బాలల చదువులు
బతకడానికా చావడానికా… ?

విద్యావ్యవస్థ గురించిన చర్చ రాగానే చాలామంది ప్రస్తావించేది ‘అవునవును నారాయణ, చైతన్య వంటి విద్యా కర్మాగారాలను అదుపు చేయాలి’, ‘విద్యావ్యవస్థలో మార్పు రావాలి’, ‘ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసించాలి’ … ఇలాంటివి చాలా. కానీ, ఆచరణలో అది సాధ్యమా!!!? ఇటీవల పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులలో రకరకాల కారణాల వల్ల బలవన్మరణం పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాలలో సాంకేతిక తప్పుల వల్ల ఫెయిల్ అయినా కొంతమంది బలవన్మరణం పొందారు (తరువాత రీ వాల్యుయేషన్ లో వారిలో కొందరు పాస్ అయినట్టు తెలిసింది). ఇలా ఒక్కో విద్యార్ధి బలవన్మరణానికి ఒక్కో కారణం ఉంటోంది. ప్రేమ విఫలం కావడం, ర్యాగింగ్, ఒత్తిడి తట్టుకోలేకపోవడం, వేధింపులు భరించలేకపోవడం … ఇలా రకరకాల కారణాలు. ఇవేమీ కొత్తగా జరుగుతున్నవీ కావు. ర్యాగింగ్ వంటి వికృత చర్యకు బలై/గురై విపరీత మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్ లో ఉండి, ఇప్పటికీ ఆజ్ఞాపకాలతో బాధపడుతూ, డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోతున్న వ్యక్తి ఒకతన్ని మా సమీప బంధువుల్లో చూశాను అంతేకాక పలుమార్లు అతడితో వ్యక్తిగతంగా మాట్లాడాను కూడా. కానీ, తల్లిదండ్రులు మరియు కొందరు ఇతరులు అండగా నిలబడంతో అతడు మానసికంగా చాలా కోలుకున్నాడు. కానీ, ప్రతి సంవత్సరం యిటువంటి అనుభవాలతో బలవన్మరణాలకు పాల్పడే వారు లేదా డిప్రెషన్ కు లోనయ్యేవారు చాలామంది ఉంటున్నారు. పరిస్థితిని మార్చడం మాత్రం జరిగేపని కాదనిపిస్తోంది. ఎందుకు అలా కాదనిపిస్తోందో నా అనుభవం ఒకటి వివరించి చెబుతాను

మాది కర్నూలు జిల్లాకు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే గని అనే పేరు గల గ్రామం. గత కొద్ది సంవత్సరాలుగా మా ఊరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మా గడివేముల మండలంలోని ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మరింత చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు. పాఠశాలలో మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు చక్కటి నిబద్ధతతో పని చేస్తూ, విద్యార్థులకు తగిన శిక్షణ ఇస్తున్నారు. మా ఊరినుండి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మండల కేంద్రమైన గడివేములలోని ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. కొందరితో మాట్లాడాను ‘మన ఊరి ప్రభుత్వ పాఠశాల ప్రతి సంవత్సరం ఆ ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది కదా, మరి ఇంకా అక్కడికెందుకు పంపడం?’ అని. మరో విషయం ఏంటంటే నేను సేకరించిన సమాచారం మేరకు ఇంటర్/డిగ్రీ చదువుతున్న వారిలో మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు, మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివిన వారికంటే మెరుగ్గా ఉన్నారు. తల్లిదండ్రుల సమాధానం ఒకటే ‘ప్రైవేట్ బడి మేలు అయ్యా, వీళ్ళు సదువుతన్నారో లేదో మాకు ఎరుక లేదు, ఆడ అయితే ఆళ్ళే అన్నీ సూసుకుంటారు’ అని. అక్కడ వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ, విద్యార్థులను ఒత్తిడికి లోను చేస్తున్నారు అని మాత్రం చెప్పగలను.

మా ఊరి వారి వరకూ అయితే ప్రైవేట్ బడి మేలు అన్న భావన ఉంది. బహుశా నంద్యాల, కర్నూలు లేదా మరో పట్టణ ప్రాంతానికి వెళితే నారాయణ, చైతన్య వంటి బడా విద్యా సంస్థలు మేలు అనే భావన ఏర్పడి ఉండవచ్చు. ఎందుకంటే వారు వారి వద్ద చదివే వేలాది మందిలో బాగా పైకెదిగిన పదుల మంది ఫోటోలు వేసి విపరీత ప్రచారం నిర్వహిస్తారు. ఇపుడు కొంతమంది పిల్లలు స్వీయమరణాలు పొందగానే ఆ విద్యాసంస్థలు చెడ్డవైపోయాయా? వాటి తీరు ఎలా ఉంటుందో మనకు ఇపుడు కొత్తగా తెలిసిందా? అంతెందుకు – తరువాతి విద్యా సంవత్సరం ఆ విద్యా సంస్థల్లో చేరికలు ఏమన్నా తగ్గుతాయా!? అవేవీ జరగవు, జరిగే అవకాశాలూ లేవు. అంతెందుకు ఆ విద్యాసంస్థల్లోని బలవన్మరణాలు గురించి రాసిన పత్రిక విలేఖరి పిల్లలు కూడా ఆయా పాఠశాలల్లోనే చదువుతూనే ఉంది ఉండవచ్చు లేదా చేరవచ్చు కూడా. దీనికంతటికి కారణం ఆ విద్యాసంస్థలు మాత్రమేనా? పిల్లల్లో వైఫల్యం పట్ల ఎందుకంత భయం ఏర్పడుతోంది? వారిలో ఓటమి తాత్కాలికమే అనే పోరాటతత్వం ఎందుకు లోపిస్తోంది? అసలు ఈ విద్యాసంస్థలే కాదు, ఇంట్లో వారైనా పిల్లలకు పోరాడే తత్వాన్ని నేర్పగలుగుతున్నారా అని అనుమానం. బానిసత్వాన్ని నరనరాన నింపుతూ ఇటు ఇంట్లో, అటు విద్యా సంస్థల్లో యంత్రాలుగా తయారు చేసే పనిలో ఉన్నారు తప్పించి వారి మనస్తత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం లేశమాత్రం చెయ్యట్లేదు.

ఇలా రెండువైపులా జరిగే నిర్బంధపు ఒత్తిడిని తట్టుకోలేని నిర్బలమనస్కులు ఎవరైనా బలవన్మరణానికి పాల్పడినప్పుడు నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలను తిట్టుకోవడం, ప్రస్తుత విద్యా విధానాన్ని విమర్శించటం తప్పించి ఏమీ జరగట్లేదు. ఇక జీవితంలో ఎదుగుదల అనేది ప్రైవేట్ చదువులతోనే అని ఇంకా భావిస్తున్న వారు గుర్తించడానికి ఇష్టపడని విషయం ఏమిటంటే, ఇవ్వాళ వారు వారి పిల్లలకు ఉదాహరణగా లేదా ఆదర్శంగా చూపుతున్న అనేకమంది గొప్పవారిలో 90% మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించినవారే. వారి నిబద్ధతను, వారు ఎదిగిన తీరును, సమస్యలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యాన్ని – ఇటువంటి వాటిని ఆదర్శంగా చూపరు. వారికి ఆదర్శంగా లేదా అందంగా కనిపించేది, పిల్లలకు చెప్పేది కేవలం ఆ గొప్పవారు చివరాఖరుకు చేరిన ‘స్థాయి’ని మాత్రమే. మార్గాన్ని వదిలేసి, గమ్యాన్ని మాత్రమే చూసే వారికి ఇపుడు జరుగుతున్న ఘటనల వెనుక కేవలం విద్యాసంస్థల తప్పు, విద్యావ్యవస్థ లోపభూయిష్టత మాత్రమే కనబడతాయి గురువిందగింజలాగా. ప్రైవేట్ పాఠశాలల్లో చదువు మాన్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే చాలు అని నేను చెబుతున్నానని అనుకుంటే ‘థూ … దీనమ్మ జీవితం’ అనుకోవడం తప్పించి చేసేదేమీ లేదు.

ఎటువైపీ పయనం అంటూ వగచడం వృధా. ఇంటికొచ్చిన బంధువులకు మన పిల్లలు నారాయణ, చైతన్య లాంటి ‘పెద్ద’ కర్మాగారాల్లో తయారు చేయబడుతున్నారు అని చెప్పుకోవడాన్ని గొప్పగా భావించే భావజాలం పోనంతవరకూ ప్రాణాలు పోతూనే ఉంటాయి తప్పించి పరిస్థితుల్లో మార్పేమీ రాదు, పిల్లల తల్లిదండ్రులు మారనివ్వరు కూడా

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.