వ్యక్తి వికాసమే సంస్థ వికాసం

You may never know what results come of your action, but if you do nothing, there will be no result. 

                                                                                                  –Mahatma Gandhi

వ్యక్తి వికాసమెప్పుడూ సంస్థాగత వికాసానికి దోహదం చేస్తుంది. ప్రతి వ్యక్తి ప్రవర్తనా నైపుణ్యాలు సంస్థాగత సమగ్ర, సంపూర్ణ ప్రవర్తనకు తోడవుతాయి. ప్రతి వ్యక్తిలోను ఉండే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలనే కాంక్ష కూడా సంస్థాగత అభివృద్ధికి దోహదం చేస్తుంది. నేటి సమస్యలను నిన్నటి పరిష్కారాలతో పరిష్కరించలేము. పరిష్కారాలు వ్యక్తి సానుకూల ఆలోచనలనుండి, ఆచరణల నుండి పుట్టుకొస్తాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రతి వ్యక్తి సృజనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించుకుంటే, అటువంటి కంపెనీ నిరంతరం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. సరికొత్త లక్ష్యాలను మీ కంపెనీ సాధించాలనుకుంటే దానికి తగిన విధంగా మీ ఉద్యోగుల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి. అదే పరిజ్ఞానం, అవే నైపుణ్యాలు, అదే వైఖరి ఉన్న పాత ఉద్యోగుల ప్రవర్తనతో మీరు కొత్త లక్ష్యాలను సాధించలేరు. వ్యక్తిగత అభివృద్ధితోపాటు సంస్థాగత అభివృద్ధి కోసం వారు సరికొత్త పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను, దృక్కోణాన్ని పెంపొందించుకుంటే  వ్యక్తితో పాటు సంస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. దీనినే ఉద్యోగి తన లక్ష్యాలను సంస్థాగత లక్ష్యాలతో సమన్వయం చేసుకోవడమని అంటారు.  This is what aligning personal goals to organisational goals. ప్రతి కంపెనీ తన లక్ష్యాలతో ఉద్యోగుల లక్ష్యాలను సమన్వయం చేసుకోవడానికి, వారిని మానసికంగా సంసిద్ధులను చేయాలి.  ఉద్యోగులు తమ బలాలను, బలహీనతలను, అవకాశాలను గుర్తించి తమ ఉద్యోగ జీవితాన్ని ప్రగతి పథంలో నిలుపుకునేలా కంపెనీ వారికి సహకరించాలి.   లక్ష్యాలు నిశితంగా, అంచనా వేయగలిగేలా, సాధించగలిగేలా, ఫలితాలను రాబట్టేలా, సమయబద్ధంగా ఉండేలా ఉద్యోగులకు శిక్షణనివ్వాలి. దీనివల్ల ఉద్యోగులకు వ్యకిగత అభివృద్ధి మీద ఆసక్తి కలిగి అది వ్యవస్థాగత ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ప్రగతి శీల దృక్పథం పట్ల ఉద్యోగులలో అవగాహన కల్పించడమే కంపెనీ వారికివ్వగలిగే అద్భుతమైన బహుమతి.

ఈ క్రింది సూచనలు ఉద్యోగులలో వ్యక్తిగత అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయి.

  1. ఉద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, ఫీడ్ బ్యాక్, కౌన్సెలింగ్ ద్వారా వారి మానసిక అవరోధాలను తొలగించడం.
  2. ఉద్యోగులు పనిలో అందుకోవలసిన ప్రమాణాలను విస్పష్టంగా తెలియచేయండి. మీ అంచనాలను అందుకోవడానికి వారిలో స్ఫూర్తిని రగిలించండి.
  3. ప్రశ్నాపత్రాలు తదితర స్వీయ అంచనా సాధనాలను వారితో అభ్యాసం చేయించాలి. దీనివల్ల ఉద్యోగులకు వారిలో నిద్రాణమై ఉన్న ప్రతిభ పట్ల అవగాహన ఏర్పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం రేకెత్తుతుంది.
  4. ఉద్యోగులలో నిరంతరం నేర్చుకునే లక్షణాన్ని ప్రోత్సహించడానికి చిన్న చిన్న బహుమతులు అందచేయండి. దీనివల్ల నేర్చుకోవడంలో ఎంత ఆనందముందో వారికి తెలుస్తుంది. 
  5. ఉద్యోగులు తమ తాత్కాలిక, దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరచుకునేలా ప్రోత్సహించాలి.
  6. ఉద్యోగులు సాధించిన వ్యక్తిగత విజయాలను, వృత్తిగత విజయాలను నమోదు చేసి వారిని తగిన పురస్కారాలతో ప్రోత్సహించాలి.
  7. వ్యక్తిగత, వృత్తిగత ప్రగతికి ప్రణాళికాబద్ధంగా అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం. ఉద్యోగాభివృద్ధిలో వారికి గల అవకాశాలపట్ల అవగాహన కల్పించాలి. 
  8. ఉద్యోగులు తమ వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధికి వారే ప్రణాళికలు వేసుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల చిత్తశుద్ధితో తమ అంచనాలను పోరాట స్ఫూర్తితో అందుకునే అవకాశముంది.
  9. వ్యక్తిగత నిర్వహణ ప్రగతికి ప్రధమ సోపానం. క్రమశిక్షణ, సమయపాలన, లక్ష్య సాధనలో పట్టుదల వంటి వ్యక్తిగత ప్రగతి సూత్రాలను ఉద్యోగులు పాటించేలా ప్రోత్సహించాలి.    

ఉద్యోగుల అభివృద్ధే కంపెనీ అభివృద్ధి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ విధమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఉద్యోగులను ప్రోత్సహించడం వలన కంపెనీలు ప్రగతి పథంలో పయనించి, జాతి అభివృద్ధికి దోహదం చేస్తాయి. 

 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.