మిరకిల్స్ జరుగుతాయి!

 

మనుషులం దిగులు పడుతుంటాం.

ఒకటా రెండా యెన్నో సమస్యలు. 

దేన్ని ముట్టుకున్నా మృదువుగా తగలదు. పల్లెరుగాయను పట్టుకున్నట్టు గరుగ్గానే తగులుతుంది.. 

యెవర్ని గుర్తు చేసుకున్నా… వాళ్లు నిన్ను అన్న మాటలో, వాళ్లను నువ్వు అన్న మాటలో మనస్సుకు గుచ్చుకుంటాయి. 

వొకటా రెండా, వొకరా యిద్దరా…. ఏం గుర్తు చేసుకున్నా దిగులేస్తుంది. ఇక్కడ ఈ భూమ్మీద యింకా వుండాలా అనిపిస్తుంది. 

సమస్యలలోంచి, వైమనస్యాల లోంచి తప్పించుకుపోదామంటే కుదరదు. దిగుళ్ల పుట్టలో అలసిన పామువి అయిపోతావు నువ్వు. పుట్టలోంచి బయటికి వొక్క దారి కూడా కనిపించదు. 

ఉరి వేసుకు చనిపోవడమో, సముద్రాన పడిపోవడమో, పెళ్లాం బిడ్డల నోటి కాడి కూడు కూడా ఖర్చు పెట్టి సురాపానంలో మునకలేసి వూపిరొదలడమో… అంతకు మించి ఛాయిస్ కనిపించదు. 

అలాంటప్పుడే… అప్పుడు నువ్వు తలపెట్టిన మరణంతో సహా యేదీ శాశ్వతం కాదనే ఒక వూహ గొప్పగా పని చేస్తుంది. దిగులు పుట్ట నుంచి బయటికి దారి చూపిస్తుంది.. 

మరణమే శాశ్వతం కానప్పుడు, ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఏదీ వున్నదున్నట్టు వుండదు. ప్రతిదీ మారతుంది. ఎవెరి థింగ్… ఇన్ ఫ్లక్స్.  

మారిపోడానికి వీలున్న దీని గురించేనా…ఈ కష్టం ఇక తీరదు అన్నట్టు ఇంత సేపూ నెత్తీ నోరు కొట్టుకుంటున్నది… అనే వూహ కొత్తగా వొక ఫీలింగ్ అఫ్ వెల్ బీయింగ్ని ఇస్తుంది. 

మరేం పరవాలేదనిపిస్తుంది.

ఎన్ని జరగలేదు, మరణ ధిక్కారాలు?

పురాణాల్నిండా అవే.   

యేసుక్రీస్తు తన గోరీ లోంచి లేచి వెళ్లిపోలేదూ?! మార్కండేయుడిని శివుడు తిరిగి బతికించలేదూ?! యముడు సత్యవంతుడిని బతికించి సావిత్రమ్మకు యిచ్చెయ్యలేదూ?! 

అవన్నీ మిరకిల్స్. అద్భుతాలకు సంబంధించిన వూహలు.

అద్భుతాలు జరుగుతాయనే వూహ ఎంత సాంత్వన? అన్నిటికన్న ఎక్కువ సాంత్వన మరణ రాహిత్యం వూహ.

మరణం శాశ్వతం కాదు, నా సమస్యలు శాశ్వతం కావు… అని అనుకోడంలో పెద్ద వూరట. 

వూరట కలిగించే ఆ వూహల్లో పడి మనం మరణిద్దామనుకున్న సంగతే మరిచిపోవచ్చు. 

ఉరితాడు, సముద్రం, సురాపాత్ర అన్నీ పనికిరాని పరికరాలైపోవచ్చు. 

కఠిన జీవన వాస్తవికత అనే కటకటాలలోంచి వొక వూహా విముక్తి… మిరకిల్స్ సాధ్యం అనే భావన. 

అద్భుతాలు జరుగుతాయనే వూహ లేకపోతే మనిషి సాహసించడం, కొత్తవి కనిపెట్టడం, కొత్త దారులు తొక్కడం అనేదే వుండదు.

ఏమీ జరగదు, తనకు కొత్త జీవితం లేదు అనుకుంటే ఇక మిగిలేది నిరాశ కింద నలిగిపోవడం మాత్రమే. అది వాస్తవం కూడా కాదు. 

విచిత్రం యేమంటే విచిత్రాలు (మిరకిల్స్) జరుగుతాయి.  

పైన చెప్పిన కట్టుకథలు కాదు. నిజ జీవితంలో మిరకిల్స్ జరుగుతాయి.

మిరకిల్స్ జరుగుతాయనే నమ్మకానికి కథా రూపాలే అన్ని పురాణ కథలు. 

కళ్ల ముందు జరిగే నిజమైన మిరకిల్స్ నమూనాల్లో తయారైనవే అన్ని పౌరాణిక మిరకిల్స్. 

***

అద్భుతాల మీద నమ్మకం మనకొక ధైర్యాన్నిస్తుంది. దాంతో పాటు మిరకిల్స్ చేసే గారడి గాళ్లకు మనల్ని బానిసల్ని చేస్తుంది. 

నమ్మకం మనుషుల్ని మతస్థుల్ని చేస్తుంది. ఆసరా ఇచ్చినట్టే ఇచ్చి మనిషిని సాంతం మింగేస్తుంది. నమ్మకం బలపడే కొద్దీ బానిస బంధం బిగుసుకుంటుంది. చివరాఖరికి భూసురులు (దేవుడి మనుషులు, పూజారులు) మిరకిల్ శక్తులతో గుడ్డితనాన్ని, కుంటితనాన్ని, పిచ్చిని నయం చేస్తారని, పరీక్షలు ప్యాస్ చేస్తారని…. ఆనుకుంటాం. 

దేవుని మహిమ మనకు నేరుగా అందదు, పూజారి ద్వారా అందుతుందంటారు. ఔను కదా అనుకుంటాం ఆ మాటల్లోని హేతువుని చూసి. 

ఇంకేం, బాబాల దగ్గరికి, ఫాదరీల దగ్గరికి, దర్గాల దగ్గరికి తండోపతండాలు. మంత్రాలు, అంత్రాలు, తాయెత్తులు, వేపమండలు, భూతవైద్యాలు, చేతబడులు, చేతబడుల చాటున ఆస్తి తగాదాల ఖూనీలు.

మిరకిల్స్ మీద నమ్మకం లేకపోతే మతం లేదు. మత యాత్రలు లేవు. వొక రాయి మీద రాళ్లేయడానికి అంత దూరాలు వెళ్లక్కర్లేదు. గుండ్లు కొట్టించుకోడానికి కొండలు యెక్కక్కర్లేదు. అంతే కాదు, యెవరి దేవుడికి యెక్కువ మహిమలున్నాయో నిరూపించడానికి కత్తులెత్తి కుత్తుకలుత్తరించాల్సిన అవసరం లేదు. టవర్లు కూల్చాల్సిన అవసరం లేదు. దరిమిలా ఏ అఫ్ఘానిస్తాన్ లోనో అప్పటికే అక్కడున్న ప్రజల చొరవలను ‘సమితి’ సాక్షిగా వురి తీయనవసరం లేదు. అడపిల్లలకు చదువులు వొద్దని ఒక చోట (తాలిబాన్), ఆవు మాంసం తినొద్దని ఇంకోచోట (సంఘ్ పరివార్) జనాన్ని చంపనక్కర్లేదు.

***

నమ్మకాలతో పని లేకుండా, ప్రమేయం లేకుండా… నిజంగానే, నిత్యజీవితంలో మిరకిల్స్ జరుగుతాయి. 

మతం, మత హత్యలు మానేసినా మిరకిల్స్ జరుగుతాయి. ఆడపిల్లల్ని వంటింటికి, పడకటింటికి బానిసల్ని చేయకపోయినా మిరకిల్స్ జరుగుతాయి. పిల్లల్ని, యువకుల్ని అది చెయ్యొద్దు యిది చెయ్యొద్దు అని… యెందుకు చొయ్యొద్దో చెప్పకుండా దుడ్డుకర్రలతో కట్టడి చేయకపోయినా…  మిరకిల్స్ జరుగుతాయి.

యేసు క్రీస్తు పునరుత్ధానం చెందకపోయినా, మహమ్మదు ప్రవక్త యేదో గుర్రం మీద అలివిగాని దూరాన్ని దూకకపోయినా, యెవరో రుషి సముద్రాన్నంతా ఒక్క గుక్కలో తాగకపోయినా, మరెవరో రుషి చచ్చిపోయిన వాళ్లను బతికించకపోయినా… అవేవీ జరక్కపోయినా… అవేవీ జరగవు గాని… మిరకిల్స్ జరుగుతాయి.

నువ్వు దిగులు పడినప్పుడు, దిగుళ్ల పుట్ట లోంచి బయటికి యెటు వైపూ దారి కనిపించనప్పుడు, నీ వాళ్లనుకున్నవాళ్లందరూ… మిహాయింపు లేకుండా… ప్రతివొక్కరూ… నీకు దూరమైపోయినప్పడు… అప్పుడు నువ్వు కోరుకుంటావే ఆ మిరకిల్స్, అప్పుడు నీకు ఆశ యిస్తాయే ఆ మిరకిల్స్… అవి నిజంగానే జరుగుతాయి.

యెందుకంటే మిరకిల్స్ మత విషయాలు కావు. సో కాల్డ్ ఆధ్యాత్మికాలు కావు. యెవరో కొందరు మనుషుల, దేవుళ్ల మహిమలు కావు. 

మిరకిల్స్ భౌతిక ఘటనలు. యీ భూమ్మీదే, యీ మన జీవితాల్లోనే, చాల సార్లు మన వల్ల కూడా… మిరకిల్స్ జరుగుతాయి. యీ మిరకిల్స్ ను మనం శ్రద్ధగా భక్తిగా నమ్మనక్కర్లేదు. నమ్మకాల కోసం చావక్కర్లేదు. వాటి కోసం తలనీలాలు, నిలువు దోపిడీలు ఇవ్వక్కర్లేదు. 

అవి జరుగుతాయని వూరక, అలవోకగా తెలుసుకుంటే చాలు. గొప్ప ధైర్యమిస్తాయి. అలాంటి ధైర్యం కొత్త పనులు చేయడానికి, కొత్త దారులు తొక్కడానికి వుపకరణమౌతుంది.

నన్ను నమ్ముకో అనే యే శ్లోకమూ వొద్దు. యే పుస్తకంలోని యే సూక్తీ వొద్దు. యే వుపదేశమూ వొద్దు. అసలు నమ్ముకోడమే వొద్దు. తెలుసుకుంటే చాలు. వూరట యిస్తాయి మిరకిల్స్. 

పొద్దున్నే… ప్రతి పొద్దున్నే పొద్దు పొడుస్తుంది. సూర్యుడుదయించగానే జగమంతా వెలుగు మొలుస్తుంది.. 

పిచికల కిలకిలారావాలు. యెవరో యెవర్నో కేకేసి పిలుస్తుంటే నీకు పలకాలనిపించేంత సంగీతం, 

పొద్దున్నే నువ్వు తాగ బోయే పొగలు వెదజల్లే కాఫీ, నువ్వు గుడ్ మార్నింగ్ చెబితే నవ్వుతూ నీకు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లే బాటసారి…. ఈ మిరకిల్స్ రోజూ జరుగుతాయి. రోజూ జరుగుతాయి కాబట్టి నువ్వు పట్టించుకోవంతే.

అతి పరిచయా దవజ్ఞా
సంతత గమనాదనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ
చందన తరు కాష్ట మింధనం కురుతే

అతిగా పరిచయమైన దాని గొప్పతనం మనకు తెలియదు. వొక యింటికి మరీ యెక్కువ సార్లు వెళితే అనాదరణకు గురవుతాం. కొండల్లో నివసించే భిల్ల స్త్రీ చందనపు కట్టెను (దాని విలువ గుర్తించక) వంటచెరుకుగా పొయ్యిలో పెడుతుంది కదా, అలాగే… అని యీ శ్లోకం అర్థం. మనకు మరీ ఎక్కువగా పరిచయం వున్నవి మనకు మిరాక్యులస్ అనిపించవు. 

కాని అవి మిరకిల్సే. 

సూర్యోదయమే కాదు, సూర్యుని చుట్టు భూమి తిరగడం, తన చుట్టు భూమి, మరి దేని చుట్టూరానో మొత్తం సూర్యకుంటుంబం తిరగడం… యివన్నీ మిరకిల్సే. యిందులో యే వొక్కటి గతి తప్పినా మనం మటాష్. తప్పవు. అదీ మిరకిల్. అలా యుగ యుగాలుగా యివి జరుగుతూ వుండడం… అదీ వాటి వాటి క్రమాలు తప్పకుండా వుండడం మిరకిల్ . 

మనకు తెలీని మరెన్నిటి వెనుకనో మరెన్నో, మరేవో మిరకిల్స్ వుంటాయి. వాటిలోని క్రమాలను కనుక్కునే పని శాస్త్రవేత్తలది.

మానవ జీవితాన్ని అంత లోతుగా చదివిన ఒక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్. 

మానవ సమాజంలో ఇప్పటి వరకు జరిగిన మిరకిల్స్ ని చెప్పి ఆయన కల్పించిన వూరట, కల్గించిన ఆశ, పురోగమనానికి అందించిన ప్రేరణ….  అంతా ఇంతా కాదు. 

ఏ పూట బువ్వ కోసం ఆ పూట పెను ప్రమాదాలను ఎదుర్కొని వేటాడి బతకడం ఇవాళ లేదు. ఒక మనిషి యజమాని, మరో మనిషి బానిస… అనేది ఇవాళ లేదు. 

ఇవాళ కూడా పూట కూటి కోసం అగచాట్లున్నాయి. ఇవాళ కూడా బానిసత్వం వుంది. మునుపటి మనిషి చూపిన చొరవ, చేసిన ఆలోచన, నిర్వహించిన పోరాటం మనల్ని ఇక్కడి దాక తెచ్చాయి. ఈ పోరాట క్రమంలోనే ‘పూర్తి స్వేచ్చ’ సాధ్యమవుతుంది. 

ఇవన్నీ మిరకిల్సే. మానవ ప్రమేయంతో జరిగే చారిత్రక పరిణామాలు కొన్నయితే, 

చీకటిని తొలగించే సూర్యోదయాల వలె, రేగడి చేలుగా మారిన లావా ప్రవాహాల వలె… సహజంగా జరిగేవి ఇంకొన్ని. 

ఏమీ జరగదనే నిరాశ మాత్రం అర్థరహితం.  

విశ్వగోళాల వంటి పెద్ద వస్తువులకే కాదు. మీ మనస్సును కలచి వేసే దైనందిన దిగులు కారక క్రమాలలోనూ మిరకిల్స్ జరుగుతాయి. అయ్యా! మీ బిడ్డకు వుద్యోగం వస్తుంది. మీరనుకున్న వుద్యోగం కాకపోవచ్చు. అలాంటిదే యేదో వొకటి. మీరనుకున్నదాని కన్న పెద్దది కూడా కావొచ్చు. ఆ మిరకిల్ జరుగుతుంది. మీరు అప్పిచ్చిన వాడు మీకు తిరిగి యిస్తాడు. ఆ మిరకిల్స్ జరుగుతాయి. లేదా వాటిని కాంపెన్సేట్ చేసేవి యేవో జరుగుతాయి. అసలు కన్న కాంపెన్సేషన్ యెక్కువ కావొచ్చు. 

దిగులు పడొద్దు. నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు రాయాల్సినవి నువ్వు రాసుకో. నీ చేతుల్లో వున్నవి సంవత్సరాలో, క్షణాలో… మనసారా అనుభవించు. జీవించు. జరగబోయే మిరకిల్స్ జరుగుతాయి. నువ్వు జీవించడం ముఖ్యం. జీవించడం అంటే నీ పని నువ్వు చేయడం. యెవడో నీకు నిబంధించిన పని కాదు. వున్నంతలో నీకు యిష్టమైన పని.

ఆ పని వుద్యోగం, ప్రేమ వంటి వ్యక్తిగతాలు కావొచ్చు, లోకంలో ‍అన్యాయాల్నెదిరించి నువ్వు చేసే సామూహిక పోరాటాలు కావొచ్చు. 

సూర్యుడు నువ్వు కావాలనుకున్నప్పుడు వుదయించడు. ఉదయించకుండానూ వుండడు. ఎప్పుడు ఎలా వుదయిస్తాడో తెలుసుకోడం నీకు సాధ్యమే. 

ఇప్పుడు చీకటి. 

ఇప్పుడు ఈ చీకటిలో ఏం చేయాలో, రేపు పొద్దు పొడిచాక ఏం చేయాలో తెలుసుకోడం కూడా నీకు సాధ్యమే.

12-7-2019

హెచ్చార్కె

9 comments

  • ఇటువంటి భౌతిక మిరకిల్స్ మీద కార్ల్ యూంగ్ బోలెడంత రాసేడు. జరుగుతాయి. మంచి సంపాదకీయం.

  • ఏమిటీ తాత్వికత ? కత్తిలా తెగే మాట మెత్తగా అనిపిస్తోంది. మీతో ఎక్కువగా పరిచయం పెంచుకోకూడదు. మిరాకిల్ కాదంటారు. ఇదొక మేనేజ్మెంటు పాఠంలా రాశారే ! సందర్భం తోచలేదు. నిడివి పెరిగింది. కానీ చదవబుద్దేసింది. బా చెప్తారు కదా ! అదీ మీరు చేసే మిరాకిల్.

    మరిన్ని మిరకిల్స్ జరుగుతాయి. అది మీకు నచ్చింది రాసుకోవడమో, రస్తా వేయడమో, ఇంకా ఏమేమో !

    ఏదీ అసాధ్యం కాదు కదా ! థ్యాంక్యూ సర్

  • ఎంత అద్బుతంగా రాసారో.. ఎంత మొటివషనల్ ఆర్టికల్ ఈ మధ్య కాలం లో ఇంత వివరణాత్మకంగా వచ్చిన గొప్ప ఎడిటోరియల్..సర్…అసలు ఎక్కడ కూడా నేను చదవడం లో వెను దిరగ లేదు..ఎంత రీడబిలిటీ..wow.. ఫెంటాస్టిక్..కుడోస్ సర్

  • So far I have seen only few people like you,who writes such an amazing articles. Excellent work sir.keep going

  • ఎంత బాగరాశారో!సర్,ముందుగా మీకు ధన్యవాదాలు,. పనిఒత్తిడి లో,పడి, నెనుచదవలేదు ముందు, సరిగ్గా, టెన్షన్ time లో,ఈ ఆర్టికల్, నాకు ఓదార్పు నిచ్చింది..👌సర్.అభివందనలు మీకు💐..సర్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.