కత్తికి కలానికి
మొదట్నించి చుక్కెదురే!

(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం ; పార్ట్ – 2)

‘విశ్వ శ్రేయః కావ్యమ్’ అని ఆనాడే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ లో చెప్పారు. కవి సమాజాన్నుండి దూరంగా పోలేడు. సమాజ చైతన్య దిశగా అనాదిగా కవులు తమ కలాలను ఝుళిపిస్తున్నారు. అయితే, సమాజ చైతన్యం అనేది  ఒక్కో దశ లో ఒక్కో రకంగా మనం చూడొచ్చు. మత, కుల పరమైన మార్పులే కాక ఛందస్సు సంబంధంగా మార్పులను తీసుకువచ్చే క్రమం కూడా సామాజిక చైతన్యమని భావించాలి. ఈ వ్యాసానికి అనుగుణంగా విభజించిన మూడు కాలాల కు చెందిన కవులు తమ దైన శైలి లో సమాజాన్ని తమ రచనల ద్వారా చైతన్య పరుస్తూనే వస్తున్నారు.

నన్నయ్య కు వంద సంవత్సాల కు పూర్వమే ఇప్పటి కరీం నగర్ లోని వేములవాడ కు చెందిన మల్లియ రేచన ‘కవి జనాశ్రయం’ అనే లక్షణ గ్రంథం, ఉద్యోతనుడు రాసిన కంచలయ మాల కథ లో తెలుగు/తెనుగు/ఆంధ్ర భాష అని ప్రస్తావించారు.  

పియ మహిళా సంగామే సుందర గత్హేయ  భోయణే రోద్దే
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి

అని కంచలయ మాల కథలో ఆంధ్రుల ప్రస్తావన జరిగింది.

దీని అర్థాన్ని తెలుగు లో ఆరుద్ర (సమగ్ర సాహిత్యం) “అందగత్తెలన్నా.. యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గలవాళ్లున్నూ తిండిలో ధిట్టలున్నూ అయిన ఆంధ్రులు అటూ పుటూ రటూ అనుకొంటూ వస్తుండగా చూచాడు“… అని చెప్పారు. ప్రాజ్నన్నయ్య కాలంలో శాసనాలల్లో  కనిపించిన ప్రాకృత భాష కాలక్రమం లో కొన్ని కొన్ని తెలుగు పదాలతో రావడం జరిగింది. చాల కాలానికి, సంస్కృతం తో జరిపిన సంఘర్షణ లో తెలుగు రాజభాష గా స్వతంత్ర స్థితి కి వచ్చింది. ఈ సంఘర్షణ కూడా ఒక రకంగా భాష చైతన్య ధోరణి అనే చెప్పవచ్చు.

నన్నయ్య కంటే ముందు ‘వాంఛయ్య’ అనే కవి ఛందో బద్ధమైన తెలుగు గ్రంథం లో కూడా భాషా పరమైన చైతన్య ధోరణులు ఉండేవని తెలుస్తోంది. అంటే, వాంఛయ్య నాటికే చాలా తెలుగు గ్రంథాలు ఉండేవని తెలుస్తోంది. కల్చరల్ రెవల్యూషన్ అని చెప్పుకున్నా, సమాజ చైతన్య ధోరణులు అని మాట్లాడినా, తెలుగు కవులు ఎప్పటికప్పుడు ఒక రకమైన చైతన్య దిశగానే తమ కలాలకు పని చెప్పారు.

ఇక నన్నయ్య 1000-1100 కాలం లో  రచించిన ఆంధ్ర మహా భారతం లో కూడా సామాజిక న్యాయం, సామాజిక చైతన్యం, అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. ఏకలవ్యుడు గురువు లేకుండా నే విశేష ప్రజ్ఞాపాటవాలు నేర్చుకోవడం, గురువు లేకుండానే విద్యనభ్యసించే వారికి ఒక ఐకాన్ గా ఆయన నిలబడటం ఒక రకమైన చైతన్య ధోరణి అనే చెప్పవచ్చు. అదే విధంగా, దుర్యోధనుడు కూడా తన రాజ్యం లో కులాలతో పట్టింపు లేకుండా అన్ని  కులాలవారికి తన రాజ్యం లో ఉద్యోగాలు ఇచ్చినట్లు భారతం లో స్పష్టంగా చెపుతారు. కర్ణుడు అగ్ర కులం కాక పోయినా అతడికి అంగ రాజ్యానికి రాజును చేయడం, అంతే స్థాయిలో కర్ణుడు స్నేహధర్మానికి విలువ నివ్వడం ఇవన్నీ కూడా సమాజం లో ఒక చైతన్య పరిచే దిశగా సాగినవే. ఏ కవి కూడా వృధాగా రాయడు. ఎదో ఒక సామాజిక సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకు పోయేవారు.

భారతం లోని శాంతి పర్వం లో …. ఒక పద్యం లో కృత యుగం లో రాజు రహిత సమాజం .. అంటే రాజు అనేవాడే లేదని చెపుతుంది. మార్క్స్ కల కన్న రాజ్యం ఆనాడే ఉండేదని తెలుస్తోంది.

“తొల్లి కృతయుగంబున
మనుజుల యెడ దండనీతి మంతుండై రా
జన నొకడు! గలిగి యరయట
మనుజేశ్వర లేదు ధర్మ మత మండ్రు తగన్…”

అప్పటి ప్రజలు కామక్రోధాలకు దూరంగా ఉండి, పరస్పర రక్షకులై ఉండే వారని భారతం లో తెలిపినారు. అవసరాలు తీర్చుకోవడం కోసం, ప్రజలు ఆత్మ గతమైన నియమాలకు లోబడి ఉండేవారు. దీన్ని ధర్మ మత సిద్ధాంతం అని పిలిచే వారు. ఎలాంటి వర్ణ విబేధాలు లేకుండా ప్రజలంతా ఒకరి కొకరు తోడుగా ఉండేవారు.

క్రమంగా ఆస్తి, కామం, ఇవన్నీ తోడు కావడం సమాజం అస్తవ్యస్తమవ్వడం వారిని క్రమ బద్ధంగా ఉంచడానికి రాజు.. రాజరికం ఏర్పడ్డాయని అందుకే భారతం లో రాజు అనే పదం ఉపయోగించే ప్రతి చోటా “రక్ష” అని పిలుస్తారు. రాజు కూడా మనిషే కావడం తో అతడి లో కూడా అనేక లోపాలతో రాజు పరిపాలించడం, ఆ రాజనీతిని వ్యతిరేకిస్తూ  మేధావులు, కవులు సాంఘీక సిద్దాంతాలను తమ కవిత్వం లో రాస్తూ, సమాజాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు.

రాజులు అమానుషంగా ప్రవర్తించవద్దని, ప్రజలకు సకల సౌక్యాలు కల్పించేలా వ్యహరించాలని చెప్పిన పద్యాలు కూడా భారతం లో ఉన్నాయి.

రాజు క్రూరుడు అయితే… “క్రూరుడగునేని లోకంబు బెగడు కుడుచు”  అని కూడా చెప్పుకొచ్చారు. అదే విధంగా,

“…వసంతంబు భానుని  చాడ్పున దగియెడు పాటితో ధరణి ప్రజల
సుచితవర్తనముల నొందించునదియుది రాజధర్మములకు రాజుసుమ్ము”

అని కూడా భారతం లో నన్నయ్య ప్రస్తావిస్తారు. రాజు అనేవాడు విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించడానికి వీలు లేదు అని ..చెప్తుంది.
అదేవిధంగా శిక్షలు కూడా పూర్తి విచారణ అయ్యాకే శిక్షలు అములు చేయాలని చెపుతూ..

“… దండము పరీ
క్షా విశుద్ది పూర్వకముగా వలయ
దన తలంపు వెంట దమకించి ప్రజకు నొ
వ్వుగా జరించటయును దగదు పతికి”
పరీక్షా విశుద్ధి అయ్యాకే శిక్షలకు శిక్ష యోగ్యత అని చెప్పే ఈ కవిత్వం ఇప్పటికీ సమాజాన్ని చైత్యన్య పరిచే ధోరణి లోనే  సాగుతుంది అని చెప్పవచ్చు.

క్రమేపి రాజరిక వ్యవస్థ భ్రష్టు పట్టి కవులు రాజనింద చేయడం అప్పట్లోనే అలవడింది. ఆనాటి నుండి ఈనాటి వరకూ.. కవులు రాజును /ముఖ్య మంత్రిని/ ప్రధానమంత్రి ఇలా ఎవరు  తప్పు దోవ పడుతున్నా.. కవులే కాదు పామరులు కూడా వారిని విమర్శించి నిందించేందుకు వెనుకాడటం లేదు….

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

21 comments

 • నమస్సులు…
  మీ పరిశోధన, కవిత్వం పట్ల మీకున్న మక్కువ, ఈ వ్యాసం ద్వారా ప్రాచీన కవిత్వo. అప్పుడున్న సామాజిక,రాజరికం, రాజకీయ విశ్లేషణలు,కవిత్వం. హృద్యంగా రాశారు. అందుకోండి అభినందనలు.

 • ఆ కాలంలో రాజులు అనుసరించే విధానాలు…బాధ్యత, మంచి తనంగా వ్యవహరించిన ఉదాహరణలు అన్నీ కలిపి చక్తని సమాచారాన్నిచ్చారు..మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే రాజయినా ఎవరూ సహించలేరని వేలెత్తి చూపడానికి ఎందరో సిద్దమని..కవులు మినహాయింపు కాదని చెప్తూ..కవి బాధ్యతాయుతంగా రచనలు చేయాలనే హెచ్చరిక కూడా నాక్కనిపించింది..మంచి వ్యాసం సురేష్ గారు..అభినందనలు .

 • రాజులు, కవులు వారి బాధ్యత గురించి విలువైన, పరిశోధనాత్మక వ్యాసాన్ని అందించారు సర్

 • ప్రతి విషయాన్ని పాతనుండి కొత్త వరకు మీరు విశ్లేషణ చేసే విధానం అద్భతం . పూర్వ రచనల్లోకి వెళ్ళి వాటిని కొత్త తరానికి పరిచయం చేస్తూ ఆలోచన ల్ని మరింత పరిపక్వత నందించే మీ రచనలు ఇంకా అవసరం గురూజీ.

 • బావుంది సార్.నిజమేనా పూర్వం నుంచి కవులు సామాజికతను అనుసరిస్తూనే ఉన్నారు.విఐటిపై తగినంత విశ్లేషణలు ఇంకా రావాలి.

 • నాటి సాంఘిక సిద్ధాంతాలు, రాచరిక లోపాలు… రాజు ను రక్ష అని కూడా అనడం..కవుల/రచయితలు పోషించిన పాత్ర మొదలగు ఎన్నో కొత్త విషయాలు తెల్సుకోగలిగాం!! శ్రమకోడ్చి రాసిన మీకు శుభాభినందనలు💐💐💐💐💐

 • ప్రాచీన కావ్యాలు తీరిగ్గా చదివి ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలు చెప్పడం బాగుంది సార్.

 • పూర్వ కాలపు సాహిత్యాన్ని ఇప్పటి అవసరమైన ఓ కోణంలో చర్చించటం.. సామాజిక చైతన్య ధోరణులను ఇలా తెలుగు సాహిత్యం మూలాల నుంచి స్పృశించటం.. చాలా ప్రయోజనకరంగా ఉంది. రాజునైనా వ్యతిరేకించిన చైతన్యం ఆనాటి రచనల్లో ఉండటం వర్తమానానికి స్ఫూర్తినిస్తుంది. తీసుకున్న థీమ్ కు సంబంధించి కావల్సిన ఉటంకింపులను చూస్తే మీ అధ్యయన కృషి అర్థమవుతోంది. ప్రజలు ఆత్మగత నియమాలకు లోబడి ఉండేవారని.. వర్ణ విబేధాల్లేకుండా ఒకరికొకరు తోడునీడగా పరస్పర రక్షకులుగా ఉండేవారనే విషయం నన్ను బాగా ఆకర్షించింది. వర్తమానంలో అనేక అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో.. ప్రాచీన కాలంలోని ఆంక్షాపూరిత రాజ్యాలు కంటె నాగరికత పెరిగి స్వేచ్ఛా ఊపిరులు పొందుతున్నామన్నవి భ్రమలేమో.. ఈ విషయంలో మనం ఇప్పుడు పురోగమనంలో ఉన్నామా తిరోగమనంలోనా అనిపించింది. ఇక ప్రస్తుత రచనల్లో చైతన్యం ఎలా ఉండాలో అన్యాపదేశంగా తెలియజేస్తున్న ఈ వ్యాసాల తదుపరి భాగంకై ఆసక్తి గా ఎదురుచూస్తూ.. మీకూ.. రస్తా కూ ధన్యవాదాలు సర్.

 • కవులు,విమర్శలు, చేస్తూ,రాస్తున్నారు, సరే, అవిమర్శలువల్ల,కొంత అయిన, ఈ సమాజం మారితే, బాగుండును అనిపిస్తోంది కత్తి కన్నా, కలం గొప్పది, కదా!మీ,రచన బాగుంది cv సర్👌👍💐.మీరురాసే వాటికి,విమర్శలు,చేసేప్రతిభ.. మాకు ఇంకా రాలేదు.సర్!అభివందనలు. మీకు.

 • పరిశోధనాత్మక వ్యాసం‌ అందించారు…అభినందనలు సర్ మీకు

 • మీరు కవిత్వం పై విభిన్న పరిశోధనలు చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం సురేష్ సార్….

 • సారవంతమైన విశ్లేషణ… నన్నయ కన్నా ముందు వున్న కవుల ప్రస్తావన ఎక్కడ సంపాదించారు? ఆంద్రుల సాహసం వీరత్వం ఏ కాలంలో నైనా ఘనంగా నే వుండటం గర్విం దగ్గ విషయం. కొత్త విషయాలు చాలా తెలిపారు. ధన్యవాదాలు మీకు

 • ఈ పరస్పర సంఘర్షణలు వివిధ తత్వాలుగా మారి వృద్ధి చెందాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.