కలిసి నడవడం మంచిదే
కూల్చివేత కూడా మంచిదే

ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలింగనాలూ , కరచాలనాలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు సామరస్యంగా సమసిపోతాయనే ఆశించోచ్చు. అయితే యీ కరచాలన పర్వం ఇలాగే కొనసాగాలి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న విభజన సమస్యలు ఒక ఎత్తైతే , నీటి సమస్యలు మరో ఎత్తు. అందునా ఇవే కీలకం. తెలంగాణ , సీమాంధ్రల మధ్య నీటి జగడాలు ఇప్పటివేమి కాదు , దశాబ్దాల నుంచీ ఉన్నవే. సుంకేసుల నుంచి నాగార్జున సాగర్ వరకు విభేదాలు ఉండనే ఉన్నాయి. గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూడా వివాదాస్పద ప్రాజెక్టులపై నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ చేసి వున్నారు. 

ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల విషయానికి వస్తే మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కేసీఆర్ గారు నాడు తన ఉద్యమ ఉధృతిలో భాగంగా ప్రజల్లో రాష్ట్ర కాంక్ష రగిలించడానికి ప్రధానంగా ఎంచుకున్న విమర్శనాస్త్రం సాగునీటి ప్రాజెక్టులే. మహబూబ్ నగర్ , నల్లగొండ , ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలకు సరైన ప్రణాళికతో సాగునీటి వసతి కల్పిస్తే పంటలు పండే పరిస్థితులు వున్నా కూడా పాలకుల నిర్లక్ష్యం జరిగింది అనేది వాస్తవం . అయితే నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ , లేదా అంతకుముందు కేసీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి కానీ కేసీఆర్ పరుష వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించక తప్పదు. 

ముఖ్యంగా, వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాజెక్టుల పై నాడు చేసిన ఆరోపణలు అప్పట్లో దూమారాలు లేపాయి. మరి ఇప్పుడు అవే ప్రాజెక్టులు అలాగే వున్నా కూడా ఆ ప్రాజెక్టులకు అత్యంత శ్రద్ధ చూపిస్తానంటున్న జగన్ తో కేసీఆర్ కరచాలనం చేయడం దేనికి సంకేతమో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.  అంతేకాకుండా కేసీఆర్ తన ఉద్యమ కాలంలో ఎక్కువ శాతం విమర్శలు రాయలసీమ ప్రాజెక్టులపైనే పెట్టేవారు. దానికి కారణం వైఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కొంచెం తోడైయ్యుండొచ్చు. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు , హంద్రీనీవా తెలుగుగంగ వంటి ప్రాజెక్టులపై ఒంటి కాలిపై లేచేవారు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాలకూ ఉపయోగపడే దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ను రద్దు చేసి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు తెచ్చి , కట్టి మొన్ననే ప్రారంభం కూడా చేసాడు. ఇక్కడ గమనించాల్సిన మరో చిన్న అంశం ఏమిటంటే కోస్తా ప్రాజెక్టుల పట్ల కొంచెం ఉదార భావం కలిగి ఉన్నాడనే అపప్రద కేసీఆర్ పై సీమ ప్రజలకు ఉంది. దానికి ఉద్యమ తీరు కారణం అయ్యుండొచ్చు. కాబట్టి సీమ ప్రజలు భావి ప్రాజెక్టుల పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు. అటువంటి తరుణంలో డైరెక్టుగా శ్రీశైలానికి గోదావరి జలాలు అనే ప్రతిపాదనలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

అలాగే యీ పక్షం రోజుల పాలనలో చెప్పుకోదగ్గ అంశాలలో అమ్మఒడి పథకం, అక్రమ కట్టడాల కూల్చివేత అనే రెండు ముఖ్యమైనవి. అమ్మ ఒడి పథకంలోనైతే ప్రజాస్వామికవాదులు దాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలా అడగడం మంచిదే. అలాగే అడగాలి. అయితే వారు అంతకంటే ముందు ఎన్నికలకు మునుపే ” అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయాలని ” ఎందుకు డిమాండ్ చేయలేదో తమను తాము ప్రశ్నించుకోవాలి. ఆర్థిక మంత్రి ఒకసారి అసెంబ్లీలో పథకం గవర్నమెంట్ స్కూల్లకూ అని ప్రకటిస్తే రెండ్రోజుల తర్వాత ప్రభుత్వం తరపున నుంచి అన్ని స్కూల్లకూ వర్తిస్తుంది అని ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. బహుశా బడా ప్రైవేటు స్కూళ్ల ఓనర్లు ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు. యీ నిర్ణయం తో సందుకో కాన్సెప్ట్ స్కూలూ , వీధికొక ఇంటర్నేషనల్ స్కూలూ వెలుస్తాయి. ఫీజు  రీయింబర్స్మెంట్ కోసమని పుట్టగొడుగుల్లా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజిల్లాగా జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే పథకం ప్రకటించినప్పుడు నోరెత్తని ప్రజాస్వామ్య వాదులు ఇప్పుడు కేవలం సోషల్ మీడియా నినాదాలకు పరిమితం కాకుండా ఏదైనా ప్రత్యామ్నాయ కార్యాచరణ చూసుకుంటే ఫలితం ఉంటుందేమో. లేకపోతే ప్రయివేటు స్కూళ్ల దందా మాట ఎలా వున్నా పేదల పాలిట కొంత ఉపశమనం మాత్రం కలిగిస్తుంది.

అక్రమ కట్టడాల కూల్చివేత గురించి ప్రతిపక్ష టీడీపీ నేతలు అంత హంగామా చేసి తమ మర్యాదను తామే బజారుపాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా వేదిక అనబడే రేకుల షెడ్డు అక్రమ కట్టడం అనే విషయం ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చినది కాదు. దాన్ని కడుతున్నప్పుడే అది నది కరకట్టలోకి జరిగి మరీ కడుతున్నారు అని ఆందోళన రేగింది. పర్యావరణ వేత్తలు కోర్టులను , ట్రిబ్యునల్లను కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ప్రజా ధనం వృధా గింజుకుంటున్న నేతలు , స్వీయ ప్రకటిత , సూటికేస్ మేధావులు ఆరోజు ఒక్కరూ నోరెత్తలేదు. యీ ప్రజా ధన పొదుపరులు ఆరోజే చెప్పి వుంటే దాన్ని కట్టకుండా చేసి ప్రజల సొమ్మును కాపాడి ఉండొచ్చు కదా. కానీ వారి అసలు బాధ అది కాదు. ఏదేమైనప్పటికి నదీ కరకట్ట వెంట ప్రైవేటు వ్యక్తుల కట్టడాలు , ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఎస్టేట్ కూడా ఆ జాబితాలోనే ఉంది. ఐనా ముఖ్యమంత్రి డైరెక్టుగా వాటి జోలికి పోవడం లేదు కదా. అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి తీర్పును బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించాడు. ప్రజా వేదిక ప్రభుత్వానిదే కాబట్టి దాన్ని ముందు కూల్చి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపి ఉండొచ్చు. 

కోర్టులు ప్రభుత్వ , ప్రైవేటు బిల్డింగులు ఏవైనా సరే అక్రమమని తేలితే కూల్చి పారేయమని ఆర్డర్ ఇస్తే అప్పుడు జరగబోయే పరిణామాలకు యీ ప్రజా ధనం పై ప్రేమ ఒలకబోసేవారు ‘ ఎలాగూ కట్టారు కదా . ఇప్పుడు గొడవెందుకు ‘ అని అనకుండా చిత్తశుద్ధితో మద్దతు తెలపాలి. వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం కూడా ఏమిటంటే రేప్పొద్దున కృష్ణా నదికి భారీ వరదలు వచ్చి ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వల్ల పోయే ఏ అభాగ్యుని ప్రాణానికి ధనం తో విలువ కట్టలేం అని. వరద ముప్పుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమయ్యే యీ అక్రమ కట్టడాలు కూల్చాల్సిందే. కూల్చివేత ఇలాగే అన్ని అక్రమ కట్టడాల వరుకు చేరాలని ఆశించాలి

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

1 comment

  • ఇదేదో జగన్ పార్టీ వ్యాసం లాగా ఉంది. నిష్పక్షపాతంగా లేదు.
    దేశంలో ఎన్ని సమస్యలు లేవు? అంత యమర్జంటుగా ఒక వేదిక కూలగొట్టాలా?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.