పద్యం వెనుక దాక్కున్న
భీభత్స ఏకాంతం 

వాడూ, నీవు, నేను. లేదా వారూ, మీరూ, మేమూ. ఈ మూడింటితర్వాతి మాటేమిటి ? అసలు కవి ఏ వచనంలో, ఏ సంబోధనలో ఏమని మాట్లాడతాడు ? కోపంలో, పగలో, వంచనలో, పశ్చాత్తాపంలో, అతని గొంతు ఏ స్వరంలో, నిన్నేమని పిలుస్తుంది. రా, అన్నా రా ! అంటుందా ? నా కంఠం, నా చెవీ, నా ఉనికీ అని ధగ ధగ లాడుతుందా ? పోతుంది, చేస్తుంది, ఉంటుందీ అని కూడా పలవరిస్తుందా ? ఏమన్నా సరే, అతని తనలోని నిన్నూ, నీతాలూకు నీలోని తననీ నిరంతరాయంగా మాత్రం తప్పకుండా శోధిస్తుంది. ఈ గుడిహాళం రఘునాధం కవిత్వం చదువుతోంటే వ్యక్తికీ, క్రియకీ మధ్య అహరహమూ తత్సమ, తత్భవ మూలమైన వెతుకులాటే వాక్యాలవెంట పరుగులుపెట్టిస్తుంది. ఆశతో, భయంతో, బెంగతో, కోరికతో ఇతని పదాల సౌందర్యంలో కనబడే తీవ్రమైన సంచలనాలు కవిత్వానికి కొత్త కొలమానాన్ని తయారుచేస్తాయి.

ఫోర్త్ పర్సన్ సింగ్యులర్ కవితా సంపుటి గుడిహాళం మొదటి పుస్తకం. త్రిపురనేని శ్రీనివాస్ వేసిన కవిత్వం ప్రచురణల్లోని విలక్షణ రచన. 1980 లో ఈ కవిత్వం సర్వసాధారణంగా ఇలా వొచ్చేసి అలా వెళ్ళిపోయింది కానే కాదు. త్రిశ్రీ వెలుగులోకి తెచ్చిన్నాటినుండీ అందులోని సరికొత్తదనమేదో మనల్ని తనతో లాక్కెళ్ళిపోతూనే వుంది. రఘు లో ఉన్న అసాధారణమైన ఆలోచనాపరుడు, ఎంత ఆవేశపడ్డా విరుచుకుపడని విధ్వంసకారుడు ఈ కవితా వాక్యాల్లో మనల్ని ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా పోగొట్టుకున్నదాన్ని దొరకబుచ్చుకోమంటాడు. ఇది తాత్వికత కాదు. ఇతను తత్వవేత్తా కాదు. అచంచలమైన ఒకానొక విరక్త చాంచల్యం. నిజాయితీ లేని దిగుల్ని మోయలేక, ఏమీ చేయలేని అశాంతత లో నిత్యమూ రగిలిపోయే స్పష్టాస్పష్ట భ్రష్టాక్షరమతను.

నా అనుక్షణ ప్రమాదానివి నువ్వు
ప్రమాదాన్ని నేను ప్రేమిస్తాను
నువ్వొక నిషిద్ద ప్రదేశానివి
నిషేధం నా ప్రేరణ
….
నిర్లక్ష్యం నాకొక సవాలు
నీవొక బడబాగ్ని భాషవి
అగ్నిని ఆయుధంగా ధరించే వీరత్వం నాది
మరణమెరుగని వాంచ నీది
వాంచా శిఖరాల పై స్వేచ్చా విహారం నాది
……
నీవొక భీకర యుద్ధానివి
నేనో శతధారా ఖడ్గాన్ని (ఇంకెవ్వరచట…)

ఈ కవితలోనే కాదు అన్నింటిలోనూ నువ్వూ, నాది లాంటి వ్యక్తీకరణల్లో కవి తన బలం మొత్తాన్నీ నింపుతాడు. ఆ సంబందార్ధకమైన దగ్గరితనంలోనో చదువరికో కొత్తదనంతో కూడిన అపస్మారక స్థితిని ఏర్పరుస్తాడు. ఆ మత్తు సెంటిమెంటల్ సూదిమందు కాదు. వాస్తవాన్ని వాస్తవంగా చూడగల అద్దం లాంటిదీ కవిత్వం. కొత్త మెటఫర్లకోసం, సిమిలీలకోసం వెతికి వెతికి, మనిషిని శనగ్గింజలా నానబెట్టడం హత్యని, నిదుర చెరువులో దిగి అలసటని కడుక్కుంటాననీ, అర్ధరాత్రి టీ స్త్రీ లాంటివే కొన్నో దొరికేశాయోచ్చ్ అని సంతృప్తి పడి గుండెలమీద ఈ పుస్తకాన్ని అదిమి పెట్టుకుని నిద్రపోలేము. కవి పుస్తకం నిండా నిరలంకార మహోద్వేగాన్ని మజ్జిగని కవ్వంతో చిలికినట్టు చిలికుతాడు. అతను మెత్తటి వెన్నపూస. చేత్తో పట్టుకోవాలనుకుంటావా ? ఎక్కడెక్కడికో జారి పోతాడు. అయితే ఇతనిది పలాయనవాదం అనుకోవద్దు. అతనికి జీవితాన్ని కవిత్వాన్నీ ఒకేలా చూడ్డం, ఒకేలా స్పర్శించడం, ఒకేలా హత్తుకోవడం చాలా బాగా చేతైన విద్య. లేకపోతే అతను ఈ కవిత్వమంతా సంఘర్షణ పడ్డట్టు ఇంకెక్కడా, ఎప్పుడూ పడేవాడు కాదేమో ?

వాడి కళ్ళలో కోట్ల జనం దైన్యం; వాడి ముఖంపై వేలాడుతున్న దుశ్చర్యల తాలూకూ ఫోటో
వాడి దేహంలో నలిగిన దేశ పటం; వాడు దేశంలోని
దోపిడీకి ప్లాట్ ఫాం పై రాయబడ్డ సర్టిఫికేట్
వాణ్ణి చూసినపుడు నేను దుక్ఖాన్ని
వాడు దుక్ఖించినపుడు నేను క్రోధాన్ని
వాడు కోపించినపుడు; నేను
సువిశాలంగా పరుచుకున్న సమతా ప్రపంచాన్ని (భవిష్యత్తు పెదాల్ని కదిపి). ఇలాంటి వాక్యాల్లో మళ్ళీ వాడూ, నేనూ లాంటివి సంకేతిస్తున్న అతని రాజకీయ స్పృహ మనల్ని కొత్త ఆలోచనల్లోకి నెడుతుంది.
అలాగే —

రోజూ
నాలో దిగి నన్ను కబళిస్తున్న గోళ్ళూ, వేళ్ళూ కోరలూ
ఈ శతాబ్దానివి
సుఖ లాలసుడి మద వాంచలూ, సౌజన్యహాసాల దౌర్జన్యాలూ, తుపాకీ కాల్పులూ, విషకూపాలూ, రూపాలూ, రూపాయలూ ఈ శతాబ్దానివి
వ్యవస్థలో జీర్ణమవుతున్న ముఖమొక గాయం
మనసొక లోయ
చూపులు క్షుద్రాలు
…..
నది నాకు నేనిచ్చుకున్న కానుక
స్నాత హృదయం నాది. ఓ మూలన కూచోలేని మానవాగ్ని నాది
శతాబ్దాన్ని చీల్చే ఈటె నాది.
హిమ పర్వతాన్ని బాదే వేడి కిరణం నాది
సంఘర్షణ నాది. చివరి విజయం నాది (ఇంద్రవెల్లి)

లాంటి కవితలు చదివినపుడు ఆకాశం బద్దలయ్యేట్టు పైకెగసే కవిత్వం రాసిన కవి కనిపిస్తాడు. ఇతనెక్కడా విరసమో, అరసమో పంచన జేరి చిలుక పలుకులు పలికిన వాడు కాదు. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ లో నాళేశ్వరం శంకరం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఏసుపాదం, నందిని సిద్దా రెడ్డి లాంటి వాళ్ళతో కలసి రఘునాధం ఈ తరం యుద్ధ కవిత లాంటి సంకలనాలు తేవడంలో తనవంతు కృషి చేశాడు. అప్పటి సామాజిక రాజకీయ వైరుధ్యాల్ని, వాటివల్ల నలిగిపోతున్న సామాన్య జీవితాన్ని ఆయా సంస్థాగత వేదికలమీదనుంచి ప్రస్తావించకపోయినప్పటికీ, ఈ కవులందరూ తమ తమ గళాల్లో ప్రజా ప్రగతి శీల దృక్పధాల్నే నినదించారన్నది చారిత్రక వాస్తవం. ఈలా గుడిహాళంలో ఉన్న సామాజిక, రాజకీయ చైతన్యమంతా కూడా సామూహిక ప్రయోజన దిశగా నడుస్తుంది.

వాణ్ణి వాడు అని పిలవొద్దు
ఆకలి అని పిలుద్దాం
….
ఆకలి గాల్లోంచి ఆకలిగా వచ్చాడు వాడు
వాడి నేలంతా ఆకలే
వాడి చినుగుల చొక్కా ఆకలే
ఆకలి సముద్రం పైన పయనించి వచ్చాడు వాడు

నా కలమెప్పుడూ వాడి కోసం సిద్దంగా ఉంటుంది
ఆకలి కాగితం పై ఒక ఆకలి గీతం రాయడానికి (ఆకలి గీతం) అంటాడు. ఆకలి గురించో, అన్యాయం గురించో, కవి చెప్పడం కొత్తేం కాదు. కానీ గుడిహాళం లా ఎవరూ చెప్పలేదు. అతని అభివ్యక్తిలో ఆ కాలం నిజమైన పరిస్తితి కనిపిస్తుంది. అతని ఉద్దేశ్యాలు కనిపిస్తాయి. ఆక్రోశం, ఆవేదన కనిపిస్తాయి. అతను వంటిమీద చొక్కా చించుకుని విషాదం సాలీడులా కన్నీటి గూడు అల్లుకుని, అతనే తనకు తానే గిల గిలా తన్నుకుంటాడు. అతని గుండెల్లో గడ్డ కట్టిన సామూహిక అనురక్తి ఆసంతమూ ఒంటరిగా భోరు భోరుమని నిశ్శబ్దంగా విలపిస్తుంది. అతను బడబాగ్నుల్ని దాచుకున్న గంభీర ఘన సముద్రం లాంటివాడు. అతని కవిత్వం లోతులు తెలియని అగాధం.

గుడిహాళంలోని సున్నితత్వం, మేధోతలమ్మీద నిలబడి మాట్లాడే అతని లక్షణాన్ని కూడ దాచలేదు. ఒకదానికొకటి మించి మాట్లాడతాయి. అన్యాపదేశం కాదు. అన్వయప్రతిభా కాదు. అంతా సాంసారిక ఇష్టాయిష్టాల మధ్య ఆదర్శాల్ని నీతిమంతంగా, ససంకల్పంగా మానవీకరించుకోవడం. ఎప్పుడూ మనిషీ, మానవత్వమూ, కవితా, కవిత్వమూ అంటూ అల్లల్లాడిపోవడమూ ఈ కవిత్వమంతా నిండిపోయి ఉంటుంది. వల వల ఏడ్చిన దుక్ఖమూ ఉంటుంది. అతని అసంగతపై అతనికే చెప్పలేనంత కోపం, విసుగూ, అసహ్యం కూడా కలిగాయి.

దాంపత్యం అన్న కవితలో —

వెచ్చని హాయినిచ్చే పలకరింతల వెన్నెల దృశ్యాల్లో
నీ మాటలెంత సుగంధంగా ఉండేవి
నీ అరమోడ్పు చూపులు అందమైన కలల్ని అల్లేవి
నీ తలపులు ప్రేమ తటాకాలపై వాలి క్రీడించేవి
……
వారాలు రాలాయి; దాంపత్యం కురిసింది
మట్టి వాసన నాలో లేచింది. అసహనం నీలో వీచింది
తెరలు వాలాయి; కలలు కూలాయి;
పాట ఆగిపోయింది
రెండు స్వరాలమై రాలి స్థిరపడ్డాం
పెళ్ళాం ఫ్రేములో నీవు; మొగుడి ఫ్రేములో నేను
అంతే ! అనేస్తాడు. గుండెనెవరో నిలువునా కోసిన శబ్దం వస్తుంది. ఊపిరాడదు. అతని భార్య పేరు జలసూత్రం పద్మావతి. కలసి చదువుకున్నమ్మాయి. అతనంటే ఎంతో ఇష్టమున్న వ్యక్తి. చక్కటి పాటల పాడుతుందనీ చెప్తారు. తామిద్దర్మూ ఫ్రేముల్లో బొమ్మలమయ్యామని అతను చెప్పినపుడు మనకి కోపం రాదు. జీవన ప్రయోజనం లేక నిరాశా శూన్యంలోకి జారిపోయిన అతని అస్తిత్వ రాహిత్యాన్ని మెచ్చలేం గానీ, అతనొక భ్రాంతిలో ఉండిపోయిన క్షణం కనిపిస్తుంది. అలాంటిదే మిడిల్ క్లాస్ యెవ్వనం కవిత కూడా —
……
నీకు తెలీకుండానే
మంచు వంతెన కరిగిపోతుంది
నీలోంచి ఒక్కోమెట్టూ దిగుతూ యెవ్వనం
ఒక్కో మెట్టూ నిన్ను దించుతుంది
కలలు శ్మశానలవుతాయ్
పగళ్ళు నీ కన్నీళ్ళతోనే గలగలమని ప్రవహిస్తాయ్
రాత్రి చీకటి బ్రాకెట్ మరీ మరీ ఇరుకౌతుంది
నీ పద్యం భళ్ళున బద్దలవుతుంది ……అనేస్తాడు.
రఘునాధాన్నేమనాలి ? పొరలు పొరలుగా కప్పబడిన సంక్లిష్ట జీవన సూత్రాల్ని ముళ్ళు విప్పే ప్రయత్నం చేస్తాడో, మళ్ళీ ముళ్ళే వేస్తాడో అంతుబట్టదు. ఇదేమీ ఆధునిక వాదంగానో, మరింకే కొత్త సాంప్రదాయంగానో తోచనివ్వడు. భాషలో ఏమీ అలంకారికత ఉండదు. అతను శ్రీ శ్రీ మహాప్రస్థానం మీద టీకా టిప్పణ్ణి ఒకటి రాశాడంటారు. దాంట్లో శ్రీ శ్రీ శబ్దాలంకార ప్రియత్వాన్ని గురించి విపులంగా చెప్పాడంటారు కూడా. అది వెలుగులోకి రాలేదు. కొన్ని వ్యంగ్య, అధిక్షేప పేరడీ తరహా పద్యాలు కూడా రాశాడనీ కూడా చెప్తారు. ఈ పుస్తకంలో అతని భావజాలమంతా సూటిగానే ఉంటుంది. కాంక్రీట్ గానే ఉంటుంది. ఎక్కడా సటైర్ ఉండదు. అతని పేరడీలు ఎలా ఉండేవో ?

గుడిహాళం ముందు జర్నలిస్టుగా పనిచేశాడు. ఆనక అధ్యాపక వృత్తిలోకెళ్ళాడు. మహబూబ్నగర్ జిల్లా లోని అమరచింత లో పుట్టాడు. 55 ఏళ్ళకే 2010 లో కన్నుమూశాడు. ఈ సంపుటి కాక, ఒక జననం ఒక మరణం సంపుటి తెచ్చాడు. దానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డిచ్చారు. మిత్రులతో కలసి నల్లవలస దీర్ఘ కవిత కూడా రాశాడు. రఘునాధం కవిత్వమంతా కేవలం భావనాపటిమను మాత్రమే చూస్తే పొరబాటవుతుంది. అందులోని అతని ధర్మాగ్రహప్రకటన గొప్ప లక్షణం. అంతర్బాహిరలోకాలకి మధ్య అసామరస్య జీవితాల్ని గడిపే కవుల్ని చూసి అసహ్యించుకోవడం ఇంకా గొప్ప లక్షణం. అతని స్వేచ్చా సరళి ఎలా ఉంటుందంటే —

విప్లవం ముసుగేసుకున్న భావ కవి పేలని తుపాకి
రంగం పై కొయ్యకత్తీ, పేలని తుపాకీ నర్తించడం హత్య
వాటిని మోసుకుని ఊరేగే మధ్యతరగతి
కవి రోగులు హత్య
పద్యంలో ఇమిడిపోవాల్సిన అందం
పద్యం ముందే తెరగా వాలడం హత్య
….
నీవు కూలిపోతావ్.
అయినా దేవులాడుతూనే ఉంటావ్
సంఘం నిన్నొదలదు; సత్య నిన్నొదలదు
భీభత్సం నిన్ను కుక్కలా వేటాడుతూనే ఉంటుంది
కళ్ళు మొసుకుని నీవేమో
అందమైన అలంకారాల కోసం…నీ చుట్టూ బురద గుంటల్లో వెదుకుతూనే ఉంటావ్
నిరాటంకంగా మరో హత్య జరిగిపోతుంది
….
నీకు తెలీకుండానే నీ పద్యం వెనుక దాక్కుని
అందం నిన్ను మోసం చేస్తుంది (పద్యంలో ఇమడాల్సిన అందం) అని నిర్హేతుకంగా రాస్తాడు. మహాకవుల్ని కూడా ఏమాత్రపు సంశయమూ లేకుండా నచ్చనిరోజు నచ్చలేదని ధైర్యంగా చెప్పేవాడని అతని మిత్రులు చెప్తారు. అతని మిత్రుడైన కె నర్సిమ్హాచారి కూతురు రేలా మీద రాసిన కవిత చాలా బాగుంటుంది. కత్తుల చెలిమిలో పుట్టిన దానా ఖడ్గధారవవుతావా మరి ? అన్న వాక్యాలు భలే చదవబుద్దేస్తాయి.

అతను కవిత్వాన్ని ఆపాదమస్తకమూ ప్రేమించాడు. దానికి తనో రూపాన్నిచ్చి ఆరాధ్య దేవతలా పూజించాడు. అతను తన కవితా గీతాల్ని అరచేతుల్లోకెత్తుకున్నపుడు అదెక్కడ జారి కిందపడి ముక్కలు ముక్కలవుతుందోనని, గాయాల్తో వొళ్ళంతా చిట్లుతుందని భయపడతాడు. అతని భయమే అతని కవిత్వం. అతనో భయద విస్తరిత అభద్రమైన కారడవి. అతని కవివం అందులోంచి ఏమూలనో ఆమాయకపు కళ్ళతో తొంగి చూసే లేడిపిల్ల. అతని అనంతమైన చదువుకున్నతనం వల్లనో ఏమో మనమతన్ని చదవగల సారళ్యాన్నంత త్వరగా ఇవ్వదీ పుస్తకం. అతనో అంతర్ముఖుడు. అతని చూపు ఇప్పటిదాకా కనబడని నాలుగో పురుషబోధక సర్వనామ అనార్కిస్టు కన్నులది. అతను కవిని ఏ కాలంలోనైనా ఏకవచనంగా ఉండాల్సిందేనని శపించిన పచ్చి తాగుబోతు.

అతను మా గుడిహాళం. అంతకుమించేమీ లేదు.

And he is the mad eye of the fourth person
singular of which nobody speaks
and he is the voice of the fourth person singular in which nobody speaks
and which yet exists
with a long head and a foolscap face
and the long mad hair of death
of which nobody speaks

Lawrence Ferlinghetti
HE (Allen 1960: 136)

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

33 comments

 • ఎన్నుకున్న పుస్తకాన్ని ,పట్టుకున్న కవిని
  చాలా లోతుగా హృదయానికి హత్తుకునే విధం గా చెప్పడంలో మీరు నిలుస్తున్నారు.
  మంచి ప్రయత్నం ఈ కవి,ఈ పుస్తకం ఇప్పుడు
  మరో సారి సాహితీ ప్రియుల్లోకి వెళ్ళాలి.
  మీ మలి చూపుకి హాట్సాఫ్

 • నీవొక భీకర యుద్ధానివి,నేనో శతధారా ఖడ్గాన్ని.మరో మాటే లేదు ఈ కవిత్వం ఖచ్చితంగా చదివితీరాల్సిందే.నువ్వు నేను అంటూ ఇరువురి నడుమ జరిపిన సంభాషణను ఏంతటి పదునైన పాళీతో సిరాక్షరించాడో గాని అద్దం లాంటి కవిత్వాన్ని మన ముందు నిలబెట్టి యుద్ధం ప్రకటించాడు.ఈ బీభత్స ఏకాంతంలో సుడులు తిరిగి మనం తీరానికి చేరుకుంటామో అనే ఆలోచన ఆసక్తిగా ఉంది. ఇంతటి గొప్ప వివరణతో కవిత్వంలోని మలిచూపును కళ్ళకు కట్టిన మీకు,రఘు గార్కి సదా అభినందనలు..

 • విశ్లేషణ చాలా బాగుంది.రామ్ గారు మీకు బ్లాగు వుందా.మీకవితల్లో చాలా మెచ్యూరిటీ వుంది.మీ పరిచయం అయినందుకు చాలా సంతోషం

 • గుడిహళం, గురించి ఇప్పటి వరకు తెలియక పోవడం నా తప్పిదమే!త్రిశ్రీ., వెలుగులోకి తెచ్చిన, వారిగురించిన మీపరిచయం. చాలా బాగుంది.!💐👌సర్..అభివందనలు.!

  • అలా ఏం అనుకోవద్దండీ. దొరికినప్పుడు చదివేయడమే మనం చేయగల పని.

   మీ అభిమానానికి కొలమానం లేదు.

 • గుడిహాలం గురించి గుండెకు హత్తుకొనేలా పరిచారు. కుండ బద్దలు కొట్టినట్లు ఉన్న తన కవిత్వం భయం నీడలోంచి పొంగింది అంటే మాత్రం నమ్మకం కలగట్లే. చిక్కటి కవిత్వ గాయాల్ని వెచ్చని దుఃఖపు గేయాలుగా మనసులో నాటారు. Bowing my head before fourth person singular ..Not as a single person. Kudos sriram sir

 • శ్రీరామ్ ఈ వారం గుడిహాళం రస్తా లో మమ్మల్ని నడిపించావ్.చక్కగా ఉంది

 • నీ నిబద్ధత కి ముందు ఒక నమస్కారం.ఎక్కడినుంచి ఏరుకొస్తావు పదాలు ఎలా రాస్తావు ఎన్ని గంటల బ్యాంకు ఉద్యోగం. ఎన్ని రోజులు రాస్తావు.ఎంత అసూయగా ఉంటుంది నాకు ఇలాంటి వ్యాసం ఒకటి రాయాలని. ఒక్క వాక్యం అయినా తరాజులో పడేసి తూకం వేయించుకోవాలనే కోరిక తూగను అని తెలిసినా ఒక వెర్రి ఆశ. ఎంత బావుందో వ్యాసం మాటల్లో చెప్పలేను. గుడిహాలం ని కొత్తగా మళ్ళీ చదవాలి. మరిన్ని వ్యాసాలు మీ నుంచి ఆశిస్తూ…

 • చక్కని విశ్లేషణ శ్రీరామ్ గారు..

 • అతను కవిత్వాన్ని ఎంతగానో ప్రేమించి ఒక రూపాన్నిచ్చి దేవతలా పూజించి గీతాలుగా అరచేతుల్లోకి ఎత్తుకున్న అద్బుతాన్ని మరింత అద్భుతంగా మాకు పరిచయం చేశారు
  చాలా నచ్చింది.. అభినందనలు..

 • అజంతాని, త్రిశ్రీ ని చదువుకున్న నేను గుడిహాళం ని చడవలేకపోయాను. ఎందుకో ఆలోచించుకుంటే ఇప్పటికీ కారణం కానరావడం లేదు. సత్యాన్ని ఇంతగా కావలించుకున్న కవిని ఎందుకు చడవలేకపోయానా అనే దిగులు వెంటాడుతుండేది. ఆ దిగులు ఈ సమీక్ష మరింత పెంచింది.
  సమీక్ష కవి ఆత్మని గుండెల్లోకి ఒంపింది. గూడిహాళం గారికి జోహార్లు.
  వారి కవిత్వం పై మంచి సమీక్ష రాసిన మీకు, ప్రచురించిన రస్తా కి అభినందనలు

 • గుడిహాళం కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు విశ్లేషణ చదివిన వారికి ఆయనే కాదు, మీరు కూడా కవిత్వాన్ని ఎంత ప్రేమిస్తారో అర్థమవుతుంది.

  • నా మనసు గ్రహించారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి మీకు ?

 • Oka mahonnatha kavini lothugaa pariseelinchaaru… Parisodhinchaari… Maaku as kavithva lothulanu choopincharu. Tku very much… Good review..

 • అన్న..ఇన్ని రోజులు గుడిహలం గార్ని చదవలేకపోయా.. మీ సమీక్ష చదివాక గొప్ప థ్రిల్ ఫీల్ అయ్యా…
  ఎక్సలెన్ట్ అన్న…

 • ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ లో గుడిహాళమ్ గారు వారి తదితర మిత్రులు కలిసి”విపస్యన’ అనే పేరున మూడు కవితా సంపుటాలు కూడా ప్రచురించారు.తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని కవిత్వం రాశారు. గొప్ప కవి.మీరు గుడిహళం గారి కవిత్వాన్ని మీదైన శైలి లో లోతుగా పరిశీలించి రాసిన సమీక్ష అద్భుతం.
  చిన్న వయసులోనే వెళ్లిపోయిన వారికి స్మృత్యన్జలి ఘటిస్తూ… ఓ మంచికవిని పరామర్శించిన మీకు శుభాకాంక్షలు💐💐💐💐💐

 • గుడిహాళం గారిపై మీ మాటలు అనితరసాధ్యం

 • గుడిహాళం సార్ కవిత్వ వాక్యాలు మనసును తడుతున్నాయి …ఇక బుక్ చదివితే ఎట్లుంటదో…చాలా బాగుంది సార్ సమీక్ష వ్యాసం… అభినందనలు.

 • విశ్లేషణ చాలా బాగుంది. గుడిహాళం వారి కవిత్వాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఇంత గొప్పగా సమీక్ష చేయటం అసాధ్యం. విశ్లేషణ మాత్రమే కాదు, మీరు ఎంచుకున్న కవితల్లో మీ కవిత్వ ప్రేమ కూడా తేటతెల్లమైంది. అభినందనలు

 • మంచి విశ్లేషణ శ్రీరాంగారూ! అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.