స్వర్గనరకాల చెంత

చిరుగుల చెడ్డిలో కాలిన బ్రెడ్డులో
ఆకలి ఆకలిని వేటాడుతుంది
కళ్లకింది గుంటల్లో కన్నులమెరుపు క్షీణిస్తుంటే
బొమికలగూళ్ల మీది ముసుగులోంచి
మరణం తొంగిచూస్తుంటుంది
నెనరు లేని గాలి దుఃఖవాక్యాన్ని నేస్తుంది
బుధీర్ రామ్ బస్తీలోని బిషు ముండా
కలలో కలను అల్లుతుంటాడు
రేగడిమన్ను వాడితో ఆడుకుంటుంటే
నేలతల్లి వాడి మాటల్ని వింటూ వుంటుంది
దారంతో లాగబడే వాడిబండిలో పురాణసామగ్రి వుంటుంది
పచ్చిక నిండిన కలల లోయలో పడవ నడిపేవాడవుతాడు వాడు
వాడి స్వప్నాల్లో తడిసిన కాగితప్పడవ
ఊహాజనిత ఆదర్శనగరాన్ని చేరుతుంది
వాడి ఇసుకమేడల్లో కలలు నిద్రపోతాయి
బద్ధకపు పగటివేళ అలసిన చెట్టునీడలో
పక్షులు వాడికి జోల పాడుతాయి
చీమిడి నిండిన వాడిముక్కు చుట్టూ
ఈగలు హుషారుగా రొద చేస్తుంటాయి
కానీ, తెగులు సోకిన పంటచేనులా
తప్పెటలు తుప్పుపట్టి మూగబోతాయి
స్వప్నాల కింద స్వప్నాలు, పదాలకింద పదాలు
నరకంలాంటి నవ్వుమీంచి దేవకన్యల మెరుపులు నడిచిపోతుంటాయి
ఆకాశం నుండి ఆర్తనాదాలు కిందికి జారుతాయి
పత్రహరితపు మైకాన్ని శాశ్వతమౌనం కబళిస్తుంది
పరాజితుడుగా మిగిలి వాడు

ఆంగ్లమూలం: సంజిత్ సర్కార్

ఎలనాగ

ఎలనాగ: అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. కరీంనగర్ జిల్లా, ఎలగందుల లో పుట్టారు (1953).
వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టరైనా ప్రాక్టీసు చెయ్యటం లేదు. సాహితీ వ్యాసంగమే వ్యాపకం. మొదలు నైజీరియాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో పని చేసి, 2012 లో రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ. చాల కథలు, కవిత్వం అనువాదాలు చేశారు. వివిధ రచయితల కవితలు, కథలు, సాహితీవ్యాసాలను ఆంగ్లం నుంచి తెలుగు కూడా చేశారు. సొంతంగా చాల కవిత్వం రాశారు. వీరి గళ్ళ నుడికట్టు ప్రసిద్ధం. చాల బహిమతులు కూడా పొందారు.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.