భావోద్వేగాల విజయం

హ్మ్ మొత్తానికి మరోమారు సార్వత్రిక ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఫలితాల విషయంలో సీట్ల అంచనాల పరంగా అంచనాలు కాస్త అటూ ఇటూ అయినప్పటికీ నరేంద్ర మోదీ సారధ్యంలోని భాజపా, ఎన్డీయేలోని ఇతర పక్షాలతో కలిసి మరోమారు అధికారాన్ని దక్కించుకుంది. ఫలితాలను విశ్లేషిస్తే 2014 ఎన్నికల కన్నా భాజపా/ఎన్డీయే మరింత మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యకరమైన, చాలామంది ఊహించని పరిణామం. ఇది నరేంద్ర మోదీ విజయమా లేక ప్రతిపక్షాల వైఫల్యమా అన్నది చర్చాంశమే. ఆధునిక భారతదేశ రాజకీయాలలో ఇందిర తరువాత అంతటి బలమైన నేతగా మోదీ గుర్తింపు పొందాడు, ఈ విజయం దాన్ని బలపరచింది. అదే సమయంలో కాంగ్రెస్ లో నాయకత్వ లోపాలను ఎత్తి చూపగా, మరోవైపు విపక్షాలతో ఐక్యత లోపించిన విషయం కూడా ప్రస్ఫుటం చేసింది. మూడో ప్రత్యామ్న్యాయానికి ఎవరూ పెద్దగా సుముఖత చూపలేదు. 2014 లో పదేళ్ళ కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ప్రభావం చూపిందనుకున్నప్పటికీ, 2019 లో మోదీ ఇంతటి ఘన విజయం మాత్రం ఆశ్చర్యమే. అమర్త్యసేన్ గారు పేర్కొన్నట్టు ఇది మోదీ పాలనకు వేసిన వోట్ కాదేమో.మోదీ పాలన పట్ల వ్యతిరేకత లేదా? నిరుద్యోగం పెరగడం, మళ్ళీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, నోట్ల రద్దు అనంతర పరిణామాలు, నల్లధనం విషయంలో క్రియాశూన్యత, దేశం దాటిపోతున్న డబ్బు ఎగవేతదారులు (మాల్యా, నీరవ్ తదితరులు), కుదేలవుతున్న విమానయాన రంగం, అస్తవ్యస్తమవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ … ఇలా ఒకటా రెండా, లెక్కకుమిక్కిలి వైఫల్యాలు కళ్ళముందు కనబడుతున్నప్పటికీ భాజపానే మళ్ళీ విజయం సాధించగలిగింది.

మోడీ ఘన విజయానికి దేశ భద్రత పట్ల ప్రభుత్వ వైఖరి, పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్, జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొట్టటం వంటివి ఉపకరించాయి అని చెప్పవచ్చు. అదే సమయంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయాయి. అన్నిటికంటే ముందుగా ప్రతిపక్ష కూటమికి సరైన, సమర్థవంతమైన నాయకత్వం లోపించటం మోదీకి లాభించింది. అదే సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టటంలో విజయం సాధించిన భాజపా, దాన్ని వోట్ల రూపంలోకి మార్చటంలో అమలు చేసిన వ్యూహాలు లభించాయి. మోదీ పేర్కొన్నట్టు ఇది భావోద్వేగాల విజయమే కావచ్చు. ముఖ్యంగా జాతీయవాద, హిందుత్వ భావనలను కలిగించడంలో మరియు రెచ్చగొట్టటంలో చూపిన చతురత మునుపటి కంటే ఘన విజయాన్ని మోదీ – షా సారధ్యంలోని భాజపాకు అందించింది. ఈ ఎన్నికల్లో భాజపాకు విజయాన్ని అందించినవి; ప్రతిపక్షాల వైఫల్యానికి కారణమైనవి అయిన దాదాపు అన్ని అంశాల గురించి లెక్కకు మిక్కిలి విశ్లేషణలు వచ్చినవి కాబట్టి వాటిని లీలగా స్పృశించాను. కానీ, చాలామంది గుర్తించని, పెద్దగా చర్చకు నోచుకోని ఒక అంశం గురించి విశదీకరించాలనుకుంటున్నాను.

ఎవడూ ఊహించని విధంగా ఒంటరిగా భాజపా 300 కు పైగా లోక్ సభ స్థానాలను సాధించడం అన్నది ఈ ఎన్నికల్లో ఒక అతి ముఖ్యమైన మార్పు. ప్రజలు ప్రాంతీయ రాజకీయాలను, జాతీయ రాజకీయాలను వేర్వేరుగా చూడటం అలవాటు చేసుకుంటున్నారా అన్నది ఈ ఎన్నికల్లో కనబడిన సందిగ్ధత (మొదటి ప్రశ్న). మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాలలో భాజపా సాధించిన లోక్ సభ స్థానాల సంఖ్యను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఫలితాలను చూసినపుడు కాదనిపించేలా ఉంది. జమిలిగా జరిగినపుడు జాతీయ పార్టీలకు ప్రాబల్యం ఉన్నచోట ఒకలా, లేనిచోట మరోలా వచ్చిన ఫలితాలు ఈ విషయంలో సందిగ్ధతను రేకెత్తిస్తున్నాయి. జాతీయ పార్టీలకు ప్రాబల్యం ఉన్నచోట కొన్ని నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో పోల్చి చూస్తే, లోక్ సభ ఎన్నికలలో పార్టీ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజస్థాన్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఇక మధ్యప్రదేశ్, కర్ణాటక లలో దాదాపు అలాంటి ఫలితాలే. అదే జాతీయ పార్టీలకు ప్రాబల్యం లేని కేరళ, తమిళనాడు వంటి చోట్ల ప్రాంతీయ పార్టీలకు అనుకూల ఫలితాలు వచ్చాయి. జమిలి ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ప్రాంతీయ పార్టీలు ఘనవిజయం  సాధించాయి.

ఒకేసారి అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభ ఎన్నికలతో పాటుగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని; అందుకు గల అవకాశాలను పరిశీలించాలని కొద్దికాలం క్రిందట ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. చాలామంది వ్యతిరేకించారు, ఎందుకో కానీ దానిమీద పెద్ద చర్చ జరగడం లేదా ముందడుగు పడటం కానీ జరగలేదు. లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకతను ఇపుడు జమిలిగా ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల ఫలితాలు తెలియజేస్తున్నవి. జమిలి ఎన్నికలలో ప్రధానంగా జరిగే చెడు ఏంటంటే, స్థానిక సమస్యలు పక్కకు పోయి జాతీయ స్థాయి సమస్యలు/అంశాలు ప్రధాన భూమిక వహిస్తాయి. అయిదు సంవత్సరాల కాల పరిమితి దృష్ట్యా – లోక్ సభకు, మిగతా అన్ని రాష్ట్రాల శాసనసభలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు అయిదేళ్ల కాల పరిమితిని, కొద్దీ తేడాతో ఉంచి – ఎన్నికలు విడి విడిగా జరిపితేనే రాష్ట్రాల సమస్యలు చర్చించబడి, పరిష్కరించబడే అవకాశాలుంటాయి. ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు, కారణాలేమిటి అనే విశ్లేషణల కంటే ముఖ్యంగా ఎన్నికలు జరిపే తీరును విశ్లేషించాల్సిన ఆలస్యకతను ఈ ఎన్నికలు మరోమారు  ఎత్తి చూపాయన్నది నా ఉద్దేశం.

ఇక మరో అతి ముఖ్యమైన ప్రశ్న – ఇప్పటికే చాలామంది మేధావులు, ఇతర వర్గాల వారు సందేహంతో కూడిన భయం వ్యక్తం చేస్తున్నట్టుగా భారతదేశపు భవిష్యత్తు హిందుత్వ దిశగా పయనిస్తోందా? గోసరంక్షణ సమితి పేరిట జరుగుతున్న దాడులు; పెరుగుతున్న ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి హిందుత్వ శక్తుల ప్రాబల్యం; చట్టసభల్లో సాధ్విలు, సంత్ ల సంఖ్య పెరుగుతుండటం వంటివి ఇటువంటి అనుమానాలకు ఊతమిస్తున్నాయి. భారతదేశాన్ని మతసామరస్యానికి ఆలవాలమైన ప్రాంతంగా చెప్పుకుంటున్నప్పటికీ, దాదాపుగా గడచిన మూడు దశాబ్దాల కాలం నుండి అది కాస్త మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాబ్రీ, గోద్రా ఘటన వంటివి ఇప్పటికీ ఆరని మంటలై ఇరువర్గాలవారిని దహిస్తూనే ఉన్నాయి. 2014 తరువాత గోసంరక్షణ సమితి చర్యలు/దాడులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇది హిందుత్వ దిశగా దేశం పయనమా? మైనారిటీ, మెజారిటీ వర్గ రాజకీయాలను పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలు ఈ అసహనానికి కారణమవుతున్నవి. కొన్ని వర్గాలపై దాడులు జరిగిన సమయంలో తీవ్రంగా స్పందించే మేధావి వర్గాలు, పోరాట వర్గాలు హిందువులపై దాడులు జరిగినపుడు మౌనం వహించడం అంతర్లీనంగా తటస్థ హిందువులలో కూడా అభద్రతా భావానికి కారణమై మోదీ – షా ఎదుగుదలకు కారణం. భాజపా పట్ల మైనారిటీలలో, భాజపాయేతర పార్టీల పట్ల హిందువులలో అభద్రతాభావం ఉన్నంతకాలం ఎన్నికలలో కులాలు/మతాలు ప్రభావం చూపుతూనే ఉంటాయి. వివిధ వర్గాలలో నెలకొన్న ఈ అభద్రతాభావాలు తొలగించబడనంతకాలం త్రాసులో మొగ్గు మారుతుంటుంది కానీ, పరిస్థితిలో మార్పు ఉండదు. ఈ పరిస్థితికి పరిష్కారం అన్నది ప్రస్తుతానికి ఒక శేష ప్రశ్న …

వంశీ కలుగొట్ల

2 comments

  • ఎన్నికలు విడి విడిగా జరిగితేనే అందరికి ప్రయోజనం. తెలంగాణ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని క్లారిటీ లేకపోవడమే. హిందువులలో అభద్రత భావం పెరగడం, ముఖ్యంగా మత మార్పిడులు పని గట్టుకొని చేపించడం. విశ్లేషణ బాగుంది బ్రదర్.

  • “Konni వర్గాలపై దాడులు జరిగిన saమయంలో తీవ్రంగా స్పందించే మేధావి వర్గాలు, పోరాట వర్గాలు హిందువులపై దాడులు జరిగినపుడు మౌనం వహించడం అంతర్లీనంగా తటస్థ హిందువులలో కూడా అభద్రతా భావానికి కారణమై మోదీ – షా ఎదుగుదలకు కారణం.”

    ఎస్

    Anti-oppostion Vote is responsible for Modi-Shaw Victory

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.