నిఘా!

చుట్టూరా ఏం జరుగుతోందనే ప్రశ్నకు సరైన సమాధానం లేకుండా ఎంత నడిచినా అగమ్యమే. పరిస్థితిని ఉన్నదున్నట్టు అర్థం చేసుకోకుండా నిజమైన ముందడుగు లేదు.

స్థితి గురించి జ్ఞానం లేని గతితర్కం ముడ్డిలేని ముంత.

ఏం జరగలేదు, అంతా ఎప్పటి లాగే వుందంటారు కొందరు. వాళ్ళకు స్థితి, గతి ఒక్కటే. అది అతి నిరాశ. వుట్టి నిహిలిజం. దాంటోంచి పుట్టేవి రెండే రెండు చర్యలు. ఒకటి ఆత్మహత్యా సదృశ వుద్యమాలు. రెండు నిష్క్రియను కప్పిపుచ్చే పండిత చర్చలు.

సజ్జలు తిని సజ్జలు విసర్జించే కోళ్లు, వాక్యాల్ని తిని వాక్యాల్ని విసర్జించే మేధావులు ఒకే కోవ. తిన్న వాక్యాలు అరక్క పడే బాధ అదనం. తమ బాధ లోక బాధ అనుకునే వింత జబ్బు.

కుదరదు. అలా బండి ముందుకు నడవదు. వొట్టి కుదుపులే గాని, ముందుకెళ్ళడం వుండదు.

ఏం జరుగుతున్నదనే దానిపై అవగాహన అవశ్యం.

ఉదాహరణకి… నిన్న ఎన్నికల్లో ఢిల్లీలో ఏం జరిగింది? తెలుగు రాష్ట్రంలో ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? జరిగిందాని అర్థం ఏమిటి? దీని వల్ల మనకేమవుతుంది? అసలు మనకు కావలసిందేమిటి? మనకు కావలసిందాన్ని ఎలా సంపాదించుకోవాలి?

రష్యాలో ఏం జరిగిందో, చైనాలో ఏం జరిగిందో సరే, శుక్ర గ్రహంలో, అంగారక గ్రహంలో ఏం జరిగిందో సరే!

ఇండియాలో ఏం జరిగింది?

ఆలోచించకుండా వుండలేం. అలోచించకుండా వుంటానికి మనమేం పెట్టిపుట్టిన వాళ్ళం కాదు. ఏం జరిగిందో అది మన రోజుల్ని, ఘడియల్ని, మన కాలాన్ని శాసిస్తుంది. ఇంట్లో వెలిగే దీపం, నడిచే రోడ్డు, తినే తిండి, చదివే చదువు, జబ్బు చేస్తే వైద్యం, సామాజిక బంధాలు, మాట్లాడే స్వేచ్ఛ, సంఘటితమయ్యే వీలు… ప్రతిదానికీ మనం ‘ఇవాళ ఇక్కడ’ (హియర్ అండ్ నౌ) వెదుక్కోవలసిందే. ప్రతిదీ మనకు మనం సంపాదించుకోవలసిందే.

ఇవాళ ఇక్కడ జీవించాల్సిన వాళ్ళం, ఇవాళ ఇక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా వుండే లగ్జురీ మనకు లేదు.

కలలను వాస్తవాలుగా భ్రమించే భోగం లేదు. ఉన్న వాస్తవాలను చేతిలోకి తీసుకుని, వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి.

లేని వాటిని చేతిలోకి తీసుకోనూ లేం, మార్చనూ లేం.     

***
మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఉన్నంతలో ప్రజలు మంచి నిర్ణయం చేశారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం అడుగడుగు అబద్ధాల యంత్రం. జనహితం దిశగా ఒక్క ఆడుగు ముందుకు వేయని కుతంత్రం. మనసు లేని, ఎండిపోయిన కట్టె.  యంత్ర చోదకులు కొందరికి తప్ప, మరెవరికీ మేలు చేసే వుద్దేశం లేనిది.

పోగా అది ఆడపిల్లల ఆభిజాత్యాల మీద దాడులకు, రాజధాని పేరిట పంటభూములూ నదీ శికం భూముల దురాక్రమణకు, ఇసుక మాఫియాకు, ప్రజలను సమాచార లేమితో తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టించే పనులకు ట్యూన్ చేయబడిన యంత్రం.

ఒక్క మాటలో చెప్పాలంటే, అదొక పెద్ద ‘అబద్ధం’ (హిపోక్రసీ). హిపోక్రసీని తిరస్కరించకుండా హిపోక్రసీ మీద ఆధారపడిన దోపిడిపై సమరానికి జనవాహిని కదలదు.

ఒక పెద్ద అబద్ధాన్ని ఒద్దని ప్రజలు నిర్ణయించారు. అందుకు ప్రజలకు అభినందనలు. ఎన్నికల్లో ప్రజాభీష్టం వ్యక్తం కాదనేది వొట్టి బండ సూత్రమని జనం మరోసారి నిరూపించారు. వాళ్ళు ఓడించాల్సిన దాన్ని ఓడించారు. ప్రత్యామ్నాయంగా ముందుకు వొచ్చిన వాళ్లను ఇక ఒక కంట కనిపెట్టాలి. ఇప్పుడు మన పని దీనికి ప్రతిపక్షంగా వ్యవహరించడం. ప్రజల పక్షాన గొంతు విప్పి దీని మంచి చెడ్డలను విమర్శించడం.

కొత్త ప్రభుత్వం బెల్టు షాపులు ఎత్తేసి, సారాయీ మురుగునీరూ కలిసి వీధుల్లో ప్రవహించకుండా చూస్తామనడం బాగుంది. దీన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన మాటను కూడా నెరవేర్చాలి. ఆశా వర్కర్లకు జీతాలు పెంచి ప్రాథమిక ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేద్దామని మొదలెట్టిన ప్రయత్నం బాగుంది. ఈ ప్రయత్నం విస్తరించి ప్రజలందరికి వైద్యం అందుబాటులోకి వచ్చేట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి.

వైద్యమే కాదు, విద్య… ఉన్నత విద్య కూడా… పేదలందరికి పూర్తిగా అందుబాటులోకి రావాలి. విద్యా వైద్య వ్యవస్థలు బడా కంపెనీల, పెటీ కోటీశ్వరుల లాభార్జనకు బలి కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి. వాటిని తిరిగి పబ్లిక్ రంగం (ప్రభుత్వ రంగం) లోనికి తెచ్చి, పార్టీలకు అతీతమైన ప్రజా అజమాయిషీలో పని చేయించడమే సరి దారి. పబ్లిక్ రంగమంటే… మునుపటి వలె… పేరుకు ‘సోషలిజం’ అసలుకు ‘జన భారం’ కాకుండా వుండే జవాబుదారీ యత్రాంగం కావాలి.

రేపు ఏమిటో గాని… ఇప్పుడు మనుషులు… నేటి పేదలై రేపటి పెద్దలయ్యే మనుషులు కూడా… ప్రాథమికంగా స్వార్థపరులే. బతుకు చోదక శక్తి (డ్రైవింగ్ ఫోర్స్) స్వార్థం.

దీన్ని మసి పూసి మారేడు కాయ చేయడం పాలక వర్గ సేవలో భాగం, ప్రజలపై వంచన.

జీవితాన్ని చెడగొట్టేవి, హింసించేవి, పక్కదారి పట్టించేవి, నాశనం చేసేవి స్వార్థాలు కాదు. అవి దుస్వార్థాలు. స్వార్థం వొద్దని చెప్పొద్దు, దుస్వార్థం వొద్దని చెప్పాలి. నా ముద్ద నాకు అనుకుంటే స్వార్థం, అందరి ముద్దలు నాకే అనుకుంటే దుస్వార్థం.

దుస్వార్థాల మీద నిరంతర పోరు, జాగరూకత అవసరం. మన జీవితాలకు మనం కాపలాదారులం కాక తప్పదు.

కొత్తగా వొచ్చిన రాష్ట్రప్రభుత్వం మీద కూడా అలాంటి నిఘా అవశ్యం.

నిఘా అంటే… ఏం చేసినా తిట్టిపోసి, అబద్ధపు ఆరోపణలతో ముంచెత్తే రాజకీయ ‘మేనేజ్మెంటు’ కాదు.

తప్పులను తప్పులుగా, ఒప్పులను ఒప్పులుగా చూసే నిఘా.

ప్రజా క్షేమమే గీటురాయిగా వుండే నిఘా.

జగన్ నాయకత్వం మీద జనం గంపెడాశలు పెట్టుకున్నారు. దళితుల మీద దాడులను అరికట్టడానికి ఒక దళిత మహిళకు హోం శాఖ అప్పజెప్పగానే సరిపోదు. ముఖ్యమంత్రితో సహా సమస్త ప్రభుత్వ యంత్రంలో చిత్తశుద్ధి అవసరం. బక్కి శ్రీను దారుణ హత్య తాజా హెచ్చరిక. కులవాదం వ్రేళ్ళు ఎంత లోతైనవో ఎంత క్రూరమైనవో తేటతెల్లం. దీనికి నిజమైన విరుగుడు దళిత ప్రజలకు రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో తగినంత ప్రాతినిధ్యం దొరకడమే. వారి లోంచి పెట్టుబడిదారులు పుట్టుకు రావడమే. దానికి తగినట్లు ఇన్సెంటివ్స్ కల్పించగలిగితే మేలు. ప్రోత్సాహకాలు ఉద్యోగాది ఉపాధి అవకాశాలకు పరిమితం కారాదు, దళితులు పారిశ్రామికులుగా దూసుకుపోవడానికి వీలుగా విస్తరించాలి.

మన సమాజంలో వెనుకబాటుతనం కేవలం కులపరం కాదు. ప్రాంతీయం కూడా. కోస్తా ఆంధ్రకు దీటుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ముందుకు సాగితేనే రాష్ట్రంలో దరిద్ర దేవత సెలవంటుంది.

కొత్త ప్రభుత్వం తప్పులు చేయకుండా చూడడానికే కాదు, ఒప్పులు చేసేట్టు చూడడానికి కూడా జనం నిఘా అవసరం.    

***
కథ అయిపోలేదు.

మనల్ని రాష్త్ర ప్రభుత్వం మాత్రమే పాలించదు. ‘బిజేపీ’ రూపంలో మతవాదం… మెజారిటీ మతవాదం..  ఢిల్లీ పొదల్లో పొంచి వుంది.

ఎన్నికల్లో మరో విధంగా జరిగితే బాగుండేదా? ఉదాహరణకు కాంగ్రెస్ నాయకత్వంలో కులవాదాల మంద అధికారం చేపట్టి వుంటే బాగుండేదా?

పెద్దగా బాగుండేది కాదు. కథ మొదటికి వొచ్చేది. అప్పుడు కూడా అధికారం మతవాదానిదే అయ్యేది. అదీ మతవాదమే గాని, అర్థం చేసుకోడానికి, నిర్దిష్టంగా విమర్శించడానికి వీలివ్వని జంగ్లీ. ఆ మంద ‘హిందూమత’వాదానికి ఇచ్చే వత్తాసు ఎలా వుంటుందో చూశాం. మొదటి నుంచి కాంగ్రెస్ పరోక్ష మద్దతు లేకుండా అయోధ్య కేసే లేదు. రాజీవ్ నిర్వాకం లేకుండా రామాలయానికి పునాది రాయి (శిలాన్యాస్) పడలేదు. పీఠం మీద ‘వేయిపడగ’ల పీవీ లేకుంటే, ‘స్వయం’గా అద్వానీ పంచె ఎగ్గట్టి మసీదును కూలదోయ గలిగే వాడు కాదు. మతవాదం కాష్టాన్ని కాంగ్రెస్ వాడుకుంది, వాడుకుంటుంది. బీజేపీ మాదిరి స్పష్టంగా వుండదంతే.

‘కూటమి’ ఒక వంద తోకల పాము. గ్రామసీమల్లోని కులవాద హంతకులు, హతులు కలగలిసిన విచిత్ర సందోహం. వేయి పడగల, వంద తోకల పామును ప్రజలు కాదన్నారు. దీనికి మన వాళ్ళకు వగపెందుకు?

పలు కుల, మత వాదాల కూటమి కన్న స్పష్టంగా తెలిసే మతవాదం మేలని జనం అనుకోడంలో వున్న వ్యాకరణం ఏమిటి? మరేమీ లేదు. ప్రజల ముందు వయబుల్ ఆల్టర్నేటివ్ లేకపోవడమే దానికి కారణం. బీజేపీ విజయం ఒక మహా శూన్యానికి సంకేతం. అది దేశంలో మెజారిటీ ‘మతం’ కావడం మరొక ఇన్సిడెంటల్ కారణం.

ఒక సాంస్కృతిక అస్తిత్వాన్ని మతంగా మలచే పరివార్ చారిత్రక కుట్రకు సో కాల్డ్ సెక్యులరిస్టుల సహాయం విస్మరణీయం కాదు. ఈ వైఖరి మారకుండా మోడీ, షాలను కాదు గదా, సాధ్వి ప్రగ్యాసింగును కూడా ఓడించలేం.

మనకు మతవాదం, కులవాదం వొద్దా? ఒద్దయితే, ప్రజల దైనందిన సమస్యల్లో ప్రజలతో కలిసి పని చేయడం తప్ప వేరే దారి లేదు. ఒక ప్రభుత్వం వైద్యాన్ని జన సామాన్యానికి చేరువ చేస్తే.. చేసింది పాలకులు గనుక దాన్ని మెచ్చుకోం, ఒక ప్రభుత్వం విద్యను పేద పిల్లలకు చేరువ చేస్తే.. చేసింది పాలకులు గనుక అది మంచిదని అనం … అనే పరిశుద్ధ వైఖరి శుద్ధ దండగ వైఖరి. అది ‘మాస్ అటు లైన్ ఇటు’ వైఖరి. సిద్ధాంత రాద్ధాంతాలతో పొద్దు పుచ్చే ‘సోమరి’ వైఖరి. ఈ నకారాత్మక వైఖరి వల్ల… మెట్టు మెట్టుగా ప్రజలను వారి దైనందిన జీవన సమస్యలపై నడిపించే అవకాశం కమ్యూనిస్టులకు వుండదు.

కేంద్రం మీదైనా వుండాల్సింది ఈ విధమైన నిఘా యే.

నిత్యం ప్రతిపక్షంగా వుండాల్సిన కమ్యూనిస్టులు తమ పనుల్ని కొలుచుకోవలసింది వారికి దొరికే అధికార పీఠాలతో కాదు. పరిపాలనలో ప్రజలకు దొరికే ప్రాతినిధ్యమే వారికి కొలబద్ద. అల్టిమేట్లీ, ఇటీజ్ ప్రొలిటేరియట్ అండ్ ఇట్స్ కాన్షియస్నెస్ దట్ డిసైడ్స్, ఇడియట్.

కమ్యూనిస్టులు నిత్య ప్రతిపక్షం.

వారి పని వాస్తవాల మీద ఆధారపడిన నిఘా.

6-6-2019

 

హెచ్చార్కె

5 comments

 • వాఁహ్..సర్..నిజంగా ఈ ఆర్టికల్ మన ముఖ్యమంత్రి గారు చదవాలి..ఆయన్ను మాఫదర్శకం చేసే సూచనలు..ఆయన ముందున్న పాములు..నిచ్చేనాలు..చాలా అంటే చాలా స్పష్టంగా అద్బుతంగా ఒక విలక్షణమైన డిటైల్డ్ సంపాదకీయం రాశారు..అన్ని పత్రికల్లో దీన్ని ప్రచురించాలి..

  ముఖ్యమంత్రిగారికి ఈ ఆర్టికల్ ఒక అద్భుత కరదీపిక. చాలా అద్భుతం సర్ సంపాదకీయం!!💐💐💐

 • ఆఖరి 5 వాక్యాలు పాక్షిక సత్యం. మిగతా అన్ని వాక్యాలు పూర్తి సత్యం. కమ్యూనిస్టులు డెమోక్రాటిక్ manner లో కేంద్రంలో అధికారానికి వస్తేనే సోషలిజం వైపు అడుగులు పడతాయి. అప్పుడు కూడా గమ్యం బహుదూరం.

 • బాగుంది. నిఘా మొదలయ్యినట్టే. మీ వచనాన్ని ఈసారి విషయం అధిగమించింది. కవిత్వమూ లేదు. సారాంశం సారాంశంలా చదివించింది.

  గవర్నమెంటు మంచి పనులు చేస్తోంది. చెడు చేయకుండా నిఘా కావల్సిందే

 • ఈ మధ్య మనరాష్టంలోనూ, దేశం లోనూ జరిగిన ప్రజాస్వామ్య ఆట గురించి రాశారు, గెలిచిన వాళ్ళ మిధ నిఘా పెట్టమన్నారు. సరే.
  ” ఒక ప్రభుత్వం వైద్యాన్ని జన సామాన్యానికి చేరువ చేస్తే.. చేసింది పాలకులు గనుక దాన్ని మెచ్చుకోం, ఒక ప్రభుత్వం విద్యను పేద పిల్లలకు చేరువ చేస్తే.. చేసింది పాలకులు గనుక అది మంచిదని అనం … అనే పరిశుద్ధ వైఖరి శుద్ధ దండగ వైఖరి.” అని రాశారు ఇది కొంచెం వింతగా ఉంది. ఇప్పటి ఏ ప్రభుత్వమూ కూడా వైద్యాన్ని జనసామాన్య చేరువ తేలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే చదువు కూడా వ్యాపారస్తుల చేతులోంచి తప్పించి ప్రభుత్వ చేతుల్లో లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
  ఆ విషయాన్నే అమర్త సేన్ గారు గణాంకాలతో సహా తెలిపారు. పేదరికంలో మగ్గుతున్న లక్షలమందికి ఈ రెండు ముఖ్యావసరాలు అందుబాటులో ఉన్నాయా?

 • హిపోక్రసీ పై ఆధారపడిన దోపిడీ పై జన సందోహం తిరగ బడింది కదా! అబద్ధాలకు బుద్ధి చెప్పింది. మేనేజ్మెంట్ ను రీరూట్ చేసి వెనక్కి మళ్ళించింది. కాకపోతే ది వే ఆఫ్ డూయింగ్ మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. అంతే.
  వేయిపడగలు, వందతోకలు ఆడుతున్న ఆట బాగా చెప్పారు సార్. బక్కి శ్రీనివాస్ హత్యోదంతం లో మినుకు మినుకు మనే విజయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం, కాంపెన్సేషన్ చాలా వేగంగా వచ్చాయి. రోగి ని మొత్తం స్కానింగ్ చేసారు.థాంక్స్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.