ఇసుకరేణువు కంటితో చూడు
విస్లావా సింబ్రోస్కా (పోలిష్ కవయిత్రి)

 

దాన్ని మనం ఇసుకరేణువు అంటాం
తనను తానది ఇసుకా అనుకోదు రేణువూ అనుకోదు
ఆ పేరున్నా లేకున్నా దానికొక్కటే
పేరు సామూహికమా తనకు ప్రత్యేకమా
శాశ్వతమా తాత్కాలికమా
తప్పుడిదా సరైనదా… ఏదైనా ఒక్కటే దానికి.

మన చూపు, మన స్పర్శ దానికేం పట్టవు.
చూడబడుతున్నట్టు తాకబడుతున్నట్టు అదేం అనుకోదు.
అది కిటికీ చూరు మీద పడడం కూడా
మన అనుభవమే, తన అనుభవం కాదు.
అక్కడ పడినా మరెక్కడ పడినా దానికి తేడా పడదు.
పడడం పూర్తయ్యిందని సంతోషపడడం లేదా
పడుతున్నాననుకోడం ఆ తేడా కూడా రేణువుకుండదు

కిటీకీలోంచి సరస్సు ఒక అద్భుత దృశ్యం
కాని దృశ్యం తనకు తాను దృశ్యమానం కాదు
తనూ ఉంటుందీ లోకంలో
వర్ణరహితం, రూపరహితం,
శబ్ద రహితం, వాసనా రహితం, వేదనా రహితమై

సరస్సు అడుగుకు అడుగు లేదు
దాని తీరానికి తీరమూ లేదు
సరస్సులో నీరు తనకు తాను తడీ కాదు పొడీ కాదు
దాని అలలు తమకు తాము ఏకం కాదు అనేకమూ కాదు
తమ చప్పుడు తాము వినకుండానే కొట్టుకుంటాయి
చిన్న చిన్న రాళ్ళమీదైనా, పెను బండల మీదైనా

ఇంకా, ఇదంతా జరిగేది స్వాభావికంగా అసలేమీ కాని ఆకాశం కింద
ఆకాశంలో సూర్యుడు అస్తమించకుండానే అస్తమిస్తాడు
దాక్కోకుండానే దాక్కుంటాడు అదేం పట్టించుకోని మేఘం చాటున
గాలి మేఘాన్ని చెదరగొడుతుంది, వీచడం
అనే ఒకే కారణం వల్ల.

ఒక సెకండ్ గడుస్తుంది
రెండో సెకండ్ గడుస్తుంది
మూడోది కూడా
కాని అవి మూడు సెకండ్లయ్యింది మనకు మాత్రమే

కాలం సత్వర వార్త పట్టుకొచ్చిన కొరియరర్ లా వొచ్చి వెళ్లింది.
అది కేవలం మనం చూసే పోలిక.
అది ఒక కల్పించబడిన పాత్ర, సత్వరత్వం ఒక మాయ మాట
అతడి వార్త అమానవీయం.

(పోలిష్ భాష నుంచి అంగ్లానికి అనువాదం: స్టానిస్లావ్ బరానిస్జా, క్లారా కవనా.)

 

ఈ పద్యాన్ని జెస్లావ్ మిలోస్జ్ ఎడిట్ చేసిన ‘ ఎ బుక్ అఫ్ ల్యూమినస్ థింగ్స్’ అనే సంకలనం నుంచి లిఫ్ట్ చేశాను. పుస్తకంలో ఆయా కవితలకు మిలోస్జ్ రాసిన చిన్ని పరిచయాలు కూడా బాగున్నాయి. ఈ పద్యానికి ఆయన రాసిన చిన్ని పరిచయం ఈ కింద:

జెస్లావ్ మిలోస్జ్

‘ఇరవయ్యో శతాబ్దంలో కవిత్వం కనీసం ఒక దిశలోనైతే కదులుతోంది. అది తాత్విక వ్యాసం దిశ. దీనివల్ల సాహిత్య ప్రక్రియల మధ్య సూక్ష్మ రేఖ కాస్త అస్పష్టమయ్యింది కూడా. అనిర్దిష్టత (అబ్స్ట్రాక్షన్) కవిత్వానికి ప్రమాదకరమే గాని, విశ్వగోళం గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తడానికి వీలున్నందున ఈ ధోరణి వల్ల కొంత మేలు జరిగింది. విస్లావా సింబ్రోస్కా ఈ కవిత మానవీయత (భాష) కూ ప్రాణరహిత ప్రపంచానికీ మధ్య నున్న ఒక వైరుధ్యాన్ని ముందుకు తెచ్చి, విశ్వం గురించిన అవగాహన ఎలా భ్రమాన్వితమో (ఇల్యూజరీ యో) సూచిస్తుంది. ఆమె మరీ శాస్త్రీయం (సైంటిఫిక్) గా వున్నారని, వస్తుజాలం నుంచి మనం మరీ అంత వేరు కాదని నా అభిప్రాయం.’ — జెస్లావ్ మిలోస్జ్.)   

 

అనువాదం: హెచ్చార్కే

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.