వెండితెర మీద మేడే

“నేను 1950 జనవరిలో 18తేదీన పుట్టాను. కాశీమజిలీ కధలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కధ ఉంది. దేవుళ్ళపేరు కాకుండా, వైవిధ్యంగా ఉంటుందని, కమ్యూనిస్టు అయిన మా మేనమామ నాకు ఆ పేరు పెట్టాడు.” అని అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ తన అరుదైన పేరు గురించి వ్రాసుకున్నారు.  పేరు పెట్టిన మేనమామ గారికి ఆ పేరే స్ఫురించడానికి మరో కారణం అదే సంవత్సరం (1950) విడుదలైన అదృష్టదీపుడు చలనచిత్రం కారణం కావచ్చు (ఇది గుమ్మడిగారికి మొదటి సినిమా).

అదృష్టదీపక్ గారి తల్లిదండ్రులు ఇద్దరూ బాగా పాడేవారు.  మేనమామ గేయాలు వ్రాయడమేగాక చిన్నతనంలో అదృష్టదీపక్ తో పాడించేవారు. పుస్తకాలు చదవటం, పాటలు పాడటం, రచనావ్యాసంగం చిన్ననాటి నుండి అలవరచుకున్న అదృష్టదీపక్ జీవితంలో ఎర్రజెండా ఒక భాగమైపోయింది. ఈ నేపథ్యంలో కవిత్వం వ్రాయటం, గేయాలు వ్రాయడం, కథలు వ్రాయటం, అభ్యుదయ రచయితగా పేరు రావడం, అనేక బహుమతులు అందుకోవడం చదువుకు సమాంతరంగా సహజంగా జరిగిపోయాయి.

ఆరుద్ర గారి కూనలమ్మ పదాల శైలిలో ‘కోకిలమ్మ పదాలు’, ఇంకా ‘అగ్ని’, ‘సమరశంఖం’, ‘ప్రాణం’ పుస్తకాలు ఆయన వయస్సు 20లలో ఉండగానే (సినిమాల్లోకి రాక పూర్వమే) ప్రచురించబడ్డాయి.

‘అరుణతార’ మాదాల రంగారావు సారథ్యంలోని ‘నవతరం పిక్చర్స్’ వారి ‘యువతరం కదిలింది’ సినిమాలోని ‘ఆశయాల పందిరిలో’ పాటతో ఆయన సినిమాల్లో ప్రవేశించారు. అనూహ్య విజయం సాధించిన యువతరం కదిలింది ఇచ్చిన స్ఫూర్తితో ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు మాదాల రంగారావు సినిమాలు తెలుగు సినీ ప్రపంచంలో ఒక దుమారం రేపాయి.

నవతరం వారి రెండవ ప్రయత్నంగా 1981 లో వచ్చిన ‘ఎర్రమల్లెలు’ సినిమా ఒళ్ళు గగుర్పొడిచే అదృష్టదీపక్ పాట తో మొదలవుతుంది.  ప్రపంచ కార్మిక దినం మేడే గురించిన ఆ పాట సాహిత్యం చూద్దాం.

అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు
ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు
అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా
కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు
మేడే మేడే నేడే మేడే

సమభావం మానవాళి గుండెలలో నిండగా
సకలదేశ కార్మికులకు ఈనాడే పండగ
లోకానికి శ్రమ విలువను చాటిన రోజు
ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు
మేడే మేడే నేడే మేడే

వేదనలూ రోదనలూ అంతరింపజెయ్యాలని
బాధల కేదారంలో శోధన మొలకెత్తింది
చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినపుడు
చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది
మేడే మేడే నేడే మేడే

భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన
రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి
బిగిసిన ఈ పిడికిళ్లూ ఎగిసిన ఆ కొడవళ్లూ
శ్రామికజన సారథిగా క్రమించమని అడిగాయి
మేడే మేడే నేడే మేడే

ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాల
ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు
ఐక్యంగా నిలవాలి కదనానికి కదలాలి
సామ్యవాద సాధనకై సమరం సాగించాలి
మేడే మేడే నేడే మేడే

మే ఒకటో తారీకు ప్రపంచ కార్మిక దినం గా పరిగణింపబడటానికి కారణమైన సంఘటనలు షికాగోలో 1883 మే 1 నుండి మే 4 వరకూ జరిగాయి.  ఎనిమిది గంటల పరిమితి గల పనిదినం కోసం మే 1న ప్రారంభమైన సమ్మె హింసాత్మక పరిణామాలకు దారితీసింది. ఉత్తరోత్తరా మే 1 శ్రామికుల ఉద్యమాలకు కేంద్ర బిందువై కార్మిక దినంగా ఈరోజుకీ జరుపుకోబడుతోంది.

పాట పల్లవి లోనే ఈ విషయాలను జ్ఞప్తికి తెస్తూ ‘అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా/కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు’ అని అద్భుతమైన ఎత్తుగడతో పాట ప్రారంభించారు అదృష్టదీపక్.  ‘సమభావం మానవాళి’ అంటూ సాగే రెండవ చరణం ఇదే భావాన్ని మరింత అందంగా కొనసాగిస్తుంది.

మూడవ చరణంలో అక్టోబరు విప్లవానికి పూర్వం ఉన్న రష్యా సమాజాన్ని వర్ణీంచడానికి బాధలకేదారం అన్న అద్భుతమైన ఉపమానం వాడారు కవి. కేదారం అంటే పాదు లేక మడి. మట్టితో బురదతో నిండి ఉన్న కేదారం నుండి శోధన అని మొలక వచ్చిందట. ఇది కేవలం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కవికి మాత్రమే తట్టే పోలిక.  (ఎక్కువమంది ఇటువంటి సందర్భంలో పంకంలో నుండి వచ్చిన పద్మం అని వ్రాస్తారు). ఆ శోధన ఫలితంగా వచ్చిన రష్యా విప్లవంలో చిందిన రక్తం ఎర్రజెండా గా మారిందని వర్ణించే ఈ చరణం నాకు అత్యంత ఇష్టమైనది. పదేళ్ల వయసులో మొదటిసారి విన్నప్పటి నుండి అలా గుర్తుండిపోయింది. అభ్యుదయ భావాలు, చరిత్ర, చక్కని కవిత్వం కలిసి రూపొందిన ఈ చరణాన్ని (ఆ మాటకొస్తే మొత్తం పాటను) ఈ రోజున కవిత్వం రాస్తున్న వామపక్ష కవులు అధ్యయనం చేయాలని నా అభిప్రాయం.

నాల్గవ చరణం మిగతా చరణాలంత బాగానూ ఉంటుంది. ఇందులో క్రమించడం అన్న అరుదైన మాట వాడారు రచయిత. ఆక్రమించటం, అతిక్రమించడం, చంపటం మొదలైన అర్థాలు ఉన్న ఈ మాట ద్వారా   విప్లవాన్ని సామ్యవాదాన్ని వీలైనంతవరకు విస్తరింపజేయడం అనే ప్రధాన ఆశయాన్ని శక్తివంతంగా చెప్తుందీ పాదం.

కానీ అలా జరగాలంటే సంఘటితమైన కార్యాచరణ, ఐకమత్యం, సమష్టిగా ఒకే గమ్యం వైపు కదిలే ఉద్యమ దృష్టి ఉండాలి.  చీలికలు పేలికలు అయిపోయి అంతర్గత వైషమ్యాలతో దారీ తెన్నూ లేక, నానాటికీ నిర్వీర్యం అయిపోయిన కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆవేదన, మళ్లీ కలిసి ఉండాలన్న ఆకాంక్షలతో గీతం ముగిసి ఆలోచింపజేస్తుంది.

ఎర్రమల్లెలు సినిమా లాగే ఈ పాట కూడా ప్రచార సాధనం. అయినా ఇది చాలా మంచి పాట. అర్థంలో, శబ్దంలో, శిల్పంలో ఎక్కడా తక్కువ లేనిదీ పాట. ఆనాటి నుండి ఈనాటి వరకు మార్క్సిస్టు పార్టీ ల పరిస్థితి మరింత దిగజారి పోయినా ఈ సినిమాలోని మిగతా పాటల్లాగే ఇది నాలుగు కాలాల పాటు నిలిచి ఉండే పాట,

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.