ఒక నాది…

ఇది నా సమస్య కాదు!

మా సమస్య! 

మా తమ్ముడి సమస్య! కాదు, మన అందరి సమస్య అంటారు తెలుగు మాస్టారు!

ఔను, తమ్ముడికి ‘నా’ తప్ప ‘మా’ తెలీదు?!

నా పేరు అంటాడు- సరే, నా క్లాసు అంటాడు- సరే, నా స్కూలు అంటాడు- సరే, నా టీచర్- అంటాడు సరే, నా వూరు అంటాడు- సరే, నా అమ్మా నాన్నా అంటాడు- సరే, నా యిల్లు అంటాడు- సరే, నా జెండా అంటాడు- సరే, నా దేశం అంటాడు- సరే, నా ప్రధాని అంటాడు- సరే, నా భాష అంటాడు- సరే!

సరేనని యింట్లో సరిపెట్టుకున్నాం!

కాని బళ్ళో తెలుగు మాస్టారు వొప్పుకోలేదు! ‘వీడికి నా గుణింతం తప్ప మా గుణింతం నేర్పలేదా?’ అని మొదట్లో నవ్వారు! తరువాత కోప్పడ్డారు!

‘ఇది యింగ్లీసు కాలం, యీ కాలంలో ‘నా’కీ ‘మా’కీ గ్రామర్లో తేడాలేదు’ అని యిగ్లీసు మాస్టారు నవ్వి ‘ఏరా నా’ అని తమ్ముడ్ని ముద్దుగా పిలిచేవారు! తమ్ముడు కూడా పలికేవాడు!

మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ‘దేశం మనదే… తేజం మనదే… యెగురుతున్న జెండా మనదే… నీతీ మనదే… జాతీ మనదే… ప్రజల అండ దండా మనదే…’ సినిమా పాట పాడిస్తే- తమ్ముడు మాత్రం ‘దేశం నాదే… తేజం నాదే… యెగురుతున్న జెండా నాదే… నీతీ నాదే… జాతీ నాదే… ప్రజల అండ దండా నాదే…’ అని పాడాడు!

అప్పటికీ తెలుగు మాస్టారు తమ్ముణ్ణి దిద్దాలని చూశారు! ‘ఈ పెన్ను నాది… ఈ స్కూలు మనది! ఈ బేగు నాది… ఈ దేశం మనది’ అని ‘నా’కీ ‘మా’కీ వున్న తేడాని వుదాహరణలతో చెప్పి చూశారు! తమ్ముడు జుట్టు పీక్కున్నాడు తప్పితే అర్థం చేసుకోలేకపోయాడు! అయోమయంలో పడిపోయాడు! గట్టిగా చెపితే మాటలు రానట్టు మూగవాడైపోయాడు! అంతే కాదు, తమ్ముడు ‘మా’ అక్షరాన్ని గుర్తుకూడా పట్టేవాడు కాదు?!

ఎవరు యెంత దిద్దాలని చూసినా తమ్ముడు దిద్దుకోలేక పోయాడు! దిద్దబోయిన వాళ్ళే ‘మా’ అనడం మరిచిపోయి తమ్ముడిలా ‘నా’ అనడం మొదలు పెట్టారు!

తమ్ముడు పుట్టినప్పుడు అందరిలానే ‘ఉక్కూ వుగ్గా’ అనే వాడు! ‘అమ్మ… అత్త… తాత… తాత్తాత’ అనేవాడు! తరువాత మనం యేదంటే అదే అనేవాడు! మాటలు కూడా తొందరగా వచ్చేసాయని అమ్మా నాన్నా చాలా హేపీ ఫీలయ్యారు!

మొన్ననే తమ్ముడి చిన్నప్పటి వీడియోలు అందరం చూశాం!

‘అమ్మా’ అనడానికి బదులుగా ‘మా’ అన్నాడు! ‘అమ్మా తమ్ముడికి మా వచ్చామ్మా’ అని సంబరపడిపోయాను! ఇంట్లో అందరూ తమ్ముడు ‘మా… మా’ అనడం చూసి ‘అవును కదా?’ అని యిప్పుడు ముక్కున వేలేసుకున్నారు! తమ్ముడు తనని తాను పరాయివాణ్ణి చూసినట్టుగా చూశాడు!

తమ్ముడి చిన్నప్పటి రోజులు మళ్ళీ కళ్ళముందు ప్లే అవుతున్నాయి!

తమ్ముడు ముద్దుగా బొద్దుగా భలే వున్నాడు! అందరూ ముద్దులాడుతున్నారు! వాడు కూడా నవ్వుతున్నాడు! పిలిస్తే పలుకుతున్నాడు! కొత్త కొత్త మాటలాడుతున్నాడు!

‘ఇది ఆల తల్లమ్మా… నా తల్లమ్మా’ అని అమ్మ ముద్దులాడుతోంది!

తమ్ముడు కాళ్ళూ చేతులూ ఆడిస్తున్నాడు!

‘అమ్మ నాది’ అన్నారు నాన్న!

‘నా..’ అన్నాడు తమ్ముడు! వాడికి యేడుపు కూడా వచ్చేసింది!

తమ్ముడు యేడుస్తూ వుంటే అందరం నవ్వుతున్నాం! 

‘నాన్న నాది’ అన్నాను నేను!

‘నాది’ పోటీగా అన్నాడు తమ్ముడు!

విడియో ప్లే అవుతోంది!

‘ఈ బుజ్జి బుజ్జి బుగ్గలెవరివమ్మా?’ అమ్మ చేతిలోంచి తీసుకొని అత్త యెత్తుకొని అడిగింది!

‘నా…’ అన్నాడు తమ్ముడు! అందరూ గొల్లున నవ్వారు!

‘ఈ కోటేరు ముక్కు ఆలదమ్మా?’ మావయ్య తమ్ముడి ముక్కు మీద వేలు పెట్టాడు!

‘నాది’ అన్నాడు తమ్ముడు! అందరం నవ్వడమే నవ్వడం! నాకు యిప్పుడు కూడా వీడియో చూస్తున్నప్పుడు నవ్వొచ్చింది!

‘ఈ కళ్ళెవరివమ్మా?’ అని నాన్న ‘మీ అమ్మ కళ్ళే వచ్చాయి’ అని నాతో అంటే తమ్ముడు యేడ్చాడు ‘నావీ’ అని! అందరూ నవ్వారు!

‘ఈ బొమ్మ యెవరిదీ?’ అని పక్కింటి పిన్ని, ‘నేను తీసుకుంటా’ అంటే ‘నాదీ’ అని తమ్ముడు కిందపడి దొర్లడం కూడా షూట్ చేశారు!

‘ఈ టీవీ నాది’ రెండు చేతులు టీవీ మీద వేసి యెదురింటి అంకుల్ యెత్తుకుపోడానికి కష్టపడుతుంటే- ‘నాదీ’ తమ్ముడు అంకుల్ ఫేంటు పట్టుకు లాగి వెళ్ళాడుతుంటే- అందరూ నవ్వులు!

తమ్ముణ్ణి ఆట పట్టించడానికి వచ్చిన వాళ్ళందరూ ‘యిది మా బ్యాగు పట్టుకు పోదాం పద’ అని తమ్ముడు ముందు అన్నదే తడవు తమ్ముడు ఆ బ్యాగును గట్టిగా పట్టుకొని లోపలి గదిలోకి లాగలేక లాగలేక లాక్కుపోతూ ‘నాదీ’ అంటున్నాడు!

అలా యే వస్తువు తీసినా సామాను తీసినా ‘నాదీ’ అని తమ్ముడు గోల గోల!

అమ్మని పేరు పెట్టి పిలిచి ‘మీ యింట్లో వొక్క వస్తువు పోదు, యెవరు తీసుకువెళ్ళినా నీ కొడుకు వొప్పుకోడు’ అంటే అమ్మ కూడా మురిసిపోతూవుంది! ‘నా బంగారమే’ అని ముద్దులాడుతోంది!

వీడియో బయట కూడా అదే కథ!

పిల్లలు యింటికి వస్తే ‘అది తమ్ముడిది’ అని అమ్మ అంటే, ‘అది నాది’ అని తమ్ముడు కూడా!

‘ఈ బాలు నీది… ఈ బేటు నీది… ఈ బెడ్ నీది… ఈ రూము నీది…’ అని చెప్తుంటే తమ్ముడు కూడా ‘ఈ బాలు నాది… ఈ బేటు నాది… ఈ బెడ్ నాది… ఈ రూము నాది…’ అంటున్నాడు!

అమ్మ కూడా ‘యిది నా చీర… యిది నా బంగారం… యివి నేను కొనుక్కున్నవి’ అనేదా? నాన్న కూడా ‘యిది నా కష్టార్జితం… యిది నా అకౌంట్… యిది నా సెల్లు…’ అనేవారా? అమ్మతో గొడవ వొచ్చినప్పుడు ‘యిది నా యిల్లు…’ అనేవారా? తమ్ముడు కూడా అంతే! ‘ఇది నాది… యిది నాది…’ అని ప్రతీది తనదే అనేవాడు!  

ఓహో అక్కడ అలవాటైందా? అనుకున్నాను!

ఇప్పుడూ అమ్మ స్కూలుకు బాక్సు కడుతుందా ‘యిది నీ బాక్సు… యెవరికీ యివ్వకూ’ అని జాగ్రత్త చెపుతుంది! ‘ఇది నీ పెన్సిల్ వాళ్ళకీ వీళ్ళకీ యివ్వకు’ అని ముందు జాగ్రత్త చెపుతుంది!

తమ్ముడు కూడా అన్నీ ‘నావీ నాదీ…’ అంటుంటాడు!

ఇంట్లో బయటా అందరూ ‘నాదీ నాదీ’ అంటూవుంటే తమ్ముడు కూడా అదే మాట అంటున్నాడు! ‘మనమూ మనదీ’ అని అంటారు, కాని అంతా అందరూ ‘నాదీ నావీ’ అన్నట్టే వుంటారు!

తమ్ముణ్ణి చెడగొట్టిందే యీ పెద్దోళ్ళు!

తమ్ముడుకి మాట వొకటి చేత మరొకటి తెలీదు! ఉన్నది వున్నట్టుగా అంతా ‘నాది… నాది’ అని అంటున్నాడు! అదే తమ్ముడు సమస్య! పెద్దలు తెచ్చిన పెద్ద సమస్య! పెద్దలు అంటించిన పెద్ద సమస్య!

తమ్ముడికి కొన్నాళ్ళకి ‘మనమూ మనదీ’ అని అనడము అందర్లాగే రావచ్చు! వస్తుంది! వచ్చినా చేతల్లో ‘నాది… నాది’ అని వుండడము కూడా వస్తుంది!

నేనయినా మీరయినా అంతే కదా? మా తమ్ముడయినా మీ తమ్ముడయినా అంతే కదా?

– బాలరాజు,

రెండో తరగతి,

(భావన, ఐదవ తరగతి.  తమ్ముడి తరుపున)

మున్సిపల్ స్కూల్

 

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.