ఒక రౌడీ…

యస్…

యెస్సెస్…

ఐ యామ్ రౌడీ బేబీ…

‘మారి 2’ సినిమాలో ‘రౌడీ బేబీ’ సాంగ్ యిప్పుడు అందరూ మర్చిపోయారు! ‘రౌడీ బేబీ’ అంటే డాన్సు కాదు! ధనుస్ కాదు! సాయి పల్లవి కూడా కాదు! ‘రౌడీ బేబీ’ అంటే నేనే! ఔను నేనే!

హీరో విజయ్ దేవరకొండ అందర్నీ ‘రౌడీ’ అన్నా, అందరూ నన్నే ‘రౌడీ’ అంటున్నారు!

వారం క్రితం దాక నేను గుడ్ గాళ్ నే! ఇన్నోసెంట్ నే! నోట్లో వేలు పెడితే కొరకలేని దాన్నే! నోటిమీద వేలు తీయకుండా వుంచుకొనే దాన్నే! అలా అనే నాగురించి అందరూ గొప్పగా మెప్పుగా చెప్పుకొనేవాళ్ళు!

నేను పుట్టినప్పుడు నా కళ్ళు చూసి ‘రౌడీ పుట్టింది’ అని మావయ్య అప్పుడే పేరు పెట్టేశారట?! ‘పెంకి పిల్ల’ని చిన్నాన్నలు! ‘యమ పెంకి’ అని నాన్నమ్మ! ‘రణ పెంకి’ అని అమ్మమ్మ!

అందరూ రౌడీ అని- రౌడీ రాయుడు అని- రౌడీ ఫెలో అని- బుద్దిగా వున్న నన్ను పిలిచేవాళ్ళే! వాళ్ళు పిలిచారని నేను రౌడీ పనులు చేయలేదు?!

అసలు రౌడీ అంటే ఏంటి? చెడ్డ అని కదా? మరి నేనేం చెడ్డ పనులు చేశానని నన్ను అలా పిలుస్తున్నారు? ముద్దుగా పిలుస్తున్నారే- అని అమ్మ మెచ్చేసుకుంది!

అలా మెచ్చేసుకున్న అమ్మ కూడా తిట్టింది! తిట్టడమేమిటి కొట్టింది! రౌడీ అంది! నాన్న అలిగి నాతో మాట్లాడడం మానేశారు! సరదాగా అంటే నిజంగా రౌడీ అయిపోతావా? టూ బ్యాడ్- అని మావయ్య! రౌడీ అన్నందుకు సరిపెట్టేసింది- అని నాన్నమ్మ! ఇంటా వంటా లేని రౌడీ బుద్దులు నీకెక్కడి నుండి వచ్చాయే?- అని అమ్మమ్మ! ఆలోచిస్తే యిది మంచి రౌడీ- అని చిన్న చిన్నాన్న! మంచి రౌడీ… చెడ్డ రౌడీ ఏంటి?, రౌడీ రౌడీయే- అని పెద్ద చిన్నాన్న!

మొత్తానికి నేను రౌడీనే! ఈ విషయం స్కూల్లో తెలిసిపోయింది! ట్యూషన్లో తెలిసిపోయింది! ఇంకెప్పుడూ యిలాంటి రౌడీ పనులు చేస్తావా?- అని మా క్లాసు టీచర్ నన్ను అడిగారు! తలూపాను! చేస్తానన్నట్టు! అడిగిన టీచరే కాదు, అక్కడ వున్న విన్న టీచర్లందరూ అవాక్కయారు!

ఏమిటే నీ వుద్దేశం?- అని అడిగారు! నేనేం మాట్లాడలేదు! నిన్నే- అన్నారు! ఊ- అన్నారు!

అందరూ రౌడీలు కావాలి!- అని చెప్పాను!

టీచర్లంతా వులిక్కిపడి చూశారు!

నీకేమయిందే?- అన్నారు! దెయ్యం పట్టిందా?- అన్నారు! డిసిప్లిన్ తప్పింది!- అన్నారు! ఎవరితో తిరిగితే ఆ బుద్దులే!- అన్నారు!

మా హెడ్ మాస్టారు మధ్యలో వచ్చారు! ఏమయింది?- అన్నారు!

ఈ రౌడీ వీళ్ళ వీధిలో రెండు ఏసీ బాక్సులు బద్దలు గొట్టేసింది- చెప్పారు మా క్లాసు టీచర్!

హెడ్ మాస్టారు అర్థం కానట్టు చూశారు!

నేనేమో గర్వంగా చూశానట! నాకు కొవ్వు పట్టిందట! పొగరు బలిసిందట! పోకిరీ అయిపోయానట!

ఎవరైనా ఎపుడైనా టిఫిన్ బాక్సులు బద్దలు చేయడం చూశాను, ఏసీ బాక్సులు బద్దలు చేయడం ఏమిటి?- హెడ్ మాస్టారు బుర్ర బద్దలు చేసుకున్నారు! ఎక్కువ ఆలోచిస్తే బుర్ర బద్దలు చేసుకోకు- అని ఆయన అంటుంటారులే!

మీ యింట్లో ఏసీ లేదనా?- అడిగారు హెడ్ మాస్టారు!

అడ్డంగా తలూపాను!

టీచర్లు అంతా కారణం చెప్పమన్నారు! ఆ ఏసీ నీ వూసుకు వచ్చిందా?, జోలికి వచ్చిందా? దాని మానాన అది గోడకు వుందా? నీతో గొడవకు వచ్చిందా?- అని అడిగారు!

నేను సమాధానం చెప్పలేదు! ఇంట్లో కారణం చెప్పినా యెవరికీ అర్థం కాలేదు! బళ్ళో మాత్రం చెపితే అర్థం చేసుకుంటారా? కోరు! చేసుకోరు! చేసుకోరు గాక చేసుకోరు!

చెప్పకపోతే టీసీ యిచ్చి పంపించేయండి- వొక టీచరు!

చేతులు అంత దురద పుట్టాయా- మరో టీచరు! టీచర్లు కోపం వస్తే యిలా కాదు, యింతకంటే దారుణంగా మాట్లాడుతారు!

నీ పిలకలు రెండూ కత్తిరించేస్తాను- హెడ్ మాస్టారు ప్యూనుకు చెప్పి కత్తెర కూడా తెప్పించారు!

ఎవరి డబ్బుతో వాళ్ళు ఏసీ పెట్టించుకుంటే నీకేమిటి నొప్పి?- వొక టీచరు!

నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావా?- మరో టీచరు!

ఎండాకాలం ఏసీల్లేకుండా యెలా బతికి చావాలని?- తన యింటి ఏసీ బద్దలు కొట్టేస్తానన్నంత భయంతో హెడ్ మాస్టారు చూశారు!

ఏసీ బాక్సులు యెందుకు బద్దలు కొట్టానో, ఇంకా యెందుకు బద్దలు కొట్టాలో చెప్పాను!

అందరూ చిత్రంగా షాకయ్యారు! విచిత్రంగా నన్ను చూశారు!

కాదా? వద్దా? ఏసీ బాక్సులు బద్దలుగొట్టొద్దా? ఆ..? ఏసీ మీ డబ్బులుతో మీరు పెట్టించుకుంటే- కరెంటు బిల్లు మీరే కట్టేసుకుంటే- సరా? మీ ఇళ్ళలో చల్లగా ఎండాకాలంలో కూడా చలికాలం చేసేసుకోవచ్చు- కాని మిగతా వాళ్ళకి- ఏసీ బాక్సు పక్కనున్న వాళ్ళకి… ఇళ్ళ వాళ్ళకి… వడగాల్పులే కదా? వేడి కదా? పొయ్యి పక్కన వున్నట్టే కదా? ఎడారిలో వున్నట్టే కదా? ఇంక అన్ని కాలాలూ వేసవి కాలాలే కదా?

అందుకని… ఏసీలు బద్దలు కొట్టేస్తావా?- హెడ్ మాస్టారికి నా రెండు పిలకలకన్నా ముందు నా మెడ కత్తిరించెయ్యాలని వుందేమో కత్తెర నా మెడ దగ్గర పెట్టారు! నన్ను హంతకుణ్ణి చెయ్యొద్దు- అన్నారు!

మామూలుగా వీచే గాలిని వేడి చేసే హక్కు… కలుషితం చేసే హక్కు… మీకు కాదు, నాకు కాదు ఎవరికీ లేదు- అన్నాను!

ఎవరు చెప్పారు?- టీచర్లు!

పారిశ్రామిక అభివృద్ధి అందరిదీ అయినా దాని కాలుష్యం మాత్రం ఆ అభివృద్ధిలో భాగంలేని పంచుకోని కొందరిది- అని మీరే చెప్పారు కదా?- సోషల్ సైన్సు టీచర్ని అడిగాను!

అయితే ఇదేమిటి?- మా సోషల్ సైన్సు టీచరు!

కాలుష్య నియంత్రణ!- అన్నానో లేదో, నిన్నూ- అని హెడ్ మాస్టారు వీపు వంచి వొక్కటి వేసేసే వారే మిగతా టీచర్లు అడ్డుకున్నారు!

కొద్దిసేపటికి తేరుకొని వూపిరి పీల్చుకొని హెడ్ మాస్టారు- పాఠాలు పాఠాల్లా చెప్పండి- అన్నారు! అనడం కాదు, వార్నింగ్ ఇచ్చేశారు!

తరువాత నన్ను చూసి యేమనుకున్నారో యేమో- మనమందరం కలిసి కాలుష్య నియంత్రణ చేద్దాం- అని నన్ను వెళ్ళమన్నట్టు చూశారు!

అలా నేను వచ్చేశానా? మళ్ళీ వొకరోజు మా హెడ్ మాస్టారు దగ్గరకు వెళ్ళానా? కాలుష్య నియంత్రణ యెప్పుడు చేద్దామని అడిగానా? అంతే-

హెడ్ మాస్టారు బెత్తాము తీసుకు నా వెంట పడ్డారా? పరిగెత్తారా? పడిపోయారా? ఆ రౌడీ వుంటే స్కూల్లో పిల్లలందరూ చెడిపోతారని తీర్మానించారా? అమ్మా నాన్నల్ని పిలిపించారా? నామీద కంప్లైంట్ కూడా చేశారా? చేతిలో టీసీ పెట్టారా? నా తరుపున అమ్మానాన్నా రాసి యిస్తే- లాస్ట్ వార్నింగ్- అని యిప్పటికి చల్లబడ్డారా? కానీ ఏసీల వల్ల గాలి చల్లబడుతుందా? చట్టూ వున్న గాలి చల్లబడుతుందా?

ఈ రౌడీ చల్లబడుతుందా?

మొక్కలు నాటడం యెలాగూ చెయ్యడం లేదు, కనీసం ఏసీ బాక్సులన్నీ బద్దలు గొట్టాలి!

భూమి అందరిదీ అంటారు! అబద్దం! నీరు అందరిదీ అంటారు! అబద్దం! గాలి అందరిదీ అంటారు! అబద్దం!

గాలి కూడా కొందరిదే!

-రౌడీ (పద్మ),

నాల్గవ తరగతి,

సమితి పాఠసాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.