ఆ ఒకటి శాతం పెత్తనాన్ని
వొదిలించుకుంటే సుఖం

భారతదేశంలోని ప్రజా సమస్యలపై క్రియాశీలంగా పనిచేస్తున్న అమెరికాలోని (ముఖ్యంగా మసాచుసెట్స్, న్యూ యార్క్ రాష్ట్రాల్లో) ప్రోగ్రెసివ్ సర్కిల్స్ లో జస్పాల్ సింగ్ (పైన ఫొటో) సుప్రసిద్దులు. ఒక నెలలో కనీసం రెండు మూడు రోజులు తెల్లవారు ఝామున్నే, ‘రిఫ్లెక్షన్స్’ అనే అతి సామాన్యమైన సబ్జెక్ట్ లైన్ తో ఉన్న ఈ-మెయిల్స్ ఆయన సన్నిహితులను హృద్యంగా పలకరిస్తాయి. ప్రపంచం నలుమూలల్లో పీడిత ప్రజలపై జరుగుతున్న హింసతో మానవత్వంపై నిరాశ ముప్పిరిగొంటున్నప్పుడే, సమకాలీన పరిస్థితులను (ఒక్కోసారి చారిత్రిక సంఘటనలతో) అనలైజ్ చేస్తూ మనుషులుగా సంఘటితమవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి ఈ ‘రిఫ్లెక్షన్స్’. తన ఆలోచనలను ”రస్తా పాఠకులతో పంచుకునేందుకు అనువాదం చేస్తామని అడగగానే సంతోషంగా ఒప్పుకున్న జస్పాల్ గారికి ధన్యవాదాలు.

జూన్ 14, 2019

వేసవి మొదలవబోయే ఈ కాలంలో కేంబ్రిడ్జ్ సిటీ(మసాచుసెట్స్ రాష్ట్రం) చాలా అందంగా ఉంటుంది. ప్రతిచోటా అందమైన పువ్వులూ, మృదువైన లేత ఆకులూనూ. ఉదయాన్నే చార్ల్స్ నది ఒడ్డున నడుస్తూ నీటిలో సూర్యుని ప్రతిబింబం చూస్తున్నప్పుడు, నాకు వర్డ్స్ వర్త్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది, ప్రపంచంలో అంతా బాగానే ఉంది! ‘నిజంగా బాగానే ఉందా?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కిడ్నీ సర్జరీ తరువాత నా ఆరోగ్యం కుడుటపడుతోంది. గత బుధవారం, మా ఫోరమ్‌కు వెళ్లినప్పుడు  అందరినీ చూడటం చాలా బాగుంది. డాక్టర్లు నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్న స్నేహితులకూ, బంధువులకూ, శ్రేయోభిలాషులకూ నా కృతజ్ఞతలు.

అమెరికాలో 36 మిలియన్ల మంది వయోజనులు ఉన్నారనీ, వారికి చదవడం,  వ్రాయడం వంటి బేసిక్ స్కిల్స్ లేవనీ, వారిలో ఎక్కువ మంది తెల్లవారు అనీ ఒక వార్తా కథనం నివేదించింది. అమెరికాలోని వయోజన జనాభాలో ఎక్కువ శాతం ఉన్నది తెల్లవాళ్లే. అసలింతకు ఏం జరుగుతుంది? ఒక స్నేహితుడు అమెరికా ప్రజలపై  ఉద్దేశపూర్వకంగా “డంబిఫికేషన్”(Dumbification) జరుగుతోందని వ్యాఖ్యానించాడు. వయోజన విద్య కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులను తగ్గించాయని ఆ వార్తా నివేదిక సూచించింది. వాళ్లు నలభైలలో ఉన్న ఒక తెల్ల యువతిని ఇంటర్వ్యూ చేశారు. గత మూడు సంవత్సరాల్లోనే ఆమె చదవడం, వ్రాయడం నేర్చుకుందట. ఆ చదువు వల్ల ఆమె ఒక పాఠశాలలో కాపలాదారు ఉద్యోగం సంపాదించింది. ఆ ఉద్యోగంలో క్లీనర్లు రసాయనాలపై ఉన్న లేబుల్సూ, సూచనలను చదవడం, నివేదికలు రాయడం వంటి పనులు చెయ్యాలి. చదువడం రాకముందు ఆమె ఆ ఉద్యోగం సంపాదించలేకపోయింది.

చాలా సంవత్సరాల క్రితం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఘెట్టోలోని వయోజన విద్యా కేంద్రంలో వాలంటీర్‌గా బోధించేవాడిని. విద్యార్థులు చాలా మంది నల్లజాతీయులూ, ఈ దేశానికి వలస వచ్చిన వయోజనులు. వారి నేపథ్యం కారణంగా వాళ్లకు సరైన అవకాశాలు ఉండేవి కావు. వారు చాలా కష్టపడేవాళ్లూ, తెలివిగలవాళ్లూనూ. ఎంతో మంది విద్యార్థులతో నాకు చాల మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక సారి నేను లండన్ నుండి వచ్చి లోగాన్ విమానాశ్రయంలో సామాను కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరో నన్ను భుజంపై నొక్కి “మిమ్మల్ని లోపలికి అనుమతించిందెవరు?” అని అడిగాడు. నేను వెనక్కి తిరిగి చూస్తే, అతను నా పూర్వ విద్యార్థులలో ఒకరు. “నేను ఇక్కడ భద్రతా సిబ్బందికి అధిపతిని” అని అతను చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలా కలుసుకున్నందుకు ఇద్దరం సంతోషపడ్డాం. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాం.

భారతదేశంలో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బిజెపి 8 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అంటే ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ. 50 కోట్లు ఖర్చయింది. అంత డబ్బు ఎక్కడిది, వాళ్లకు “విరాళం” ఎవరిచ్చారు అని అడగేవారు లేరు. ‘దేహాన్నీ ఆత్మనూ కలిపి ఉంచు’కునేందుకు లక్షలాది జనం నానా కష్టాలు పడుతున్న దేశంలో, 8 బిలియన్ డాలర్లు ఎవరిచ్చారు? జవాబుకోసం తడుముకోకుండానే చెప్పొచ్చు: భారతదేశంలోని సహజ సంపదనూ, మానవ వనరులను దోచుకోబోతున్న అదే 1%. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి వాళ్లకు ఎన్నడూ లేనంత మంచి కాలం ఇది.

జిడిపి అభివృద్ధి గురించి ప్రభుత్వం అబద్దం చెప్పిందనీ, 2.5% అదనంగా జత చేసిందనీ మోడీ ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు వెల్లడించారు. ఎన్నికలముందు చెప్పినట్లుగా ఆర్థిక వ్యవస్థ లేదనీ ఇతర నివేదికలు కూడా వస్తున్నాయి. ఇలాంటి విషయాలను గమనించే ఒక స్నేహితుడు ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ప్రభుత్వ వాణిజ్య వ్యవస్థను (public enterprises) కార్పొరేషన్లకు అతితక్కువ ధరకు అప్పగించాలని అనుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గడ్డు స్థితిలో ఉందనీ పిఎస్‌యులను ప్రైవేటీకరించాలనీ గొడవ చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, రైల్వేలో ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. కొన్ని బిలియన్ డాలర్లకు మాత్రమే కార్పొరేట్ సంస్థలకు అప్పగించేసీ, ఆర్థిక వ్యవస్థలోకి ఈ డబ్బును ఎట్లా రప్పించారో ఆర్భాటంగా చాటింపు వేస్తారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 నీ, 35 (ఎ) నూ తొలగించాలని అధికారికా, అనధికారిక వర్గాలు గోల చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన నీరూ, ఖనిజాలూ, అటవీ సంపద వంటి సహజ వనరులను దొంగిలించడానికీ, దోచుకోవడానికీ అదానీ, అంబానీలు సన్నద్ధమవుతున్నారని దీనితో తెలుస్తోంది. ఆర్టికల్ 370, 35 (ఎ) కాశ్మీరీలకు కొంత స్వయంప్రతిపత్తిని ఇస్తున్నందువల్ల అవి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. కాశ్మీరీలు జాగ్రత్తగా ఉండి, దీనిని పాస్ చేయనివ్వకుండా పోరాడాలి. కశ్మీరీల సహజ సంపదను దోచుకోవడం కోసం పాలకవర్గమూ, దాని ప్రతినిధులూ కశ్మీరీలపై దాడులు చేస్తూ, కశ్మీరీలందరూ ఉగ్రవాదులనీ, వేర్పాటువాదులనీ అని ఎంతోకాలంగా కాశ్మీరీ వ్యతిరేక ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాశ్మీరీలు ఆ ఉచ్చుల్లో పడకూడదు. కాశ్మీరీ ప్రజలను దోచుకునే పాలకవర్గం యొక్క ఈ దుర్మార్గపు పథకాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వ్యతిరేకించాలి. జాతీయతా, ఐక్యతా, ప్రాదేశిక సమగ్రతా వంటి పాతబడిపోయిన మాటలకు ఇంకా మోసపోకూడదు.

అమెరికా కూడా ఇరాన్‌పై దాడి చేసి, చమురును దొంగిలించడానికి ఆ దేశం గురించి దుష్ప్రచారం చేస్తోంది. ఇరాక్,  లిబియాలపై దాడులకు సన్నాహాలు చేసినట్లే, ఇరాన్‌కు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఆ దేశం గురించి తప్పుడు వార్తలూ, మోసపూరిత మాయమాటలూ విస్తృత స్థాయిలో ప్రచారమవుతున్నాయి. అమెరికా దాడులకు వ్యతిరేకంగా చిట్ట చివరి పౌరుడి వరకూ పోరాడతామని ఇరానియన్లు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు యుద్ధం అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారం. అది కొత్త యుద్ధం కోసం ఆతృత పడుతోంది. పశ్చిమ ఆసియాలో చైనాను, ముఖ్యంగా వారి రోడ్ వే ప్రాజెక్ట్ ను, అరికట్టడం కూడా ఈ కుట్రలో భాగమే,

ఒక ప్రియమైన స్నేహితుడు నన్ను అడిగాడు, “ఈ విషయాల గురించి మీకెందుకు ఇంత ఆందోళన? మీ జీవితం బాగా గడిచింది. అందుకు మీ ‘నక్షత్రాలకు ధన్యవాదాలు’ చెప్పి, ఈ చివరి రోజుల్లో ప్రశాంతగా ఉండండి.” నేను అతను చెప్పిన దాని గురించి ఆలోచించాను.  నాకు మంచి జీవితాన్నిచ్చిన నా నక్షత్రాలకు కృతజ్ఞతలు. కానీ మనం, ఆ 1% మన చేతలను శాసిస్తున్న దానికన్నా మంచి మనుషులుగా ఉండగలం అని నేను అనుకుంటున్నాను. నిజానికి ప్రకృతితోనూ, ఒకరిపట్ల ఒకరికి ఉన్న మానవ సంబంధాల పరంగానూ మనం చాలా బాగా మనగలం. పజిల్ కు చెందిన అన్ని ముక్కలూ వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి. మిగిలిందల్లా, అధికారమనే మీటపై 1% కు ఉన్న పట్టును తప్పించడమే.

జస్పాల్ సింగ్

జస్పాల్ సింగ్ పంజాబులో, ఉత్తరాఖండ్ లో చదువుకున్నారు. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ చదువుకుని బోధకుడిగా పనిచేశారు. ఆయన పంజాబ్ వేదిక్ స్కాలర్ కూడా. 'పంజాబ్ దర్షన్ తే ఏక్ ఝాట్'( A Look at Punjab Philosophy) అనే పుస్తకాన్ని వెలువరించారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.