అనుకోకుండా జరిగే నేరాలు… ?

ఇటీవల ఒక వారం రోజుల్లో రెండు వార్తలు. ఒకటి తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం, మరొకటి డెబ్బైనాలుగేళ్ళ వృద్ధురాలిపై అత్యాచార యత్నం. తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆ పాప చనిపోవడం దాదాపుగా ప్రతి ఒక్కరిని కదిలించి వేశాయి. నిర్భయ ఘటన తరువాత నిర్భయ చట్టం ద్వారా కఠినశిక్ష పడే అవకలుంటాయనే భయంతో, ఇటువంటి లైంగిక నేరాలు తగ్గుముఖం పడతాయని భావించారు కనీసం కొద్దిమంది. లైంగిక నేరాలు పెరుగుతూనే ఉన్నాయి తప్పించి, ఏమాత్రం తగ్గట్లేదు. కామాంధులు పసిపిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకోవడం మరింత కలచివేసే, కలవరపరచే అంశం. ఎందుకిలా జరుగుతోంది? ఈ వైఫల్యాన్ని ప్రభుత్వం మీద, పోలీస్ మీద తోయడం సులువు. ఇది కేవలం ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యం మాత్రమేనా? ఈ నేరాలు గురించిన వార్తలు చదువుతున్నపుడు నిరుడు ఆంధ్రప్రదేశ్ లోని దాచేపల్లిలో జరిగిన ఘటన గుర్తొచ్చింది. దాచేపల్లిలో ఒక మైనర్ బాలిక మీద సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ తరువాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

దాచేపల్లి ఘటనకు సంబంధించి అయినా, అంతకుముందు నిర్భయ ఘటన అయినా, మరోటైనా, ఇప్పుడైనా సమాజం స్పందన దాదాపు ఒకటే విధంగా ఉంది. కన్నుమిన్ను గానని ఆ కామాంధులను ఉరితీయాలి, సజీవంగా కాల్చెయ్యాలి, నరికెయ్యాలి, ఇంకా రకరకాల శిక్షలు వెయ్యాలి ఇలా పలువురి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు. వాటన్నిటికంటే ఆలోచింపజేసిన ఒక విషయం/వాక్యం ఉంది, దీనిని ఎంతమంది గమనించారో తెలియదు. దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య చివరిసారిగా తన బంధువులతో  కాల్ లో మాట్లాడాడు అని చెప్పబడిన ఒక వాక్యం ‘… అందరికీ మంచి చెప్పి బతికేవాడిని, కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కటే మార్గం … నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను…’. ఆ మాటల్లోముఖ్యమైనది, నన్ను కలచివేసింది మరియు ఆలోచింపజేసింది ఒకటే – ‘… అనుకోకుండా జరిగిపోయింది…’. అవును, అనుకోకుండా జరిగే నేరాలుంటాయి. ప్రత్యేకించి ఇటువంటి ఘటనలలో ప్లాన్డ్ గా జరిగేవాటికంటే ఇలా విచక్షణను, మానవత్వాన్ని, ఆలోచించే గుణాన్ని కొద్దికాలం పాటు కోల్పోవడం వల్ల జరుగుతాయి. ఇపుడు ఆలోచించవలసింది శిక్షల గురించే కాకుండా, ప్రతి మనిషికి ‘ఆ కొద్దికాలం’ ఎదురవకుండా ఏం చెయ్యాలి, ఏం చెయ్యొచ్చు అనేది. 

ఇలా విశ్లేషించడం చాలా సులువు. అవును, ఆ ఘటనలు ప్లాన్డ్ గా, ఉద్దేశపూర్వకంగా జరిగినవికాకపోవచ్చు. అనుకోకుండా కొన్ని బలహీన క్షణాల్లోనో లేక మద్యం మత్తులోనో జరిగినవి అయి ఉండవచ్చు. (కథువా వంటి ఘటనలు ఇందుకు మినహాయింపు). ఆ “అనుకోకుండా…” జరిగే నేరాలను అరికట్టడం ఎలా అన్నది ఒక అంతుపట్టని అంశమేనా? ఈ నేరాల్లో చాలావరకు, ఉదాహరణకు దాచేపల్లి ఘటనలో నేరస్థుడు సుబ్బయ్య విషయమే తీసుకుంటే అసలు ఎవరూ అతడు అలాంటి పని చేస్తాడని ఊహించ లేదు. దీనికి కారణం సినిమాలు, టీవీలు, స్మార్ట్ ఫోన్స్ వంటివి అని కొందరి విశ్లేషణ. కొంతవరకు అది నిజమే. ఎందుకంటే ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాక, ఫోన్ లో వారు చూడగలిగే అంశాల పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతోంది. గత సంవత్సరం గుజరాత్ లో ఒక ఇరవై ఏళ్ళ యువకుడు తన సొంత తల్లి, చెల్లిపై లైంగిక దాడి చేశాడని, సెక్స్ కు ఒప్పుకోమని బలవంతం చేశాడని అరెస్ట్ చేశారు ఆ యువకుడి తల్లి ఫిర్యాదుపై. విచారణలో అతడు చెప్పినది – స్మార్ట్ ఫోన్ లో అతడు కొన్ని వీడియోస్ చూసి ప్రభావితుడయ్యాడు. ఆ వీడియోస్ లో యువకుడు తల్లితో, సోదరితో సెక్స్ చేసినట్టు చూపారు అని. కాబట్టి ఈ నేరాలలో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, సినిమాల ప్రభావాన్ని కొట్టి పడేయలేం. అదే సమయంలో నెపం వాటిపై నెట్టేసి, తప్పించుకోనూలేము. 

ముందే చెప్పుకున్నట్టు, కేవలం నేరాలు జరిగినపుడు, నేరానికి పాల్పడిన వారికి శిక్ష వేయడం మాత్రమే కాక, నేరం వెనుక మూలాలు పరిశోధించగలగాలి. 

నేరం మూలాలు పరిశోధించగలిగినపుడు, వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టటం సాధ్యం కావచ్చు. అపుడు ఇలా అనుకోకుండా జరిగే నేరాల సంఖ్య తగ్గుతుంది. డబ్బులు సంపాదించే యంత్రాలుగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాలను తీర్చి దిద్దే విద్యావిధానాన్ని రూపొందిచాలి. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను నిర్వహించాలి (వయసుతో సంబంధం లేకుండా). ఇప్పటి సమాజంలో ప్రతి ప్రాంతానికి శారీరక రుగ్మతలకు వైద్యం చేయగలిగే వైద్యుడితో సమానంగా మానసిక సమస్యల వైద్యుడు అత్యంత ఆవశ్యకం. నేరం చేసిన వారికి కఠిన శిక్షలు విధించడం భయాన్ని కలిగించి, నేరాల తీవ్రతను తగ్గించగలిగే అవకాశం ఉంది. అదే సమయంలో విచక్షణను కోల్పోయే ‘ఆ కొద్దికాలం’ మనిషిలోని మృగం నిద్దురలేచి ఆ భయాన్ని తొక్కిపెడుతుంది. ఇపుడు చట్టాలను, శాసన సంబంధ చర్యలను రెండు కోణాలలో ఉండాలి. ముందుగా అనుకున్నట్టు, అందరూ బలపరుస్తున్నట్టు ఇటువంటి నేరాలలో విధించే శిక్షలు కఠినంగా, భయం కలిగించేలా ఉండాలి. రెండవది – మానసికంగా లేదా వ్యక్తిత్వం పరంగా జనాలు ఎదగటానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఉద్యోగాలకు పనికొచ్చే విధంగా మాత్రమే కాకుండా – వ్యక్తి నడవడిక గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి వాటిపై అవగాహన సదస్సులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఇపుడు జరుగుతున్న నేరాలలో బాధ కలిగించేది – మైనర్ బాలురు మరియు వృద్ధులు కూడా నేరాలకు పాల్పడే వారిలో ఉండటం. అందుకే, కేవలం శిక్షలతో పాటు నివారణ చర్యలు చేపట్టాలి. శిక్ష నేరస్తుడికి వేయబడుతోంది కానీ నేరానికి కాదు. నేరం మూలాల్ని అన్వేషించి, చర్యలు తీసుకోనంతవరకూ ప్రతి నేరం జరిగినపుడు ప్రదర్శనలు చెయ్యటానికి కొవ్వొత్తులు కొనుక్కుంటూ ఉండవలసిందే.

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.