హాజీపూర్ తరహా ఘటనలు ఆగేదెప్పుడు?

(పైన ఫొటో: ముగ్గురు అమ్మాయిల శవాలు దొరికిన బావి వద్దకు వెళ్లి పరిశీలిస్తున్న పిఓడబ్ల్యు తదితర కార్యకర్తలు)

మహిళలపై దేశ వ్యాప్తంగా దాడులు, అత్యాచార హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న సందర్భంలో ఏమీ చేయలేని దీన స్థితిలో మనం ఇప్పుడు  జీవిస్తున్నాం. నిర్భయచట్టం లాంటి కఠిన చట్టాలు వున్నప్పటికినీ చిన్నారులపై, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. ముక్కుపచ్చలారని పసిపిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. మైనర్ల నుండి వృద్దుల వరకూ పురుషులు లైంగికవాంఛ కోసం జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. చాక్లెట్ ఇస్తామనో, మరేదో ఆశను చూపి తాతయ్య, తండ్రుల వయసువున్న వారు పసిమొగ్గలను మభ్యపెట్టో  లేదా భయపెట్టో దగ్గరకు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు లైంగిక దాడులు చేస్తూ పశువాంఛకు బలి తీసుకుంటున్నారు. మరికొందరు వివాహేతర సంబంధాలకు అడ్డుగా వున్నారని పిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారు.

దేశంలో ఏ ప్రాంతంలో చూసినా స్కూళ్ళకు వెళ్ళిన పిల్లలు, బయటకు వెళ్ళిన యువతులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, ఇంటినుండి వెళ్ళిన వారు తిరిగి ఇల్లు చేరుతారన్న బరోసా లేకుండా పోయింది.  నిత్యం తల్లిదండ్రులు భయాందోళనలకు లోనౌతూ గుండె గప్పెట్లో పట్టుకుని జీవిస్తున్నారు.ఎంతో నమ్మకంతో పిల్లల్ని వారి వెంట పంపితే ఆటోడ్రైవర్లు, బస్సు, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు పిల్లలపై, మహిళల మీద అత్యాచార దాడులు చేస్తున్నారు. వారికితోడు దగ్గరి బంధువులు, స్నేహితులు సైతం  ఆడపిల్లలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు చేస్తూ, తమ తప్పిదాలు లోకానికి కనబడకుండా గుట్టు చప్పుడు లేకుండా హత్యలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. నేషనల్ క్రైం బ్యూరో ప్రకారం మన దేశంలో ప్రతి 32 నిమిషాలకు ఒక చిన్నారిపై లైంగిక వేధింపు లెక్కన జరుగుతున్నాయి. చదువు నేర్పే పాఠశాలలలో సైతం పిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. స్కూళ్ళల్లో ఉపాద్యాయులు  మాత్రమే కాదూ వైద్యం కోసం వెళ్ళినప్పుడు వైద్యులను కూడా నమ్మలేని స్థితి ఏర్పడింది. క్షణిక సుఖంకోసం దారుణాలు చేస్తూ, పైశాచికంగా హత్యలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజంగా దేశంలో అభివృద్ది ఎటువైపు పయనిస్తున్నదో అర్ధంకాని దుస్థితి.

20 సంవత్సరాల క్రితం విజయవాడ నగరం నడిబొడ్డున వున్న హాస్టల్ విద్యార్ధిని  అయేషా మీరాపై అత్యంత దారుణంగా జరిగిన అత్యాచారహత్య ఇంకా మరుగున పడ లేదు. ఆ వార్త నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కుదిపేసింది. నిందితుడు ఎవరన్నది తెలిసి కూడా ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకులు కుమ్ముక్కై ఒక అనామకున్ని బలితీసుకున్నారు. ఆ కేసులో మరణించిన బాధితురాలికీ ఈరొజువరకూ న్యాయం జరుగలేదు. సత్యంబాబు అనే అనామకుడు ఆ కేసులో ఇరికించబడి తాను చేయని నేరానికి అన్యాయంగా జైలు శిక్షను అనుభవించి పోయిన ఏడాదే నిర్దోషిగా పోలిసుల కబంధ హస్తాలనుండి విడుదలయి తనకు జరిగిన అన్యాయాన్ని సభ్యసమాజం ముందు పెట్టాడు.  ఆ తర్వాత 10 సంవత్సరాల క్రితం దేశ రాజధాని డిల్లీలో అర్దరాత్రి జరిగిన నిర్భయ సంఘటన ప్రపంచ దేశాలను కూడా కుదిపేసింది. జ్యోతీసింగ్ అనే మెడికల్ స్టూడెంట్ తన స్నేహితునితో కల్సి సినిమా చూసి బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆమెతో పాటు ఆమె స్నేహితునిపై కూడా దాడిచేయడమే కాకుండా అత్యంతహేయంగా, జుగుప్సాకరంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని ఒక్క కుదుపు కదిపింది. ఆమె అత్యాచార హత్యానంతరం దేశంలో నిర్భయ చట్టం తీసుకు వచ్చారు. నిర్భయ చట్టం కూడా అత్యాచార ఉన్మాదులను ఏమీ చేయలేకపోతున్నది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇక ఫర్వాలేదు దేశంలో ఆడపిల్లలకు బరోసా అనుకున్నాం. కాని, ఏం జరుగుతున్నది? నిర్భయ ఘటన పునరావృతం కాదని అందరం బ్రమపడ్డాం…నిర్భయ తర్వాత అభయ, అభయ తర్వాత అనేకమంది లైంగిక దారుణ హత్యలకు గురి అవుతూనే వున్నారు. నిర్భయ చట్టం ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ దానిని అమలు చేసే విధానంలో లోసగులను ఆధారంగా చేసుకుని ఉన్మాదులు చెలరేగుతూనే వున్నారు. ఎక్కడా తగ్గుముఖం పట్టడoలేదు. ఉన్మాద సంఘటనలు జరిగినప్పుడల్లా సంఘీభావంగా మనందరం ధర్నాల రూపంలోనో, క్యాండిల్ వెలిగించో నిరసనను తెలియజేస్తూనే వున్నాం. గొంతెత్తి అత్యాచార హత్యలకు వ్యతిరేకంగా నినదిస్తూనే వున్నాం. అయినా వీటిని ఆపలేక పోవడం వెనుక ప్రభుత్వాల చాతగానితనం, న్యాయ వ్యవస్థ లోపాలను సరిదిద్దుకోలేక పోవడం,  ప్రజాస్వామ్య ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. గత సంఘటనలను మరిచ్ఇపోకముందే కొత్త దారుణాలు జరుగుతున్నాయి.

ఆ కోవలో గత సంవత్సరం (2018) జమ్మూ కాశ్మీరు ప్రాంతానికి సమీపంలో జరిగిన ఆసిఫా అత్యాచారం ప్రపంచాన్ని వణికించింది. హిందువులు పూజించే దేవత కొలువైవున్న ఒక గర్భగుడిలో ఐదుగురు కిరాతకులు ముక్కుపచ్చలారని 9 సంవత్సారాలు కూడా నిండని చిన్నారి పాప ఆసిఫాను ఎంత క్రూరంగా, పైశాచికంగా మూకుమ్మడి అత్యాచారం చేసి హత్యచేసారో..మనమందరం చూసి సిగ్గుతో తలదించుకున్నాం. కంటితుడుపు చర్యలు తప్ప, ఆ పాపకు ఇంతవరకూ ఎటువంటి న్యాయం జరుగలేదు. పైపెచ్చు ఆమె తల్లిదండ్రులనే నిర్భందించే ప్రయత్నం రాజకీయ పరంగా ఎలా జరిగిందో మనకందరికీ తెలిసిన విషయమే.

నిన్న గాక మొన్న మూడు నెలల క్రితం మార్చ్ 19, 2019న హైదరాబాదుకు అతి సమీపంలో వున్న ఆల్వాల్ ప్రాంతానికి దగ్గరగా వున్న లోతుకుంటలో హోలీ పండుగ సందర్భంగా  గ్రామ ప్రజలందరూ సంబరంగా రంగులు పులుముకుంటున్న వేళ పక్కింటి బీహార్ యువకుడు మద్యం (గుడుంబా) సేవించి ఆరేళ్ళు కూడా నిండని పసిపిల్ల ప్రవల్లికపై అత్యాచారం అందరి హృదయాలను కలచివేసింది. ఆ పసిదాన్ని మాయమాటలు చెప్పి వాళ్ళ ఇంటికి అతి సమీపంలో వున్న పొదల్లోకి తీసుకునివెళ్లి దారుణంగా అత్యాచారం చేసి ఆపైన హత్యచేసి రైలు పట్టాల దగ్గర పడేసాడు. అక్కడ కూడా అంతే జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపడం తప్ప పెద్దగా ఆ కుటుంబానికి న్యాయం జరిగింది కూడా లేదు. బాధితుల పేదరికాన్ని, నిరక్షరాస్యతను అలసుగా తీసుకుని ఇటు పోలీసు వ్యవస్థ, అటు ప్రభుత్వ వ్యవస్థ భాదితులకు వ్యతిరేకంగా నిందితుల పక్షం వహించడం సర్వసాధారణం అయిపోయింది. బాధితులకు సాయం చేస్తామని చెప్పి నాలుగు పైసలు వారికిచ్చి సమస్య జటిలం కాకుండా బాధితుల నోరు మూయించేయడం పరిపాటి అయిపొయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు వచ్చిన పరిహారంతో చల్లబడిపోవడం కూడా అతి సామాన్యం అయిపొయింది.

ఇలాంటి సంఘటనలు అనేక ప్రాంతాలలో జరుగుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లుగా కూడా వుండకపోవడం బాధాకరం. పోలీసులు కంటితుడుపు చర్యలు తప్ప ఏ కేసులో అయినా పెద్దగా బాధితులకు న్యాయం జరిగిందేమీ వుండటం లేదు. ఒకవేళ ఏదైనా అనుమానంతో భాదితులు కేసులు పెట్టినా బాధితులను పట్టించుకునే తీరక, ఓర్పు, సహనం పోలీసులకు ఉండవు. మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసి నిమ్మకు నీరెత్తినట్లుగా వుండిపోతారు. ఎవరైనా బాధితులు వెంటపడి కేసును విచారించమని కోరితే లంచం ఆడడుగుతారు. తప్ప తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెల్సుకోరు. వయసులో వున్న ఆడపిల్లలైతే  ఎవరితోనో లేచిపోయిందని అవమానపరచడం, తల్లిదండ్రలు నొచ్చుకునేలా బెదిరించడం చేస్తారు. లేదంటే నిందితుల పక్షాన వాకాల్తా పుచ్చుకుంటారు. నిందితులు పడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి బాధితులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడం పోలీసులకు బాగా అలవాటైపోయింది.

హాజీపూర్ గ్రామం హైదరాబాదు నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో బొమ్మల రామారం మండలంలో వుంది. దాదాపు 2000 గడప వుంటుంది. బొమ్మల  రామారం మీదుగా రెండు కీలోమీటర్లు లోపలికి నడిచి వెళ్ళితే గానీ హజీపూరు గ్రామంలోకి అడుగుపెట్టం. ఆ ఊరి పోలిమేర మూల మలుపు మీద బ్రహ్మ జెముల్ల తోపు ఒకటి దట్టంగా అల్లుకుని వుంటుంది. అక్కడనుండి ఆ ఊరి పొలాలు,చేలు ప్రారంభం అవుతాయి. వర్షాలు లేక నీటి ఎద్దడి  ఏర్పడంతో దాదాపుగా ఆవూరి పంట భూములన్నీ పడీతి (బీడు) పడివున్నాయి. అరవై, డెబ్బై అడుగులలోతున్న మోట బావులన్నీ నీటి చుక్కలేక ఎండిపోయి, పాడుబడి భయానకంగా తయారయ్యాయి. ఆపైన మరో కిలోమీటరు దూరం నడిస్తే గానీ హజీపూరు ఊళ్లోకి అడుగుపెట్టలేము.

ఆవూరికి గతంలో రవాణా అంతా కాలినడకనే సాగేది. గత ఇరవై  సంవత్సరాలుగా ఒక ఆర్ టి సీ బస్సు రోజుకు మూడు ట్రిప్పులు వెళుతుంది. అది తప్ప మరే వాహన సౌకర్యం ప్రజలకు అక్కడ లేదు. నాగరికత పెరిగిన దృష్ట్యా మొదట్లో ద్విచక్ర వాహనాలను ఆ ఊరి మోతుబరి రైతులు మాత్రమే ఉపయోగించే వారు. కాలక్రమేణ కాలేజీ కుర్రకారు కూడా  ద్విచక్ర వాహనాలను నడపడం అక్కడ మామూలయిపోయింది. ఇటు పట్నం నుండి రావాలన్నా,, అటు భువనగిరి నుండి రావాలన్నా హాజీపూర్ ప్రజలు బొమ్మలరామారం వరకూ రవాణా సౌకర్యం వుంటుంది కాబట్టి అక్కడి వరకూ ఏదో ఒక వాహనం మీద సుఖంగా, సునాయాసంగా

వచ్చేవాళ్ళు.  అక్కడ నుండి హాజీపూరుకు వెళ్ళడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఉన్న ఒక్కగానొక్క హజీపూరు ఆర్ టి సీ బస్సు మీదే చాలామటుకు వాళ్ళందరూ ఆధారపడి ఆ టైంకు అనుగుణంగా తమ పనులను కుదించుకుని నడుచుకునేవారు. ఒకవేళ అనుకోని సంఘటనలో, పనుల్లో ఆటంకం కలిగినప్పుడు బస్సు రావాల్సిన టైం దాటిపోతేనో , టైంకు రాలేకపోతెనో బొమ్మల రామారం నుండి హాజీపూర్ కు వెళ్ళే ఆవూరి పరిచయస్తుల ద్విచక్ర వాహానాల  వాళ్ళను బతిమిలాడి వెళ్తారు. అక్కడ డెబ్బై ఎనభై వయసు వున్న స్త్రీ పురుషులందరూ స్పష్టంగా చెప్పేది కూడా అదే. హజీపూరు వైపు వచ్చే ద్విచక్ర వాహనదారులను అడిగి వారి వాహనాలపై కూర్చొని రావడం పరిపాటి అని, అది అతి సామాన్యమని అది తప్పని భావించమని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకూ ఒక్కటి కూడా జరుగలేదని చెప్పడం వెనుక ఊరివారిపై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నది. బస్సు తప్పిపోయినప్పుడో, లేదా బస్సు ఊళ్లోకి రాలేని సందర్భంలోనో ఆ వూరి విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికీ అలా వాహనాల వెనుక కూర్చొని రావడం ఆనవాయితి కనుక అందులో తప్పు పట్టే అంశం కూడా ఎవరికీ కనబడదు. అలాగే హత్యచేయబడిన అమ్మాయిలు శ్రీనివాసు రెడ్డి తమ ఊరివాడని నమ్మారు.

మూడు కుటుంబాల అమ్మాయిలపై జరిగిన  అత్యాచారహత్యలు యావత్ ప్రపంచం దృష్టి హాజీపూర్ వైపుకు తిప్పాయి. అందుకు కారణమైన వాడు మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక  కామపిశాచి. వాడు ఎప్పుడూ ఎవరితో మాట్లాడే వాడు కాదు. ఎవరితో ఎప్పుడూ కల్సి కుర్చోనేవాడు కాదు. ఎప్పుడూ ఏమీ పట్టనట్టుగా బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతూ అడపాదడపా ఊరిలో కనబడి, మరుసటి రోజే  మాయమైపోయే మర్రి శ్రీనివాస్ రెడ్డి జీవితలోతుల్లోకి వెళ్లి చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయపడ్డాయి. శ్రీనివాసరెడ్డి లిఫ్టు మెకానిక్ గా పనిచేసే వాడు. బరువు బాధ్యతలు లేని జులాయి. తాగుబోతు. గంజాయి బానిస. అల్లరి చిల్లరిగా తిరిగే బాపతు. ఉళ్లో వారందరితో అంటి ముట్టకుండా ఉంటాడు. కాబట్టి అతని గురించిన వివరాలు అక్కడి యువతకు కూడా పెద్దగా తెలియవు. ఎప్పుడైనా గ్రౌండులో పిల్లలతో కల్సి క్రికెట్ ఆడుతూ కనబడేవాడే తప్ప పెద్దగా ఎవరితో స్నేహం చేసిన దాఖలాలు కూడా లేవు. తల్లిదండ్రులకు మూడవ సంతానం. వ్యవసాయాధార కుటుంబం. ఈ మధ్యనే అతని తలిదండ్రులు పాత ఇంటి పక్కనే మరో కొత్త ఇల్లు నిర్మించుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

శ్రీనివాసురెడ్డికి ఒక అక్క, ఒక అన్న వున్నారు. అన్నకు వివాహమై భార్యా పిల్లలతో హైదరాబాదులో ఒక ప్రింటింగ్ ప్రెస్సు లో పని చేస్తాడు. వీడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రలు తలపెట్టి నప్పటికినీ జులాయిగా తిరిగే ఇతనికి ఎవ్వరూ పిల్లనివ్వడానికి  ముందుకు రాలేదు. ఒకచోట స్థిరనివాసం లేకపోవడం వలన ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లి పనులు చేసుకుంటూ వారానికి రెండు, మూడు రోజులు హాజీపూర్ వచ్చి వెళ్ళే అలవాటున్న శ్రీనివాసరెడ్డి మీద గతంలో కూడా చాలానే ఆరోపణలున్నాయి. 2015 పూర్వం పొలం గట్లపై గొర్రెలు కాస్తున్న ఒక వివాహిత యువతిపై అత్యాచార యత్నం  చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ స్త్రీ అభియోగం మీద ఆమె భర్త, బంధువులు శ్రీనివాసరెడ్డిని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొటారు. ఆ సందర్భంలో అతని తల్లిదండ్రులు ఊరి వారిని కాళ్ళా ఎల్లా పడి కొడుకుకు క్షమాభిక్ష అడగడం వల్ల ఆ కేసు పోలిస్ స్టేషన్ దాకా వెళ్ళకుండా తప్పించుకున్నాడు.

కర్నూలు పట్టణంలో నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక అపార్టుమెంటుపైన వున్న వాటరు సంపులో ఓ అపరిచిత యువతీ శవాన్ని కనుగొన్న విషయం అప్పుడు సంచలమైంది. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడనుంచి వచ్చిందన్న వివారాల పూర్తీ సమాచారం ఈనాటివరకూ పోలీసులు తేల్చలేకపోయారు . పోలీసులకు దొరికిన అతి కొంచెం సమాచారం ప్రకారం ముగ్గురు యువకులు వేశ్యావృత్తి చేసుకుంటున్న ఒక స్త్రీని ఆరోజు రాత్రి కోసం డబ్బులు చెల్లిస్తామని నమ్మించి రూముకు తెచ్చుకున్నారట. డబ్బు లావాదేవీల విషయంలో ఆ అమ్మాయికి వీరికి మధ్య గొడవ రావడంతో ఆ అమ్మాయిని హత్యచేసి అ బిల్డింగు పైన వున్న సంపులో పడేసి పారిపోయారని తెలిసింది. చివరాఖరుకు పోలీసుల శోధనలో ఆ అమ్మాయిని హత్యచేసిన కేసులో మర్రి శ్రీనివాసురెడ్డి ప్రధమ ముద్దాయి అని తేలింది. రెండు నెలల జైలు శిక్ష అనంతరం బెయిలు మీద విడుదలై గుట్టుచప్పుడు కాకుండా హాజీపూర్ వచ్చి ఉన్నట్లుగా పోలీసుల ఇంటరాగేషన్ లో స్వయంగా శ్రీనివాసరెడ్డి చెప్పాడు. . ఆతర్వాత జరిగిన వరుస సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో సంచలనమయ్యాయి.                       

కీసరలో వున్న సెర్నిటీ మోడల్ పబ్లిక్ స్కూలులో 9 వ తరగతి పాసై 10 వతరగతి లోకి వెళ్ళుతున్న 14సంవత్సరాల శ్రావణి… స్పెషల్ క్లాసుల కోసం రోజులాగే 25.04.2019 న కూడా  స్కూలుకు వెళ్ళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆరోజు సాయంత్రం ఊర్లోకి బస్సు వచ్చే సమయం (3 గంటల) వరకూ చూసారు. బంధువులందరూ కల్సి ఆతర్వాత బొమ్మల రామారం అంతా వెతికారు. శ్రావణితో పాటు ఆమె స్నేహితురాలు కూడా 11.30 గంటల వరకు స్కూలు నుంచి వచ్చిన  షేరింగ్ ఆటోలో బొమ్మల రామారంలో దిగినట్లుగా రోడ్డుపై వున్న ఒక సిసి కేమారాలో కనబడినట్లుగా బంధువుల ఎంక్వైరీలో తేలింది. రోజు బస్సుకోసం ఒక్క చోటే నిలబడి వేచివుండే శ్రావణి ఆరోజు కూడా చాలాసేపు బస్సు కోసం వేచి వున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రామాపురంలో దిగిన అమ్మాయి ఎక్కడికి, ఎవ్వరితో ఊళ్లోకి వచ్చిందో తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేసారు. పోలీసులతోపాటు ఊరి జనం అంతా బొమ్మల రామారం నుండి వెతుక్కుంటూ వెళ్తున్న సందర్భంలో ఊరి మూల మలుపులో వున్న బ్రహ్మ జెముడు తోపుల దగ్గరికి వచ్చేటప్పడికి సాయంత్రం 5 గంటలు అయిపొయింది. పోలీసులు రేపు వెతుకుతామని చెప్పినా వినకుండా వూరి ప్రజలందరూ శ్రీనివాసు రెడ్డి పొలం వైపు వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతున్న సందర్భంలో 60 అడుగుల పైగా లోతున్న మోటబాయిలో శ్రావణి స్కూలు బ్యాగు ఎర్రది కనబడటంతో వెంటనే పోలీసులకు కబురు పంపారు. చీకటి పడ్డదన్న సాకుతో  పోలీసులు రాకపోవడంతో హాజీపూర్ ప్రజలందరూ కల్సి అక్కడే తచ్చాడుతూ రాత్రి 9 గంటల సమయంలో ఇండ్లకు వెళ్ళారు. మరునాడు, 26. 04. 2019న ఉదయం జాగిలాలతో పోలీసులు బావిలో దిగే ప్రయత్నం చేశారు. బావిలో దిగిన పోలీసులలు బ్యాగును పరిశీలించారు. అందులో శ్రావణి ఆరోజు శరీరంపై ఉండవలసిన బట్టలు, ఆమె పుస్తకాలు, షూస్ కుక్కబడి వున్నాయి. జాగిలాలు పక్కన వున్న మరో బావి వైపు వెళ్తుండగా ఎస్సై జాగిలాలను అటువైపు వెళ్ళకుండా కట్టడి చేశారని ఆరోపణలున్నాయి. పక్క బావిలో నుండి వాసన రావడంతో ఊరి పిల్లలు దిగి చూశారు. శరీరం అంతా నేలలో ఫూడ్చబడి వుంది. శ్రావణి కాళ్ళు మాత్రం భూమి మీద కనబడీ కనబడనట్లుగా కనిపించాయి. కాళ్ళపై ప్లాస్టిక్ కవర్ కప్పబడి వుంది. నేలను తవ్వి తీసి చూడగా ముఖం అంతా చిద్రమైవుంది. ఎటువంటి ఆచ్చాదనం లేకుండా నగ్న శరీరం దర్శనమిచ్చింది. పోలీసులు శవాన్ని బయటకు తీసేటప్పుడు కూడా శ్రీనివాసురెడ్డి ఊరి ప్రజలందరితో పాటు కల్సి వుండటం విశేషం. పోలీసుల ఎంక్వయిరీ అనంతరం శ్రీనివాసురెడ్డి ఆ వూళ్ళో మాయమవ్వడం, అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పాత నేర చరిత్ర ఉండడంతో  అతన్ని పట్టుకున్న పోలీసులు అతన్ని విచారించగా ఆశ్చర్యకరమైన సంఘటనలు బయట పడ్డాయి.

శ్రావణి  తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ సొంత ఇంట్లో జీవిస్తున్నారు. శ్రావణికి ఒక అన్న. అతను ఇంటర్ చదివి తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటాడు. చెల్లెలిని రోజు బొమ్మల రామారం దాక బండి మీద దించి వస్తుంటాడు. తిరిగి వచ్చేటప్పుడు వుంటే బస్సు లేకపోతే ఎవరో ఒకరి ద్విచక్ర వాహనం మీద రావడం ఆమెకు అలవాటే. అదే అలవాటుతో గతంలో కూడా శ్రీనివాసురెడ్డి  లిఫ్ట్ ఇచ్చి వుండటం వల్ల, ఆరోజు కూడా అతని వెహికల్ మీద రావడానికి సిద్దపడింది. శ్రీనివాసు రెడ్డి మాత్రం తాను ముందుగా వేసుకున్న ప్లాను ప్రకారం ఆ అమ్మాయిని బావిదగ్గరకు తీసుకుని వెళ్లి పాశవికంగా అత్యాచారం చేసి, ఆమె తలకు కట్టుకున్న స్కార్ఫ్ తో ఉరివేసి బావిలోకి తోసేసాడు. బావిలో ఆమె ఇంకా బతికి వుండటం గమనించి బావిలోకి దిగి ఆమె మీద మళ్ళి అత్యాచారం చేసి కొనఊపిరితో వున్న శ్రావణిని రాళ్ళతో మోది ముఖాన్ని చిద్రంచేసి చంపేసాడు. అదే బావిలో గొయ్యి తీసి ఆమెను పూడ్చిపెట్టి, ఆమె బట్టలను, ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ ఆమె బ్యాగులోనే కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వేరే బావిలో పడేసి ఏమీ తెలియనట్లు ప్రజలతో పాటు  శ్రావణిని వెతుకుతున్నట్లుగా నటించానని పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పాడు. తీగ లాగితే డొంక కదిలింది. మార్చి 7వ తేదిన మనీషా అనే డిగ్రీ చదివే అమ్మాయి ని కూడా అత్యాచారం చేసి చంపేశానని,ఆ బావిలోనే ఆమె శవాన్ని కూడా పాతిపెట్టానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యంతో మళ్ళి మనిషా శవాన్ని వెలికితీసే ప్రయత్నం చేసారు. మనీషా కూడా శ్రావణి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే. డిగ్రీ చదువుతున్న ఆమెకు ముగ్గురు అక్కలు వున్నారు. ఇద్దరు అక్కలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఒక అక్క పెళ్లై అదే వూళ్ళో వుంటుంది. తల్లి చనిపోవడంతో, తండ్రికి, ఇంట్లో వున్న తాతకు వంట, వార్పూ చేసిపెట్టి కాలేజీకీ వెళ్లి వచ్చేది. మొదట తండ్రి, అక్కలు చదువు వద్దని చెప్పినా వినకుండా కీసరలో డిగ్రీ లో చేరి మంచిగా చదువుతుందని పేరుతెచ్చుకుంది. డిగ్రీ  అయిపోయినాక మంచి వుద్యోగం సంపాదించి తండ్రిని ఆదుకుంటానని ఎన్నో కలలు కంది. మార్చి 7న కాలేజీకని వెళ్ళిన మనీషా తిరిగి రాకపోవడంతో ఇంట్లో తండ్రి, అక్కలు అన్నీ చోట్ల వెళ్లి అడిగారు. బంధువుల ఇళ్ళన్నీ గాలించి , కనిపించకుండా పోవడం పరువు తక్కువగా ఎంచి ఇద్దరూ ఆడపిల్లలు ప్రేమ వివాహాలు చేసుకున్నట్లే మనీషా కూడా ఎవరినైనా పెండ్లి చేసుకుని ఉంటుందని అనుకున్నారు. ఏదో ఒకరోజు తానే తిరిగివస్తుందని ఎదురుచూస్తున్నారు. పోలీసు స్టేషనుకు వెళ్లి కంప్లయింట్ ఇద్దామంటే ఉళ్లో అందరికీ తెల్సి పరువు పోతుందని మిన్నకున్నారు. ఆమె మార్చి 7న మదపిచ్చి శ్రీనివాసు వలలో పడి కలలుగన్న జీవితాన్ని కోల్పోయింది. ఆమె మీద అత్యాచారం చేసి శ్రావణి ని పూడ్చిన బావిలోనే పాతిపెట్టాడు. దాదాపు 45 రోజుల తర్వాత ఆమె సగం కుళ్ళిపోయిన శవాన్ని ఆమె బట్టలను గుర్తించిన కుటుంబ సభ్యులు  ఊరు ప్రజలు దుఖిoచడం తప్పా ఏమీ చేయలేని స్థితి.

ముగ్గురు అమ్మాయిల శవాలు దొరికిన బావి

వంతులవారిగా జరిపిన ఇంటరాగేషనులో కల్పన అనే మరో  అమ్మాయిని కూడా అత్యాచారం చేసి ఆపైన హత్యచేసి శ్రావణి బ్యాగు దొరికిన బావిలో శవాన్ని పూడ్చిపెట్టిన సంగతి  శ్రీనివాసు రెడ్డి చెప్పాడు. 5 సంవత్సరాల క్రితం పూడ్చబడిన శవం బొక్కలకుప్పగా బయటపడింది. ఈ అమ్మాయిది మైసిరెడ్డి పల్లి. తల్లిదండ్రలు గొర్రెలు కాసుకుని జీవనం గడుపుతారు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక్కడే కొడుకు. పెద్దపిల్ల ఇంటర్ వరకూ చదువుకుంది. స్కూలులో చదువుకుంటున్న సమయంలో చెట్టుపై నుండి కిందకు పడి, కొమ్మ కళ్ళలో గుచ్చుకుని, నర్వస్ సిస్టం దెబ్బతినింది. జీనీ హాస్పిటల్ ( ECIL) లో  ఆ ఆమ్మాయి ట్రీట్మెంట్ కోసం చేసిన 70వేల రూపాయల అప్పు ఈ రోజు వరకూ ఆమె పూర్తిగా కోలుకోలేక పోయినా తీరుస్తూనే వున్నారు. ఒక్కగానొక్క కొడుక్కు కూడా నర్వ్ సిస్టం సరిగా పని చేయక పూర్తిగా నడవలేని స్థితి. అలాంటి కుటుంబంలో చివరి అమ్మాయి అయిన కల్పన 6వ తరగతి పాసు అయి ఎండాకాలం తర్వాత 7వ తరగతిలోకి వెళ్ళవలసిన పిల్ల తన మేనత్తవాళ్ళ ఇల్లు హాజీపూర్ కు వెళ్ళింది. ఎండాకాలం సెలవులు అయిపోగా 2014 సంవత్సరంలో  మేనత్త ఊరు నుండి మైసురాపల్లి కాలినడకన వస్తున్న పిల్ల దారిమద్యలోనే మాయమైంది. తల్లిదండ్రలు, బంధువులు అందరూ కూడా రెండు ఊళ్ళు వెతికి బొమ్మల రామారం పోలీసు స్టేషనులో మిస్సింగ్ కేసు బుక్ చేశారు. ఆ తల్లిదండ్రలు బిడ్డను ఎవరో ఎత్తుకొని పోయారని, ఎక్కడో వుండే ఉంటుందని ఆశతో వున్నారు. పోలీసులు ట్రాఫికింగ్ లో దొరికిన పిల్లల్ని చూడమన్నప్పుడల్లా రైల్వేస్టేషనులకు, చివరాఖరుకు యాదాద్రి వ్యభిచార గృహాలలో పట్టుబడ్డ పిల్లల్ని కూడా చూసి తమ బిడ్డ లేదని అనుకున్నారే గానీ ఒక కామోన్మాది చేతుల్లో శవమై పోతుందని వారు ఉహించలేదు. ఇలాంటి సందర్భంలో తమ బిడ్డను కడసారి చూపు నోచుకోకుండా ..ఇప్పుడు బొక్కల కుప్పను చూపి ఇదిగో  మీ అమ్మాయి ఆనవాళ్ళు అని పోలీసులు ఇస్తే ఆ కన్న తల్లిదండ్రల పరిస్థితిని అంచానా వెయ్యడం దుస్సాహసమే అవుతుంది.

పై సంఘటనల న్నింటిని పరిశీలిస్తే మనకు అనేక లోసగులు ఈ వ్యవస్థలో స్పష్టంగా కనబడతాయి. దేశం అభివృద్ధి దిశగా నడుస్తున్నదనుకుని మనం ఎంత అద్వాన్నంగా జీవిస్తున్నామో  ఈ సంఘటనల ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు చుట్టుపక్కల గ్రామాలకు ఈరోజుకు కూడా సరయిన రోడ్లు, రవాణా సౌకర్యం లేక పోవడం సిగ్గుపడాల్సిన విషయం. గ్రామాలలో చదువుకునే పిల్లలు మైళ్ళ కొలది నడవాల్సిన దుస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో మోడల్ స్కూళ్ళను , ప్రభుత్వ పాటశాలలను గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పుతున్నామని, వాటి అభివృద్ధికి పాటుపడుతున్నామని డబ్బా కొట్టుకుంటారు. ప్రతి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పాఠశాల, హాజీపూర్ గ్రామం రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అనడమే గాని, ఆచరణ శూన్యం. గ్రామీణ ప్రాంతలలో పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు  అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడం వలన లైంగిక వేదింపులకు, అత్యాచారాలకు, హత్యోన్మాదాలకు గురవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పుకుంటున్న చోట ఆడపిల్లలు అదృశ్యం అయినప్పుడు కేవలం కేసులు బుక్ చేసుకుంటారే తప్పా వాళ్ళ ఆచుకీ కోసం ప్రయత్నించరని నిరంతరం జరుగుతున్న లైంగిక,అత్యాచార,హత్యోన్మాదాలను చూస్తుంటే అర్ధమౌతున్నది. కనబడకుండా పోయిన అమ్మాయిలను వెతికి పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ విఫలం అవుతున్నదని చెప్పడానికి 2014 లో మాయమైపోయి ఉన్మాది పాలుబడ్డ బొక్కల కుప్పగా 2019 దొరికిన కల్పన కన్న మరో ఉదాహరణ ఏముంటుంది? ఈ ముగ్గురు ఆడపిల్లలు పేదపిల్లలు. ముగ్గురూ చదువంటే ప్రాణం పెట్టే అమ్మాయిలు.  ప్రభుత్వాలు తాము చెప్పే బేటీ పడావ్, బేటీ బచావే అనే నినాదాలు ఎవరికోసమో చెప్పి జరిగిన సంఘటనలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. ఈ మూడు సంఘటనలు ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా శ్రద్ధగా వ్యవహరించడంతో వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రానివి, ఎవరి దృష్టికి పడనివి ఎన్ని వున్నాయో ఏ గణాంకాలు చెప్పలేవు.

హాజీపూర్ సంఘటనలో ప్రజలనుండి కొన్ని డిమాండ్లు ముందుకు వచ్చాయి. 1. బాధితుల కుటుంబానికి 25 లక్షల రూపాయల నగదును అందించాలి.  2. రోడ్డురవాణా వ్యవస్థను పునరుద్ధరించి షేరింగ్ ఆటోల వసతులను కల్పించాలి. 3. విద్యార్ధులు చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటారు కాబట్టి స్కూలు బస్సుల వసతిని కల్పించాలి. ఊరు నాలుగు కూడళ్ళవద్ద సీసీ కేమేరాలాంటివి అమర్చాలి. ప్రతిరోజు పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించాలి. నేరస్తుడిని  కటినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా పోలీసు వ్యవస్థను పటిష్టపర్చాలి.

పై సంఘటనలపై నిజనిర్దారణ కమీటిగా ప్రగతిశీల మహిళా సంఘం (సంధ్య ) బృందంతో  మే నెల 2 న హాజీపూర్ గ్రామానికి వెల్లి వచ్చాం. బాధిత మూడు కుటుంబాలను పరామర్శించి వారి ఆవేదనను, బాధిత కుటుంబాల దీన గాథలు విని సభ్యుల హృదయాలు దుఖసముద్రంలో మునిగిపోయాయి.

 

భండారు విజయ

భండారు విజయ: రచయిత, కవయిత్రి, వ్యాసకర్త, కాలమిష్టు, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త (హస్మిత ప్రచురణలు). హైదరాబాదులో నివాసం. కవితలకు, కథలకు వంగూరి ఫౌండేషను తదితర సంస్థల నుంచి బహుమతులు అందుకున్నారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.