బ్రాహ్మణవాద ద్వంద్వనీతిని ఎండగట్టిన “సంస్కార”(1970)

(గిరీష్ కర్నాడ్ స్మృతిలో….)

పరమేశ్వర శాస్త్రి గా కర్నాడ్

రిచయం అక్కర్లేని పేరు గిరీష్ కర్నాడ్. దీర్ఘ అనారోగ్యం తర్వాత గత నెల 10 వ తేదిన నిద్రలోనే నిష్క్రమించాడాయన. నాటకసినీరంగాల్లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సుపరిచితుడు. యయాతి, తుగ్లక్, హయవాదన వంటి అతని నాటకాలు ఎన్నెన్నో దేశవిదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. పద్మశ్రీ, జ్ఞానపీఠాలతో సహా లెక్కలేనన్ని జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడతడు. అంతకంటే ముఖ్యంగా నిరంతర ప్రజాపక్షపాతిగా ఆఖరుశ్వాస వరకు అన్యాయాన్ని ఎదురించాడు. కాషాయమూకలు అతడ్ని తమ నెంబర్ వన్ శత్రువుగా హిట్ లిస్టులో పెట్టి గౌరవించాయి.

“సంస్కార” నేపథ్యం:

గిరీష్ సినీరంగ ప్రవేశం ‘సంస్కార’ అనే కన్నడ సినిమాతో జరిగింది. ‘సంస్కార’ నవలను మైసూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యూ ఆర్ అనంతమూర్తి కన్నడ భాషలో రాశారు. స్వాతంత్ర్య భారతదేశంలో నిషేధానికి గురైన తొలి కాల్పనిక రచనల్లో ‘సంస్కార’ ఒకటి. గిరీష్ ఈ నవలను చదివిన వెంటనే ఇది సినిమాగా తీయల్సినంత గొప్పది అనుకున్నాడట. ఇదిలా వుంటే ఓసారి నెల్లూరు తిక్కవరపు పఠాభిరామిరెడ్డి ఇంటికి రాంమనోహర్ లోహియా వచ్చినపుడు “సంస్కార” ప్రస్తావన వచ్చిందట. చాలా అలజడి రేపిన ఈ నవలను సినిమాగా తీస్తే బావుంటుందని లోహియా సూచించాడు. వాస్తవిక, ప్రయోజనాత్మక చిత్రాలు నిర్మించాలన్న ఆలోచన పఠాభికి ఇదివరకే వుంది.

తిక్కవరపు పట్టాభిరామా రెడ్డి

గిరీష్ మద్రాసు ఆక్స్ఫర్డ్ ప్రెస్ లో వున్నప్పటినుంచే “మెడ్రాస్ ప్లేయర్స్” అనే నాటక సంస్థ ద్వారా గిరీష్కి పఠాభితో పరిచయం.“సంస్కార” విషయంలో ఇద్దరి అభిప్రాయాలూ ఒకటి కావడంతో గిరీష్ స్క్రీన్ ప్లే రాయగా దాన్ని తెరకు తగ్గట్టు మలుచుకుని పఠాభిరామిరెడ్డి దర్శకనిర్మాతగా ఈ సినిమాను నిర్మించాడు. ప్రధాన పాత్ర గిరీష్ పోషించాడు. ఆ విధంగా గిరీష్ కర్నాడ్ ఒక తెలుగు దర్శకుడి ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. “మెడ్రాస్ ప్లేయర్స్”లోని నటీనటులు ఇతర పత్రాలు వేయగా, ఒక వేశ్య పాత్రను వేయడానికి పఠాభి భార్య స్నేహలతా రెడ్డి ముందుకు రావడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన టామ్ కోవన్ అద్భుతమైన ఛాయాగ్రహణం అందించాడు. నవలలానే సినిమా కూడా ఇబ్బందుల్లో పడింది. కానీ చాలా వొత్తిడి తర్వాత ‘ఏ’ సర్టిఫికేట్ తో కట్స్ లేకుండా విడుదల చేశారు సెన్సారు వాళ్ళు. విడుదలయ్యాక వ్యాపారపరంగా విజయం సాధించడమే కాక రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ తో పాటు మైసూరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులు గెల్చుకుంది ఈ సినిమా.

సినిమా కథ:   

కథకుడు యు ఆర్ అనంతమూర్తి                                                                                                                                     

అది కర్ణాటక పశ్చిమ కనుమలలోని దుర్వాసపుర అనే చిన్న గ్రామం. అందులోని ఓ అగ్రహారం సాంప్రదాయ మధ్వ బ్రాహ్మణులది. దూర్వాసుడిలానే దుర్వాసపుర బ్రాహ్మణులూ కట్టుబాట్ల విషయంలో కోపిష్టులు. బయటి ప్రపంచంతో పట్టింపు లేకుండా, ఆధునికతకు ఏ మాత్రం తావివ్వకుండా, శాస్త్రాలు నిర్వచించిన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, కులవ్యవస్థను అదిమిపట్టుకుని గిరిగీసుకుని బతుకుతుంటారు. నియమం తప్పిన వాణ్ణి గ్రామం నుంచి వెలివేస్తుంటారు. కథలోని ప్రధాన పాత్రల్లో ఒకడు ప్రాణేశాచార్య (గిరీష్ కర్నాడ్). పరమ నిష్టాగరిష్టుడు. గ్రామంలో అందరిచేత మన్ననలు పొందే వేదవిద్వాంసుడు. వారణాసిలో వేద విద్యను పూర్తి చేసి వచ్చాడు. గ్రామంలోని బ్రాహ్మణ సమాజానికి పెద్దదిక్కులా ఉంటాడు. అతని ప్రధాన లక్ష్యం మోక్షసాధన. దానిని సాధించడానికి ఎంత దూరం వెళ్ళడానికకైనా సిద్ధం. తన లక్ష్యసాధనకై ఆత్మబలిదానంగా సంసారానికి పనికిరాని రోగిష్టి స్త్రీని వివాహం చేసుకుని, పెళ్లయినా బ్రహ్మచారిగానే ఉంటాడు. రొజూ ఉదయం లేవగానే నదిలో స్నానం చేసి, పూజ చేసి, భార్యకు ప్రసాదం, తిండి పెట్టి, గోవులకు మేతవేశాకనే, తను భోజనం చేస్తాడు. మరో పెళ్లి చేసుకుని బిడ్డను కనొచ్చు కదా అని భార్య ప్రాధేయపడినా వినిపించుకోడు. మరొక ప్రధాన పాత్ర నారాయణప్ప (పి. లంకేష్). పుట్టుకతో బ్రాహ్మణుడైనా బ్రాహ్మణ నియమాలను తోసిపుచ్చి బతుకుతున్నాడు. భగవధారాధన విడిచి పెట్టాడు, పిలక తీసేసి జుత్తు పెంచాడు, మాంసం తింటాడు, మద్యం సేవిస్తాడు, సొంత భార్యను వదిలేసి తక్కువ కులం వేశ్య చంద్రిని ఇంట్లో పెట్టుకుంటాడు. ఒకసారి నారాయణప్ప అతని స్నేహితులతో కలిసి  ఆలయం చెరువులోని పవిత్రమైన చేపలను పట్టుకుని తింటాడు. అసలే నారాయణప్పతో విసుగెత్తివున్న గ్రామ బ్రాహ్మణులు ఈ చర్యతో అతడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. బలశాలి అయిన నారాయణప్పను నేరుగా ఎదుర్కునే ధైర్యం ఆ బ్రామ్మల్లో ఎవరికీ వుండదు. అందుకని నారాయణప్పను గ్రామం నుండి తరిమికొట్టమని ప్రాణేశాచార్యను సంప్రదిస్తారు. అతడ్ని సంస్కరిస్తానని చెబుతాడు ప్రాణేశాచార్య. కానీ మార్చడం అతని తరం కాదు. ‘నీవు నీ పురాణాల శృంగార కవిత్వం వినిపించి శ్రీపతి అనే కుర్రాడిని చెడగొట్టలేదా? రా, నాతో కూర్చుని మందుకొట్టు’ అని  నారాయణప్ప అనడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని అక్కడ్నుంచి వెనుదిరుగుతాడు. ఓసారి నారాయణప్ప శిమోగను సందర్శించి, అధిక జ్వరంతో దుర్వాసపురకు తిరిగి వచ్చి మరణిస్తాడు. ఈ మరణమే ఉత్ప్రేరకంగా పనిచేసి కథను క్లైమాక్సుకు చేర్చుతుంది.

చంద్రి, నారాయణప్ప పాత్రలు

నారాయణప్ప మరణవార్తను ప్రాణేశాచార్య దగ్గరికి మోసుకొస్తుంది చంద్రి. సరిగ్గా బ్రాహ్మణులు భోజనానికి కూర్చునే వేళ అది. మిగతా బ్రాహ్మణులకు ఆ వార్త చేరవేస్తాడు ప్రాణేశాచార్య. బ్రాహ్మణులంతా విపరీతమైన పరిస్థితిలో పడతారు, ఎందుకంటే, బ్రాహ్మణ సూత్రాల ప్రకారం, మరణించిన వ్యక్తిని వీలైనంత త్వరగా దహనం చేయాలి. బ్రాహ్మణులు ఎవరూ అతడి శరీరాన్ని దహనం చేయటానికి వొప్పుకోరు. బ్రాహ్మణ్యాన్ని త్యజించిన నారాయణప్ప మృతదేహాన్ని ముట్టుకుంటే మైలపడతారని వారి భావన. బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుడి శరీరాన్ని దహనం చేయకూడదని కూడా బ్రాహ్మణ సూత్రాలు చెబుతున్నాయి. చిన్న పిల్లలయితే పర్వాలేదు గానీ, దహనం జరగందే ఎవరూ భోజనం చేయకూడదు. మంచి నీళ్ళయినా ముట్టుకోకూడదు. ఈ కష్టమైన సమస్యకు పరిష్కారం కనుగొనే బాధ్యత శాస్త్రపండితుడిగా ప్రాణేశాచార్య మీద పడుతుంది. నారాయణప్ప దహనం కోసం అవసరమైతే నా బంగారు ఆభరణాలన్నీ వినియోగించుకోండి అని తన నగలన్నీ బ్రాహ్మణుల పంచాయితీకి సమర్పిస్తుంది చంద్రి. నగలు చూసిన బ్రాహ్మణులకు ఆశ పుడుతుంది. ఆ నగలన్నీ తమ వొంటిమీద ఉండాల్సినవే అని దూరాన్నించి కిటికీల్లోంచి చూస్తున్న బ్రాహ్మణ స్త్రీలు అనుకుంటారు. మనుధర్మశాస్త్రాన్ని చదివి పరిస్కారం కనుగొంటానని గడువు తీసుకుంటాడు ప్రాణేశాచార్య. రాత్రంతా పవిత్ర గ్రంథాల పఠనంలో తలమునకలవుతాడు.  ఈలోగా బ్రాహ్మణ కుటుంబాల్లో మంతనాలు మొదలవుతాయి. ‘దహనం చేసిన వారికి ఆ నగలు బహుమతిగా వస్తాయిగా! ఆ నగలు నా కోసం మీరు సంపదించవచ్చుగా!’ అని భార్యలు భర్తల చెవిలో రొదపెడతారు. చంద్రి అంటరానిది. ఆమె నగలు మాత్రం కావాలి. నారాయణప్ప శవాన్ని శాస్త్రాలు ముట్టుకోనివ్వవు. బంగారు నగలు మాత్రం వాటేసుకొమ్మని వుసిగోల్పుతాయి. ఒక్కొక్క బ్రాహ్మణుడూ రహస్యంగా ప్రాణేశాచార్యను కలుస్తాడు – బంగారం కోసం దహనం కాంట్రాక్టు సంపాదించడం కోసం ఒకరుండగా మరొకరొచ్చి పట్టుబడిపోతారు కూడా! ప్రాణేశాచార్య వారందర్నీ తిరిగిపంపుతాడు. పరిస్కారం కనుగొంటానని మాటిస్తాడు. నగలు చంద్రికి తిరిగి ఇచ్చేస్తాడు. రాత్రంతా శాస్త్రాలు శోధించీ ఏమీ సాధించలేకపోతాడు ప్రాణేశాచార్య. వివశుడై కొండమీది హనుమంతుడి (మారుతి) ఆలయానికి వెళ్లి అక్కడ ఒక రోజు మొత్తం గడుపుతాడు. సమస్యను పరిస్కరించలేక నిరాశ చెంది ఇంటికి తిరిగివస్తూ దారిలో ఓ ఏకాంత ప్రాంతంలో చంద్రిని కలుస్తాడు. చంద్రి అందానికి పరవశుడై ఆమెకు వశమౌతాడు. జీవితమంతా అణచుకున్న లైంగిక వాంఛ, రెండు రోజులుగా తీరని ఆకలి, నిద్ర అన్నీ ఆమె వొడిలో తీరిపోతాయి. అపస్మారకంగా ఆమె పెట్టినవన్నీ తింటాడు. అర్ధరాత్రి మేల్కొనేసరికి చంద్రి ఒడిలో పడుకునివున్నట్లు తెలుసుకుంటాడు. తనేం చేశాడో అర్ధమౌతుంది. తన బతుకు  పాపపంకిలమైందని భావిస్తాడు. తన అనైతిక చర్యను గ్రామ ప్రజలకు వెల్లడించాలా వద్దా అని సతమతమౌతూ ఇంటికి వస్తే భార్య చనిపోతుంది. నిజానికది ప్లేగు వ్యాధి ప్రబలివున్న సమయం. ఎక్కడికక్కడే ఎలుకలు రాలిపడి చనిపోతున్నాయి. (వినాయకుడి పటం దగ్గర కూడా.) ఆకాశంలో గుమిగూడిన రాబందులు ఇళ్ళ పైకప్పులపై బసచేస్తూన్నాయి. భార్య దహనసంస్కారం చేశాక ఇక ఆ వూరితో సంపర్కమేమిటని అన్పిస్తుంది ప్రాణేశాచార్యకు. ఊరిలో వుండి ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదనుకుంటాడు. కాలిబాటన ఎటో తెలీని యాత్రకు బయలుదేరుతాడు.

చంద్రి తన ప్రయత్నం తను చేస్తుంది. కుళ్ళిపోతున్న శవాన్ని సంస్కారం చేయమని తన వూరెల్లి తన కులపోళ్ళని వేడుకుంటుంది. నారాయణప్ప దయగలవాడే, అవసరానికి వడ్డీ లేకుండా పేదలకు అప్పిచ్చి ఆదుకున్నవాడే అని వారు వొప్పుకున్నా బ్రాహ్మణుణ్ణి తాకి వివాదం తెచ్చుకోవడం మాత్రం వారికీ ఇష్టం వుండదు. మరోవైపు సమస్య పరిస్కారం తెలుసుకోడానికి శృంగేరి గురువు దగ్గరికి బయలుదేరుతారు ఊరిలోని కొందరు బ్రాహ్మణులు. ఆకలి బాధను తట్టుకోలేకపోతున్న వృద్ధ బ్రాహ్మణులు కొందరు తామే అగ్రహారం నుండి వెలివేసిన బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి రహస్యంగా ఆకలి తీర్చుకుంటారు. ఇలా బతికుండగా బ్రాహ్మణ సంప్రదాయాలను విమర్శించిన నారాయణప్ప శవమై వారి ద్వంద్వ వైఖరిని మరింత ఎండగడతాడు

ప్రాణేశాచార్య అగమ్య యాత్రను జ్ఞానయాత్రగా మారుస్తాడు దారిలో పరిచయమైన పుట్టా. ఒక విధమైన అపస్మారక స్థితిలో దేన్నీ పట్టించుకోకుండా వెళ్తున్నప్రాణేశాచార్యకు తుమ్మబంకలా అటుక్కుంటాడు పుట్టా. నిమ్న కులస్తుడు. పుట్టా మాటలపుట్ట. నిశ్శబ్దంగా ఉండలేడు. మనసుకు తట్టినదల్లా వాగేస్తాడు. కిగ్గాలో దేవుడి జాతరకు వెళ్తున్నానంటాడు. జీవితం ఆస్వాదించాలి అన్న తన ఫిలాసఫీని దారి మిత్రుడికి అర్థమయ్యేలా చెప్పడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రాణేశాచార్య మాత్రం తన గురించి ఏదీ సరైన సమాచారం ఇవ్వడు. తనది కుందనపుర అని చెబుతాడు. (నిజానికది చంద్రి వూరు) దారిలో ఒక పాము ఎదురౌతుంది. కర్రతో బాది చంపుతాడు పుట్టా.ప్రాణేశాచార్య బయల్దేరుతుండగా – ‘దీనికి దహన సంస్కారం చెయ్యకుండా వెళ్ళడం సరికాదు కదా?’ అని చెప్పి, అక్కడికక్కడే ఎండు పుల్లలు పేర్చి దానికి దహనం చేస్తాడు. దుర్వాసపుర వేద పండితులు మూడు రోజులుగా నాన్చుతున్న సమస్యకు ఒక దళితుడు టక్కున చక్కని వ్యావహారిక సమాధానం ఇచ్చినట్టనిపిస్తుంది. ఈ బ్రాహ్మణులకు ఈపాటి కామన్ సెన్స్ ఎందుకులేదా అని అన్పిస్తుంది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు. నచ్చినది తినాలి, నచ్చినది చూడాలి, నచ్చినట్టు వుండాలి అన్న పుట్టా జీవనరీతి ప్రాణేశాచార్యలో మార్పు తెస్తుంది. ‘నారాయణప్ప బహిరంగంగా చేసినదాన్ని నేను రహస్యంగా చేశాను’ అని ప్రాణేశాచార్య పుట్టాతో  పశ్చాత్తాపపడతాడు. ప్రాయశ్చిత్తంగా నారాయణప్ప దహన సంస్కారాన్ని తనే చేస్తాడు. 

ఎన్నో ప్రత్యేకతల సినిమా:   

వాస్తవవాద సినిమాకు నిజమైన అర్ధంలో ఈ సినిమాను రూపొందించారు. ఎక్కడా కృత్రిమ మేకప్పులు వాడలేదు. పాటలు లేవు. కేవలం మూడు వాద్యాలతోనే నేపథ్య సంగీతాన్ని అందించారు. కన్నడ పాత్రికేయులు, మేధావులు ఇందులో చిన్న చిన్న పాత్రలు వేయడం విశేషం. అసలు కథలో చేపలు అమ్మే ముస్లిం వ్యక్తి నారాయణప్ప సంస్కారం చేస్తాడు. కానీ నవలాకారుడి అనుమతితో ప్రాణేశాచార్య సంస్కారం చేసినట్టు మార్పు చేశాడు గిరీష్ తన సినిమా స్క్రిప్టులో. ‘సంస్కార’ అన్న మాటకు ‘శుద్ధిచేయడం’ అనీ, ‘దారి తప్పిన వారిని దారిలోకి తేవడం’ అనీ, ‘మంచి ప్రవర్తన’ అనీ, ‘అంత్యక్రియ’ అనీ ఎన్నో అర్థాలు వున్నాయి. కథను నిశితంగా పరిశీలిస్తే ఈ అర్థాలన్నీ గోచరిస్తాయి. నవలలో అనంతమూర్తి చిన్న చిన్న పాత్రలను కూడా చాలా శ్రద్ధగా చిత్రించాడు. ప్రాణేశాచార్య – నారాయణప్ప; ప్రాణేశాచార్య – పుట్టా; బ్రాహ్మణ స్త్రీలు – చంద్రి – ఇలా ఎన్నెన్నో పాత్రల వైరుధ్యాల ద్వారా కులవ్యవస్థను, ఆ కులాల ప్రతినిధుల ద్వంద్వవైఖరులను ఎండగడతాడు రచయిత. సినిమా కూడా అంతే శక్తివంతంగా తయారైంది. భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుంది ఈ సినిమా. “దక్షిణ భారత సినిమాలో నవశాకానికి నాంది పలికింది ‘సంస్కార” అని చెబుతాడు ప్రముఖ దర్శకుడు అదూర్ గోపాలక్రిష్ణన్. కన్నడలో ‘సంస్కార’ నవలలానే వివాదల్లోంచి ఎగిసివచ్చి దేదీప్యమానంగా వెలుగొందింది ఈ సినిమా. కన్నడ న్యూవేవ్ సినిమాకు శ్రీకారం చుట్టింది. ఆ ఘనత తెలుగు దర్శకుడికి దక్కడం విశేషం. కర్నాటక ప్రభుత్వం పఠాభికి లైఫ్ టైం అవార్డుతో గౌరవించింది.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

3 comments

  • Good Sir.
    మూకీ చిత్రాలకాలంలో తెలుగులో మాలపిల్ల అనేసినిమా (around 1940) వచ్చింది. ఇందులో కూడా ఆమెను బ్రాహ్మణుదే వివాహమాడతాడు.

    సంఘసంస్కరణలో భాగంగా పిలక, జంద్యం తో వచ్చిన వారికి ఆసినిమా ఉచితంగా చూపించారుట. సినిమాచూసాకా, నేరుగా ఇంటికెళ్ళకుండా, స్నానంచేసి, జంద్యం మార్చుకొని ఇళ్ళకువేళ్ళేరుట.

    This Novel and movie seem to be more dramatized for better social impact.

    I will try to watch

  • It is an excellent review of Samskara film.I have seen the film.It is sad that the great persons associated with the film are no more.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.