ఒక యేడుపు…

‘ఆ…’

ప్చ్… కాదు!

‘యా…’

ఊహూ!

‘ఇంగే…’

ఊహూహూ!

ఏడుపుని రాయడం నాకు రాదు!

కాని యేడుపుని గురించి రాయాలంటే యేడుపొస్తుంది! రాదా? పుట్టినప్పుడు యేడుస్తాం! ఏడిస్తే అందరూ సంతోషంగా నవ్వుతారు! చెల్లి పుట్టినప్పుడు చూశాగా! చెల్లి యేడవలేదని- అప్పుడే పుట్టిందని కూడా చూడకుండా- వీపు మీద డాక్టరు వొక్క చరుపు చరిచింది! అంతే చెల్లి యేడ్చింది! అందరినీ నవ్వించింది!

ఎందుకో చెల్లి యేడిస్తే నాకూ యేడుపొచ్చింది! ఏడ్చేశానా? అప్పుడు అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టి యేమందీ? ‘అలా యేడిస్తే హెల్దీ’ అని చెప్పింది! ‘అయితే చెల్లి హెల్దీనా?’ అడిగితే, ‘చాలా యేడ్చింది కదా?, చాలా హెల్దీ’ అంది అమ్మ!

అమ్మా చెల్లీ ఆసుపత్రి నుండి యింటికొచ్చాక నేను ‘బా’మని పెద్దగా యేడ్చానా? అమ్మ ‘యెందుకు యేడుస్తున్నావు’ అని అడిగింది!

‘ఐ యామ్ హెల్దీ బోయ్’ అని చెప్పాను! అంతే కదా? ఎంత పెద్దగా యేడిస్తే అంత పెద్ద హెల్దీ కదా?, కాని అమ్మ యెందుకో నన్ను చూసి నవ్వింది! అమ్మని నవ్విద్దామని మళ్ళీ యేడ్చానా? పెద్దగా ‘వా’ అని యింకా యింకా యేడ్చానా? ఆపమని అమ్మ నా వీపు మీద వొక్కటేసింది! అప్పుడు నిజంగానే యేడుపొచ్చింది! ‘నోర్ముయ్… వెధవ కనా’ అని తిట్టింది! నేను యేడిస్తే చెల్లి కూడా యేడ్చింది! ఇద్దరం యేడ్చాం! ఇద్దరం హెల్దీయే కదా? ప్చ్! ‘ఏడిస్తే చంపేస్తా… నీవల్ల చెల్లి యేడుస్తోంది’ అమ్మ నాకు వార్నింగు యిచ్చింది! నావల్ల చెల్లి హెల్దీగా వుండడం అమ్మకి యిష్టం లేనట్టుగా వుంది?!

ఆ తరువాత కూడా చెల్లి హెల్దీ కదా, అందుకని యెప్పటికప్పుడు యేడ్చేది! చెల్లి అలా హెల్దీగా వుండేసరికి నేను హేపీగా నవ్వేవాణ్ని! అమ్మ మాత్రం కోప్పడేది! ‘చెల్లి యేడుస్తుంటే నవ్వకూడదు’ అనేది! ‘పోని నేనూ హెల్దీగా యేడవనా’ అన్నాను! అమ్మ వద్దంది! చెల్లి భయపడుతుంది అంది! ఏం చెయ్యాలో నాకు తెలీ లేదు?!

చెల్లి హెల్దీ బేబీ కదా వొక రోజు గుక్కపట్టి యేడ్చింది! అప్పుడు అమ్మ పక్కింటి అత్తతో వాళ్ళింట్లో మాట్లాడుతోంది! చెల్లి హెల్దీగా వుంటే హేపీ కదా, అందుకే ‘యింకా యేడు… బాగా యేడు’ అన్నాను! చిక్కాను! అమ్మ యెప్పుడు వచ్చిందో నా వీపు మీద దబదబా వేసింది! ‘చెల్లి యేడిస్తే యింకా యేడు బాగా యేడు అంటావా?’ అంది! చెల్లిని యెత్తుకొని పాలు పెట్టింది! నన్ను మాత్రం తిట్టింది అమ్మ!

ఏడుపు అంటే అమ్మ చెప్పినట్టుగా హెల్దీ కాదని మాత్రం అర్థమయ్యింది!

ఆ తరువాత యేడుపు అంటే ఆకలి అని అర్థమయ్యింది!

చెల్లి యేడిస్తే ఆకలికి యేడుస్తుందని- దానికి మాటలు రావని- యేడుపు కూడా వొక భాషేనని- నాన్న చెప్పగా అర్థమయ్యింది!

చెల్లి యేడిస్తే వుయ్యాల్లో వేసి వూపేది అమ్మ! అప్పుడు యేడుపు అంటే నిద్ర అని అర్థమయ్యింది!

చెల్లి యేదన్నా చూసి వులిక్కిపడి యేడ్చేది! అప్పుడు యేడుపు అంటే భయం అని అర్థమయ్యింది!

మరి వొకరోజు చెల్లి కడుపునిండా పాలు తాగి కూడా యేడ్చింది! చెల్లికి యింకా ఆకలి తీరలేదని పాలసీసా యిచ్చానా? చెల్లి పాలు తాగీ తాగక కక్కుకుందా? అమ్మ నన్ను కొట్టింది! ‘చెల్లి విషయాల్లోకి వచ్చావంటే చెమ్డాలు వొలిచేస్తాను’ నా చెవి మెలి పెట్టింది!

చెల్లి యేమీ జరగనట్టు నన్ను చూసి నవ్వుతుందా? నేనూ నవ్వుతానా? అంతలోనే చెల్లి యేడుస్తుంది! ‘అమ్మా నేనేం చెయ్యలేదు’ అని ముందే అంటానా? అప్పుడు అమ్మ నవ్వుతూ వచ్చి చెల్లిని యెత్తుకొంటుందా? ఎత్తుకోగానే టక్కున చెల్లి కూడా యేడుపు ఆపేస్తుంది! అప్పుడు అమ్మ నావొడిలో చెల్లిని కూర్చోపెడుతుందా? ‘దీనికి బాగా యెత్తు అలావాటై పోయింది… యెత్తు మరిగి పోయింది’ అని అంటుందా? తగ్గట్టుగా యెత్తితే నవ్వుతుంది! దించితే యేడుస్తుంది!

ఏడుపుకి యిన్ని అర్థాలు వున్నాయా అని అనుకుంటుండగా చెల్లి యింకా కొత్త కొత్త యేడుపులు నేర్చేసుకొని యేడ్చేది! అలా యేడిస్తే యేదో వొకటి ఆడుకోవడానికో తినడానికో అమ్మ యిచ్చేది! కోరినవి యివ్వకపోతే చెల్లి యెక్కడ పడితే అక్కడ దొర్లి దొర్లి యేడ్చేది! బట్టలు పాడవుతాయని అడగ్గానే అమ్మానాన్న అన్నీ చెల్లికి యిచ్చేవారు! ప్చ్… నిజమే, చెల్లికి మాటలు రావు కదా? ఇంక యెలా చెప్తుంది?

అయితే చెల్లికి యిప్పుడు మాటలు వచ్చినా యేడుపు పోలేదు! అన్నిటికీ యేడుస్తుంది! రాగం తీస్తుంది! అడిగితే యివ్వనివి చెల్లి యేడ్చి సాధించుకుంటుంది! ఏడుపు భాష కాదు! ఆయుధం! ఆ మాట అమ్మమ్మే అంటుంది! ‘ఏడ్చినోళ్లదే యెవసాయం’ అని అంటుంటుంది!

ఏడుపు అలవాటు మాన్పించాలని అమ్మ చూసింది! ఏడిస్తే కొడతా అని అమ్మ చెయ్యెత్తకముందే చెల్లి యేడుస్తుంది!

‘వద్దు దాన్నేమనకు, యేదన్నా యేడుస్తుంది’ అని నాన్న అంటారు! ఆ మాటకు చెల్లి ముఖం యెంతో వెలిగిపోతుంది! బల్బులా!

‘అది యేడిస్తే ఆపదు, దానికిచ్చేయ్…’ అమ్మ అంటుంది!

ఏదయితేనేం? చెల్లి యేడ్చి సాధించుకుంటుంది! అడిగితే జరగని పని- యేడిస్తే జరుగుతుందని- చెల్లికి తెలిసిపోయింది! అయితే యేడుపు ఆపడం లేదని అప్పుడప్పుడూ అమ్మో నాన్నో రెండు తగిలిస్తే నిజంగానే చెల్లి యేడుస్తుంది!

‘ఏడవనీ, యేడిస్తే బలం…’ అని అమ్మానాన్నా చెల్లిని కొన్ని సార్లు పట్టించుకొనేవాళ్ళు కాదు! అప్పుడు కూడా చెల్లి యేడ్చేది… కాని దాని కళ్ళలో చుక్క నీళ్ళు వచ్చేవి కావు?!

నేను కూడా చెల్లిని ఫాలో అయిపోదామని యేడ్చాను! ప్చ్! ‘ఆడపిల్లలా యేడవడానికి సిగ్గులేదూ?’ అన్నారందరూ! షేమ్… షేమ్… అనడంతో నేనూ కామ్!

ఇలా యేడుపు గురించి చెపుతానా? చెల్లి యేడుపు గురించి యేడవకు అని నన్నే అంటారు! ఈ యేడుపు గురించి తెలుసుకుంటే బోలెడు యేడుపు వస్తుంది!

-సంతోష్,

ఒకటో తరగతి,

తథాగత్ విద్యా వాటిక.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

8 comments

 • ఎవరి ఏడుపు ఎలా వున్నా
  మీ ఏడుపు బావుంది….సార్!

 • సమస్కారమండి.
  నాపేరు సీతారాము. మాదికూడా కాశీబుగ్గ యే.
  నేనూ ఇరువదేండ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను.
  బెంగుళూరు రాఘవమాష్టారు గారు మిమ్ములను కలుద్దాం అనుకున్నాము. ఇందులోని ఫోన్ నం.. తప్పు అనిచెబుతున్నది. ఒకసారి నాకు ఫోన్ చేయండి. 98499 32519.
  కె. సీతారాము
  ఫిల్ము డైరెక్టర్. ప్రోడ్యూసర్.
  ఇంటర్ నేషనల్ ఆవార్డ్స్ విన్నర్.
  హైదరాబాద్.

 • ఏడుపు చెల్లికి(ఆడపిల్లకి) అలంకారం.. అన్నకి (మగాడికి) శాపం.. అందుకే ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని సామెత. అది కథ రూపంలో నిజమనిపిస్తోంది..

  • ఏడుపు యెవరికీ అలంకారం కాదు! అవసరం! ఆపదని తెలిపే ఆది రాగం! అమాయకంగా కొందరు దాన్ని ఆయుధంగా వాడుతారు! ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు! ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదనే సామెత పురుష స్వామ్యం నుంచి పుట్టింది! ఆడపిల్ల అడుగు గడప దాటకూడదు… నవ్వు పెదవి దాటకూడదు- అని! ఆడవాళ్ళని కట్టడి చెయ్యడానికి చేసిన యేడుపే మీరు చెప్పిన సామెత! పిల్లలు స్త్రీలుగా పురుషులుగా తయారుకాకముందు వాళ్ళ యేడుపు కూడా యెంతో కొంత స్వచ్చం! ఇక్కడ ‘సంతోష్’ మగ సామ్రాజ్యంలోకి యింకా అడుగు పెట్టలేదు గనుక యిక్కడ మీరు నిజమన్నది అబద్దం అని నా విన్నపం!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.