ఇంటి పెరట్లో అణు విద్యుత్ కేంద్రం

మాది తమిళ నాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని కవల్కినరు అనే పల్లెటూరు.  కన్యాకుమారి దగ్గర.  మా నాన్న ట్యూటికారన్ లోని హెవీ వాటర్ కర్మాగారం లో ఉద్యోగం చేసేవాడు. నా మొదటి 24 ఏళ్లు  అక్కడికి దగ్గర్లోని అటామిక్ ఎనర్జీ టౌన్షిప్ లో గడిపాను. అణువిద్యుత్తు సురక్షితమైనదనీ, అదే మన  భవిష్యత్తు అనీ మా టౌన్షిప్ లో వాళ్లు ఎప్పుడూ అంటూ వుండేవాళ్లు. నేను వాళ్లను నమ్మాను.

2001 లో, మా ఊరికి 18 కిలోమీటర్ల దూరంలో కూడంకుళం అణువిద్యుత్ కేంద్ర (KNPP) నిర్మాణం ప్రారంభమయింది. 2009 లో ఒక పత్రికలో ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూ బెంగళూరులో ఉన్నప్పుడు, కైగా (కర్నాటక రాష్టంలోని ఉత్తర కన్నడ జిల్లా) అణువిద్యుత్ కేంద్రలో లీకేజి జరిగి, 50 మంది పనివాళ్లు అణుధార్మిక శక్తి(రేడియేషన్) ప్రభావానికి లోనయ్యారని తెలిసింది. ఆ తరువాత ఫోటోగ్రఫీ వర్క్ షాపులో పాల్గొనడానికి కాంబోడియా వెళ్లినప్పుడు, అక్కడ నాతో పాటు పాల్గొంటున్న కొంతమంది అణు భద్రత గురించి మాట్లాడుకుంటూ, అణుశక్తి మంచిదా కాదా అన్న విషయం గురించి చర్చించుకోవడం విన్నాను.

2011 దాకా విద్యుత్ కేంద్రం గురించి గానీ, దానివల్ల కలిగే అపాయాల వల్ల గానీ మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు అంతగా పట్టించుకోలేదు. ఆ సంవత్సరం మార్చిలో, జపాన్ దేశాన్ని కుదిపేసిన సునామీ వల్ల కలిగిన ఫుకుషిమా పెనుప్రమాదం మా ప్రాంతాల వారిని భయాందోళనల కు గురిచేసింది. 2004 లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ వలన అప్పటికే బాధలు పడిన చుట్టుపక్కల గ్రామప్రజలు, అణుశక్తి  భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టారు. ఆ సమయానికి KNPP నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ చుట్టుపక్కల  నివసిస్తున్న  ప్రజలు  ఫుకుషిమ తరహా ప్రమాదం అక్కడ కూడా జరుగుతుందేమోనని భయపడసాగారు. 

అణుభద్రత, ప్రకృతి విపత్తు సందర్భంలో సంసిద్ధత  గురించి ఆ ప్రాంత ప్రజల్లో చెలరేగుతున్న భయాల్ని తగ్గించడానికి  భారత  ప్రభుత్వం కూడా, తన వంతు బాధ్యతగా, ఏమంత కృషి చెయ్యలేదు. భద్రతా చర్యల గురించి ప్రజలు అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడు సమాధానాలే లభించాయి.

అప్పట్నుంచీ అక్కడి జనం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అహింసాయుత ఉద్యమంలో పాల్గొంటున్నారు. అణువిద్యుత్ కేంద్రానికి చేరువలో ఉన్న ఇడింతకరై అనే గ్రామం ఈ ఉద్యమానికి ముఖ్య కేంద్రమయ్యింది. ఆ గ్రామప్రజలు, ముఖ్యంగా జాలర్లు, రైతులు, విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా దాదాపు 500 రోజులనుంచి(ఈ ఫోటో వ్యాసం రాసిన 2013 సంవత్సరం నాటికి) ఉద్యమం చేస్తున్నారు. చుట్టుపక్కల పర్యావరణంపై అణువిద్యుత్తు కేంద్ర  ప్రభావం గురించి కూడా వాళ్లు భయపడుతున్నారు. దగ్గర్లోని మన్నార్ మహాఖాత ప్రాంతం పర్యావరణ పరంగా ఇప్పటికే బలహీనంగా ఉందన్నది తెలిసిన విషయమే. 

ప్రారంభంలో ఈ ప్రజా ఉద్యమాన్ని బలపరచిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, తరువాత వెన్నుచూపి ఉద్యమాన్ని అణచడానికి తమకు అందుబాటులు ఉన్న అన్నిరకాల సాధనాలను ఉపయోగించింది. 

ఉద్యమకారలకు వ్యతిరేకంగా పోలీసు బలగాలను మొహరించింది. మార్చి 2012 నుంచి, న్యూక్లియర్ ప్లాంటు చుట్టూ ఏడుమైళ్ల దూరంలోపల ఉన్న అన్ని ఊర్లన్నీ కర్ఫ్యూలో ఉన్నాయి. అణుశక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్న  పీపుల్స్ మూవ్ మెంట్ అగైనిస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ (PMANE) అనే సంస్థకు చెందిన సభ్యులపైనా, గ్రామస్తులు ఎవరైనా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటే, వారిపైనా ఎన్నో కేసులు బనాయించింది. ఇందులో చాలామందిపై దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని కేసులు బనాయించింది. 

గ్రామస్తులు చేస్తున్న సాహసోపేతమైన పోరాటం గురించిన కథ ఇది:

ఇదింతకరై గ్రామం. నేపథ్యంలో కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రం. మే 21, 2012.

 

ఆరోజు పట్టిన చేపలను మార్కెట్టుకు చేరవేస్తున్న జాలరి. తమ వంతుగా గ్రామస్తులు ప్రతి బుధవారం తమ సంపాదనలోంచి పది శాతం సేకరించి ఉద్యమ ఖర్చులకు ఇస్తారు. స్కాండినేవియా దేశాలకు చెందిన ఎన్ జీ వో లు ఉద్యమ కార్యకర్తలకు డబ్బు ఇస్తున్నాయని భారత ప్రభుత్వం ఆరోపించింది కానీ రుజువు చేయలేకపోయింది.  గ్రామస్తులు తాము సేకరించిన డబ్బుకు, ఖర్చులకు సరియైన ఖాతాలు చూపించారు. అక్టోబరు 18, 2012. 

 

కర్ఫ్యూ విధించి ఇడంథకరై గ్రామానికి వెళ్లకుండా అడ్డుకున్నందుకు, కూథంకులి గ్రామం నుంచి వచ్చిన ఉద్యమకారులు చర్చి ఎదుట గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యం. మే10, 2012. 

 

కర్ఫ్యూ విధించిన తరువాత, కూడంకుళం గ్రామం లోకి వెళ్లేముందు  KNPP ఎదుట పోలీసు బలగాలు. మే 10, 2012.

 

అణువిద్యుత్ కేంద్రాన్ని మూసివేయించాలని ప్రార్థనలు చేస్తూ కూథంకులి గ్రామంలో ఊరేగింపు జరిపారు. ఆ ప్రాంతంలో చాలామంది రోమన్ క్యాథలిక్ శాఖ భక్తులు. మే 14, 2012.

 

హిరోషిమ బాధితులకు సంతాపం తెలుపుతూ క్యాండిల్ లైట్ విజిల్ లో పాల్గొంటున్న గ్రామస్తులు. ఆగస్టు 06, 2012.

 

ప్రాజెక్టుకు రష్యా అందిస్తున్న సాంకేతిక సహాయాన్ని నిలిపివేయాలని రష్యా అంబాసిడరుకు రాసిన పోస్టుకార్డులతో ఇందింథకరై గ్రామానికి చెందిన పిల్లలు. ఆగస్టు 06, 2012.

 

KNPP దగ్గర్లో సముద్రం ఒడ్డును ఆక్రమించడానికి తరలివెళుతున్న మహిళలు. సెప్టంబరు 09, 2012.

 

విద్యుత్ కేంద్రాన్ని ఆరంభించడానికి వ్యతిరేకంగా ఉద్యమంలో వేల సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, తమ పిల్లలతో సహా, KNPP దగ్గర సముద్రం ఒడ్డున నిద్రిస్తున్న దృశ్యం. సెప్టంబరు 09, 2012.

 

విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి వ్యతిరేకంగా రాత్రిపూట జరిగిన పోరాటంలో పాల్గొన్న గ్రామస్తులు చలికాగుతున్న దృశ్యం. సెప్టంబరు 09, 2012.

 

 పోలీసు బలగాలు మేరీ మాత విగ్రహాల్ని ద్వంసం చేసి, చర్చిలో మూత్రవిసర్జన  చేసినప్పుడు, ప్రక్షాలన కార్యక్రమంలో పాల్గొంటూ ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్న గ్రామస్తులు. సెప్టంబరు 15, 2012.

 

కూడంకుళం గ్రామస్తులపై పోలీసుల జరిపిన దాడిని నిరసిస్తూ టుటింకొరిన్  పోర్టును ఆక్రమించి  ఓడలను అడ్డగిస్తున్న జాలర్లు. సెప్టంబరు 22, 2012.

 

గ్రామస్తులపై పోలీసులు దాడి జరిపిన తరువాత చర్చిలో మేరిమాత ముందు ప్రార్థిస్తున్న ఒక మహిళ.  సెప్టంబరు 11, 2012.

 

అణువిద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని డిమాండు చేస్తూ 260 మంది మహిళలతో కలిసి  ఏడు రోజులపాటు నిరాహారదీక్షలో పాల్గొన్న డెబ్బై ఏళ్ల తంగమ్మ. మే 05, 2012.

 

తనను అరెస్టు చెయ్యడం కోసం గ్రామస్తులపై దాడి చేస్తున్న పోలీసులకు లొంగిపోతానని చెప్పిన  పీపుల్స్ మూవ్మెంట్ ఎగైన్స్ట్ న్యూక్లియర్ ఎనర్జి(PMANE) నాయకుడు,  డాక్టర్ ఎస్ ప్ ఉదయకుమార్ ను  లొంగిపోవద్దని వేడుకుంటున్న మహిళలు. కొన్ని నిమిషాల్లోనే కొంతమంది యువకులు ఆయనను  డయాస్ మీదనుంచి మోసుకెళ్లి, బోటులో ఎక్కించి సురక్షిత స్థలానికి తరలించారు. సెప్టంబరు 11, 2012.

 

కోస్టు గార్డుకు చెందిన విమానం ఉద్యమ కార్యకర్తల మీదుగా ఎగురుతున్న దృశ్యం. సెప్టంబరు 12, 2012. 

 

పోలీసుల దాడిలో గాయపడి, పరిగెత్తుతున్న ఇడింథకరై గ్రామస్తుడు నపోలియన్. సెప్టంబరు 10, 2012.

 

ఇడింథకరై గ్రామానికి చెందిన జేవియరమ్మ. సముద్రంలోకి తరిమివేయబడి, ఎటూ పారిపోలేక సహాయం కోసం అర్థిస్తున్న దృశ్యం. కొద్దిసేపటి తరువాత సెక్యురిటీ బలగాలు ఆమెకు సహాయం చేశారు. సెప్టంబరు 10, 2012.

 

సహాయం అనే గ్రామస్తుడి అంత్యక్రియల సమయంలో ఏడుస్తున్న ఆయన్ పిల్లలు.తమ తలలమీదుగా ఎగురుతున్న కోస్ట్ గార్డు విమానం తగులుతుందేమోనని భయపడి తను నిలబడిన బండమీద నుంచి కిందకి దూకి, ఆ తాకిడికి చనిపోయాడు. సెప్టంబరు 17, 2012.

 

(“Counter Currents” నుంచి . అనువాదం: కొడిదెల మమత)

అమిర్తరాజ్ స్టీఫెన్

ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.