సరుకూ మనిషీ

బజారులోకి….
నేనలా అడుగు పెడతానో … లేదో
సరుకులు నాతో
మాట్లాడటం మొదలెడతాయి
బియ్యం … పప్పులూ… ఉప్పుల్లాంటి
నిత్యావసరాలన్నీ… నన్ను పలకరించి
నా సంచిలో కూర్చుంటామంటాయి
ఆఫర్లు… డిస్కౌంట్ల పేరుతో
కొన్ని… కన్నుగీటి
నన్నే తమ బుట్టలో వేసుకుంటాయి
నా చేతిలోనివి కొన్ని…
నువ్వు మమ్మల్ని కొనేది కన్నా
ప్రతి నెలా చూసిందే ఎక్కువని
కిసిక్కున నవ్వుకుంటూ
తిరిగి సెల్ఫ్ ల లోకి చేరుకుంటాయి
మమ్మల్ని చూడడానికే
నీవు అర్హుడివి కాదంటూ
నా వైపు నుండి  కొన్ని…
ముఖం తిప్పేసుకుంటే
‘ఈ వస్తు వ్యామోహం నీకెందుకంటూ’
చలామణిలో వున్న ఓ సిద్ధాంత వాక్యం
నన్ను ఓదార్చాలని చూస్తుంది
సరుకులను తయారుచేసేవాడిని
సరుకులన్నింటికీ  నేనెందుకు
అర్హుడిని కాదో ఆలోచించుకుంటూ
గాలిపటం తోకలాంటి
బిల్లును చెల్లించడానికి
కార్డును…
స్వైపింగ్ మెషిన్ నోటికందిస్తాను
అది నా డెబిట్ కార్డుతో పాటు
రేపటి నా శ్రమను తాకట్టు పెట్టిన
క్రెడిట్ కార్డును సైతం…గీకేస్తుంది
ఈ సరుకుల మధ్య వైరుధ్యంలో
నేనూ.. తగినంత మారకంలేని
ఓ సరుకునేనన్న సంగతి
గబుక్కున గుర్తుకొస్తుంది

మొయిద శ్రీనివాస రావు

8 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.