

మా ఊరి మట్టివాసన నన్నెపుడూ వీడలేదు
మళ్ళీ ఏ ఊరూ నన్ను కన్నబిడ్డలా చూడలేదు
దృష్టి గమ్యంపై లగ్నం చేసి నడుస్తూ ఉంటే
దారిలో ముళ్ళు చూడలేదు మైలురాళ్ళు చూడలేదు
ఎరుపెక్కిన చెక్కిలిపూలు అరవిచ్చిన అధరసుమాలు
ఇటువంటి పూదోటని మునుపెన్నడూ చూడలేదు
ఈరోజు కూడా ఒక నాన్న వేళకు ఇల్లు చేరలేదు
ఈరోజు మాత్రం గుమ్మంలో చిన్నారి ఎదురుచూడలేదు
ఒకానొకరోజు నాకు నిజమేంటో తెలిసొచ్చింది
ఈ రాయి వినలేదు పలుకలేదు చూడలేదు
హృదయస్థానంలో నీ శశివదనం ప్రవేశించాక
ఏయే గ్రహాలు ఎక్కడెక్కడున్నాయో చూడలేదు
అందరూ స్వర్గానికో నరకానికో వెళ్ళినవారే
వెళ్ళి తిరిగొచ్చినవారిని ఇంతవరకూ చూడలేదు
చివరికి ఒక మలుపులో మా దారులు చీలాయి
వీడ్కోలు చెప్పాను కానీ తన కళ్ళలోకి చూడలేదు
మధుబాలా ఇది ఖచ్చితంగా నీ చేతి మహిమే
ఇంత తీయని మధువు వేరెక్కడా రుచిచూడలేదు
‘అంజలీ’, ఆనందం కోసం ఊరంతా తిరిగావు
పెరట్లోనే విరగబూసిన మల్లెతీగని చూడలే
28.06.2019
Add comment