మర్యాదస్తుల కవి కాని పఠాభి!

1939, ఇప్పటికెన్నేళ్ళయ్యింది. సుమారు ఎనభయ్యేళ్ళు. ఈ ఫిడేల్ రాగాల డజన్ పుస్తకం అచ్చయ్యి ఇన్నేళ్ళయ్యాక్కూడా ఎందుకింత ఆసక్తి రేపుతోంది. ఆరుద్ర, సినారె మొదలగు వారు కవిత్వాన్ని పద్యం నుండి వచనం వైపు నడిపించినవాళ్ళలో పట్టాభి ముందు వరసలో ఉంటాడని రాశారు. విశ్వనాధ “విప్లవం అన్న తర్వాత ఇది అవును, ఇది కాదు అన్న నియమమెక్కడ ? ఆ పాటలో (ఫిడేల్ రాగం) వర్ణ క్రమం విపరీతంగా ఉంటుంది” అంటాడు. ఫిడేలురాగాల డజన్ సంపుటిలో ఆయనకది పాట అనిపించింది.

అలాగే కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారైతే “శిల్పమునకు సంయమనము (restraint) అవసరము. వీనియందు అటువంటిది కన్పించదు. నవత్వము కొరకు సహజ శక్తిని అడగద్రొక్కి పరిపూర్ణమైన ఆకారమునందు అవయములు భేదించి వీరు సాధించిన ఆ మహాప్రయోజనమేది ? ఈ అపకారము వారికే కాదు, లోకమునకు కూడ. ఒక చిత్రమును ఇరువై తుంటలుగ కత్తిరించి చీట్ల ప్యాకీ కలిపినట్లు కలిపి మరలా మేజా పై నెరపిన ఒక అసంబద్దమైన (dis-harmonious) చిత్రము కనపడును. ఈ విచిత్ర సౌందర్యమేనా ఛందో వైకల్యము నందు వీరు ఆశించునది? (ఇది) వలపు పస్తులతో నవసి మతి చెడిన యువకుని ఉన్మత్తప్రలాపములు (mad ravings) గా నాకు స్పురించినది” అని అక్షింతలు వేశాడు.

ఇంకా చాలా మంది ఈ కవితా సంపుటి మీద చాలా చాలా రకాల సమర్ధింపులూ, సన్నాయినొక్కులూ చేయడం జరిగింది. కేవీఆర్ అయితే “చలనమే గానీ నిలుపు లేదు, గవేషణమే గానీ ఇష్టఫల సిద్ది లేదు. తృష్ణే గానీ తృప్తి లేదు. ఉన్నది సరిపోదు. లేనిది కావాలి. ఈ మనస్తత్వం ఒక వ్యాధి లక్షణం. (అతను) తనలో పేరుకుపోయిన జిడ్డువంటి అసమ్యమిత క్షుద్రొద్రేకాలకు బానిస” అనేస్తాడు. వీళ్ళందరూ ఇన్నిరకాలుగా అన్నవన్నీ చదువుతోంటే ఇతగాడు వీళ్ళందర్నీ ఎంత గట్టిగా గిల్లినంత పని చేశాడూ అనిపిస్తోంది. ఏదన్నా కొత్త ప్రయోగం చేసినప్పుడు ఏ రంగంలో నైనా స్వాగతించే వాళ్ళతో పోల్చితే వేలెత్తి చూపే వాళ్ళే ఎక్కువుంటారు. బహుశా అది కాలధర్మం కావొచ్చునేమో! అప్పటిదాకా ఉన్న కవితా రీతుల్ని కాదని పఠాభి కొత్తగా రాశాడు కనుక చాలామందికతని కవితా సౌందర్యమంతా విచిత్రమనిపించింది. సినారె ఏకంగా వక్రోక్తి ద్వారా వైచిత్రీ వైవిధ్యాల్ని కవి ఎలా సాధించాడో వివరిస్తూ వ్యాసం రాస్తాడు. ‘చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తానన్న’ పఠాభిని వ్యాకరణాంశాలతోనే కనుగొనే ప్రయత్నం చేయడం అసలు విచిత్రం. మొత్తానికి పఠాభి ఇప్పటికీ నచ్చాడనడానికి మొదటి కారణం. తనకు నచ్చినట్టు తను రాయడం వలన. ఒకర్ని ఫాలో అయితే ప్రయోజనం శూన్యమన్న సత్యం గ్రహించడమే అతని సగం విజయం. అంతే కాక తానెంచుకున్న వస్తువుల పట్ల కవికున్న దృక్పధాన్ని బట్టి కవితల ఆకారం మనకి కనిపిస్తుంది. కేవీఆర్ “హెచ్చు లొచ్చులు హస్తిమ శకాంతరంగా ఉన్న వర్గ సమాజం. పనిపాటులేని సోమరి శ్రీమంతులు, పనిలో అచ్చుబాటులేని దరిద్రులు. అహంభావ కవి నిష్పాక్షికుడు. పక్షాతీతుడు” అన్నమాటలు తన సహజసిద్ద మార్క్సిస్టు విమర్శనా దృష్టితోనే అన్నట్టు తోస్తుంది. స్వతహాగా పట్టాభి శ్రీమంతుడు కనుక వెనుకాముందు చూడకుండా మార్క్సిస్టు విమర్శకుడు పఠాభిని బూర్జువా గాటన కట్టేస్తాడు కానీ, కవి “పోలీసు” అన్న కవిత చదివాక అలా అనిపించదు.

మండుచున్నట్టి మాడుచున్నట్టి
మే మాస మధ్యాహ్న కాలమందేని,
బానల్తోడ పోసినట్లుం గురిసేటి
భాద్రపద మాస వాన యందేని
తన నిర్ణీత ప్రదేశంబు నుండి
ఓ యంగుళంబు కూడ జరుగడు !
ఏ ప్రచండాతి ప్రచండ ఘోరాతిఘోర
తీవ్రాతితీవ్ర తపస్సుం జేయుచున్నాడో నిష్ఠతోడన్ ?
…..
చీలు దారుల్లో నిల్చోని యున్న పోలీసు భటుణ్ణి
చాలా నేను స్తుతి చేస్తాను, బలే గౌరవిస్తాను..

అంటాడు. ఆ పోలీసువాని స్తితిగతుల్ని చూసి కవి చలించినప్పుడు అతని పక్షం అర్ధం కాలేదనగలమా ? అలాగే “బోగందాన” అన్న కవితలో పఠాభి డబ్బుకోసం వ్యభిచరించే స్త్రీ పట్ల తన సానుభూతితో కూడిన అభిప్రాయాన్ని కాక ఎంతో గౌరవంగా మాట్లాడతాడు.
…..
తమ రూపాయి కోసం నిను
తమ్ము ప్రేమించాలని, ప్రధమ ప్రేమలో బడ్డ
అమ్మాయిలా అమాయకంగా
ప్రవర్తించాలని కోర్తారే అందరూ
తమ్ముతామే మోసపుచ్చుక, నిన్ను గౌరవిస్తున్నా నేను
నీలోనే నాకు జీవితం నిజంగా సరిగ్గా ప్రతిఫలిస్తున్నది
ఇతర స్థలాలలోన అంతా బూటకం అంతా నాటకం
గొప్ప అబద్దం, పూజారి యబద్దం
పరపురుషుని జూచి
తలవాల్చే పతివ్రత సతీత్వమబద్దం, యోగులబద్దం
అందరూ అబద్దం, సర్వమబద్దం.
కానీ నీవు మటుకు ఓ బోగందానా !
ముసుగులేని నిష్టురమగు నిజానివి
నీడపడనటువంటి నిర్మలమగు నిజానివి

అని రాస్తాడు. ఈ కవిని పక్షాతీతమనాలంటే మనసొప్పదు. అతన్ని మనిషి పక్షం, కష్టజీవి పక్షం లాంటి మాటలనలేను కానీ, కవిలో సామాజికత చాలా మేరకు స్పష్టంగా కనిపిస్తుంది. “మరీనా” అన్న కవితలో కూడా —

సమూహమంతా కరిగిపోయింది, మిగిలింది
సమాజములోని మడ్డి మటుకు
అన్నం ముద్దకయి కక్కుర్తిపడి
శరీరాన్ని సవారికిచ్చే జవరాళ్ళు
తొమ్మిదణాల సినిమా టికెటునకు
తమ బహిర్దేహము మీద యాత్ర చేయుటకు హక్కునిచ్చే
కొందరాంగ్లో ఇండియన్ అభాగినులు
ఈ కార్యాల చాన్సు కోసం
ఇటూ అటు తటపటాయించుచున్న
“మర్యాదస్తుల” మంద.
ప్రకటించుచున్నవి తరంగాలు
బిగ్గరగా తమ యసమ్మతిని. గాలి ఏడుస్తూంది.
రగులుచున్నవి గగనములోన భువికార్చిన కన్నీటి చుక్కల్లాగ తారకలు
కానీ మనుజుని మనస్సులో రేగుచున్నవి
రకరకాల కోరికలు — అని ముగిస్తాడు. అతని గమనింపులో స్త్రీపట్ల గౌరవమున్నట్లా ? మిగతా కవితల్లో ఎక్కువగా ఉటంకించబడ్డ కామోద్రేక ప్రేలాపములున్నట్లా ? లేదా ఇతనూ ఫెమినిస్టు కవా ? స్త్రీలగురించి మాట్లేడేస్తే ఫెమినిజం అయిపోద్దా ? అయితే స్త్రీ అతని లౌల్య ప్రతీక. ఆమెని తన ప్రతీ కవిత్వ సందర్భంలోనూ చూసిన చూపు ఆక్సేపించదగినదని చెప్పను కానీ, వ్యావహారికంగా చాలా సునాయాసంగా ఉంది. ఆ తేలికతనం దేన్ని సమర్ధించుకోజూసినా సంభావ్యమైనది కాదు. అయితే అదంతా వాస్తవదూరం కూడా కాదు కనుక ఆ వర్ణన అనవసరమైనా భరించవల్సిందే.

సినారే తన వ్యాఖ్యల్లో “వస్తువైచిత్ర్య ప్రవహమునపడి కామ శృంగారమునకు దాసుడైనాడు. గేయములన్నియు పాశవిక శృంగార క్రీడలకు అసంపూర్ణ కామవాంఛలకు పతాకలవంటివి. ఈ ధోరణి పఠాభితోనే అస్తమించుట తెలుగు కవితలోని ఆరోగ్యవంతమైన లక్షణములలో నెన్నదగినది” అంటాడు. వీళ్ళందరికీ కవి కాముక ప్రియత్వమే కవితా లక్షణంగా తోచడం ఆశ్చర్యమనిపిస్తుంది. పఠాభి కవితల్లోని మానవీయ కోణం అతని శృంగారప్రియత్వాన్ని అధిగమించి కనబడకపోవడం, అదే అతన్ని వర్గవ్యతిరేక మనిషిగా ముద్రవేసేందుకు వీలుకావడం బాధాకరం. ఇది కేవలం అప్పటి డామినెంట్ సాహిత్య శక్తుల ప్రాబల్యంగానే భావించవచ్చు. పైపెచ్చు ఆ కాలమ్నాటి సామాజిక స్థితిగతులూ, సామాన్యుడి జీవన పోరాటాలూ పఠాభి కవిత్వమ్మీద నైతికంగా ఈ ముద్రకి కారణమనిపిస్తాయి. కానీ కాలప్రధానంగా ఈ పుస్తక ప్రయోజనం భిన్నమైనది.

కవి తన కవిత్వంలో ఒక నూతన పోకడ తేవాలన్న దృఢ సంకల్పం మనకు సులభంగా కనబడే లక్షణం. అతని అభివ్యక్తిలోనే చాలా లెక్కలేనితనముంటుంది. అప్పటిదాకా గల కవిత్వ భావనలమీద, అసలు కవిత్వ రూపమ్మీద తనకున్న కోపాన్నంతా ‘ఆత్మకధ’ కవితలో అతను చూపిస్తాడు.
…..
పద్యాల నడుముల్ విరుగదంతాను
చిన్నయ్ సూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను
ఇంగ్లీషు భాషాభాండారంలో నుండి
బందిపోటుంజేసి కావల్సిన మాటల్ని దోస్తాను
నా ఇష్టం వచ్చినట్లు జేస్తాను,
అనుసరిస్తాను నవీనపంధా; కానీ
భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని —- అని ప్రకటిస్తాడు.

వైచిత్రి సరేగానీ అతని మాటల్లో అప్పటిదాకా ఉన్న భావకవిత్వపోషకులమీద ఎంతటి అసహనముందో గమనించాలి. సున్నితంగా చెప్పలేకపోవడమే ఈ కవి సాధించిన గొప్పతనమనుకుంటే కూడా పొరబాటు. అతని పలుకుబడి అంతరాంతరపొరల్లో తన సున్నితమైన భావప్రకటన్ని ఒదిలేయలేము. కాకున్న, అతని వ్యక్తీకరణ మాత్రం వ్యతిరేక భావంలో, అవహేళన మూలంతో అసహ్యప్రధానంగా ఉంటుంది. ఆ అసహ్యము కవితావసరము. వస్తు చిత్రణ దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. సామాన్య జనజీవన సున్నితత్వాన్ని పఠాభి కవితా శిల్పం భంగపరిచినట్టుండదు. నగరీకరణ అంశం చాలా విస్తృత చర్చకు తావిచ్చినది కనుక దాన్నింక మళ్ళీ నేను ఉటంకించకపోయినా, నగరజీవన సున్నితత్వాన్నీ పఠాభి ఫిడేల్రాగాల డజన్ ప్రతిబింబించిందని తప్పక చెప్పితీరాలి. ఏం ? నగరమంటే కర్కశత్వమే కాని సున్నితత్వం ఉండదని ఎలా అనగలం ? జాబిల్లి కవితలో “యలక్ట్రిక్కు బల్బు టేరులంటే మాకు భలే సరదా, బలే గమ్మత్తు” అన్నపుడో, వర్షం అన్న కవితలో “కాఫీ హోటల్సు లోపల కూచోని గరం గరం గరంగా బజ్జీ వడ మున్నగునవి తినుచున్నారు” అన్నపుడో కవి నగర కర్కశత్వాన్నేమీ చెప్పినట్టుండదు. పారిశ్రామిక నాగరీకరణలో కూడా కవి సున్నితకోణాల్ని ఆవిష్కరించే ప్రయత్నమే చేసినట్టుంటుంది. యంత్రభూయిష్టమైన నగరంలో మనిషి విచిత్ర ప్రవర్తన మాబాగా కనిపిస్తుంది కవితల్లో. ఆ యాంత్రికతని కాదన్నతనంలోంచి పుట్టిన కవితలివన్నీ. అయితే అప్పటికాలందాకా భావకవిత్వ వాతావరణంలో ఉన్న ప్రబంధ పురవర్ణనకీ పఠాభి చేసిన మద్రాసు వర్ణనలకీ చాలా తేడా ఉండటంవలన, అతని భాషలో ఎక్కువగా ఆంగ్ల పదాల వాడుక ఉండటం వలన కొంత కృతకత్వం ఏర్పడవచ్చుగాని కవి ఊహాశాలీనతలోని ఘర్షణ సున్నితత్వాన్ని పక్కకు పడదోయదు. దాన్నిక్కారణం బహుశా చాలా కవితల్ని నిశితంగా గమనిస్తే ఈ సమకాలిక విమర్శకులందరూ శృంగారం, కాముకత్వం అని వేలేత్తి చూపిన లక్షణమూ తత్సంబంధ అనుభూతీ ఐహికప్రధానంగా అనుభవించే వీలుగా ఉండటం. అదీ నైతిక తలమ్మీద జరిగే యుద్దమే కాని అందుకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించిడాన్ని పట్టించుకోలేదు. ఎవరికైనా, ఎప్పుడైనా పైకి కనిపించనీయరు గానీ కామోద్రేకపూరితమైన అభివ్యక్తుల్ని తోసిరాజన్న సందర్భాలు మన సాహిత్యంలో చాలా తక్కువ. వాటిని క్షణమాత్రమైనా అనుభవించకుండా వ్యతిరేకించామని చెప్పుకోగలిగితే చాల గొప్పతనమే. లేచిపోయినానంటే అన్న ఒక్క ప్రారంభ పదంతోనే మైదానం మొత్తాన్నీ చదివిన కుర్రకారుంటారు. అది ఏ లక్షణమనుకున్నా చేయగలిగింది లేదు. ఇన్స్టింక్ట్స్ మీద సాహిత్యకారుడి పదజాలం చూపే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది గానీ వాటి అంతర్లీన భావజాల ఉద్దేశ్యం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి :

— అదో రసాల్మామిడి పండ్లనమ్ము ఏనాదానిం జూడుము, పయ్యంట తడిసి, కండ్లకు పండుగ జేస్తున్నవి దాని రసాల్మామిడి పండ్ల లాంటి పాలిండ్లు (వర్షం)

— లీల్ కచాలు నా ముఖమ్మీద నాట్యం చేస్తూ ఉంటే వాటిన్ నామూత్తో లాగుచూ ఆడుచుంటిని (ఆ రోజు)

— కిసన్సింగంగడిలో నమ్మంబడు తీ బూందీ పొట్లాలంబోలు వారి చనులూగుచున్నవి (బోగందాన)

— అహో ! రవికందున గ్రుచ్చబడి స్వర్గద్వయం మధ్య నూగాడుచున్న ఆ స్త్రీ వక్షం మీది లేడీస్ పార్కర్కలంబుగానున్న నేను నా రక్తాన్నే సిరగా పోస్తాను (నవ్య స్త్రీ)

లాంటి వ్యక్తీకరణల్లో ఆత్మానుభూతిని పఠాపంచలు చేసిన ఐహిక ధోరణికి సంబంధిన వర్ణనే ఎక్కువ పాళ్ళలో కనిపిస్తుంది. ఆస్వాదనకి ఆస్కారమిచ్చిన స్వేచ్చప్రియత్వం కవితల్లోని కామోద్రేకం కన్నా అప్పటిదాకా ఉన్న భావకవిత్వ అప్రేమాయణాల్లోని కృతకత్వాన్ని ఎండగట్టిన దాఖలానే ఎక్కువ కనిపిస్తుంది. వేల్చేరు నారాయణరావ్ గారు తీర్మానించినట్టు ఈ పుస్తకం నెరవేర్చిన ప్రయోజనమే పెద్దది. అది అప్పటి కవిత్వాభిప్రాయాల్ని నిర్ద్వంద్వంగా బద్దలు కొట్టడమే అతిపెద్ద విజయం గా భావించాలి. ఆ రకంగా పఠాభి ఫిడేల్ రాగాల డజన్ ఒక సంచలన కవితల సంపుటి.

ఇంకో రెండు విశేషమైన కవితల ప్రస్తావన చేస్తాను. సీత మరియూ ఫిడేల్ రాగం. మొన్నామధ్య రాముడూ సీతల గురించి ఒక యువ కవయత్రి వెలిబుచ్చిన అభిప్రాయాన్ని చాలామంది మతపరంగా ఆక్షేపించారు. కోపాలొచ్చాయి. వొళ్ళూపైతెలీకుండా మాట్లాడ్డం, హుంకరించకోవడం, మౌనం వహించడం కూడా గమనించాం. పఠాభి మాత్రం అప్పట్లోనే,

సీతా నువ్ పురాణ యుగం నాటి రామయ్య సతి సీతలాగా ఉండాలని వాంచిస్తావా ? చెప్మా ?
….
రామయ్య సతిగానుంట కన్న రావణుని ప్రియురాలిగా ఉండి
హృదయంగల అసురుణ్ణి, అమరుణ్ణి గా చేసిఉండేదాన్ని నా ప్రేమ బలంతో —

అదిసరే పఠాభీ నీకేమన్నా రామయ్యలా ఉండాలని కోరిక ఉందా ?

రామయ్యగా ఉండేదానికంటే
రావణుని గావాలని నా వాంచ .—-
పది మూతులతోనూ, వదనమును అదుముతాను
ఇరవై కళ్ళ సంకెళ్ళతో నిన్ను నిరతము బందీ చేస్తాను
ఇరవై లావు చేతుల్తో నిన్ను నా పక్షానికి లాగుకొని
చిక్కని కవుగిలింతల్ అయిక్యం చేసుకుంటాను నిను నాలో సీతా ”

అంటాడు. అప్పుడు హిందువులకి ఎంత కోపం వొచ్చిఉంటుందో ? వచ్చి ఉండిఉంటే చరిత్రలో రికార్డు ఉండేది. కవి సాహసం ఎన్నదగినదన్న ఇంగిత ప్రదర్శన వలన హద్దుమీరిన అభిమానదురభిమానులు లెక్కతేలుతారు. మరిప్పుడు యాంత్రీకరణ, నగరీకరణ 1939 తో పోల్చితే ఎక్కువయ్యింది కనుక అసహన స్థాయి ఏకాలంలో ఎందుకు పెరిగిందనుకోవాలి ? కవిత్వం వలనా ? దురభిమాన కవుల వలనా ? ఏది ఏమైనా పాఠకులకి ఏది కావాలో ఎందుక్కావాలో చాలా స్పష్టంగా తెలుసన్నది అక్షర సత్యం.

ఇంకో కవిత ఫిడేల్ రాగం. దీన్లో వర్ణమాల క్రమాన్ని పూర్తిగా మార్చిరాయడాన్ని కవి కొత్త పోకడల్లోని విశేషంగా భావించాలి. ఈరకం రాత సాంప్రదాయవాదులకి కోపం తెప్పించింది. అయితే ఈ పోకడ వల్ల ప్రయోజనం శూన్యమనే భావించాలి. భాషా రూపాన్ని మార్చడంవల్ల కవి చెప్పదలుచుకున్నదేమిటో అర్ధం కాదు. అంతే. ఇక్కడ విశ్వనాధని సమర్ధించలేం కానీ భాషా నియమాలపట్ల కొంత మౌలిక నిబద్దత అవసరమైనది. భాష తల్లి వంటిదన్న సెటిమెంటు మనకందరికీ ఉంటుంది కదా ? పఠాభి ప్రయోగపూర్వకంగా అది రాయడంలోనూ తన నూతనత్వమే సిమ్హ భాగం తీసుకుంటుంది. చదువరులకదొక జర్క్ అనుకోవలసిన సందర్భమే తప్ప అలా రాయడం వలన ఏమీ ఒరిగిందనడానికి సాక్ష్యాలు లేవు. కవి పాటించిన విశృంఖలత్వ ధోరణికి ఈ కవిత పరాకాష్ట.

పఠాభి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భమిది. 1919 లో పుట్టి దేశదేశాలు తిరిగి అతను గడించిన అనుభవమ అసామాన్యమైనది. టాగోర్ శాంతినికేతన్లో చదివి కలకత్తా దుర్భర సామాన్య జీవన ప్రభావాల్లోని కష్ట సుఖాలాని కళ్ళారా చూసి, బేరీజు వేసుకుని, మదరాసు నగరలక్ష్మి సోయగాలకి అచ్చెరువొంది పఠాభి ఫిడేల్ రాగాల్ డజన్ తో చేసిన ఫీట్లు చాలా వింతవే కాదు, సాహసోపేతమైనవి. లేకపోతే అప్పటిదాకా లేని భాషా వినియోగాన్నీ, కవితా నిర్మాణాన్ని, వస్తు వైవిధ్యాన్ని సాధించిన కవి ఇంకోరెవరున్నారని ? పఠాభి కన్నడలో సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. ఆయన సంస్కార సినిమా గిరీష్ కర్నాడ్ కీ పఠాభికీ ఎంతో పేరు తెచ్చింది. కేవలం అతని శ్రీమంత సుఖాయాస స్వభావాన్ని బట్టి అతని సామాజిక ప్రయోజన రాహిత్య లక్షణాన్ని సూత్రీకరించడం తప్పు కాదా ? సంస్కార ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది ? దర్శకుడిలోంచి కవి పారిపోలేడు కదా ?

పఠాభి మరువ వీలులేని తెలుగుకవి. అతను ఆధునిక తెలుగు కవిత్వానికి కొత్త దారి చూపెట్టినవాడు. ఇది కాక అతని కైత నా దైత, నీలగిరి నీలిమలు, పన్ చాంగాం రచనలు చాలా ప్రసిద్దాలు. అయితే అభ్యుదయమూ కాదు, ఫెమినిజమూ లేదు. మొదటి అర్బన్ కవీ అంతకన్నా కాదు, డాడాయిస్టు ప్రభావాన కూడా పడలేదు. అతనిది తెలుగు కవిత్వానికి సున్నితమైన అరాచకవాదాన్ని పరిచయం చేసిన ప్రత్యేకమైన మనస్తత్వం. నూతన దృక్పధం.వ్యక్తిత్వం కవిని తన కవితా వస్తువునీ, కవితాభివ్యక్తినీ ఎంచుకునేలా చేస్తుంది. వ్యక్తిత్వం తను పెరిగిన వాతావరణంలోంచీ, అలవరుచుకున్న జీవన సంస్కారంలోంచీ ఏర్పడుతుంది. కాదంటారా ?

అసలతని అరాచక ఒరిజినాలిటీ కన్నా వేరింకేం కావాలి కవికి ? ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంటిచ్చానన్న వైద్యుడికి ? అదీ ఎనభై ఏళ్ళ కింద ? అంత మామూలు విషయం కాదది.

 

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

10 comments

 • చాలా లోతైన విశ్లేషణ… మనిషి పక్షపు కవిత్వాన్ని బాగా సమీక్షించారు

 • మరొక అద్భుతమైన వ్యాసం మీనుండి!
  పఠాభి గారి శత జయంతి సందర్భంగా గొప్ప నివాళి!!

 • దాదాపు‌ ఎనభై ఏళ్ళ క్రితం నాటి కవిత్వాన్ని ,ఆ కవిని పరిచయం చేయడం బావుణ్ణా ఆనాటి కాలమాన స్థితిగతులెంతగా ఆ కవిపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టాయో తెలియజేయడం బావుంది..నన్నాశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అలనాటి కవులెందరో ఘాటుగా,సూటిగా ఎత్తిచూపిన పఠాభి శైలిని మీరు మరో కోణంలో చూడ్డం.నిజంగా కాలం మారుతూ తధనానుగుణంగా ఆలోచనలు,అవగాహనలు మారడమే ఇందుకు ప్రాధాన కారణం కావచ్చు…మరీ ముఖ్యంగా రాముడూ,సీతల
  ప్రస్తావనలో మొన్నటి సంఘటన యువకవయిత్రి రాసిన కవితపై చెలరేగిన దుమారాన్ని ఉటంకించడం సందర్భోచితంగా అనిపించింది.ఏది ఏమైనా కవికి తన ఒరిజినాలిటికి మించింది ఏముంటుంది….ఎంతో నిశితంగా పరిశీలించి వివరణాత్మ విశ్లేషణను అందించిన మీకు చెప్పాలి కదూ అభినందనలు.

 • మర్యాదస్తుల కవికాని, పట్టాభి, అని ఎందుకన్నారో.. నాకు అయితే అర్థం కాలేదు. వారి పోలీసు, కవిత, నాకు నచ్చింది..80years, అప్పటి, పరిస్థితి లో. అలారాసి ఉంటారు ఆయన!మీకు ధన్యవాదాలు సర్!మంచికవి ని పరిచయం, చేసినందుకు.వారి,కవితలు నాకు అయితే నచ్చాయి, వారికి,నివాళి!

 • ఏదో ఆవహించింది సార్ చదువుతుంటే..బహుశా మీ వాక్య విన్యాసం వలనే కావొచ్చు.పఠాభి కవిత్వం చదవాలని అనుకుంటారు ఎవరైనా.మంచి వ్యాసం సార్

 • అద్భుతమైన వ్యాసం సర్. పఠాభి గారి గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది. అన్ని కవితలు చదువాలని ఉంది సర్ ధన్యవాదాలు👏👏👏

 • చన్నుల్ని బట్టబయలు చేసినవాడిది ‘సున్నితమైన అరాజకత్వ’మా? కాముకత్వమా?
  వ్యాసంలో వాక్య నిర్మాణం సరిగా లేదు. చాల చోట్ల వ్యక్తీకరణలో క్లారిటీ లేదు.

  • థ్యాంక్యూ మేడం. మరికాస్త శ్రద్దగా రాస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రాంక్ ఒపీనియన్.

 • 1970 అక్టోబరులో ఖమ్మంలో జరిగిన మొదటి విరసం మహాసభలో ‘ సంస్కార ‘ సినిమాపై నిషేధాన్ని రద్దు చేయాలని తీర్మానించారు.నాకు అప్పటిదాకా పఠాభి అంటే పట్టాభిరామిరెడ్డి అని తెలియదు.సంస్కార సినిమా కథాంశం స్వయంగా శ్రీశ్రీ నే వివరించాడు.అప్పటికా సినిమా విడుదల కాలేదు….. దివికుమార్ ..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.