గజళ్ళూ గజ్జెల చప్పుళ్లూ
లోపలి అడవుల్లో నడకలూ..

(విపశ్యన 2 )

4.00             ఉదయం నిద్ర లేపే గంట
4.30-6.30     ఉదయం ధ్యానం
8.00-11.00   ఉదయం ధ్యానం
11.00-12.00 ఉదయం  భోజనము
12.00-1.00   మధ్యాహ్నం నివృత్తి (అస్సిస్టెంట్ టీచర్ గారితో)
1.00-5.00     మధ్యాహ్నం ధ్యానం
5.00-6.00     సాయంత్రం తేనీరు (పాలు లేకుండా తేనీరు, ఒక  పండు, ఇది కూడా తీసుకోకుండా ఉంటే మంచిదిట)
6.00-7.15     ధ్యానం
7.15-8.15     గోయెంకా గారి అనుగ్రహ సంభాషణ (వారిప్పుడు లేరు. వారు పూర్వాశ్రమంలో మాట్లాదిన వీడియోలో  ప్లే చేస్తారు.
8.15-9.00     ధ్యానం
9.00-9.30    ప్రశ్నలు సమాధానాలు (ఉంటేనే )
9.30            మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి దీపాలు ఆర్పేసి పడుకోవడమే

ఇవన్నీ ముందే చదవడం వల్ల షాకవలేదు.

అహింస ,అసత్యమాడకుండుట, దొంగతనం చెయ్యకపోవుట, బ్రహ్మచర్యం, మత్తు సేవించకుండుట  ఈ ఐదు పంచ సూత్రాలని పాటించడం ధ్యానానికి తొలిమెట్టు అని చెప్పారు. ఒకరితో ఒకరి మాట్లాడం కానీ, సైగలు చెయ్యడం కానీ, పూజ పునస్కారాలు, యోగ లాంటివేమీ చెయ్యకూడదని చెప్పారు. కళ్ళు దించుకుని నడవడం అలవాటు చేసుకోవాలనీ, అలా  ఎవరి కళ్ళలోకీ చూడకుండా ఉండడం వలన ఎదుట వారి చర్యల పైనా, వారి పైనా ఆసక్తి కలగకుండా ఉంటుందనీ, ధ్యానానికి అది చాలా ముఖ్యమైన విషయమనీ చెప్పారు. మవునం పాటించడం, మధ్యాహ్నం 12 దాటాక ఆహారం తీసుకోకపోవడం ప్రాముఖ్యత గల నియమాలు ట . ఇది చెప్పగానే ఒక గంట క్రితం నకనకలాడిన ఆకలి గుర్తొచ్చిన్నీ, రోజూ ఇంటికెళ్ళగానే ఘటోత్కచుడిలా అన్నం కుండల మీద పడడం గురించిన్నీ తలపోసి హతాశురాలనయితిని. ఆశ్రమం పెద్దది కావటం వలన  ప్రతి చోటా దారి చూపే యారో మార్కులు ఉన్నాయని, ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని చోట్లా వ్రాసి ఉన్నాయని చెప్పారు. ఇక్కడొక విషయం చెప్పాలి. ఒక్కొక్క గదిలో ఇద్దరేసి ఉంటారు. వారికి ఒక స్నానాల గది. ఆ స్నానాల గది తలుపు మీద ఒక షీట్ ఉంటుంది. ఇద్దరూ కూడా వారు బాత్రూం వాడుకునే టయిం ముందుగానే దాని మీద వ్రాసెయ్యాలి. అక్కడ వ్రాసిన టయిం లో మాత్రమే వారు బాత్రూం వాడుకోవడం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడే అవకాశం రాదన్నమాట. ఎవరినీ ఏమీ అడగక్కరలేకుండా ప్రతి గదిలో గోడల మీదా, గుమ్మం తలుపుల మీదా చెప్పులు ఎక్కడ విప్పాలి దగ్గర నించి ధ్యానం సమయం, భోజన సమయం పాటించవలసిన నియమాలన్నీ వ్రాసిన షీట్ లు అమర్చి ఉంటాయి. ఇంత ఖచ్చితం గా రూల్స్ పాటించడం పుట్టి బుధ్ధెరిగి నేను చూసిన పాపాన పోలేదు. ఇదే మొదటి సారి. ఇవన్నీ చెప్పడమయ్యాక మా  విలువయిన వస్తువులు , ఫోన్ లు, పుస్తకాలు, మొదలైనవన్నీ డిపాసిట్ చేసేసి ధ్యాన మందిరం వైపు కదిలాము.

పెద్ద మసీదులని తలపించే విశాలమైన ధ్యాన మందిరం అది. అతి ప్రశాంతం గా ఉంది. ఆడవారి గదులు మందిరానికి కుడి వైపున ఉన్నందున వారు కుడి వైపు ద్వారం నించీ, మగ వారి గదులు మందిరానికి వెనక వైపు ఉన్నందున వారు ఎడమవైపు ద్వారం నించీ ప్రవేశించి, నిష్క్రమించాలి.   అందరికీ ఆసనాలు వేసి ఉన్నాయి.. 2X2 అడుగుల పలుచని స్పాంజీ కి నీట్ గా నీలం గంగు గలేబులు.. వాటిపైన మన ఇంట్లో వాడే పీట సయిజులో ఇంకో స్పాంజీ కి కూడా నీలం గలేబు. ఇటుకల సయిజులో దీర్ఘ చతురస్రాకారపు స్పాంజి ముక్కలు 2, వాటికి కూడా అందంగా నీలం రంగు గలీబులు వేసి ఉన్నాయి. కూర్చోలేని వారికి కుర్చీలు, వాటిలో ఇటువంటి మెత్తలు.. కొందరు  వీపుకి సపోర్ట్ ఉండే ధ్యానాసనాలేవో ఇంటినించి తెచ్చుకున్నట్టున్నారు. అన్ని వైపులా ఒక మనిషి నడిచే దారి వదిలి క్రమంలో అన్నీ అమర్చి ఉన్నాయి. ప్రతి ఆసనం మీదా పేర్లు ఉన్న చీటీలు పెట్టి ఉన్నాయి. మవునంగా ఎవరి పేరు ఉన్న చోట వారు చూసుకుని కూర్చున్నారు. తలుపులు మూసివేయడం తో వెలుగు తగ్గింది. కింద కూచోడం అలవాటు పోయిందేమో అందరమూ కాళ్ళు అటు ఇటు మడుచుకుంటూ అడ్జస్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇటుకల షేప్ లో ఉన్న స్పాంజి ముక్కలు ఎందుకో అర్థమవలేదు గానీ, ఎవరినో చూసి నేనూ మోకాళ్ళ కింద పెట్టుకుంటే కాస్త కూచోడం సులువయ్యింది (ఆ నిమిషానికి)  

ఇంకా అలా సర్దుకుంటుండగానే  గోయెంకా గారి గొంతులో బుద్ధుని దోహాలు వినబడ్డాయి. ఆ గొంతు గరుగ్గా ఉంది..ఆ గొంతు కానీ, ఆయన పాడే తీరు కానీ అసలు నచ్చలేదు. బాబోయ్ ఈ గొంతు 10 రోజులు వినాలా అనిపించింది.. పాపముపశమించు గాక!!!!!…  నోబుల్ సయిలెన్స్ గురించీ, శీల ప్రాముఖ్యత (పైన చెప్పిన పంచ సూత్రాలు పాటించడం) గురించీ చెప్పాక, ఊపిరి మీద ధ్యాస నిలపమని చెప్పడంతో ఆడియో అయిపోయింది.. అక్కడ నించి 2.30 గంటలు ధ్యానం చెయ్యాలిట. కేవలం నాసాగ్రం మీద మనసుంచడమే అని వీజీగా చెప్పేసారు కూడా.. మనసు చంచలమైనది అని అందరికీ తెలుసు. చంచలమందు వీర చంచలము వేరయా అన్నట్టు ప్రతి రాత్రీ 12 గంటలకి పనులు చేసుకుని పడుకున్నాక మళ్ళీ ఏదో గుర్తొచ్చి అటూ ఇటూ తచ్చాడడమూ, .. ఇంకో గంటాగి అందరూ పడుకున్నారని నిర్ధారించుకుని మెల్లగా ఇంకో గదిలోకెళ్ళి రేడియో షో రికార్డు చేసుకునే రికార్డు మనది. అలాంటి చంచల మర్కట మనసుతో   అసలు 30 సెకన్లు కూడా కూచోలేకపొయ్యా. శని మహరాజు చూసినట్టు కనుకొలకుల్లోంచి అటూ ఇటూ వక్రదృష్టితో చూస్తే చిన్నప్పటినించీ అలవాటయినట్టు అందరూ సమాధి చెందారు.. సారీ.. సమాధి లోకి వెళ్ళారు. నేనూ బలవంతంగా గాఠిగా కళ్ళు మూసుకున్నా.. చిన్నప్పుడు చెరువుగట్టు దగ్గరున్న గుడ్డి పోషయ్య బొంద మీద బొమ్మల పెళ్ళి చేస్తున్నామని చూసి మా ఆనందన్న పరుగుపరుగున పొయ్యి అమ్మకి చెప్పినప్పుడు, అమ్మ భయపడిపోయి మమ్మల్ని పిలిపించేసి , దిష్టి తీసి, పుణ్యవతి -భాగ్యవతి వాళ్ళింటికి ఇంకో సారి వెళ్ళద్దని ఒట్టు వేయించిన దగ్గర నించీ.. పొద్దున్న చేసిన వంకాయ మెంతికూర రెసిపీ వరకూ అర్థ శతాబ్ది జీవితం సీను తరవాత సీను యశోదకి కృష్ణుడి నోట్లో కనబడ్డట్టు కనబడేసాయి..ఆఖరి సీనలా ఆగిపోయింది. అసలీ వంకాయ- మెంతి కూర వండడం ఎవడు కనిపెట్టాడో కానీ.. ఆహా అని నెమరేసుకుంటుండగా..కల చెదిరిందీ.. కథ మారిందీ.. కన్నీరే ఇక మిగిలింది.. ఎందుకేంటండీ.. ఇంత సినిమా చూసినా ఇంకా ఒక అరగంట కూడా అయినట్టు లేదు. దేవుడో నువ్వే దిక్కు అనుకున్నా. ఆయన దయ ఉందేమో … నా జీవిత చరిత్ర అయిపోయింది కదా .. ఇప్పుడు నా చిన్నప్పటి స్నేహితులూ వాళ్ళ గోల ఒక సారీ.. పక్కింటి పాపాయమ్మ గారి కోడలుకి నడిచిన ప్రేమ వ్యవహారమొకసారీ.. కెనడాలో నాతో పనిచేసే పిల్లకి హ్యూమన్ రిసోర్స్ తో జరిగిన   గొడవ తాలూకు పూర్వాపరాల గురించొకసారీ నేనే సినిమాలు నిర్మించేసుకునే అవకాశమిచ్చేసి ఆ పూట గండం గట్టెంకించేసాడు. ఇంకా చివరి సినిమా చివరి ఘట్టం లో ఉండగానే మళ్ళీ అరగంట దోహాలు చదివి ఇంటికి పొమ్మన్నారు. అనడమంటే అనడము కాదులెండి.. అక్కడ గోయెంకా గారి వాయిస్ తప్ప ఇంకెవరూ మాట్లాడరు. నెమ్మదిగా అందరినీ అనుసరిస్తూ గదుల వైపుకి దారి తీసాము. అలసటకి లైట్ ఆపి పడుకోగానే నిద్ర పట్టేసింది. 

ఒకటవ రోజు (వెళ్ళిన రోజు ప్రోగ్రాం మొదలైనప్పటికీ ఆ రోజు ని 0 గా గుర్తించాలి..) పొద్దున్నే 4 గంటలకి గుడి గంటల్లాంటి గంటలు మోగాయి.. కొత్త ఉత్సాహం కదా భలే అనిపించింది.. గబ గబా లేచి స్నానం ముగించి (గుడికెళుతున్న ఫీలింగ్ మరి) 4. 25 కల్లా ధ్యాన మందిరం దగ్గరున్నా.. ఎవరితోనూ మాటా మంతీ లేవుగా సరాసరి ధ్యాన మందిరంలోకెళ్ళి సమాధిలోకెళ్ళిపోవడమే.. నమ్మరేమో గానీ అలా కళ్ళు మూసుకున్నానో లేదో ఒక్క ఆలోచన వస్తే ఒట్టు!! .. 6 అయినట్టుంది చివరి అరగంటా  పంతులు గారు మళ్ళీ దోహాలేవో పాడుతున్నారు.. కానీ నన్ను అవేమీ డిస్టర్బ్ చెయ్యలేదు..కాసేపటికి అందరూ లేస్తున్న అలికిడి వినిపించి కళ్ళు తెరిచా.. అబ్బా 2 గంటలు ఎంత చక్కగా నిద్దరట్టేసిందో అసలు!!!పూర్తి ఫ్రెష్ ఫీలింగు..

స్నానం అవచేసేసాను కాబట్టి సీదా రుచికరమైన శాఖాహార అల్పాహారం తినేసి కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్ళీ ధ్యాన మందిరానికొచ్చేసా.  .. 8 నించి మాత్రం సీరియస్ గా చెయ్యాలబ్బా.. ఎందుకొచ్చినట్టిక్కడికి.. నిద్ర పోవడానికా.. చీఛ్ఛీ అని విసుక్కుని.. నాసాగ్రం మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించా.. ఈగలు దోమలు లాంటి ఆలోచనలు ముసిరినా.. కాసేపటికి కాస్త ఏకాగ్రత వచ్చినట్టుంది.. కానీ కలలాంటిదేదో.. అందులో  నా పిల్లలు 3/ 4 ఏళ్ళ పిల్లలు గా మారి భుజాల మీదా, వీపు మీదా ఉయ్యాలూగుతూ .. అమ్మా అమ్మా అని బుగ్గ మీద కొట్టి పిలుస్తూనే ఉన్నారు.. మొత్తం మూడు గంటలూ అదే .. అదొక్కటి తప్ప ఇంకే ఆలోచనా రాలేదు.. అబ్బో ఇది గెలుపు అనుకున్నా.. సాయంత్రం గోయెంకా గారి డిస్కోర్స్ లో ఆయన ఒక గంట మాట్లాడారు (ఆయనిప్పుడు లేరు.. కానీ ఆయన తరువాత ఎవరూ వారసత్వం తీసుకోకుండా ఆయన గతం లో మాట్లాడిన వీడియోలు ప్లే చేస్తారు. ఆయన కూడా “నేను ఉపాధ్యాయుడిని అంతే.. ఇక్కడెవరూ గురువులుండరు” అని చెప్పారు. ఆ సింహాసనం కోసం ఎవరూ  తన్నుకోడాలు, చంపుకోడాలు చెయ్యనందున నా నించి పూర్తి 100 మార్కులు పడిపొయ్యాయి ఆ సంస్థకి ).. మంచి విషయాలు చెప్పారు.. పొద్దున్న అర్థం కాని వాటికి, అయోమయానికీ ఆ అనుగ్రహభాషణలో అర్థాలు దొరికాయి.. ఆయనని చూసాను కాబట్టి, చూస్తూ విన్నందువల్లేమో వాయిస్ కి కన్నెక్ట్ అయ్యాను.. మళ్ళీ 45 నిముషాల ధ్యానం తరువాత అలసటగా పోయి పడుకోగానే నిద్రొచ్చేసింది.. అయ్యప్ప దుస్తుల్లో ఉన్న ఏసుదాస్ గారి లాంటి ఒకాయన వచ్చి ఏదో పుస్తకమిస్తున్నట్టు వచ్చిన అర నిముషం కల. ఇంకా చదువుకునేదేదో ఉందేమో లేక అన్నమయ్యకి నారదుడిచ్చినట్టు ఏదైనా మహత్తు గల పుస్తకమా! ఆయనెవరు? ఆ పుస్తకం లో ఏముంది? అని ఆలోచిస్తూ నిద్ర పట్టేసి మళ్ళీ 4 గంటల బెల్లుతో మెళకువొచ్చింది.. ధ్యానం, తిండీ, నిద్రా తప్ప ఏమీ లేవు కాబట్టి ఆ రోజూ షరా మామూలే, కానీ చుక్కలు కనిపించిన రోజది.. ఎందుకంటారా .. అది తెలియాలంటే 3 రోజుల వెనక్కెళ్ళాలి. శ్రమ తెలియకుండా వినండి… 

నేను ఇక్కడికొచ్చే రోజు పొద్దున్న పనులు చేసుకుంటుంటే సడన్ గా  ” ఝుకీ ఝుకీ సీ నజర్ బేకరార్ హై కి నహీ” అనే పాట గుర్తొచ్చిందెందుకో.. ఆ పాట వెతికి అదే పనిగా వింటున్నా. వినడమొక్కటేంటి దాంతో కలిపి పాడేస్తున్నా.  సీతయ్యకి నచ్చలేదు.. ఆయనకి కొన్ని పాటలు నచ్చవు.. బహుశా నేను కలిపి పాడడం వల్ల కావచ్చు… ” ఏంటా దబా దబా, నేను ఆఫీస్ పని చేస్తున్నా ఇక్కడ” అని విసుక్కున్నారు.. ఈ ‘వర్క్ ఫ్రం హోం’ ఒకటి నా మొకానికి అనుకుంటూ కట్టేసా కానీ ఆ పాటే మనసులో.. భలే ఉంది,   గజల్ కదా ఇది!.. తెలుగులో అనువాదం చేస్తే భలే ఉంటుంది కదా అనుకున్నా.. ఆ రోజంతా అదే మనసులో కానీ గమ్మత్తుగా ఆ సాయంత్రం కానీ, ఒకటవ రోజు కానీ అస్సలు గుర్తు రాలేదు. రెండవ రోజు 4.30 కల్లా పిలిచినట్టు వచ్చేసింది.. ఇంక రోజంతా ‘దబా దబా స సహీ దిల్ మే ప్యార్ హై కి నహీ “అని తప్ప ఇంకో ఆలోచన లేదు.. దీన్ని తెలుగులో ఎలా చేస్తే బాగుంటుంది.. ఉహూ ఆ పదం బాలేదు ఈ పదం బాలేదు అనుకుంటూ సాయంత్రానికల్లా  “వాలి ఉన్న చూపులలో పిలుపు దాగి ఉందేమొ.. మూసి ఉన్న ఊహలలో వలపు దాగి ఉందేమో” అన్న దగ్గర ఆగింది.. అంత తృప్తిగా లేదు కానీ బోలెడు పదాలు ఈ పాటికి అనేసుకున్నా కదా ఒకటీ సరిగా గుర్తు రావట్లేదు. ఇది కూడా గుర్తుంటుందో లేదో అని ఖంగారు. చాయ్ కి వెళ్ళే ముందు రూం కి వెళ్ళా. అక్కవుంటెంట్ని కాబట్టి పెన్ ఉంటుంది ఎప్పుడూ బ్యాగ్ లో .. పేపర్ లేదు.. అటూ ఇటూ చూసా. చటుక్కున గుర్తొచ్చింది. వచ్చిన రోజు సాయంత్రం ధ్యాన మందిరానికి మొదటి సారి వెళుతున్నప్పుడు  చిన్న కాగితం మీద రూం నించి భోజన శాల, ధ్యాన మందిరం కి రూట్ వేసిన కాగితమిచ్చారు.. అది అరలో ఉంది. బయటికి తీసి వెనక్కి తిప్పి ఈ రెండు లయిన్లూ వ్రాసా.. మనసు కాస్త ప్రశాంతమయింది.. ఇంక ధ్యాస ధ్యానం మీద పెట్టాలి అనుకున్నా. కానీ ఒక అపరాధ భావం.. అబద్ధాలు ఆడను, అహింస చేయను లాంటి వాటితో పాటు పాడను, నాట్యం చెయ్యను, చదవను , వ్రాయను , పూజ పునస్కారాలు, యోగా వంటివేవీ చెయ్యనని సంతకం పెట్టానో లేక వారు చెప్తే సరే అన్నానో గుర్తు రావట్లేదు.. శీల స్టేజ్ లోనే దెబ్బ తినేసానని దిగులు పట్టుకుంది. రోజంతా అయిపోయింది, అప్పుడే మూడో రోజొచ్చేస్తోంది.. ఇప్పటి వరకు కథలూ, సినిమాలు, పాటలు..చిరాకేసేస్తోంది. ఆ రోజు రాత్రి  వీడియో లో పంతులు గారు మాట్లాడుతూ “ఈ రోజు ఆడుతూ పాడుతూ గడిచింది కానీ, ఇంకా కష్టమైన రోజులు ముందు 8 ఉన్నాయి అని చెప్పారు. సడెన్ గా మా అమ్మ గుర్తొచ్చింది. నా పుట్టిల్లు వరల్డ్ ఫేమస్ ఆల్వాల్ అవగా అత్తవారిల్లు నేరేడ్మెట్టు . రేపు, ఎల్లుండీ, పెళ్ళి, పేరంటం అంటూ నేను పుట్టింటికి వెళ్ళే లోపే ఆసుపత్రిలో చేర్చాక ఇంటి దగ్గరుండే ఒక పిల్లాడితో మా అమ్మకి కబురు పంపారు. వాడు భోజనం అదీ చేసి, సైకిల్ వేసుకుని వెళ్ళి చెప్పడానికి, అమ్మ బస్సులెక్కి రావడానికీ 3 గంటలు పైనే పట్టింది.. వస్తూనే “నెప్పులొస్తున్నాయా వదినగారూ” అంది. ఆ వాయిస్ లో పిల్లని మొదటి కానుపుకి తొందరగా పుట్టింటికి పంపలేదని బాధ , కోపం, నిష్టూరం, ఉక్రోషం అన్నీ కలిసి పోయి గొంతు లోంచి దుఖం తన్నుకొచ్చేస్తోంది.. అత్తయ్య నిదానంగా … “అబ్బే,  ఇంకా చలి నెప్పీ పులి నెప్పీ అంతే! పెద్ద నెప్పులు మొదలవ్వలేదు ఖంగారు పడకండి వదినా” అన్నారు. అమ్మ కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి, నా చెయ్యి పట్టుకుంది సుతారం గా…. అయ్యో అనిపించింది నాకు. “ఫర్వాలేదు అమ్మా బాగనే ఉన్నా, నెప్పీ లేదు గిప్పీ లేదు” అన్నా నవ్వు కళ్ళల్లోకి తెచ్చుకుంటూ,.. “అవును కానీ అమ్మా, ఈ పులి నెప్పులేంటీ” అనడిగా.. “ఇప్పుడొచ్చేవి అప్పుడప్పుడు వస్తున్నాయి కదా. కాసేపయ్యాక గ్యాప్ లేకుండా వస్తాయి అంతే” అంది. “ఓస్ అంతేనా” అనేలా చెప్పింది మరి!.. తర్వాత సంగతి మీరు అడక్కండి. నేనూ చెప్పను, కానీ ఈయన చెప్పింది మాత్రం సేం అలాగే అనిపించి వామ్మో అనుకున్నా…ధ్యానం అని ఊరికే కూచోడమేగా ఇన్ని కథలు చెప్తుందేంటీ అనుకుంటున్నారు కదా.. అంత వీజీ కాదండీ మరి! అదంతే.. అందుకే ఆ రోజు చివరి సెషన్ అంతా మనసు మనసులో లేదు.. 

రోజు లాగా నిద్దరొచ్చెయ్యట్లేదు. పరీక్షలు దగ్గరికొచ్చేసినా ఇంకా పుస్తకం ముట్టుకోని పిల్లల మానసిక స్థితి లా ఉంది నా పరిస్థితి. పైగా పేపర్ మీద వ్రాసిన ఆ రెండు ముక్కలు మనసు తొలిచేస్తున్నాయి. అందరూ వెళ్ళి అస్సిస్టెంట్ టీచర్ తో మాట్లాడుతున్నప్పుడు.. “నేను అలా కూడా రూల్ బ్రేక్ చెయ్యకూడదు” అని మొదటి రోజు అనుకున్న మాటలు మరచి  12 గంటలకి సందేహ నివృత్తి కోసం అస్సిస్టెంట్ టీచర్ తో 5 నిమిషాలు కలవడానికి బోర్డ్ మీద పొద్దున్నే పేరు వ్రాసేసా.. నేను ఆలోచించీ, చించీ వ్రాయడం వల్ల అందరిలోకి చివరగా నా వంతు. అందరూ అయ్యాక లోపలికి వెళ్ళా.. ” ఏంటి నీ సందేహం” అని గుసగుస లాగా వినీ వినిపించనట్టు అడిగారావిడ. “ఇలా ఒక పాటేదో నన్ను తినేస్తోంది. అసలు కాన్సెంట్రేట్ చెయ్యనియ్యట్లేదు , అందువల్ల కాగితం మీద వ్రాసి తప్పు చేసాను. అపరాధం చేసినట్టుంది. మీతో  చేమని వచ్చా” అని చెప్పా.”ఆనా పానా (శ్వాస మీద ధ్యాస) వచ్చిందా” అన్నారు. లేదు అని అడ్డం గా తలాడించా.. “ఆనా తెలిస్తోంది కొద్దిగా కానీ పానా, జానా, ఖానా ఏమీ తెలియట్లేదు” అన్నా కాస్త సిగ్గుగా. “ఈ రోజుకల్లా పెదవి పై భాగంలో ఊపిరి తగిలే ఫీలింగ్ రావాలి” అన్నారు “ఈ రోజు 3 వ రోజు రేపే విపశ్యన ఇంకా ఇలా ఉంటే ఎలా.. ఈ పాటలు, పద్యాలు ఎప్పుడైనా వ్రాయచ్చు.. ఇలాంటి అవకాశం వస్తుందా” అన్నారావిడ మృదువుగా.. తలాడించా మవునం గా.. “కాన్సెంట్రేట్ చెయ్యి మరి” అన్నారు దయగా. సరే అని 12.30 కే ధ్యానమందిరం కెళ్ళి కూచుని ముక్కు పీల్చీ పీల్చీ పెదవి పైన శ్వాస తగలడానికి ప్రయత్నించా… మీరు నమ్ముతారో లేదో కానీ ముక్కు లోపల ఎర్రగా పుండు పడి రక్తం వస్తోందన్నంత నెప్పెట్టేసింది. “రేపు మధ్యాహ్నం జరిగే విపశ్యనకి అందరూ  రెడీ గా ఉండాలని ” మాస్టారు చెప్పారా రాత్రి. ఇదంటే ఏంటో అని ఒకటే ఉత్సాహం.. మళ్ళీ చివరి 45 నిమిషాల ధ్యానానికి ముక్కు ఉంటుందో పోతుందో అన్నంత నెప్పి. ఆ రాత్రి నిద్రలో ముక్కు తడుముకుంటూనే ఉన్నా నెప్పికి. నిద్ర లేచేటప్పటికి సర్దుకుంది అంటే అదంతా నా ఊహ కావచ్చు. నా ముక్కు బానే ఉంది.

మర్నాడు పొద్దున్న 4.30 నించి 5.30 లోపు పెదవి  పై భాగంలో గాలి తగులుతున్నట్టు అనిపించిది.. హుర్రే అనుకున్నా.. కానీ అది నిజమో ఊహో తెలియలేదు.. అలా అలా అవును కాదుల మధ్య తూగులాట లో  6 అయింది.. 6కి పంతులు గారు పాడుతున్న పాటకి గబుక్కున మెలకువొచ్చింది.. కాస్త చెవులు విప్పి విన్నా .. “అయ్యొ మెంటలూ.. పాగల్ కహీ కే ! నువ్వు , నీవాళ్ళూ సుఖంగా ఉండాలని 3 రోజుల నించీ మాస్టారు ఆశీర్వదిస్తుంటే నిద్దరోతున్నావా.. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. అని చెళ్ళున తగిలింది.. అది ఆశీర్వాదం!!  అక్కడి నించీ ప్రతి రోజూ ఆ అరగంటలో విన్న ప్రతి పదాన్ని ఎంజాయ్ చేసాను.. ఏంటీ మీరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. విన్నారా.. ? నా వాళ్ళంతా సుఖంగా ఉంటారంట..!

అర్థమయ్యిందిగా … 

11 గంటలకి భోజనమయ్యాక స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు, నడిచే వారు నడక, రూం కి పొయ్యి విశ్రాంతి తీసుకునేవారు విశ్రాంతి ఇలా ఒక అరగంట పైన టయిం ఉంటుంది. అటూ ఇటూ చూస్తూ నడుస్తుంటే అడవిలోకి  సన్నటి తోవ కనిపించింది… మెల్లగా లోపలి కెళ్ళా.. భలే ఉంది అడవి! నేనొక్కదాన్నే! అతను అడవిని జయించాడు పుస్తకం చదవాలి.. జయతి లోహిత్ గారూ ఇలాగే తిరుగుతుంటారేమో, మన వీర లక్ష్మి గారికి, భద్రుడు గారికీ ఎంత ఇష్టమోట ఇలా తిరగడం.. బోడపాటి పద్మావతి గారు, కొండవీటి సత్యవతి గారు, రాధ మండువ గారూ, వారిజ గారు, వసంత గారూ అందరూ గుర్తొచ్చేస్తున్నారు.. ” ఎదలోలయా ఎదకేలయా,  ఎగిసీ ఎగిరే” అని పాడుకుంటుంటే నా కాళ్ళ పట్టీలు తాళం వేస్తున్నాయి….” ఛీ, పాడద్దన్నారు కదా” అనుకునే లోపు …అక్కడ దాక్కున్న అల్లవారి పిట్ట ఘొల్లుమనే, నా కాళ్ళ గజ్జెలు ఘల్లుమనే..!!! ఆ ఘల్లుకి అక్కడున్న కాబోయే మునులు మొహం మీద స్వైర విహారం చేసాయి.. పొండి నాయనా..పొండి బాబూ అని చెప్తుంటే వింటేనా.. గుంపులు గుంపులు గా మొహం మీద చేతుల మీదా కాళ్ళమీదా.. టోటల్ గా ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి ..!  బాబోయ్ అవి నన్ను వదిలే లా లేవు.. పోనీ గట్టిగా గదమాయిద్దామంటే,, ” అహింసో పరమో ధర్మః..!!

భుజాల మీద మహా రాణిలా కప్పుకున్న శాలువా తలమీద కెక్కింది. “ఎదలో లయ” పోయి “నిను వీడని నీడను నేనే”  పాట గుర్తొచ్చి భయమేసి గబ గబా అడుగులేసుకుంటూ బయటకొచ్చేసా…

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

2 comments

 • టైం భలే యూజ్ చేస్తారు మీరు .. బాగుందండి ..

 • భలె మెడిటేషన్ తరగతులు లెండి..
  నేనూ ఒకసారి కలికి భగవానుడి ధ్యానం క్లాస్ స్ కి వెళ్ళాను.
  కళ్ళు మూసుకుంటే ఏం కనిపించిందనే ప్రశ్నకి..ఏం చెప్పాలో అర్ధం కాలేదు. చుట్టూ వున్న వాళ్ళేమో..ఏమేమొ మహిమలు వల్లేస్తుండే..నాకేమిటి ఒక్క మహిమా కనిపించలేదు? అని చిన్న బోయి, నన్నే కరుణించలేదు భగవ్వానుడని బాధ పడి చేసిన ఖర్చు అంతా వృధా కదా అని నిట్టూర్చి ఇంటికొచ్చాను.
  🙂
  రామచంద్ర మిషన్ వారి ధ్యాన తరగతి కొంత వరకు నాకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. అలానే రేకీ.
  రామకృష్ణ మఠం ధ్యాన మందిరం లో కళ్ళు మూసుకుని అలా కూర్చున్న కాసేపటికే నాకు తెలీని ఒక దివ్య లోకంలో కి ప్రవేశించాను.
  అది కైలాసమేమో..
  కనిపిస్తున్నంత మేరా అంతా వెండి మయం… తళ తళా మంటూ…
  అంతలో నన్ను వెంటనే పంపేయాల్సిందిగా ఎవరిదో స్వరం వినిపించింది. అది కమాండ్ లా లేదు. కానీ స్వరం లో తొందరదనం దొర్లుతోంది. అంతే. మరు క్షణం వెయ్యో వంతులో తిరిగి నాలోకి నేనొచ్చేసాను. వెంటనే స్పృహ లోకి వచ్చినట్టు కళ్ళు తెరిచి చూసాను. నిశ్శబ్దం గా వుంది హాల్.
  ఇది జరిగి దరిదాపు ఇరవై యేళ్ళు అయినా, ఇంకా ఆ అనుభవం, ఆ అనుభూతి మాత్రం నాలో అపురూపం గా నిలిచిపోయింది.
  ధ్యానం అన్నది మిధ్య కాదు. నిజంగా ఒక నిజం. ఒక సత్యమైన శాంతి యోగం.
  కానీ నేర్వడానికి మనకు – పెద్ద పెద్ద గురువుల కన్నా, మనమే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే సరి అని అర్ధమైంది.
  మీ అనుభవాన్ని చదువుతుంటే, నవ్వొచ్చింది. ఇలానే వుంటాయన్న సత్యాన్ని చాటి చెప్పారు. అభినందనలండి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.