అరకు లోయలో
కూలని శిఖరం?*

 

‘లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్’ అంటాడు డేల్ కార్నీ అనే ‘వ్యక్తి వికాస’ నిపుణుడు. అదొక ప్రాక్టికల్ ప్రపోజిషన్. దైనందిన జీవితానికి పనికొచ్చే మాట, వ్యక్తికే కాదు, సమూహానికి కూడా.

జీవితంలో ఒక్కొక్క రోజు ఒక రైలు బోగీ (కంపార్ట్మెంట్) వంటిది. ఒక్కొక్క సారికి ఒక రోజులోనే వుంటావు, దానికి ముందు, వెనుక రోజులలో వుండాలని అనుకున్నా వుండలేవు. అదీ ఈ మెటఫర్ అర్థం. 

‘హియర్ అండ్ నౌ’ అంటారు దాన్నే తాత్విక పరిభాషలో.

నువ్వు న్యూయార్క్ నుంచి ఇండియాకు వెళ్తున్న విమానంలో కూర్చుని వున్నావా, అయితే నీ వునికి విమానం లోపలి పరిసరాలే. (అతిక్రమిస్తే అనర్థం తప్పదు).

రేపు లేదని కాదు, వుంటుంది. నీ ప్రమేయం వున్నా లేకున్నా రేపు వుంటుంది. నీ ప్రమేయం వుంటే ఇంకా బాగుంటుంది. ఇండియా ప్రయాణాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్నావనుకో… ప్లాన్ చేసుకోకపోడం కన్న… మెరుగ్గా వుంటుంది.

ప్లాన్ చేసుకోవాలంటే ‘తెలియాలి’. తెలియడమంటే పూర్వజ్ఞానం వుండడం. అప్పటికే… ఎంతో కొంత అనుభవం నీకు (లేదా నీకు చెప్పే వాళ్ళకు, నువ్వు చదివే పుస్తకాలకు) వుండడం. 

జ్ఞానమంతా జ్ఞాపకమే. చారిత్రకమే. అప్పటికప్పుడు మెదడులో పుట్టే జ్ఞానం అంటూ ఏమీ వుండదు. 

నిన్నటి అనుభవంతో ఈరోజు జీవిస్తావు గాని,  జీవించేది మాత్రం ఇవాళ అనే ‘స్థలం’ లోనే. ఇవాళ ఎంత బాగా జీవిస్తే రేపు అంత బాగుంటుంది.

***

ఇవాళ 

ఉన్నట్టుండి తెలుగునాట… ఎర్…. ఒక తెలుగు రాష్ట్రంలో ఒక మంచి అవకాశం వొచ్చింది. ఇది మంచి అవకాశం అనే మాటకు ఇప్పటి వరకున్న దత్తాంశాలే ఆధారం.  

లాయిరిపెట్టెలో మంత్రనగరిని చూస్తో ఆకలి దప్పులు మరిచిపోయే దుర్గతి పోయింది. రాజకీయ-వాణిజ్య ప్రకటనల్లోని నీళ్ళు తాగి, ప్రకటనల్లోని పంటలు కోసుకు తిని ఆకలి దప్పులు తీరుతున్నట్లు నటించనవసరం లేదు. ఇప్పుడు ఆకలి అంటే ఆకలే. దప్పిక అంటే దప్పికే. మారిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ‘గ్రాఫిక్’ బతుకులను ఎర వేయడం లేదు. 

నిరుటి నేత చెప్పిన హానికర అబద్ధాల్ని వెలికి తీసే ధ్వంస రచన కూడా జరుగుతోంది. 

ఒక అబద్దాన్ని ధ్వంసించాక మిగిలే ‘ఖాళీ’ కూడా మంచిదే. అది కొత్త పోరాటాలకు అవసరమైన స్థలమవుతుంది. కావాలి. మంచిని పెంచి, చెడుగును తుంచే ప్రజా పోరాటాలే సరైన హామీ.

ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్లో ఒక్కొక్క దాన్ని తీసి కొత్త ప్రభుత్వం వాటిని నెరవేర్చే ఆలోచనలేవో చేస్తున్నది. ఇవి ఇంకా ఆలోచనలు. సంకల్పాలు. ప్రారంభాలు. ప్రారంభాలు బాగున్నాయి.

‘అమ్మ వొడి’ పథకాన్ని ప్రైవేటు స్కూళ్ళకూ అన్వయించడం తప్పటడుగే. దాన్ని సరిదిద్దుకోవాలని జనం పక్షాన వొత్తిడి చేయకతప్పదు. 

ఇప్పటికిప్పుడు కొన్ని మెచ్చుకోదగిన పనులున్నయ్. 

ఉదాహరణకు… విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు అనుమతినిచ్చే పాత ప్రభుత్వాదేశాల్ని (జీవో 97 ని) రద్దు చేయడం ఒక సాహసిక చర్య. తక్షణం పలువురు కంట్రాక్టర్లకు, పెట్టుబడిదార్లకు కంటగింపు అయ్యే చర్య. అడవులను, అడివి బిడ్డలను కాపాడే మంచి పని. 

దీని మీద వినిపించడానికి వీలున్న విమర్శ ఒకటుంది. అది ప్రజల వేపు నుంచి వినిపించడానికి వీలున్న విమర్శే. 

పాత పద్ధతుల్లో తవ్వకాలు సాగించే వారిని అదుపు చేసే పేరుతో… ఏజెన్సీలో పోలీసుల కదలికలు పెరుగుతాయని, పోలీసు కదలికలకు దారి సుగమం చేయడమే ‘జీవో రద్దు’ అసలు వుద్దేశమనే విమర్శ దీని మీద వుంటుంది. 

సాధారణ స్థానిక జనం ఈ విమర్శను ఎలా తీసుకుంటారో చూడాలి. ఎప్పుడో ప్రజారాజ్యం తెస్తామనే వాళ్లు తెచ్చే రాజ్యం ప్రజలది అవుతుందో అవదో గాని, దాని కోసం ఇప్పటి ప్రజలు తమ జీవితాల్ని తమ చేతుల్లోనికి తీసుకోవద్దనడం సహేతుకం అవదు. 

కంట్రాకర్ల, మైనింగ్ కంపెనీల బారి నుంచి అడివిని కాపాడే ప్రభుత్వ చర్యను గిరిజనులు, బహుశా, తిరస్కరించ(లే)రు.

సాయుధ విప్లవం గెలిచి ఏర్పరిచే ‘న్యూ డెమొక్రటిక్’ ప్రభుత్వం తప్పక ఆహ్వానించదగినదే. కాని, అది ఇవాళ్టి వాస్తవం కాదు. ఆ అవగాహన ఇవాళ్టి రైలు బోగీలో కూర్చుని రేపటి బోగీలో జీవించడానికి చేసే ప్రయత్నం.

మైనింగే ఇవాళ్టి వాస్తవం. దాన్ని నిరోధించడం ఇవాళ్టి ప్రజావసరం. అందుకు కొత్త ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి.

అదే దారిలో కడప బేసిన్ లో అత్యంత హానికరమైన యురేనియం మైనింగ్ ను పూర్తిగా ఆపాలని జనాన్ని కదిలించాలి. రాయలసీమ ఇతర ప్రజా సమస్యలను ఈ పోరు జెండాకు ముడెయ్యాలి.

ఈ ఆలోచనల చౌరస్తాలో వామపక్షీయులు ఎదుర్కొనే డైలెమా గురించి జర నిర్మోహంగా మాట్లాడుకోగలమా? 

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పగ్గాలు పట్టిన తొలి రోజుల్లోనే విశాఖ ఏజెన్సీలో పోలీసులు కదిలారు. వారికి అడివిలో సాయుధ విప్లవకారులు ఎదురుపడ్డారు. ఎదురు కాల్పులు జరిగాయి. అదృష్ట వశాత్తు ఎవరూ మరణించలేదు. 

ఎవరూ మరణించకపోయినా, అది ఒక ఎన్కౌంటరే. 

దాన్ని ప్రజాతంత్ర వాదులు ఖండించాల్సి వుండిందని కొన్ని వెల్ మీనింగ్ మైదాన స్వరాల వువాచ. 

నిజమా? ఆ ఘటనను ప్రజాతంత్ర వాదులు ఖండించ వలసిందా? 

అది ‘బూటకపు ఎన్కౌంటరై’తే, నిస్సందేహంగా ఖండించాలి. ‘బూటకపు ఎన్కౌంటర్’ అంటే… పోలీసులు… ప్రజా కార్యకర్తల్ని పట్టుకుని, కోర్టులో హాజరు పరిచి విచారించకుండా… ఏ అడివికో తీసుకెళ్లి కాల్చి చంపి, ఎదురు కాల్పుల్లో మరణించారని కట్టుకథలల్లడం.

జంపాల చంద్రశేఖర ప్రసాద్, నీలం రామచంద్రయ్య, రాజారామ్ రెడ్డి, శ్రీహరి, జనార్దన్ వంటి ఎందరో ప్రజా వీరులను పాలకులు అలా పొట్టన పెట్టుకున్నారు. అది యుద్ధం కాదు, అవి హత్యలు అని ప్రజాతంత్ర వాదులు వీధులకెక్కి నిరసించారు. ఇక ముందూ నిలదీస్తారు.

సాయుధులు ఒకరికొకరు ఎదురు పడి జరిపే కాల్పులను బూటకపు ఎంకౌంటర్లని అనలేం. అలా అనడం మొదలెడితే, ఇక సామాన్య ప్రజల మీద (నిరాయుధుల మీద) జరిగే బూటకపు ఎన్కౌంటర్లను నిరసించలేం. అది ప్రజలకు వున్న ఒక డెమొక్రటిక్ ద్వారాన్ని మూసేయడమే అవుతుంది.

విప్లవోద్యమం ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించుకుంటుందో ఆసక్తికరం. విప్లవం అనే మాట ప్రాథమిక అర్థమే ఇక్కడ చర్చనీయం కావొచ్చు.       

***

విప్లవం ఎందుకు? 

కార్మికవర్గ అధిపత్యం కోసం!

ఏ వర్గం ఆధిపత్యానికైనా ప్రజా సమ్మతి (కన్సెంట్) మాత్రమే పునాది, అయుధాలు కాదు.  

ప్రజా సమ్మతి లేకుంటే పరిపాలన (మన పాలన కూడా) అసాధ్యం. ప్రజా సమ్మతి లేకుండా సాయుధ పోలీసులు, సైన్యాలు రాజ్య ‘శతృవు’లను ఆణిచివేయలేరు. నియంత్రించలేరు. కేవల నిరంకుశత్వం ఎక్కువ కాలం నిలవదని చరిత్ర. 

జనాభీష్టాన్ని అణిచి వేయడం సాధ్యమయ్యుంటే, చైనాలో తీన్మెన్ స్క్వేర్ తిరుగుబాటు లేదు. నేడు హాంకాంగ్ వీధుల్లో లక్షల జనం కవాతులు లేవు. మునుపు… పోలండ్ తదితర దేశాల్లో, రష్యాలో ఒక్కుమ్మడిగా ప్రభుత్వాలు హాం ఫట్ మారేవి కావు. 

(అవి మంచి మార్పులా కాదా అని కాదు ఇక్కడ చర్చ. అవి జనం కోరుకున్న మార్పులు, వాటిని పోలీసులు సైన్యాలు ఆపలేకపోయారు … అదీ గమనార్హ సత్యం). 

‘కార్మిక వర్గ ఆధిపత్యం’ నెలకొనాలంటే, అత్యధిక జనం దాన్ని కోరుకోవాలి. అది ఏర్పడ్డాక, దాన్ని కాపాడుకోవాలని కోరుకోవాలి. అలాంటి కోరికకు మరో పేరే ‘ప్రజా సమ్మతి’.

మెజారిటీ ప్రజల సమ్మతి లేకుండా ప్రజా రాజ్యం అసంభవం. సంభవించినట్టు కాసేపు అనిపించినా, మన్నడం (డ్యూరబిలిటీ) అసాధ్యం. నిన్నటి రష్యా, చైనా అనుభవాలు నేర్పించే పాఠాలివే.

***

నిన్నటి రష్యాలో ‘సోషలిస్టు’ రాజ్యం కార్మిక కర్షకుల మీద (కూడా) ఆణిచివేతను అమలు చేసిందని…  ఛార్లెస్ బెతల్ హ్యామ్ నీళ్ళు నమలకుండా డాక్యుమెంట్ చేశాడు. 

మరి, విప్లవం గెలిచాక ఏర్పడే రాజ్యం ప్రజల మీద ఆణిచివేతకు పాల్పడకుండా చూసేదెవరు? నూతన ఉత్పత్తి సంబంధాలు పురోగమించేలా చూసేది ఎవరు?

సందేహం లేదు. ఆ కర్తవ్యం కమ్యూనిస్టులదే. కరదీపిక కమ్యూనిజమే. 

మరి, కమ్యూనిస్టులే ‘రాజులై’పోతే, ఆ రాజ్యం అకృత్యాలను ఎదిరించేదెవరు? రాజ్యం మీద కరుకు విమర్శలు పెట్టి, సరిదిద్దేదెవరు? 

రాజ్యం ఇర్రిలెవెంట్ అయిపోయి, కనుమరుగు (విదర్ అవే) అయిపోయే వరకు ప్రజల హక్కులకు బాసటగా నిలబడేదెవరు?

విప్పరాని పొడుపు కథలా కనిపించే ఈ ప్రశ్న నిజానికి చాల సామాన్యమైనది. 

మావో ఇచ్చిన ‘బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్’ నినాదానికి ఆ ప్రశ్నే మూలం. 

‘హెడ్ క్వార్టర్స్’ అంటే పార్టీ, రాజ్యం. 

తాను ఏ పార్టీకి, ఏ రాజ్యానికి ‘అధ్యక్షుడో’ దాని మీద తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు మావో. 

అందులో ఉన్న నిజాయితీ అబ్బురపరుస్తుంది. 

నినాదంలో ఇసుమంత  కృత్రిమత్వం కూడా వుంది. రాజ్యం (మావో) తనకు తానే ప్రతిపక్షమయిపోవడం కృత్రిమం. 

కృత్రిమత్వాన్ని పరిహరించడం ఎలా?

కార్మిక కర్షకుల విప్లవ ఫలమైన రాజ్యాన్ని వారే నడిపించేలా చూడడమే సమాధానం. రాజ్య నిర్వహణ పనిని ‘పార్టీ’ చేపట్టి బొక్కబోర్లా పడకుండా వుండడమే. 

ఉదాహరణకు: రష్యా ఒక సోవియట్ల యూనియన్. గ్రామ/పట్టణ స్థాయి సోవియెట్ల నుంచి సుప్రీం సోవియెట్ వరకు వుండిన ‘ప్రజాసంఘాల’ నిర్మాణం సోవియట్ యూనియన్. సోవియెట్లే రాజ్యాన్ని నిర్వహించాల్సి వుండింది.

కమ్యూనిజం స్వాభావికంగానే రాజ్య-వ్యతిరేకం. కమ్యూనిస్టులు రాజ్య వ్యతిరేకులు. 

రాజ్యమెవరిదైనా… ఆధిపత్యం (హెజ్ మొనీ) కార్మిక వర్గానిదే అయినా… కమ్యూనిస్టులు ప్రతిపక్షమే.

***

ప్రతిపక్షమే, ఇవాల్టికివాళ కూడా… రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలకు కమ్యూనిజం.

రాజ్యాన్ని ప్రజల తరుఫున విమర్శకు గురి చేయడం, అది ప్రజావసరాల నుంచి ఏమాత్రం పక్కకు జరిగినా నిలదీయడం, నిరంతరం అప్రమత్తమై, మంచి పనులను ప్రోత్సహిస్తూ, చెడ్డ పనులను తిరస్కరిస్తూ…  ప్రజల పక్షాన, రాజ్యం అనే ఎద్దును ముల్లుగర్రతో పొడిచి, చర్నాకోల ఝళిపించి నడిపించడం ప్రతిపక్షం పని. అదే కమ్యూనిస్టుల పని.

ఈ నడిచే క్రమంలోనే రాజ్యం అటు ఇటు చేతులు మారుతూ అంతకంతకు ఎక్కువగా కార్మిక వర్గం చేతుల్లో స్థిరపడుతుంది.

కార్మిక వర్గం తాను స్వయంగా పాలన పగ్గాలు చేపట్టి, వొదులుకుని, తిరిగి చేపట్టే… క్రమంలోనే తన ఆధిపత్యం (హెజ్మొని) ఎలా నెరపాలో నేర్చుకుంటుంది. తన మీద దోపిడీ, పీడనలను త్రోసివేసే క్రమంలోనే… దోపిడీ పీడనల్లేని కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తుంది. 

26-6-2019

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేకంగా గిరిజనులు. ఈ ఎడిట్ మొదటి ఫోటో కూడా ఏజెన్సీ ప్రాంతంలో జీవితానిదే.
 • ‘అరకులోయలో కూలిన శిఖరం’ అనే బుచ్చిబాబు కథకూ ఈ సంపాదయానికీ సంబంధ బాంధవ్యాలేం లేవని మనవి 🙂

 

హెచ్చార్కె

8 comments

 • స్థూలంగా అంగీకరిస్తున్నాను.

 • సంపాదకీయం, సూపర్బ్, సర్!వాస్తవాలని,వెలికితీసింది.కొత్త ప్రభుత్వం ,ఇప్పుడు డిపుడే, పుంజు కుంటుంది, సరి అయిన, ఆఫీసర్స్, రాగానే,…చాలా వరకు. సమస్యలు,తొలగి పోతాయి అనేది, మా భావన!

  • థాంక్స్ పద్మ గారు. మంచి జరుగుతుందనే అనుకుంటాను. ఇప్పటి వరకు అలాటి ప్రజానుకూలతే కనిపించింది.

 • మీ సంపాదకీయంలో చాల విషయాలు ప్రస్తావించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు అనుమతినిచ్చే పాత ప్రభుత్వాదేశాల్ని (జీవో 97 ని) రద్దు చేయడం ఒక సాహసిక చర్య అన్నారు. నిజానికి అది మంచి పరిణామమే. అటు పెట్టుబడి దార్ల కళ్ళు ఇటు పాలకుల కళ్ళు ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజం మీదనే దృష్టి సారించారు. ఆంధ్రలో కొత్త ప్రభుత్వం (జీవో 97 ని) రద్దు చేయడం మంచి చర్యే కానీ ముఖ్య మంత్రి గారు ఆ మాట మీద ఎంతకాలం నిబడుతారు ? ఏ పాలకుడు కళ్ళముందు కనిపిస్తున్న సంపదను ఒదులుకోలేడు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బయ్యారంతో పాటు, ఒబులాపురంలోని ఇనుప ఖనిజాన్ని అక్రమ మార్గంలో దోచుకెళ్లి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ చరిత్ర ఉంది.
  ఏజెన్సీలో ఖనిజ సంపదను కాపాడే బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకోదు. దోచుకునే పద్ధతి రూపం మార్చుకోవడం తాత్కాలికంగా దోపిడీని వాయిదా వేసుకోవడమే జరుగుతుంది. ఆంధ్రలో కొత్త ముఖ్య మంత్రి గారు ప్రజలను నమ్మిచడంలో విజయవంతమౌతున్నారు.

  • థాంక్యూ రాజబాబు గారు. నమ్మగూడనివి ఏమైనా వుంటే చెప్పాల్సిన బాధ్యత బహిరంగంగా ఎండగట్టాల్సిన బాధ్యత… ప్రజాపక్షపాతుల మీద తప్పకుండా వుంది. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన వాటిని చర్చంచవలసిందే. కొత్త ప్రభుత్వం పనులను కొత్తగా చూసి బేరీజు వేయడమే బెటర్. ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందే నిరంతరం. అందుకే కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిఘా కన్నుగా వుండాలని అనడం.

 • సూటిగా లేదు. మీ క్రియేటివ్ రైటింగ్ సబ్జక్ట్ని కాంప్లెక్స్ చేసింది. అయితే వీలైనంతమేర, ప్రజా సమ్మతిని బట్టి విప్లవాలు తయారవ్వాల్సిన మాట నిజమే గానీ, ఇప్పుడా పరిస్తితులు కనబడటంలేదు. ఆ సమ్మతికోసం రాజకీయ పార్టీల ఎత్తుగడలు, మిగతా ఉద్యమ సంస్థల నైతిక స్తైర్యంకన్నా హేతుబద్దంగానే ఉన్నాయి. సాధ్యాసాధ్యాలు సత్యాసత్యాలు తర్వాత తేలుద్దాం. ఆ కోవలోనిదే బాక్సైట్ తవ్వకం రద్దుకూడానేమో !

  కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఇంకా ఉన్నారనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళెపుడో పక్షాతీత వ్యవహారంలో పడిపోయారు. కేరళ కూడ మంచి ఎగ్జాంపుల్ ఏమీ కాదు.

  ఇక ఈరోజుల్లో ఎవరు రాజులవగల అవకాశముందో వాళ్ళే అవుతారు. కలలు కంటం తప్పు సారూ అననుగానీ, కమ్యూనిస్ట్లు ఆ అర్హత కోల్పోయినట్టే కనిపిస్తున్నారు.
  శిరోధార్యం సంగతికి వేరే మాట లేదు. అది శిరోధార్యమే.

  అవకాశాల్ని ఉపయోగించుకునే క్రమంలో కూడా ప్రజా సమ్మతి పొందనివ్వండి. ఎవ్వరికైనా ఎంతవారికైనా ఒరిజినాలిటీ దాగడం అంత దూరపు ప్రయాణం అవ్వదుగా.

  యూ కెన్ బీ మోర్ స్ట్రైట్ అండ్ సింపుల్ టూ !

  • శ్రీరామ్ చదివి వ్యాఖ్యానించినందుకు చాలా థాంక్స్.

   మీ నుంచి ఇంతకంటె ఎక్కువ సపోర్ట్ కోరుకుంటాను. ఇంకొంచెం శ్రద్ధను కోరుకుంటాను, పఠనంలో.

   సంపాదకీయం విప్లవం గురించి కాదు, అది ఏర్పాటు చేసే రాజ్యం గురించి. సమ్మతి/కన్సెంట్ కావాలన్నది ‘రాజ్యా’నికి. ప్రజా సమ్మతి వుంటేనే ఒక వర్గ రాజ్యం ఏర్పాటు సాధ్యం. సమ్మతి వుంటేనే ఆ రాజ్యం మన్నడం సాధ్యం.

   ఇక, ప్రతిపక్షంగా కమ్యూనిస్టులు/మార్స్కిస్టులు లేరనడం కరెక్ట్ కాదు. అది నెగటివ్ అతిశయోక్తి. జెండా ఎత్తినోళ్ళంతా కమ్యూనిస్టులు కారు గాని, కమ్యూనిస్టులున్నారు. బూర్జువజీ కి పక్కలో బల్లెంగా వుంటారు. వాళ్లొక డై హార్డ్ జాతి. వాళ్లుండరని ఆశ… మీ సంగతేమో గాని… బూర్జువజీకి లేదు. 🙂

   బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు అలాంటి సమ్మతి సాధన లో భాగమని అన్నదే మీ మాట అర్థం అయితే, మీరన్నది నిజం. పాలకవర్గం ఆ విధంగానే తన ‘రాజ్యా’నికి సమ్మతిని, మన్నికను సాధించుకుంటుంది. ఈ సంగతి కమ్యూనిస్టులు గ్రహించాలని నా కోరిక. అలాంటి అవగాహనతోనే ప్రజల్లో పని చేయాలి, ఇప్పుడూ ఎప్పుడూ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.