వాడిపోయిన పువ్వుల్లో నువ్వు

ఉద్వేగంతో ఎదురుచూసే మధుర క్షణాలు కాస్తా
నువ్వొక్క నిర్లక్ష్యం బాణంతో నిర్లిప్తం చేస్తావు..
ఆనందపుటంచులు తాకి
జ్ఞాపకాల్లో దాచుకోవాల్సిన వెన్నెల రేయి
విషాద రాగమాలపిస్తుంది.
దేహాం తప్ప మరేదీ కనపడని మనిషికి
గాయమెక్కడో తెలీదు..
దగ్గరకి తీసుకోని సహవాసయాత్రలో
అంటుకట్టుకున్న అంటరానితనమేదో
నీ నుంచి దూరంగా విసిరేస్తుంది.
నువ్ పై చేయి కోసం ఆరాటపడతావు
చిగురు తొడగాల్సిన నేను ముడుచుకుపోతాను
మనసు రేకులు విప్పి పరిమళించాలనుకుంటే
క్షణకాలపు రాపిడిలో నువ్వూపిరాడనివ్వవు
అనుభూతి గీతాన్నై నిన్నూరడిద్దామని ప్రయత్నిస్తాను.
అగాధంలోకి తోసేసి నువ్వెళ్ళిపోతావు..
నేన్నీకోసం
ఇంకా..
వాడిపోయిన పూవుల్లో వెతుకుతుంటాను.

కోడే యామినీ దేవి

కోడే యామినీ దేవి: పుట్టి పెరిగిన ఊరు, ఇప్పుడున్న ఊరు మర్లపాలెం గ్రామం, కృష్ణా జిల్లా. కథలు, నవలలు చదవడం ఇష్టం.. అడపాదడపా కవిత్వం. కెనడా తెలుగుతల్లి పత్రిక, మల్లెతీగ, సాంస్కృతీ సమాఖ్య కవిత్వ పోటీల్లో విజేతగా పురస్కారాలు పొందారు.

1 comment

  • అయ్యబాబోయ్……నేనేమీ కామెంటలేను. అక్షరాల్ని ఏరుకొస్తాను. బాయ్.

    🌺🌺

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.