నైపుణ్యాలతోనే మెరుగైన వుపాధి

క్యాంపస్ నుండి కార్పొరేట్ వుద్యోగం వైపు అడుగులు వెయ్యాలంటే పదవ తరగతి పరీక్షలు రాశాక, వేసవి  కాలం శెలవుల నుండే తగిన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఏ రంగంలో మంచి జీతం వస్తుంది? ఎంతిస్తారు?  ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? వంటి భవిష్యత్తు పరిణామాల మీద అనవసరమైన అసందర్భమైన కలలు కంటూ, వాటి మీద దృష్టి పెట్టకుండా మీకు ఆసక్తి వున్న రంగంలో ఎటువంటి అవకాశాలున్నాయి? అందులో పైకి రావడానికి కృషి ఎలా ప్రారంభించాలి? దానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలేమిటి? ప్రవర్తనా నైపుణ్యాలేమిటి? దానికి సంబంధించిన డిగ్రీ ఎక్కడ చెయ్యాలి? అత్యున్నత స్థాయికి వెళితే అవకాశాలు ఎలా ఉంటాయి? కేవలం డిగ్రీతో ఆపేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఆ చదువుకు సంబంధించిన కంపెనీలు ఎక్కడ ఉన్నాయి? మన దేశంతో పాటు, విదేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయా? మీకు ఆసక్తి కలిగిన రంగంలో  సాఫ్ట్-వేర్లు ఉన్నాయా? ఏవైనా యంత్రాలున్నాయా? అవి ఉపయోగించడం నేర్చుకుంటే కెరీర్ ప్రారంభంలో ఉపయోగమేమైనా ఉందా? ఆ సాఫ్ట్-వేర్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయా? జీవితాంతం ఒకటే సాఫ్ట్-వేర్ ఉపయోగిస్తే వృత్తిగత జీవితం సాఫీగా సాగిపోతుందా? ఎప్పటికప్పుడు ఆ సాఫ్ట్-వేర్ల పరిజ్ఞానాన్ని అప్ డేట్ చేసుకుంటూ ఉండాలా? ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సంతృప్తికరమైన సమాధానాలు లభించాకే ముందుకు సాగి సరైన నిర్ణయం తీసుకోవాలి. అనుభవజ్ఞుడైన కెరీర్ కౌన్సిలర్ సలహాలు, మార్గదర్శకత్వం (Mentoring) తీసుకోవాలి. ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా అంతిమ లక్ష్యం డబ్బు సంపాదన, పెళ్ళి, పిల్లలు, జీవితానికి కావలసిన కూడు, గూడు, గుడ్డ కొనుక్కోవడం, వాటికి వాయిదాలు చెల్లించడం వంటి మామూలు లక్ష్యాలుంటే ఇంతకు ముందు చెప్పినంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం జీవించడమా? జీవితాన్ని జీవంతో జీవించడమా? జీవిత కాలానికి కూడు, గూడు, గుడ్డ హామీ ఇచ్చే చదువు చదివి ఇంటికి, కారుకి, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్ తదితర భౌతిక  సుఖాలకు వాయిదాలు కట్టడానికే జీవితాంతం ఉద్యోగం చేయడమా? లేదా మనం ఎంచుకున్న రంగంలో అనునిత్యం ఆనందిస్తూ, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అనుక్షణం కృషి చేస్తూ, విజయ శిఖరాలు అధిరోహిస్తూ, నడుస్తున్న చరిత్రకు వెలుగులద్దుతూ, యువత భవితకు దారి చూపుతూ, కష్టపడుతూ ఇష్టమైన రీతిలో జీవించడమా అన్నది మీరే నిర్ణయించుకోవాలి.   

పట్టభిరాం గారు చెప్పిన సంఘటనొకటి ఇక్కడ గుర్తుకొస్తోంది. పట్టాభిరాం గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో పి.హెచ్.డి. చేసిన తొలి విద్యార్ధి. ఆ రోజుల్లో సైకాలజీ  అంటే ఎవ్వడికీ తెలీదు. ఉద్యోగావకాశాల్లేవు. కొన్నాళ్ళేవేవో ఉద్యోగాలు చేసినా ఆయనకు వాటి మీద మనసు పోలేదు. సైకాలజీ మీద మోజు పోలేదు. డబ్బులకోసం మనసుపడ్డ చదువు కన్నా, మోజు పడ్డ చదువు మీద మనసు పెడితే జీవితంలో ఏ స్థాయికి వెళ్ళచ్చో పట్టాభిరాం గారు నిరూపించారు. సైకాలజీకి అనుబంధ విద్యలు, ప్రదర్శనకు అనుకూల విద్యలైన మ్యాజిక్, హిప్నటిజం, నేర్చుకున్నారు. వాటితో ప్రదర్శనలిస్తూ, తనకు నచ్చిన రంగాల్లోనూ పట్టు సాధించి ఎన్నో పుస్తకాలు రాశారు. ఇవన్నీ సమాజంలో తాను సుదీర్ఘ కృషితో, ఇష్టంతో నేర్చుకున్న విద్యల్లోనే అనితర సాధ్యమైన స్థాయికి చేరడానికి ఆయనకు దోహదం చేశాయి. తెలుగులో ఆధునిక వ్యక్తిత్వ వికాస సాహిత్యానికి ఆయన ఆద్యులుగా నిలిచారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు. ‘కష్టపడి, ఇష్టపడి’ అని ఆయన ఉపయోగించిన పదాలు సినిమా రచయితల కలాలకు కూడా స్ఫూర్తినిచ్చాయి. ‘కష్టపడి కాదు; ఇష్టపడి చదవండి’; ‘కష్టపడి ఉద్యోగం చేయద్దు; ఇష్టపడి చేయండి’ – ఇలా ఎన్నో పదబంధాలు వ్యక్తిత్వ వికాస సాహిత్యంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చినవే. సైకాలజీలోనే కాదు; మేనేజ్-మెంట్ లో కూడా పట్టాభిరాం గారు పి.హెచ్.డి. చేశారు. పట్టాభిరాం గారు చేసినంత కృషి మీకు నచ్చిన రంగంలో మీరు చేయగలిగితే, అంతటి పట్టుదల, సత్తా మీకుంటే, జీవికతో పాటు, మీ రంగంలో మీరు ఏలిక అయ్యే స్థాయికి చేరుకుంటారు. అంతటి పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసిద్ధి పట్ల నిబద్ధత మీలో లేకుంటే కేవలం జీవనోపాధినిచ్చే చదువుతో, ఉద్యోగంతో సరిపెట్టుకుని, జీవిత రధాన్ని ఈసురోమని ఈడుస్తూ బతికేయండి.        

ఆధునిక కంపెనీలు మౌలికంగా సానుకూల వైఖరి (Positive Attitude), ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాల మౌలిక పరిజ్ఞానం (Technical Skills) సరళ కౌశలాలు (Soft Skills), విషయ పరిజ్ఞానం (Subject Knowledge) వంటి అంశాలను ఉద్యోగాలివ్వడానికి పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో చదవడం (Reading), వ్రాయడం (Writing); సరళ కౌశలాలలో భాగంగా బృందంతో కలసి పని చేయగలిగే నైపుణ్యం (Team Work), సమస్యా పరిష్కార నైపుణ్యం (Problem Solving Skills), వ్యక్తిగత ఫలిత సాధనా నైపుణ్యం (Personal Effectiveness) లెక్కల్లో నైపుణ్యం (Numerical Ability), కంప్యూటర్ పరిజ్ఞానం (Computer Skills) ఉన్నవారికే కంపెనీలు ఈ రోజుల్లో ఉద్యోగాలిస్తున్నాయి.    

మీలో ఉన్న నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అవి ఉద్యోగానికి పనికొచ్చే స్థాయిలో ఉన్నాయా? వాటిని ఎలా అంచనా వేసుకోవాలి? అవి నేర్చుకోక ముందు, నేర్చుకున్న తర్వాత మీ ఆత్మ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే మీరు గుగుల్ తల్లిని భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకూ మీకెవ్వరూ చెప్పని చిట్కా చెప్పేస్తున్నాను. ఉదాహరణకు మీరు ఉద్యోగం సాధించడానికి పనికొచ్చే నైపుణ్యాలు మీలో ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవానుకుంటే గుగుల్ తెరచి ఆ నైపుణ్యంతో పాటు, దాని ముందు మీరు స్వీయ అంచనా వేసుకోవాలనుకునే నైపుణ్య శీర్షికను టైప్ చేయాలి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంచనా వేసుకోవాలనుకుంటే ‘Self Assessment Questionnaire in Communication Skills’   అని టైప్ చేయాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను అంచనా వేసుకోవాలనుకుంటే ‘Self Assessment Questionnaire in Leadership Skills’ అని టైప్ చేయాలి. మీకు అవసరమైన ప్రశ్నా పత్రాలను ఆన్ లైన్ పూర్తి చేస్తే ఫలితం తక్షణం మీకే కనిపిస్తుంది. వీటిని ‘Self Assessment Questionnaires’ (SAQs) అంటారు. దాదాపుగా పట్టాభిరాం గారి పుస్తకాల్లో ఇవి విరివిగా, విస్తృతంగా ఉంటాయి. ఆయన సైకాలజిస్టు కాబట్టి సొంతంగా కూడా ఎన్నో రకాల స్వీయ అంచనాకు ఉపయోగపడే ప్రశ్నా పత్రాలను రూపొందించారు. వీటిలో కొంచెం ఖచ్చితంగా ఫలితాలనిచ్చే ప్రశ్నాపత్రాలను ‘సైకోమెట్రిక్ టెస్టు (Psychometric Tests) లంటారు ‘. వీటి ప్రామాణికతను మనం అంచనా వేయలేకపోయినా ఇవన్నీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైకాలజిస్టులు తయారు చేసినవే. మన వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రశ్నను అర్ధం చేసుకునే విధానాన్ని బట్టి సమాధానాలిచ్చి ఫలితాలను అర్ధం చేసుకోవచ్చు. ఫలితాలను ఎలా అర్ధం చేసుకోవాలో ప్రతి స్వీయ అంచనా ప్రశ్నా పత్రం కింద తప్పకుండా సూచనలు ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకుని ఇవి పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. లేదా ఆన్ లైన్ లోనే మీ నైపుణ్య పరిజ్ఞానాన్ని అంచనా వేసుకుని, ఎప్పటికప్పుడు ఎంత అభివృద్ధి సాధించారో మళ్ళీ మళ్ళీ పూరించి తెలుసుకోవచ్చు. 

ఇటువంటి ప్రణాళికతో వ్యూహాత్మకంగా, ఆచరణాత్మకంగా ముందుకు సాగితే కార్పొరేట్ రంగంలో బలమైన పునాదితో చక్కని భవిష్యత్తును నిర్మించుకునే అద్భుత అవకాశాలు మీవే! మీ సాఫల్య శిఖరాల మీద విజయ పతాకాలు ఎగరేసే అవకాశం మీదే! జయోస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.