సుభాషిత భూషణుడు
ఏనుగు లక్ష్మణ కవి

నడక నేర్చి నాగరికత పెంచుకొని ప్రాభవం చెందుతున్న ఏ రాజ్యంలోనైనా నీతిని బోధించే సామాజిక తత్వవేత్త కనీసం ఒకడైనా ఉండక మానడు. వడివడి గా వేగంగా పరుగెత్తే జీవనంలో సామాజిక విలువలు హద్దులు దాటిపోకుండా అదుపు చేసే సామాజిక వేత్తలుంటారు. ప్రతీ తరంలోనూ అటువంటి ప్రబోధకులుంటారు. వారు ఎంచుకొనే మార్గాలు వేరుగా ఉండొచ్చునేమో కానీ, ఆశయాల విషయంలో సారూప్యత ఉంటుంది.

కొందరు ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రజలకు నీతులు బోధించి శాంతివైపు నడిపించ ప్రయత్నిస్తే, కొందరు కళా ప్రదర్శనల ద్వారా, కొందరు నిష్టతో కూడిన జీవితాన్ని గడిపి మిగతా వారికి ఉదాహరణగా నిలవడం ద్వారా, మరి కొందరు క్షరము లేనిదైన సాహిత్య సృజన ద్వారా, తమ నీతులను ఒడుపుగా కూర్చిన సుభాషితాల ద్వారా సమాజపు లోతుల్లోకి ప్రబలేట్టుగా చేస్తారు. అటువంటి అక్షర శిల్పులను జాతి తాను మనగుడ సాగించినంత వరకూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వారు చెక్కిన కొన్ని సూక్తులు కాలాన్ని బట్టి, మారుతున్న తరాలలో జనులు ఆపాదించుకునే విలువలనుబట్టి కొంత పాతబడవచ్చేమో కాని, మిగతావి మాత్రం కాలంపోటుకు నిలబడి అజరమారమై నిలుస్తాయి. ఆ రాతగాళ్ళను చిరంజీవుల లాగా ప్రజల నాలుకలపై నిలుపుతాయి.

అటువంటి వారిలో ప్రాచీన సాహిత్య యుగంలో సుమతీ శతకం రాసిన బద్దెన, మధ్య యుగంలో మహాకవి వేమన, మలి యుగంలో ఏనుగు లక్ష్మణ కవి వంటి వారు సుప్రసిద్ధులు. ముందున్న ఇద్దరూ నీతి శతకాలు స్వతంత్ర రచనగా చేస్తే ఏనుగు వారు సంస్కృతంలో రాయబడ్డ సుభాషితాలను ఉత్తమ శ్రేణి నైపుణ్యంతో అందమైన తెలుగులో అనువదించడం ద్వారా కీర్తి సాధించారు

ఎప్పుడో ఒకటవ శతాబ్దంలో భర్తృహరి అనే ఒక కవిరాజు వైరాగ్యం చెందినవాడై తన సింహాసనాన్ని సోదరుడికప్పగించి వానప్రస్థుడై చరించి, నీతులపై, శృంగారంపై, వైరాగ్యం పై ముచ్చటగా మూడు శతకాలు రాసి సుభాషిత త్రిశతి గా జనులకందించి రెండువేలేళ్ళుగా వారి నోళ్ళలో నానుతున్నాడు. దానిని తెలుగులో ఏనుగు వారు కాక మరో ఇద్దరు ప్రసిద్ద కవులు కూడా అనువదించారు – ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. కానీ ఏనుగు లక్ష్మణకవి అనుసృజించినవే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఈయన అనువాదం యథామూలంగా, మనోహరంగా, ప్రౌఢ శైలిలో, సందర్భోచిత సముచిత శైలిలో ఉండినదై, మూలకవి హృదయాన్ని అర్థం చేసుకొని రచింపబడినదై పండిత పామరులను సైతం మెప్పించింది. అందుకే ఏనుగు వారి సుభాషత అనువాదమే ఎక్కువమందిని చదివించాయి. ఏనుగు వారి అసలు పేరు పైడిపాటి లక్ష్మణకవి. వారి వంశంలోనివారి సాహిత్య ప్రతిభకు బహుమతిగా ఏనుగులు పొందడం వల్ల ఏనుగుగా ఇంటి పేరు స్థిరపడింది.

ఆకాశవాణి లో 40 యేళ్ళుగా ప్రతి రోజూ సంస్కృత పాఠానికి ముందు పాటగా ప్రసారమయ్యే స్వరమాధుర్యంతో కూడిన ఈ భర్తృహరి శ్లోకం ముందుగా గమనించి, తరువాత మన కవి ఏనుగు వారు ఎలా తెలుగు పదాలలో బంధించారో చూద్దాం.

శ్లోకము ।।
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

సంధి విగ్రహం :
కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః,
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః,
వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,
క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.

శబ్దార్థం:
కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని, హారాః = ముత్యాల హారములు, న = న , చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి, న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత ఇవేమీ అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,

వాణీ = ఏ వాక్కు, ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో, క్షీయన్తే = కాలక్రమేణా నశించును, అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము.
భావము/విశేషము :

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు గానీ పురుషుని అలంకరింపవు. చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణలు పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు. వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి సుభాషితాలలోని నీతి శతకంలో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితానికి, ఏనుగు లక్ష్మణ కవి అంతే ధీటుగా తెనుగు చేశాడు:

ఉ॥
భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .

ప్రతి పదార్థము :
మర్త్యులకు = మానవులకు; భూరి = గొప్పవైన, అంగద = భుజకీర్తులు, మయ = నిండిన; తార హారముల్ = సూర్య చంద్ర హారములు, భూషిత ప్రకాశించెడు , కేశపాశ = వెంట్రుకల ముడుల, మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ = మెత్తని పూలతో కూడి సువాసనలు నిండిన జలక్రీడలు, భూషలు కావు = అలంకారాలు కావు, పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి = పురుషునికి అలంకరణ చేసేది శాస్త్ర సంస్కారములు గలిగిన వాక్కు ఒక్కటే, వాగ్భూషణమే సుభూషణము = చక్కని మాటలు అను ఆభరణమే అసలు సిసలైన ఆభరణము, భూషణములు నశియించు నన్నియున్‌ = తతిమ్మా అలంకరణలూ ఆభరణాలు ఎప్పటికైనా నశించేవి.

భావము = పురుషునికి భుజ కీర్తులు, సూర్యహారములు, చంద్రహారములు మొదలైన ఆభరణము గానీ, స్నానము, చందనము పూసుకొనుట, పూలు ముడుచుకొనుట, తలను అందముగా దువ్వుకొనుట మొదలగు వానిలో ఏదీ అలంకారము నీయదు. శాస్త్ర సంస్కారము గల వాక్కు ఒక్కటే అలంకారమును కలుగజేయును. సువర్ణమయ భూషణములు నశించును. వాగ్భూషణమొక్కటే నశింపని భూషణము

ఇక్కడ వాక్కు అనగా విద్య అని అన్వయించుకోవాలి. మరి మన సాహిత్యపు మొదటి రూపం మౌఖికం కదా! మన మొదటి శాస్త్రవేత్త పాణిని తన అష్టాధ్యాయి సిద్ధాంతాన్ని భాషా ద్వని శాస్త్రం మీదే కదా చెప్పింది! అసలందుకనే సాహిత్యానికీ విద్యకూ ఉమ్మడిగా మనం ఇచ్చిన పేరు వాఙ్మయము కదా !

ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదంలోని నీతి ఏకాలాలకైనా వర్తించేది. మానవ జీవితంలోని ఛాయలలో ఏయే పద్దతులలో మసలుకోవాలో చెప్పాడు. అందుకనే తన నీతి శతకాన్ని ఈ విధమైన పద్దతులుగా విభజించాడు : మూర్ఖ, విద్వత్తు, మాన శౌర్య, అర్థ, దుర్జన, సుజన, పరోపకార, దైవ, కర్మ. ఎన్నో మంచి పద్యాలను ఈ పద్దతులలో మనం చూస్తాం. ఈ విధంగా జీవితంలోని అన్ని పార్శ్వాలపై తమ నీతి కావ్యాల ద్వారా జనులను సరైన దారిలో పెట్ట యత్నించిన మహా కవులు, వారికి జేజేలు, వారినెప్పుడూ తలుచుకుంటాం.

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.