“You want to tell a story? Grow a heart. Grow two. Now, with the second heart, smash the first one into bits.”
— Charles Yu
అన్ని రోజులలాంటివి కాని కొన్ని రోజులని, పూర్తిగా సంపూర్ణంగా బతికిన ఆ క్షణాలని వదిలి మళ్ళీ ఎప్పటిలాగే దుమ్ము పట్టిన యంత్రాన్ని దులుపుతూ నన్ను నేను ఇల్లు వదిలి బెంగుళూరుకు(ఉద్యోగానికి) పోవటానికి సిద్ధం చేసుకుంటుంటే ఎంత నీరసత్వం అస్సలు ఇల్లు వదిలి వెళ్లాలనిపించదు మళ్ళీ మళ్ళీ బాత్రూమ్ వస్తుంటుంది…వస్తున్న..ట్టుం..టుంది,’చికెన్ చపాతీలు బ్యాగ్ లో పెడుతున్న బస్ లో తిను’ అంటుంది అమ్మ, సర్రుమని కోపం వస్తుంది ‘నాకు వద్దు, నూనె కారుతది అయినా నేను బస్ లో తినను ఇప్పుడే తిన్నా కదా రేపటి వరకి ఆకలి కాదులే’ అని కోపంగా ఏదేదో వాగుతూవుంట, నిజానికి మా అమ్మ logistics వాళ్ళ కంటే పెర్ఫెక్టుగా పాక్ చేస్తుంది నూనె కారదు. అయినా నేను పోవడానికి అమ్మ సిద్ధంగానే ఉందని కోపం. కిందికి వంగితే చేతులు వేలాడుతుంటాయి తప్ప షూ లేస్ ని కట్టవు. ఇంటి బయటకు వెళ్లేవరికే ఇదంతా బైటికెళ్లి దూరం పోతున్న కొద్దీ ఈ నీరసత్వం, నెగిటివ్ ఎనర్జీ అంతా నెమ్మదిగా మాయమైపోతుంది అంటారు కొందరు, కానీ నా విషయం అలా కాదు రెండ్రోజుల వరకి నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది ఆ ఎనర్జీ నేను మర్చిపోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల, ఎం చేయను నేనో పెసిమిస్టుని మరి.
రాత్రి 10 అయ్యింది ఆరంఘర్ లో బస్ కోసం ఎదురుచూస్తున్నా చుట్టూ జనాలు- కొందరు కూర్చొని కొందరు నిల్చోని ట్రావెల్ బస్ డ్రైవర్ చెప్పే అబద్ధాలు వింటూ, తిట్టుకుంటూ ఎదురుచూస్తూ కాసేపటికి కూర్చున్నవాళ్ళు నిలబడుతూ, నిల్చున్నవాళ్ళు ఖాళీ చూడగానే కూర్చుంటూ ఎంటో మాయ. చుట్టూ ఇంత మాయ జరుగుతున్నా నేను ఇంట్లో చేసినవి బెంగుళూరుకు వెళ్లి చేసేవి synonym, antonym లా గుర్తొస్తూనే ఉన్నాయి. అందుకే అంటారేమో ఇష్టమైన పని మాత్రమే చేయాలి అని. ఈ మాయ లోకి చొచ్చుకుపోతే అంతా మర్చిపోతానేమో అని సైడ్ డివైడర్ మీద కూర్చొని చుట్టూ దీక్షణగా చూస్తుండిపోయా కుడి వైపు ఒక పెద్ద అట్ట డబ్బాలో ‘kenley’ బాటిల్స్ పెట్టుకొని చేతిలో 10, 20 నోట్లు జేబులో 100, 500 నోట్లతో కూర్చున్నాడు రూమి లాంటి ఒక ముసలాయన. ఆ డబ్బాలోంచి బాటిల్స్ ని తీసుకెళ్లి ప్రయాణికులకి అమ్ముతున్నారు ఆయన మనవళ్ళు, మనమరాళ్లు.
ఎడమవైపు చూస్తే మూడు లేక నాలుగేళ్ళ పాప. భలే క్యూట్‌గా ఉంది నా కోడలు మల్లే. ఆమె చుట్టూ నాలుగు పెద్ద బ్యాగులు అన్ని జిప్పులు ఫెయిలైనవే. ముందు రోడ్ మీద చివరి బ్యాగ్ దగ్గర సర్వీస్ లైన్ మీద నిలబడిన ఒక వ్యక్తిని చూస్తుంది పాప, అతను బాగా తాగి ఉన్నాడు సరిగ్గా నిలబడటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు ఏదైనా బస్ రాగానే ఊగుతూ దాని దగ్గరికి వెళ్లి ఎదో అడుగుతున్నాడు. అతను బ్యాగ్ దగ్గరి నుండి బస్ దగ్గరికి పోయినప్పుడల్లా పాప ఏడుస్తూ నాన్న నాన్న అని అరుస్తూ వెళ్లి అతని ప్యాంట్ పట్టుకుని వెనక్కి లాగుతుంది అతనికి ఏ స్పర్శ లేనట్టు అలాగే ఎదో మాట్లాడుతున్నాడు క్లీనర్ తో, కాసేపు అలానే ఏడుస్తుంటే ఎత్తుకొని మళ్ళీ ఆ బ్యాగుల మధ్యలో కూర్చోబెట్టి ఆ సర్వీస్ లైన్ ముందుకో అడుగు వెనక్కో అడుగు వేస్తూ నిలబడ్డాడు. ఇంకో బస్సు ఇంకోసారి ఎదో ముచ్చట, ఎందుకో ఏడుపు మళ్ళీ బ్యాగుల మధ్యలో తను. ఇదంతా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. పాప గురించి అతని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనిపించింది కానీ తడిసిన వేప చెట్టు మొద్దులా ఉన్న నాకు మాట్లాడాలని లేదు, ఎలా మాట్లాడాలో కూడా అర్థంకాలేదు చుట్టూ చూశా, వీళ్ళని ఇంకెవరు చూస్తున్నారా అని ఎవరి బిజీలో వాళ్ళు వెనకలెవరో ఒక ముసలాయన చూస్తున్నాడు. చివరికి పాప ఏడుపు ఆపినప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అని అడిగా.
‘ఇల్లు కాలి చేసాం, నాన్న కొత్త ఇంటికి తీసుకెళ్తా అన్నాడు, కానీ నాన్న రోడ్డు మధ్యలోకి ఉరుకుతున్నాడు అదిగో చూడండి మళ్ళీ…నాన్న నాన్న ఆగు ఆగు’ అంటూ మళ్ళీ ఏడుపు మొదలు.
అతనా నిన్ను కొత్త ఇంటికి తీసుకెళ్లేది వరుసపెట్టి ఒక 5 లారీలు హార్న్ కొట్టుకుంటూ పోతే అక్కడే సోయి తప్పి పడిపోతాడు అతనెక్కడికి తీసుకెళ్తాడు పాప నిన్ను, అతను పడిపోతే నీ పరిస్థితి ఏంటి పాప! 11:30 అవుతుంది ఈరోజు ఆదివారం ఏ బస్సు కాలిగా ఉండదు ఒకవేళ ఉన్న టికెట్ ధర మాములుగా ఉండదు, తిరిగి ఇంటికి కూడా వెళ్లలేరు- ఇల్లు కాలి చేశారు ఎటైనా తెలిసిన వాళ్ళింటికి పోదాం అన్నా సిటీ బస్సులు ఉండవు ఉన్నా ఆ నాన్నకి అడ్రస్ గుర్తురావాలిగా ఆయన ఈ ప్రపంచంలో లేనే లేడు ఇవన్నీ ఆలోచిస్తుండగా నన్ను పిలిచి ‘మీరైనా చెప్పండి నాన్నని ఇక్కడ నాతో కూర్చోమనండి’ నేనేమి మాట్లాడలేదు అవతల వైపు తిరిగి రూమిని చూస్తుండిపోయా. మళ్ళీ బస్ వస్తుంటే అతను రోడ్ మధ్యకి పోతున్నాడు ‘నాన్న, నాన్న ఆగు’ అని ఏడుస్తుంది అతని చెవులు పనిచేయని స్థితి కనీసం తిరిగి వెనక్కి చూడట్లేదు రోడ్డు మధ్యలో బస్ కోసం నిలబడ్డాడు. గొంతులో ఎదో అడ్డుపడ్డట్టు హఠాత్తుగా కళ్ళ నుండి నీళ్ళు కారి కనురెప్ప దగ్గర ఆగిపోయాయి
ఉన్నట్టుండి నా ప్రాణాన్ని ఎవరో లాక్కున్నట్టు కాలీగా, తేలికగా అనిపించింది. ‘నాతో వచ్చెయ్ పాప’ అని అడగాలనిపించింది, అతని దగ్గరికెళ్ళి ఎందుకిలా చేస్తున్నావ్ అని తిట్టి పాప పక్కన కూర్చోబెట్టి కట్టేయాలనిపించింది కానీ ఆ రెండు చేయకుండా అక్కడ్నుంచి లేచి వెనకాలున్న బస్టాప్ లో, చీకట్లో కూర్చున్నాను తననే చూస్తూ. నా చుట్టూ జరిగే వాటికి నేనెప్పుడూ ఇంతలా స్పందించి కన్నీరు కార్చింది లేదు, ఎదో కాలక్షేపానికి కాసేపు బాధపడినట్టు చేసి మళ్ళీ నా జీవితంలోకి నేను దూరేవాడ్ని కానీ ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ పతాక స్థాయిలో ఉండడం వల్ల అనుకుంటా నా హృదయం high రేట్ లో స్పందిస్తుంది.
గత అర్ధగంట నుండి సిగ్నల్ అవతలే ఉన్నా అని చెప్పుకుంటున్న నా బస్సు రానే వచ్చింది పాపనే చూసుకుంటూ బాధగా బస్ ఎక్కేసా, బస్ లో ఒక్క ఫ్యాన్ కూడా తిరగట్లేదు (నేనెప్పుడూ AC ప్రిఫర్ చేయను,afford కూడా చేయలేను;afford చేయలేను కాబట్టే ప్రిఫర్ చేయనేమో) కాసేపు క్లీనర్ తో గోడవపడాలని ఆర్గుమెంట్ గెలవాలని నాలో నేను attack and defend కామెంట్స్ చేసుకొని ‘ఈ ప్రయివేట్ బాడకావులు ప్రయాణికుల అవసరాలని బాగా సొమ్ము చేసుకుంటున్నార’ అని తిట్టుకొని క్లీనర్ తో మాట కూడా మాట్లాడకుండా నిద్రలోకి జారుకున్నాను. నాలో ఆ homesickness కూడా కాస్త తగ్గింది మరుసటి రోజు నేను యంత్రాన్నయిపోయా. పాప గురించి మర్చిపోయా, మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత బెంగళూరులో హైదరాబాద్ బస్ కోసం ఎదురుచూస్తుంటే గుర్తొచ్చింది తను. అంత బాధపడి కన్నీరు కార్చిన విషయాన్ని కూడా అంత తేలిగ్గా మరిచానంటే నేనెంత గొప్ప హిపోక్రీట్ ని ప్చ్..చిచ్చి.
హైదరాబాద్ బస్సు ఎక్కినకాంచి ఆ పాప ఆలోచనలే ‘వాళ్ళు ఆరోజు బస్ ఎక్కారో లేదో, అతను పడిపోయివుంటే ఆ పాప పరిస్థితి ఏంటి? ఆ బ్యాగుల మధ్యలో ఒక చిన్న బ్యాగులా ముడుచుకున్నా కాపాడుకోలేదు తనని, తన అమ్మ ఉన్నా బాగుండేది చీ! ఎంత మూర్ఖుడు ఆ తండ్రి పాప పక్కనుంచుకొని అంతలా ఎలా తాగగలిగాడు, కానీ అతనికి ఎంత కష్టమొస్తే అంతలా తాగి ఉంటాడు ఇంకో ఇల్లు ఎక్కడా దొరకలేదేమే. అక్కడ తప్పు నాన్నదేనా? అవును నాన్నదే కానీ అతనికి ఇంకో ఇల్లు దొరక్కపోతే, ఆ రాత్రి ఎటు పోవాలో తెలియకపోతే ఏ దిక్కు లేదని అసలు దిక్కులనేవే లేవని తోచినప్పుడు ఇంకేం చేయగలడు పక్కన పర్మిట్ రూంలో ఒక్కోడు పండి బోర్లుతుంటే మెదడులో నరాలన్నింటిని మందు సీసాలు పట్టి లాగుతుంటే’
‘చీ! ఎంత దుర్మార్గపు ఆలోచనలు నావి…అలాంటి పరిస్థితుల్లో పక్కన పాప ఉన్నంక ఎవరైనా ఒక సొల్యూషన్ కొరకు ఆలోచిస్తారు గాని మందు సీసాలు నరాలని లాగడం ఏంట్రా, చెత్త నాయాల, ఆ నాన్నకి నాకు పెద్ద తేడా లేనట్టే కొడుతోంది.’ attacker లా మారిన డిఫెండర్
‘అయ్యో! నేను తనకి ఏ విధంగా సాయం చేయలేకపోయానే, ఆ తండ్రిని గట్టిగా గదమాయించి ఆ kenley బొటల్ నీళ్లు అతని తలపై పోస్తే ఏమాయే, ఎవడేమంటాడు ప్చ్..తు నా బతుకు.. ఎందుకు ఆ పని చేయలేదు నేను’
‘ఎవడు ఏమి అనడు, పెదాలు కూడా కదపరు కానీ నాకే అన్నీ వినిపిస్తాయి’ గుణుక్కుంటున్నట్టు, నవ్వుకుంటున్నట్టు, తిట్టుకుంటున్నట్టు… అందుకే ఏ మంచి పనీ చేయలేవు. అయినా నువ్వేం సాయం చేస్తావ్ అప్పటికే నువ్వు అదొక మంచి బాధ కలిగించే సన్నివేశమని జరిగేదాన్ని ఏమాత్రం గెలక్కుండా పరీక్షిస్తూ ‘ఇది కథలా మార్చొచ్చేమో’ అని ఉన్నట్టుండి నీకు వచ్చిన ఆ ఆలోచన నిన్ను సాయం చేయనికుండా ఆపేస్తుంది కదూ’ నేను నువ్వు అయ్యేంత దూరం పెరిగింది మా మధ్య హఠాత్తుగా ఒంట్లోకి భయం జొరబడింది ‘హే! అయ్యుండదు కథ కోసం సాయం చేయకుండా ఉంటానా?’
‘దిన్నంతా ఒక కథలా మార్చలన్న ఆలోచన నీలో ఉన్నంతవరకు నువ్వు ఆ పాపకి ఏ విధంగా కూడా సాయం చేయలేవ్.’
‘అయినా అసలు అదంతా కథలా మార్చాలనే ఆలోచనే నాకు రాలేదు, సరే వచ్చిందే అనుకుందాం- ఇలాంటివి మన చుట్టూ జరుగుతున్నాయని మనం స్పీడ్ బ్రేకర్ ని దాటినట్టు మూల నుంచి పోయి దాటుతున్నామని కాస్త అందరిని అన్నిటినీ పరీక్షిస్తూ కుదిరితే సాయం చేస్తూ సాగిపోండి- అని చెప్పేలా ఒక కథ రాస్తే తప్పేముంది అది కూడా ఒక రకమైన సహాయమే కదా తనకి చేయకున్నా తనలాంటి వాళ్ళకి చేసినట్టేగా’
‘ఆహా! ఎంత పొగరు..నువ్వు అక్కడ చేసిందేమిటి -నువ్వు రాస్తాననుకున్నది ఏమిటి, ఏమైనా పొంతన ఉందా అసలు bloody hypocrite.. నువ్వు ఉన్నది ఉన్నట్టు రాసినా, పూర్తిగా లేనిది ఉన్నట్టు రాసినా తప్పులేదు కానీ నువ్వు వాస్తవాన్ని నీ కథాశైలి, రూపం కోసం అవాస్తవంలా మారుస్తావ్… నువ్వు కావాలనే వాళ్ళకింకో ఇల్లు దొరకలేదని, బస్సు దొరకదని, నరాలు లాగుతున్నాయని ఊహించుకున్నది ఎందుకు? ఈ ఆలోచనల వెనక, అతకని కారణాల వెనక ముసుగేసుకొని దాక్కున్న దొంగ నీ కథ, అవకాశం దొరకగానే ఆ ముసుగుని అన్ని నిజాలపై, వాస్తవాల పై కప్పి అవాస్తవాన్ని భుజానెత్తుకొని అభివాదం చేయడానికి సిద్ధంగా ఉంటుంది నీ చెత్త కథ. You are just a hiding piece of shit, deep inside the intestine’
బస్సు పక్కల వస్తూ పోతూ ఉన్న కలర్ కలర్ ట్యూబులైట్ల వెలుగులో అవతలి పక్క తిరిగి విండో గ్లాస్ పై ముఖం చూసుకున్నా, ఇంకెవరైనా ఆ ముఖాన్ని చూస్తే దడుచుకొని చస్తారు దయ్యాన్ని చూసిన కళ్ళలా దయ్యం కంటే భయంకరంగా… పిచికారీ చేసాక ఆకుపై పై నిలిచే నీటి తుంపర్లులా నుదిటి పై చెమటలు (ఈసారి AC బస్ అయినప్పటికీ) చూసుకొగానే భయమేసి అన్ని మరిచి చెద్దరు కప్పుకొని పడుకున్నా.
మనలో భిన్నంగా ఆలోచించే ఇద్దరు ఉంటే అన్ని తెలుస్తాయి అంటారు, ఒకరి సమాధానం ఒకరి ప్రశ్నల ద్వారా మొత్తం విశ్లేషించొచ్చు అంటారు, కానీ ఒకడు ఒకటి నమ్మితే ఇంకొడు దానికి పూర్తి వ్యతిరేకాన్ని నమ్ముతాడు చివరికి ఇద్దరు వాదించుకొని దేన్ని నమ్ముకుండా నిహిలిస్టు లా మరిపోయే అవకాశం కూడా ఉంది. ఇది నా విషయంలో ఫాక్ట్.
పొద్దుగాల లేచెేసరకి ఆరాంఘర్ దగ్గరికి వచ్చింది బండి ఈసారి ఉత్సాహంగా షూ లేస్ కడుతుండగా గోపిచంద్ అసమర్థుని జీవయాత్రలో రాసిన ‘జీవిత ప్రవాహం ఒడ్డున నిలబడి పుస్తకజ్ఞానంతోనే తృప్తిపొందడం వల్ల జ్ఞానానికి తగిన మనస్తత్వం ఏర్పడలేదు’ అనే లైన్ గుర్తొచ్చింది ఇది నాకు వర్తిస్తుందని అనిపించగానే టాస్ వేసే ముందు కెప్టెన్స్ లా నాలో ఉండే attacker అండ్ డిఫెండర్ చేతులు కలిపినట్టు మూసుకొని ఒప్పుకున్నారు కానీ కాసేపటికే కిందికి దిగుతుండగా ఈ కోటషన్ ని fb లో వాట్సాప్ లో పోస్ట్ చేద్దామని ఇది చూసైనా నా contacts లో టాలెంటెడ్ అనుకునే జనాలు ఉహల్లోంచి దిగుతారని వచ్చిన ఆలోచనతో మళ్ళీ విడిపోయి మ్యాచ్ కి సిద్ధమయ్యాను.
రోడ్ క్రాస్ చేసి ఆ పాపని అప్పుడు చూసిన చోటుకి వెళ్లి చూస్తే షాదనగర్ ఆటోలు ఆటో డ్రైవర్లు తప్ప ఎవరూ లేరు ఎడమ వైపు తిరిగి రోడ్ క్రాస్ చేశా. నెం.300 బస్సు ఎక్కడానికి అక్కడ హోటల్ ముందు రెండు సీల్డ్ ‘kenley’ బాటిల్స్ తో ఆ పాప, నేననుకున్నట్లు రూమికి సొంత మనమల్లు, మనమరాళ్లు లేరు.
‘ఆహా! భలే చక్కటి ముగింపు అనమాట ఇది. తు… రేయ్ ఆపరా, ఎందుకురా ఇలా? అసలు అక్కడ పాప ఉందా? చూసావా? చిచ్చి వెధవా… ఒకవేళ దీన్ని ఒక మంచి కథలా మారిస్తే అందరూ మెచ్చుకుంటున్నారని ఆనందం లేకపోతే నీకు చక్కటి కథ శైలి, సామర్థ్యం లేదనే బాధ అంతే తప్ప ఆ కథ రాయించిన ఆ మనుషుల్ని, పరిస్థితుల్ని గురించి ఏనాడైనా కనీసం నువ్వైనా పట్టించుకుంటావా.’
‘అయితే, మన జీవితం గురించి మనం రాసుకోవడమే ఉత్తమమా’
‘నీకిలా అర్ధమైందా!’.
Nce Ra ..
ప్రతీ వ్యక్తీలోనూ ఈ మానసిక సంఘర్షణలు ఉంటాయి. అంతర్మధనాలు ఉంటాయి. అంపశయ్య నవీన్ లా, గోపీచంద్ లా భావాలను మనసుకు హత్తుకుపోయోలా ఇలా రాసే వాళ్ళు అరుదు. హిమసాయి నీకు అభినందనలు.
Thank you sir.
Excellent bro 😎