జొమాన్స్

‘హాయ్ మాటి!’ వాట్సాప్  పలకరింత. 

‘ఏంటి మాటో?’ రిప్లై పెట్టింది శ్వేత. 

‘ఏ ఏరియా?’ 

‘శ్యామల నగర్.  యు?’

‘గోరంట్ల.’

‘ఎంజాయ్’

‘యు టూ’ 

‘వెన్ మీటింగ్?’

‘జి. ఓ. కే.’

ఇలా పలకరింతలవగానే బండి స్టార్ట్ చేసింది శ్వేత.  డిగ్రీ అడ్మిషన్ వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని జొమాటో లో  చేరింది. నాన్న ఇచ్చిన బండి ఉండడంతో ఓ ప్రయత్నం. సాయంత్రం షిఫ్ట్ లకు రానని, లేడీస్ ఆర్డర్స్ కి, ఫామిలీ ఆర్డర్స్ కి మాత్రమే వెళ్తానని లక్షా తొంభై కండిషన్లతో చేరింది. 

రకరకాల ఆర్డర్స్ చేసే మహిళలు, ఆఫీసుల నుంచి వచ్చి వండుకో లేని వాళ్లు, ఇంట్లో వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చ లేని వాళ్ళు, లావు వాళ్ళు, బక్కవాళ్ళు, బద్ధకస్తులు, వెరైటీల కోసం పడి చచ్చేవాళ్ళు ఇలా చాలా మందిని చూసింది.  బోర్ కొడుతున్న సమయంలో కలిశాడు మిథున్ ‘జొమాటీ నా’ అంటూ. 

ఆ పలకరింపు నచ్చి నవ్వేసింది.  ఇంజనీరింగ్ చేసి ఖాళీ సమయంలో సరదాగా ఫ్రెండ్స్ తో జొమాటో లో చేరిన మిథున్  ఓ మధ్య తరగతి కుటుంబీకుడు. చాలా తెలివైన సరదా మనిషి. కొంచెం పాకెట్ మనీ. కొంచెం  టైం పాస్. ‘జొమాటో’, ‘జొమాటీ’ అని పలకరించుకుంటూ రెండు నెలలు గడిచిపోయాయి. ఇంకొక రెండు రోజుల్లో పీజీ రిజల్ట్ వస్తుంది. ఇంకెన్నాళ్ళు? మహా అయితే పది రోజులు.  ఎవరి దారి వారిది. కానీ మిథున్ లో ఏదో ఒక ఆకర్షణ. మాటలో? మనసో? 

బైక్ స్టాండ్ వేస్తూ అనుకుంది శ్వేత.  రెండు రోజుల తర్వాత ఆ వైపు వెళితే చూశాడు మిథున్.  వెనక్కి తిరిగి వచ్చి కలిశాడు. ఆనందంగా పలకరించాడు. ‘ఇంకో పది రోజుల తర్వాత ఈ జొమాటీ మాయం’ అంది. ‘ఎందుకు? జొమాటో ఫామిలీ మహిళలకు పెద్ద లాస్. బట్ ఐ మిస్ యు’ అన్నాడు.

‘పీజీ స్టడీస్ కి వెళ్లాలి కదా.  కానీ రెండేళ్ల తర్వాత ఒక వేళ గుర్తు ఉంటే కలవచ్చేమో’

‘మెసేజ్ చేస్తూ ఉంటే ఎలా మర్చిపోతాం?’

‘నేను నీ నెంబర్ డిలీట్ చేస్తే? నీ నెంబర్ బ్లాక్ చేస్తే?’ కవ్వించింది శ్వేత.  మిథున్ కళ్ళల్లో నిరాశ.

‘నా స్నేహం హద్దుమీరనంత కాలం, నేను నిన్ను ఇబ్బంది పెట్టనంతకాలం అలా చేయాల్సిన అవసరం లేదేమో?’ ‘చూద్దాం’ వచ్చేసింది శ్వేత.

రెండు రోజులు గడిచాయి. మిథున్ పలకరిస్తూనే ఉన్నాడు.  

‘మళ్ళా అలవాటు పడతానేమో-వద్దులే’. అయినా మెసేజ్ పెడితే ఏమవుతుంది?’

వద్దు-పర్లేదు- వద్దు- పర్లేదు – పర్లేదా – వద్దా ?

టేబుల్ మీద ఫోన్ వెలుగుతోంది. ‘జొమాటీ – జొమాటీ-జొమాటీ-జొమాటీ-జొమాటీ’ మిథున్  రామకోటి రాస్తున్నాడు. నవ్వుతూ ఫోన్ చేతిలోకి తీసుకుంది.  

ఎస్ ఆర్ నో , 

నో ఆర్ యెస్ …??? 

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.