, యేట్స్, టి.యస్.ఎలియట్ వంటి మహాకవులు అతని కవిత్వాన్ని కొనియాడారు.  కవిత్వం అంటే ‘ఒక కొమ్మకు ఆకులు చిగిర్చినంత సహజంగా రావాలని, అలా కాకుంటే అది కవిత్వమే కాద’నీ చెప్పాడు. చిన్న వయస్సులోనే చనిపోయినా తరతరాల పాటు చెప్పుకోదగ్గ, గర్వించదగ్గ కవిత్వాన్ని అందించాడు జాన్ కీట్స్.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.