ఒక బలం టానిక్…

.‘చెప్పండి…’

‘…………..’

‘ఊ… చెప్పండి… ఎవరు బలవంతులు?, రాముడా భీముడా?’ నా మాటకు అమ్మా నాన్నా ముఖా ముఖాలు చూసుకున్నారు.

‘మేడ్ క్వశ్చన్?’ అన్నాడు పక్కనే ఉన్న అన్నయ్య.

‘నీ దగ్గర ఆన్సర్ లేకపోతే, నాది మేడ్ క్వశ్చన్ అయిపోతుందా? హూ..’ అని ముఖం తిప్పుకున్నాను.

‘నీకివేం డౌట్లే?’ విన్న మావయ్య చిన్నగా నవ్వాడు.

‘రాముడు బలవంతుడా? భీముడు బలవంతుడా?’ అడిగా.

‘రామాయణం భారతం కలిపేస్తే ఎలానే?’ అంది అమ్మ.

‘అంటే… అది… అది…’ నాన్న నీళ్ళు నమిలారు.

ఎవరైనా నీళ్ళు తాగుతారుకాని నీళ్ళు నములుతారా?, ఆన్సర్ లేనప్పుడు రానప్పుడు… ఆ… ఊ… అదీ… ఇదీ… అంటే నీళ్ళు నమిలినట్టేనట. అమ్మమ్మ చెప్పింది.

‘పోనీ… భీముడు బలవంతుడా? ఆంజనేయుడు బలవంతుడా?’ ప్చ్.. ఈ ప్రశ్నకయినా జవాబు చెప్పలేకపోయారు.

నేనూరుకుంటానా?

‘భీముడా? ఆంజనేయుడా?’

‘వాళ్ళిద్దరికీ నీకోసం బాక్సింగ్ పోటీలు పెట్టాలి’ అన్నాడు మావయ్య. ‘ఎప్పుడూ?’ అని నేనూ అడిగాను. మావయ్య నా టెంకి మీద ఒక్కటేసి ‘పిలక కత్తిరించేస్తా’నన్నాడు.

ఈ పెద్దవాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు.

మాయాబజార్ సినిమాలో గద పట్టుకున్న ఘటోత్కచుని కన్నా పిన్నలగర్ర పట్టుకున్న కృష్ణునికే బలం ఎక్కువ. బక్కముసలివాడి వేషంలో వున్న కృష్ణున్ని అంత బలవంతుడైన ఘటోత్కచుడు కనీసం కదపలేకపోవడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ విషయం నాన్నమ్మని అడుగుతామా సావిత్రి వేషంలో యస్వీ రంగారావు అదరగొట్టేశాడు అంటుంది. అక్కడితో ఆగదు. సావిత్రి కథలోకి వెళ్ళిపోతుంది.

సో… బక్కగా వుంటే బలం లేదని కాదు. దుక్కగా వుంటే బలం వుందనీ కాదు.

సంజీవనీ పర్వతాన్ని అరచేతిలో పెట్టుకొని అది కూడా గాల్లో ఎగురుకుంటూ వచ్చిన ఆంజనేయుడికే చాలా బలం. ఎంత బలం కాకపోతే చిన్నప్పుడే సూర్యుణ్ణి చూసి పండనుకొని గాల్లో ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళతాడు? ఎర్రని పండని కదా సూర్యుణ్ణి మింగెయ్యబోతే నోరు కాలింది. కాలిపోబట్టి కదా బుగ్గలు బూరెల్లాగ అయ్యింది?

‘ఉఫ్’ అని ఆంజనేయుడిలా పెదాలు బిగబట్టి బుగ్గలు పొంగించానా ‘కోతి’ అన్నాడు మావయ్య.

ఆంజనేయుడు కోతే కదా? యస్… అలాగయితే మనం కూడా కోతే!

‘నేను కోతే’ అన్నాను.

‘అది వేరే చెప్పాలటే పిల్లకోతీ?’ అని మావయ్య నవ్వి, ‘నీకేం కావాలో చెప్పు తెచ్చిస్తాను… కొండమీది కోతి’ అన్నాడు.

‘బలం’ అన్నాను.

మావయ్య సైలెంటయ్యి చూసి ‘దీనికిదేం పిచ్చి?’ అన్నాడు.

‘బాగా బలంగా ఉండాలని దాని కోరిక’ అమ్మ చెప్పింది.

‘ఎందుకే మీ మేస్టుతో కాయడానికా?’ అన్నాడు మావయ్య.

అమ్మా నాన్నా అదో పెద్ద జోకులా నవ్వారు.

‘కోడి రామ్మూర్తిలాగ నాకు చాలా బాగా బాగా బలం కావాలి’ అని పిడికిలి బిగించానో లేదో నా ఉషారుకి ఉడికిపోయి ‘నువ్వాడ పిల్లవే’ అన్నాడు మావయ్య.

‘మరి కరణం మల్లీశ్వరి?’ అడిగా. కరణం మల్లీశ్వరిది మన శ్రీకాకుళం జిల్లాయే, నరసన్నపేట దగ్గర అని నాన్నమ్మ నాతో చాలా సార్లు చెప్పిందిలే.

నా ఆన్సరుకి మావయ్యతో పాటు అమ్మానాన్న అందరూ నీళ్ళు తాగలేదు. నీళ్ళు నమిలారు.

నాన్నమ్మ మాత్రం నవ్వి ‘నీ కండలేవే?’ అని అడిగింది.

భుజాలు రెండూ చాపీ పిడికిలి బిగించి చేతులు రెండూ మడిచి చూశాను. ప్చ్…

ఏం చేస్తాం? బుగ్గలు పొంగించి ‘ఇవే నా కండలు’ అని చూపించాను.

‘కండలా? కొండలా?’ అని అంతా ఆటపట్టిస్తూ నవ్వేసారే కాని నాకు నిజంగా కండలెలా వస్తాయో అడిగినా చెప్పలేదు. అయినా కండలొస్తే మావయ్యని గిరగిరా తిప్పి వీధిలోకి విసిరెయ్యనూ?

అన్నం ఎక్కువ తింటే బలం ఎక్కువొస్తుందని అమ్మ అంటుంది గాని, ఎక్కువ తింటే ఎప్పుడూ వాంతే వస్తుంది.

నాన్నమ్మ ఇంక తన బలం హిస్టరీ లోకి వెళుతుంది. ‘నా వయసు వుడిగిపోయి బలమంతా బద్దలయిపోయింది గాని…’ అని మొదలు పెడుతుంది. ఇప్పుడందరూ ఎరువులూ పురుగు మందులూ తింటున్నారని అంటుంది. కల్తీ లేని శాల్తీని చూపించమంటుంది. తనకిప్పుడు బొత్తిగా బలం లేదంటుంది. ఇటు చీపురుపుల్ల తీసి అటు వెయ్యలేకపోతున్నానంటుంది. ఆ భగవంతుడు బద్దలయిపోయిన భగవంతుడు తనను తీసుకుపోయినా బాగుణ్ణు అంటుంది. అన్నీ అన్నాక డాక్టర్ని బలానికి మాంచి టానిక్ ఇమ్మంటుంది. ఇస్తే భగవంతుడితో దెబ్బలాడుతుందో ఏమో?!

నాక్కూడా బలానికి టానిక్కు కావాలన్నాను!

డాక్టరు ముందు నవ్వాడు. తర్వాత స్టెతస్కోప్ పెట్టి చూశాడు. నువ్వు బాగా చదువుకో బలమొస్తుంది అన్నాడు. బాగా చదువుకుంటే ఫస్ట్ రాంకు వస్తుందని మాస్టారు చెప్పారు. బాగా చదువుకుంటే బాగా బంగారం కొనుక్కోవచ్చని అమ్మ చెప్పింది. బంగారం లాంటి ఉద్యోగం చేసుకోవచ్చు అని నాన్న చెప్పారు. బంగారం లాంటి మొగుడొస్తాడని మావయ్య చెప్పాడు.

‘నాకు బంగారం వద్దు, బలమే కావాలి’ అన్నాను.

నా మాటెవరూ వినలేదు. విన్నా పట్టించుకోలేదు. నాన్నమ్మ మొర మాత్రం విన్నారు. పట్టించుకున్నారు. బలానికి టానిక్కు కూడా ఇచ్చారు. ముందు ముందు నాన్నమ్మకి కండలొస్తాయేమో? అదే విషయం అడిగితే నోర్ముయ్యమన్నారు. మా పిల్లలతో ఎవరైనా అలాగే మాట్లాడుతారు మరి.

అయినా నీకిప్పుడు బలమెందుకే అంటుంది ఎదురింటి అత్త.

బలమెందుకా?

పుస్తకాల బ్యాగులు కాదు, బస్తాలు మొయ్యాలంటే బలం కావాలి.

పక్కింటి బంటిగాడ్ని… వాడు భలే బుజ్జిగా వుంటాడులే, వాడ్ని ఎత్తుకోవాలంటే బలం కావాలి.

స్కూలు వర్కూ హోమ్ వర్కూ చెయ్యాలంటే బలం కావాలి.

ఆటలు ఆడాలంటే బలం కావాలి. పాటలు పాడాలంటే బలం కావాలి. అన్నయ్యతో పోట్లాడాలంటే బలం కావాలి.

…ఇలా బలమెందుకు కావాలో చెప్పాలంటే కూడా బోల్డంత బలం కావాలి.

నాన్నమ్మకి బాగోలేదని అందరూ వచ్చి చూసి వెళ్ళేవారు. వంట్లో శక్తి పూర్తిగా పోయిందనేది నాన్నమ్మ. బలానికి టానిక్కులు కూడా ఇప్పిస్తున్నామని అమ్మ చెప్పేది. ఆ మాట వింటున్నప్పుడల్లా నా నోరూరిపోయేది.

నాన్నకి టైటానిక్కు సినిమా ఎంత ఇష్టమో… నాకు ఆ టానిక్కు అంత ఇష్టమన్న మాట.

నాన్నమ్మకు పాత టానిక్కు బోటిలయిపోయిందని, కొత్త టానిక్కు బాటిల్ చాలా పెద్దది తెచ్చారు. ఎకానమీ పేక్ అట.

ఓ రోజు పొద్దున్నే నాన్నమ్మ పెద్దగా పిడుగు పడినట్టుగా అరిచింది.

‘ఏమయిందమ్మా’ అని నాన్నా అమ్మా మావయ్యా అన్నయ్యా అంతా కంగారు పడుతూ వచ్చారు. బాగోదని నేనూ కొంచెం కంగారు పడి వెళ్ళాను.

‘బోటిల్ బోటిల్లా వుంది, బోటిల్లోని టానిక్కు మాయమయిపోయిందిరా…’ నాన్నమ్మ గొల్లుమంది.

నేను మరోసారి నోరు తుడుచుకున్నాను.

హ… హ్హ… అని అరచేతిని అడ్డం పెట్టుకొని నోరు వాసన కూడా చూసుకున్నాను.

అయినా అందరూ నన్నే అనుమానంగా చూశారు. నేనడ్డంగా తలాడించాను. అందరూ నా దగ్గరకొస్తుంటే తాగలేదన్నాను. కొద్దిగా ఎత్తుగా వున్న నా పొట్ట వైపు చూశారు. గౌను సర్దుకున్నా సరే-

కండ పొట్ట దగ్గరొచ్చినట్టుంది.

‘చాక్లెట్ ఫ్లేవరా? ఫైనాపిల్ ఫ్లేవరా?’ మావయ్య అడిగితే, ‘గ్రేప్స్’ అని కంగారులో చెప్పేశా.

అంతే.

అమ్మ ఏడుపు. నాన్నేడుపు. నాన్నమ్మేడుపు. అన్నయ్యేడుపు. మావయ్య మాత్రం ఏడవకుండా నా నోరు వాసన చూశాడు.

‘అంతా తాగేశావా? కొద్దిగా దాచుకున్నావా?’ మావయ్యడగాడు.

‘అంతా…’ అని తలూపానా?, అయినా అర్థం కానట్టు చూస్తారే? చెప్పా. ‘నాకు బలం ఎక్కువ కావాలి కదా?’

ఆమాటే నన్ను తీసుకువెళ్ళి చూపించిన డాక్టరుకు కూడా చెప్పా.

డాక్టరు ఎప్పటిలాగే ముందు నవ్వాడు.

ఆ తర్వాత-

‘ఈ టానిక్కూ తాగేస్తావా?’ అని డాక్టరు టేబుల్ మీది మరో టానిక్కు బాటిల్ కొత్తది తీసి ఇచ్చాడు.

తలూపి ‘ఇక్కడ తాగనా? ఇంటికి వెళ్ళి తాగనా?’ అడిగాను.

‘తాగితే ఏమవుతావో తెలుసా?’ డాక్టరు నవ్వలేదు.

‘కరణం మల్లీశ్వరి’ అన్నాను.

డాక్టరు నీరసంగా ఊపిరొదిలాడు. అయినా డాక్టరూ ఓ బాటిల్ తాగొచ్చుగా?

‘ఇలా టానిక్కు బాటిళ్ళు తాగేస్తే చచ్చిపోతావే’ స్కూల్లో మాస్టారిలానే డాక్టరూ అరిచాడు.

‘ఎందుకూ?’ అన్నాను.

ఏమనాలో తెలీనట్టు తల విదిల్చి ‘ఇది విషం’ పల్లు కొరికాడు డాక్టరు.

‘విషమయితే నాన్నమ్మకెందుకు ఇచ్చారు?’ నా డౌట్ నాది.

‘అసలు నిన్ను… నిన్ను…’ అని నాన్న నన్నేమీ అనలేక అమ్మ మీద పడ్డారు. మావయ్య ఆపాడు. డాక్టరు చాలా టానిక్కు బాటిళ్ళు ఉంచుకొని, నీళ్ళే తాగాడు. అందుకే నీరసంగా ఉన్నాడు.

‘ఇంకెప్పుడూ ఇలా టానిక్కు మొత్తం తాగకు’ అన్నాడు డాక్టరు.

‘కొంచెం కొంచెం తాగుతాలెండి’ డాక్టరుకు ధైర్యం చెప్పా.

‘అలా కాదమ్మా… ఎవరి టానిక్కు వాళ్ళే తాగాలి’ డాక్టరు మోగిన సెల్ ఆపి నన్ను ఎప్పుడూ చూడనట్టుగా చూశాడు.

‘మరి నా టానిక్కు ఏది?’ అడిగాను.

అప్పుడు డాక్టరు నాకు కూడా ఓ టానిక్కు రాసి ఇచ్చారు. నాన్న ఆ టానిక్కు కొని తెచ్చారు. అమ్మ టానిక్కు దగ్గరుండి ఇస్తుంది. కాని టానిక్కు నిజంగానే విషంలానే చేదుగా వుంది. ‘అన్ని టానిక్కులూ ఒకేలా ఉండవు’ అన్నాడు అన్నయ్య. ‘ఎవరి టానిక్కు వాళ్ళే తాగాలి’ అన్నాడు మావయ్య. ఒకరి టానిక్కు మరొకరు తాగడం చాలా ప్రమాదం’ అని అమ్మ చెప్పింది. ‘ఇలా ఇంకెప్పుడూ చెయ్యొద్దు’ అన్నారు నాన్న.

నేను చెప్పినట్టు వింటానని ప్రామిస్ చేశాను.

‘ఇప్పుడేం కావాలో చెప్పు?’ అన్నాడు నన్ను మెచ్చుకుంటూ మావయ్య.

‘బలానికి తియ్యటి టానిక్కు’ అన్నాను.

అందరూ నవ్వారు.

‘నా బలం నీకు ఇవ్వగలిగితే బాగుణ్ణు’ అని నాన్నమ్మ మాత్రం గట్టిగా ఏడ్చింది. బలం టానిక్కు బాగా పనిచేస్తున్నట్టుంది.

నాకు బలం టానిక్కు ఎప్పుడిస్తారో? నాకెప్పుడు అందరికన్నా ఎక్కువ బలం వస్తుందో?

-బిజిలి,

రెండవ తరగతి,

సప్తగిరి టాలెంట్ స్కూల్.

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.